లిస్టులో మైక్రోసాఫ్ట్ నుంచి ఇంటెల్ వరకు బడా సంస్థలు
దేశీయంగా సాంకేతిక రంగానికి దన్ను
లక్షల కొద్దీ యువతకు ఉద్యోగావకాశాలు
సాంకేతిక ఆవిష్కరణలకు భారత్ మెగా హబ్‌గా మారే దిశగా చురుగ్గా అడుగులు పడుతున్నాయి. అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ నుంచి ఇంటెల్ వరకు పలు అగ్రగామి సంస్థలు వరుస కడుతున్నాయి. దేశీయంగా డేటా సెంటర్లు, ఏఐ ఆవిష్కరణలకు ప్రోత్సాహం లభించడంతో పాటు లక్షల సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు కూడా అవకాశాలు పెరుగుతున్నాయి.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. నాలుగేళ్ల వ్యవధిలో క్లౌడ్, కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక సదుపాయాల కల్పనపై ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు. ఆసియాలో మైక్రోసాఫ్ట్ ఇంత భారీగా ఇన్వెస్ట్ చేయడం ఇదే ప్రథమం. భారత్ సాంకేతిక సామర్థ్యాలపై కంపెనీకి గల నమ్మకానికి ఇది నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక చిప్ దిగ్గజం ఇంటెల్ కూడా భారత్ సెమీకండక్టర్ల లక్ష్యాల సాధనకు మద్దతుగా నిల్చేందుకు ముందుకొచ్చింది.
ఇందుకోసం టాటా ఎలక్ట్రానిక్స్‌తో జట్టు కట్టింది. కంపెనీ సీఈవో లిప్–బు టాన్ ప్రధాని మోదీతో కూడా సమావేశమయ్యారు. అటు మరో అగ్రగామి సంస్థ అమెజాన్ సైతం భారత్‌పై మరింతగా దృష్టి పెడుతోంది. ఏఐ, ఎగుమతులు, ఉద్యోగాల కల్పనపై 35 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఇక్కడ అదనంగా పది లక్షలకుపైగా ఉద్యోగావకాశాలను కల్పించాలనే ప్రణాళికల్లో ఉంది. భారత్ నుంచి 80 బిలియన్ డాలర్ల ఈ–కామర్స్ ఎగుమతులను లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇక సెర్చ్ దిగ్గజం గూగుల్ .. వైజాగ్‌లో డేటా సెంటర్‌పై 15 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తోంది. ఓపెన్‌ఏఐ కూడా భారత్‌లో డేటా హబ్ ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది.
రియల్టీకి కూడా ఊతం..
దేశవ్యాప్తంగా డేటా సెంటర్లను నిర్మించడంపై పెద్ద సంస్థలు ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఊతం లభించనుంది. డేటా సెంటర్ల రాకతో నిర్మాణ, రిటైల్, నిర్వహణ విభాగాల్లో పెద్ద సంఖ్యలో పరోక్ష ఉద్యోగాలకు ఊతం లభించనుంది. వైజాగ్‌లో గూగుల్ ఏఐ, డేటా సెంటర్ హబ్‌తో 1,00,000 పైగా ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని అంచనా. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ అధ్యయనం ప్రకారం డేటా సెంటర్లతో వచ్చే ఒక్క ప్రత్యక్ష ఉద్యోగంతో ఆరు రెట్లు పరోక్ష ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉంది. ఏఐ డేటా సెంటర్ బూమ్‌తో ఇంజినీర్లు, ఐటీ నిపుణులు, నిర్మాణ రంగ వర్కర్లు, రిటైల్ తదితర పరి శ్రమలలో మరింత ఉద్యోగ కల్పన జరగనుంది.
– సాక్షి, బిజినెస్ డెస్క్


