రూ.5,75,000 కోట్లు: సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కుదిరిన అవగాహన ఒప్పందాలు | MoUs signed in the presence of Chief Minister Revanth Reddy | Sakshi
Sakshi News home page

రూ.5,75,000 కోట్లు: సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కుదిరిన అవగాహన ఒప్పందాలు

Dec 10 2025 1:07 AM | Updated on Dec 10 2025 1:22 AM

MoUs signed in the presence of Chief Minister Revanth Reddy

తొలిరోజు రూ. 2,43,000 కోట్లు.. రెండోరోజు రూ. 3,32,000 కోట్ల పెట్టుబడులు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కుదిరిన అవగాహన ఒప్పందాలు

స్వయంగా ఆయా సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపిన సీఎం  

డేటా సెంటర్లు, ఫార్మా, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ తదితర రంగాల్లో పెట్టుబడులు

సాక్షి, హైదరాబాద్‌: పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రెండు రోజులుగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌–2025లో పారిశ్రామికవేత్తలు భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రెండు రోజుల్లో మొత్తంగా రూ. 5,75,000 కోట్ల మేర పెట్టుబడులకు సంబంధించి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. సమ్మిట్‌ తొలిరోజైన సోమవారం రూ. 2.43 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు కుదరగా రెండో రోజైన మంగళవారం రూ. 3,32,000 కోట్ల మేర పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరినట్లు ప్రభుత్వం వివరించింది. 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపింది. సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం 20కిపైగా సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు జరిపారు. ఐటీ, విద్యుత్, ఫార్మా, క్రీడలు, పర్యాటకం, అటవీ, ఆహార ఉత్పత్తులు, గృహ సముదాయాల నిర్మాణానికి సంబంధించిన కంపెనీలు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. 

ఎంఓయూలు కుదుర్చుకున్న ప్రముఖ సంస్థల్లో రిలయన్స్, గోద్రెజ్, ఫోర్టిస్, హెటెరో, మహీంద్ర అండ్‌ మహీంద్ర, భారత్‌ బయోటెక్, అరబిందో, గ్రాన్యూల్స్, బయోలాజికల్‌–ఈ, వింటేజ్‌ కాఫీ, కేజేఎస్, కేన్స్‌ టెక్నాలజీస్, జేసీకే ఇన్‌ఫ్రా, అక్విలాన్‌ నెక్సస్, ఏజీపీ గ్రూప్, ఇన్‌ఫ్రాకీ డీసీ పార్క్స్, ప్యూర్‌వ్యూ గ్రూప్, ఎంఎస్‌ఎన్, సత్వా, సుమధుర ఉన్నాయి. సీఎం సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్న పలు సంస్థలకు గ్రీన్‌ ఫార్మాసిటీలో భూములు కేటాయించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది.

రంగాలవారీగా మంగళవారం వివిధ సంస్థలు కుదుర్చుకున్న ఎంవోయూలు ఇలా..
డేటా సెంటర్లు, జీసీసీ..
ఇన్‌ఫ్రాకీ డీసీ పార్క్స్‌: రూ. 70 వేల కోట్లతో 150 ఎకరాల్లో ఏఐ ఆధారిత ఒక గిగావాట్‌ డేటా పార్క్‌ ఏర్పాటు.
జేసీకే ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌: రూ. 9,000 కోట్లతో డేటా సెంటర్‌ ఏర్పాటు. యాన్సిలరీ మౌలిక వసతుల కల్పన. 2,000 మందికి ఉపాధి కల్పన.
ఏజీపీ గ్రూప్‌: రూ. 6,750 కోట్లతో 120 ఎకరాల విస్తీర్ణంలో ఒక గిగావాట్‌ హైపర్‌స్కేల్‌ డేటా సెంటర్‌ ప్రాంగణం ఏర్పాటు.
కేన్స్‌ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్‌: ప్రస్తుత ప్లాంట్‌కు అదనంగా రూ. 1,000 కోట్లతో విస్తరణ.
ప్యూర్‌వ్యూ గ్రూప్‌: గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్‌ (జీసీసీ), ఏఐ డేటా సెంటర్‌ క్యాంపస్‌. 3,000 మందికి ఉపాధి. 10 ఎకరాల్లో ఏర్పాటు.
అక్విలిన్‌ నెక్సెస్‌ లిమిటెడ్‌: గ్రీన్‌ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు. 50 మెగావాట్ల డేటా సెంటర్‌ ఏర్పాటు.

వ్యవసాయ, అనుబంధ రంగాలు..
ఫోర్టిస్‌ ఇండియా లిమిటెడ్‌: వ్యవసాయ, ఆహార ఉత్పత్తుల రంగంలో క్రాప్‌ న్యూట్రిషన్‌లో పరిశోధనల కోసం రూ. 2,200 కోట్లతో రెండు దశల్లో పెట్టుబడి. 100 ఎకరాల్లో 800 మందికి ఉపాధి.
రిలయన్స్‌ కన్సూ్యమర్‌ పోడక్ట్స్‌ లిమిటెడ్‌: రూ. 1,500 కోట్ల పెట్టుబడితో ఆహార, పానీయాల ఉత్పత్తి ప్లాంట్‌. 1,000 మందికి ఉపాధి.
వింటేజ్‌ కాఫీ అండ్‌ బేవరేజెస్‌ లిమిటెడ్‌: రూ. 1,100 కోట్ల పెట్టుబడితో 15 ఎకరాల్లో ప్రీమియం కాఫీ పొడి ఎగుమతుల ప్లాంట్‌. 1,000 మందికి ఉపాధి.
కేజేఎస్‌ ఇండియా: ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌ రెండో యూనిట్‌.. రూ. 650 కోట్లు పెట్టుబడి, 44 ఎకరాల విస్తీర్ణంలో 1,050 మందికి ఉపాధి. 
గోద్రెజ్‌: పాడి రంగంలో రూ. 150 కోట్ల పెట్టుబడి. ప్రతిరోజూ 5 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి సామర్థ్యంతో 40 ఎకరాల్లో డెయిరీ ప్లాంట్‌ విస్తరణ. 300 మందికి ప్రత్యక్ష ఉపాధి.

పర్యాటక రంగంలో..
» మొత్తం పెట్టుబడులు: రూ. 7,045 కోట్లు. ప్రత్యక్ష ఉపాధి 10 వేలు, పరోక్షంగా 30 వేలు.
»   ఫుడ్‌ లింక్‌ ఎఫ్‌ అండ్‌ బీ హోల్డింగ్స్‌ ఇండియా లిమిటెడ్‌: రూ. 3,000 కోట్లతో భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంలో ట్రేడ్, ఎగ్జిబిషన్‌ సెంటర్, ఇంటిగ్రేటెడ్‌ గ్లోబల్‌ కన్వెన్షన్‌ హాల్‌ ఏర్పాటు.
»  అట్మాస్ఫియర్‌ కోర్‌ హోటల్స్‌ (మాల్దీవులు): రూ. 800 కోట్ల పెట్టుబడితో అంతర్జాతీయ వెల్‌నెస్‌ రిట్రీట్‌ కేంద్రం.
»   ఫ్లూయిడ్రా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌: రూ. 300 కోట్ల పెట్టుబడి.
»  పొలిన్‌ గ్రూప్‌ (టర్కీ) అండ్‌ మల్టీవర్స్‌ హోటల్స్‌ (హైదరాబాద్‌): రూ. 300 కోట్ల పెట్టుబడితో ప్రపంచ శ్రేణి అక్వమెరైన్‌ పార్క్, అక్వా టన్నెల్‌ నిర్మాణం.
» కేఈఐ గ్రూప్‌ అండ్‌ అసోసియేట్స్‌ (కామినేని గ్రూపు): గండిపేట మండలం కిస్మత్‌పూర్‌లో రూ. 200 కోట్లతో గ్లాస్,–గ్రీన్‌ హౌజ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌.
» రిధిరా గ్రూప్‌: రూ. 120 కోట్లతో భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో భాగంగా యాచారంలో నోవాటెల్‌ ఆతిథ్య రంగంలో పెట్టుబడి.

ఫార్మా రంగంలో..
బయోలాజికల్‌–ఈ లిమిటెడ్‌: రూ.3,500 కోట్ల పెట్టుబడితో వ్యాక్సిన్‌ పరిశోధన, ఉత్పత్తు­లకు సంబంధించి మలిదశ విస్తరణ కోసం 150 ఎకరాల్లో గ్రీన్‌ ఫార్మాసిటీలో ఏర్పాటు. 3,000 మందికి ఉపాధి. 
అరబిందో ఫార్మా: ఔషధ రంగంలో రూ.2,000 కోట్ల మేర పెట్టుబడులు. 3,000 మందికి ఉపాధి అవకాశాలు
హెటెరో గ్రూప్‌: రూ.1,800 కోట్లతో 100 ఎకరాల్లో దేశీయ, అంతర్జాతీయ ఫార్మా ఉత్పత్తుల తయారీ, ఎగుమతులు. 9,000 మంది ఉపాధి.
గ్రాన్యూల్స్‌ ఇండియా: రూ.1,200 కోట్ల పెట్టుబడితో కేన్సర్‌ వ్యాధి నివారణకు ఉపయోగించే ఔషధాలు, పరికరాల ఉత్పత్తికి 100 ఎకరాల్లో గ్రీన్‌ ఫార్మా సిటీలో ప్లాంట్‌ ఏర్పాటు. 3,000 మందికి ఉపాధి.
భారత్‌ బయోటెక్‌: పరిశోధన, అభివృద్ధి, తయారీ రంగాల్లో రూ. 1,000 కోట్ల పెట్టుబడి. 200 మందికి ఉపాధి.

విద్యుత్‌
ఆర్‌సీటీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్‌: రూ. 2,500 కోట్ల పెట్టుబడితో మూడు దశల్లో విద్యుత్‌ ప్రాజెక్టులు ఏర్పాటు, 1,600 మందికి ఉపాధి

ఇతర సంస్థలు
»  విజ్హీ హోల్డింగ్‌ ఐఎన్‌సీ: రూ. 2,500 కోట్లతో ప్రాణాంతక వ్యాధుల నివారణపై పరిశోధనల కోసం అత్యాధునిక ల్యాబ్‌ ఏర్పాటుకు ఒప్పందం. 
»  అక్షత్‌ గ్రీన్‌టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌: రూ. 2,500 కోట్లతో ఎల్రక్టానిక్స్‌ తయారీ యూనిట్‌ స్థాపన. 
»   టీడబ్ల్యూ గ్రూప్‌: రూ. 1,100 కోట్లతో ప్రపంచ తొలి ప్లగ్‌ ఇన్‌ మోటార్‌ బైక్‌ ఉత్పత్తుల పరిశ్రమ. 
»   ఇండియన్‌ ఇమ్యునాలాజికల్స్‌ లిమిటెడ్‌: రూ. 700 కోట్లతో జినోమ్‌ వ్యాలీలో టీకాల తయారీ ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఎంఓయూ. 
»  మహీంద్రా అండ్‌ మహీంద్రా: రూ. 500 కోట్లతో వచ్చే నాలుగేళ్లలో జహీరాబాద్‌లో ఎల్రక్టానిక్‌ ట్రాక్టర్లు, గ్రీన్‌ఫీల్డ్‌ ఇంజిన్‌ షాప్‌ ఇతర ఉత్పత్తుల ఎగుమతుల కోసం ఒప్పందం. 
»  ఇండియా ఎక్స్‌ట్రీమ్‌ అడ్వెంచర్‌ యాక్టివిటీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌: రూ. 500 కోట్ల పెట్టుబడితో 20 ఎకరాల్లో సాహస క్రీడలు, వినోద కార్యక్రమాల నిర్వహణ కేంద్రం ఏర్పాటు. 
»  బయోవరం: రూ. 250 కోట్లతో టిష్యూ ఇంజినీరింగ్, రీజెనరేటివ్‌ మెడిసిన్, ఏఐ ఆధారిత ఆరోగ్య సాంకేతికతలు, కణ, జన్యు చికిత్సలకు సంబంధించి అత్యాధునిక సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీఓఈ) ఏర్పాటుకు ఒప్పందం. 
»   అనలాగ్‌: ఏఐ ఆధారిత ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు. ప్లగ్‌ అండ్‌ ప్లే సౌకర్యాలు, ల్యాబ్‌లు, విశ్వవిద్యాలయాలతో అనుసంధానం, టీఎస్‌ ఐ–పాస్‌ సమన్వయంతో ఏర్పాటు. 
» ఆల్ట్‌మ్యాన్‌ సంస్థ బ్యాటరీ మెటీరియల్‌ తయారీ యూనిట్‌. 
»  అజయ్‌ దేవ్‌గణ్‌ ఫిలిం స్టూడియో: వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియోలు, వర్క్‌షాప్‌లు, స్థానిక నైపుణ్యాల వెలికితీత.
» జ్యూరిక్‌ ఇన్సూరెన్స్‌: హైదరాబాద్‌లో సంస్థ మొదటి జీసీసీ. 
»   కెనడియన్‌ ఇంపీరియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌: తొలి జీసీసీ ఏర్పాటు. సైబర్‌ సెక్యూరిటీ గ్లోబల్‌ ఇంజనీరింగ్‌ హబ్, దేశంలో తొలి బ్యాంక్‌ ఏర్పాటు. 
» మాగ్జిమస్‌ (అమెరికా): భారత్‌లో తొలిసారి గ్లోబల్‌ పబ్లిక్‌ సెక్టార్‌ టెక్నాలజీ ఆపరేషన్‌ హబ్‌. ఆరోగ్య, పర్యావరణ రంగాల్లో పెట్టుబడులు 
»   జీఎంఆర్‌ స్పోర్ట్స్, వెంచర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌: భారత్‌ ఫ్యూ­చర్‌ సిటీలో శాటిలైట్‌ స్పోర్ట్స్‌ సిటీ ఏర్పాటు. స్టేడియాలు, క్రీడాకారులకు శిక్షణ, మౌలిక సదుపాయాల కల్పన. 
»   బ్లాక్‌ స్టోన్‌ ఏసియా: డేటా సెంటర్ల ఏర్పాటు. 
»  సత్వా గ్రూప్‌: అందుబాటు ధరల్లో గృహ నిర్మాణం, ప్రణాళికాబద్ధ అభివృద్ధికి ప్రభుత్వంతో కలిసి ప్రాజెక్టుల ఏర్పాటు. 
» బ్రిగేడ్‌ గ్రూప్‌: భారత్‌ ఫ్యూచర్‌ సిటీ–ఐటీ కారిడార్‌లో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ల నిర్మాణం.. ఆతిథ్య రంగంలో భారీ పెట్టుబడులు 
»   సుమధురగ్రూప్‌: మధ్యాదాయ వర్గాలకు, ఐటీ, పారిశ్రామిక వాడలకు దగ్గరలో గృహ సముదాయాల నిర్మాణం 
»   ఫిఫా–ఏఐఎఫ్‌ఎఫ్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి అకాడమీ ఏర్పాటుకు ఒప్పందం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement