వైభవం.. క్రీడోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవం.. క్రీడోత్సవం

Feb 19 2026 11:02 AM | Updated on Feb 19 2026 11:02 AM

వైభవం.. క్రీడోత్సవం

వైభవం.. క్రీడోత్సవం

రాయదుర్గం: 4వ రాష్ట్రస్థాయి పోలీస్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌–2026 బుధవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో వైభవంగా ప్రారంభమయ్యాయి. పోటీల ప్రారంభం సందర్భంగా డీజీపీ శివధర్‌రెడ్డి పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం క్రీడాజ్యోతిని వెలిగించి పోటీలను అధికారికంగా ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా డీజీపీ గన్‌ఫైర్‌ చేసి గాలిలోకి బెలూన్లను ఎగురవేశారు.అనంతరం యంగ్‌ఇండియా పోలీస్‌ స్కూల్‌ విద్యార్థులతో ముచ్చటించారు.

వ్యాయామం నిత్యజీవితంలో భాగం కావాలి

గ్లోబల్‌ సమ్మిట్‌, అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు, గ్రామపంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల బందోబస్తు, సమ్మక్క సారక్క జాతర వంటి కీలక బాధ్యతలను పోలీసులు అత్యంత నిబద్ధతతో నిర్వహించారని డీజీపీ శివధర్‌రెడ్డి కొనియాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉన్నప్పటికీ సిబ్బంది క్రీడల్లో పాల్గొనడం వారిలో నూతనోత్సహాన్ని నింపుతుందన్నారు. క్రీడలు మనలోని నాయకత్వ లక్షణాలను తట్టిలేపడంతోపాటు టీమ్‌ స్పిరిట్‌, ఐకమత్యాన్ని పెంచుతాయన్నారు. మహిళా పోలీసుల ప్రాతినిథ్యం ప్రతి విభాగంలోనూ పెరగాలని ప్రతిభతోపాటు నాయకత్వ లక్షణాలను చాటుకోవాలని సూచించారు. సైబరాబాద్‌ సీపీ డాక్టర్‌ ఎం రమేష్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి 2,532 మంది క్రీడాకారులు పాల్గొనడం గర్వంగా ఉందన్నారు. ఇందులో 300 మంది మహిళా క్రీడాకారులు ఉండడం విశేషమన్నారు. వచ్చే నెలలో సైబరాబాద్‌ వేదికగా జరుగనున్న అఖిల భారత పోలీస్‌ ఫుట్‌బాల్‌ పోటీలు జరుగుతాయన్నారు. మొత్తం 31 క్రీడా విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. అనంతరం అంతర్జాతీయ వేదికలపై రాణించిన కృష్ణారావు, సంజీవకుమార్‌, గోపాలకృష్ణ, ఎండీబాబా, అవెను గోపాల్‌ జయరామ్‌, లావణ్య తదితర క్రీడాకారులను ఘనంగా సత్కరించారు.

ప్రత్యేక ఆకర్షణగా పోలీస్‌ ఎక్స్‌పో

పోలీస్‌ వెల్ఫేర్‌ అండ్‌ వెల్‌నెస్‌లో భాగంగా సైబరాబాద్‌ కమిషనరేట్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎక్స్‌పోను డీజీపీ సతీమణి హేమ శివధర్‌రెడ్డి ప్రారంభించారు. పోలీసులకు ఉపయోగపడే ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహారం, శారీరక వ్యాయామం, క్రీడా పరికరాలు, వివిధ ఉత్పత్తులు స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

స్పోర్ట్స్‌ మీట్‌ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ జట్లు

ఘనంగా ప్రారంభమైన రాష్ట్రస్థాయి పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌

ముఖ్యఅతిథిగా హాజరైన డీజీపీ శివధర్‌రెడ్డి

33 జిల్లాల నుంచి పాల్గొంటున్న 2,532 మంది క్రీడాకారులు

Advertisement
 
Advertisement
Advertisement