తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ఇంకా మూడు వారాల సమయం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో అప్పుడే రాజకీయ సెగలు మొదలయ్యాయి. మళ్లీ అధికారంలోకి వస్తామన్న ధీమాతో పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం ‘కుర్చీలాట’ షురూ అయ్యింది. అధిష్టానం కఠిన హెచ్చరికలు జారీ చేసినా, సోషల్ మీడియా వేదికగా కొందరు నేతలు తమ వర్గానికే పట్టం కట్టాలని డిమాండ్ చేస్తుండటంతో కేరళ రాజకీయాలు మరింతగా వేడెక్కాయి.
వివాదాలకు కేంద్ర బిందువు
డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ షియాస్ ఇటీవల మాట్లాడుతూ తదుపరి ముఖ్యమంత్రి ఎర్నాకులం నుండి ఉండాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఈ చర్చ ఊపందుకుంది. దానికి తోడు ఎమ్మెల్యే కాని వ్యక్తి కూడా ముఖ్యమంత్రి కావచ్చా? అనే ప్రశ్నకు కేపీసీసీ అధ్యక్షుడు ఇచ్చిన సమాధానం అంచనాలను అమాంతం పెంచేసింది. సీనియర్ నాయకులు వీడీ సతీశన్, రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్ ఈ విషయంపై నేరుగా స్పందించకుండా పార్టీ విధానమే శిరోధార్యమని సమాధానాన్ని దాటవేస్తున్నారు. గతంలో కరుణాకరన్, ఆంటోనీ, ఊమెన్ చాందీ వంటి నాయకుల కాలంలో ఉన్న స్పష్టత ఇప్పుడు లోపించింది. అయినప్పటికీ, తుది నిర్ణయం తీసుకునే ముందు అధిష్టానం ఖచ్చితంగా ఎమ్మెల్యేలతో చర్చిస్తుందని భావిస్తున్నారు.
రేసులో ఉన్న ప్రధాన అభ్యర్థులు
ముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా రెండు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో మొదటిది వీడీ సతీశన్. ఒకవేళ యూడీఎఫ్ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని ప్రకటించిన సతీశన్, కాంగ్రెస్ గెలిస్తే సీఎం పీఠానికి ప్రాధాన్యత కలిగిన అభ్యర్థిగా కనిపిస్తున్నారు. భారీ మెజారిటీ వస్తే అది ఆయన నాయకత్వ విజయంగానే పరిగణిస్తారు. ఇక రెండో అభ్యర్థి మాజీ ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితల. పార్టీలో ఆయనకున్న సుదీర్ఘ అనుభవం అతిపెద్ద బలం. ఒకవేళ స్వల్ప మెజారిటీ మాత్రమే వస్తే, అందరినీ కలుపుకుపోయే ఆయన విధానం పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఢిల్లీ నుంచి అనూహ్య ఎంట్రీ?
ఈ ఇద్దరితో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరు కూడా తెరపైకి రావడం తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. జాతీయ స్థాయిలో సంస్థాగత మార్పులు జరిగే అవకాశం ఉన్నందున, హైకమాండ్ ఆయనను రాష్ట్ర రాజకీయాలకు పంపే యోచనలో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్, సీపీఎం పార్టీలలో ఎమ్మెల్యేలు కాని వారిని కూడా ముఖ్యమంత్రులుగా చేసిన చరిత్ర ఉండటంతో ఆయన అవకాశాలను కొట్టిపారేయలేమని విశ్లేషకులు అంటున్నారు. ఈ ముగ్గురిలో కేరళ కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి దక్కుతాయో తెలియాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.
ఇది కూడా చదవండి: బెంగాల్ రణరంగం: జెన్ జెడ్ చేతిలో ‘బ్రహ్మాస్త్రం’


