రొటీన్ లైఫ్ ఎవరికైనా బోర్ కొడుతుంది. కార్పొరేట్ ఉద్యోగంలో ఉండే వారికి ఇంకా ఫస్ట్రేషన్ వస్తుంది. కానీ బాధ్యతలు, స్థిరమైన జీతం, మిగిలిన సౌకర్యాల కారణంగా ఉద్యోగం చేయక తప్పదు. కానీ 9-5 జాబ్ విసుగు నుంచి బయట పడేందుకు ఒక యువకుడు ఎంచుకున్న వినూత్న మార్గం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రోజూ ఆఫీసులో గంటల తరబడి పని, అలసి ఇంటికొచ్చాక ఏదో వెలితిగా అనిపించడం, ఇలా ప్రతిరోజూ ఒకేలా సాగుతుండటంతో విసుగు చెంది, సాయంత్రం వేళల్లో ఇంట్లోనే కూర్చోకుండా, రాపిడో రైడర్‌గా రిజిస్టర్ చేసుకుని పని ప్రారంభించాడు. ఇది అతనికి ఆర్థికంగానే కాకుండా మానసికంగానూ ఎంతో మేలు చేసింది.రోజుకు అదనంగా రూ. 600,రూ. 700 వరకు సంపాదిస్తాడు. అదే ఫుల్ టైం రైడింగ్ చేస్తే, రోజు రూ. 1,500 వరకు సంపాదిస్తానంటూ దీపక్ పాండే తన గురించి ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో చెప్పు కొచ్చాడు.
రొటీన్ లైఫ్‌కు బ్రేక్
స్థిరమైన ఉద్యోగం ఉన్నప్పటికీ, మానసికంగా ఎంతో అలసిపోయినట్లు అనిపించడంతో దీపక్ ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఆఫీస్ పనిలోని ఏకధాటి రొటీన్ నుండి తప్పించుకోవడానికి సరదాగా ప్రారంభించిన ఈ ప్రయోగమే రెండో ఆదాయ వనరుగా మారిందని తెలిపాడు. కేవలం అదనపు ఆదాయం మాత్రమే కాదు విభిన్న వ్యక్తులతో మాట్లాడటం, నగరాన్ని చుట్టేయడం, కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావడం కారణంగా సరికొత్త జీవనశైలిఅలవడి కొత్త స్ఫూర్తినిస్తోందని దీపక్ తెలిపాడు.
ఇంకో విషయం ఏమిటంటే
చాలా కాలం పాటు ఓటమి భయం, సమాజం ఏమనుకుంటుందో అనే ఆందోళన తనను కొత్త విషయాలు ప్రయత్నించకుండా అడ్డుకున్నాయని దీపక్ తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. అలసట అనేది మనం చెప్పుకునే ఒక సాకు మాత్రమే. జీవితంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే మన కంఫర్డ్‌జోన్ నుంచి బయటికొచ్చి కష్టపడాలి అంటూ తన ఫాలోవర్లకు సందేశమిచ్చాడు. . కార్పొరేట్ ఉద్యోగం, ర్యాపిడో ద్వారా అదనపు ఆదాయంతో పాటు, PhD చేస్తున్నాడు. స్వయంగా వంట చేసుకుంటాడు. సోషల్ మీడియా కంటెంట్ క్రియేట్ చేస్తూ, వీడియోలను ఎడిట్ చేసుకుంటాడు. దీంతో దీపక్ లైఫ్‌స్టైల్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపిస్తూ, ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
ఇదీ చదవండి: అడపా దడపా సిగరెట్ కాలుస్తారా? ఈ విషయం తెలిస్తే...!


