ఎలాంటి డీల్‌ లేదు: ఐసీయూ నుంచి వాంగ్‌చుక్‌ | No Deal No Compromise: Wangchuk Hits Back From ICU Over Fasting Controversy | Sakshi
Sakshi News home page

ఎలాంటి డీల్‌ లేదు: ఐసీయూ నుంచి వాంగ్‌చుక్‌

Jul 25 2026 6:41 AM | Updated on Jul 25 2026 6:48 AM

No Deal No Compromise: Wangchuk Hits Back From ICU Over Fasting Controversy

సాక్షి, న్యూఢిల్లీ: నీట్‌-యూజీ పేపర్‌ లీక్‌, పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌.. తన దీక్ష విరమణపై వస్తున్న విమర్శలకు గట్టిగా స్పందించారు. కేంద్రంతో ‘డీల్‌ కుదుర్చుకుని’ దీక్ష విరమించారంటూ చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన.. అక్కడి నుంచే నేరుగా ఓ వీడియో సందేశం ద్వారా మాట్లాడారు.. 

‘‘26 రోజుల పాటు ఆకలితో పోరాడిన తర్వాత కూడా నా నిజాయితీని నిరూపించుకోవాలా?’’ అంటూ ప్రశ్నించారు. తన పోరాటాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్‌ మీడియాలో విడుదల చేసిన వీడియో సందేశంలో వాంగ్‌చుక్‌ మాట్లాడుతూ.. తన దీక్ష వెనుక ఉన్న ఉద్దేశాలను అర్థం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా విమర్శలు చేయడం సరైంది కాదని అన్నారు.

‘నా శరీరం ఎంత నష్టపోయిందో తెలుసా?’
దీక్ష విరమణపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారిని ఉద్దేశించి వాంగ్‌చుక్‌ భావోద్వేగానికి గురయ్యారు. ప్రజా సమస్యల కోసం తాను ప్రాణాలను సైతం పణంగా పెట్టానని తెలిపారు. ‘‘26 రోజుల పాటు ఆహారం లేకుండా ఉన్నాను. నా శరీరం తీవ్రంగా దెబ్బతింది. ఇంత చేసిన తర్వాత కూడా నా నిబద్ధతకు సర్టిఫికెట్‌ కావాలా?’’ అని ప్రశ్నించారు. తన పోరాటాన్ని, త్యాగాన్ని రాజకీయ లెక్కలతో అంచనా వేయొద్దని కోరారు.

ఐసీయూలో వాంగ్‌చుక్‌.. 11 కిలోల బరువు తగ్గింపు
వాంగ్‌చుక్‌ భార్య గీతాంజలి ఆంగ్మో కూడా విమర్శలపై స్పందించారు. 26 రోజుల నిరాహార దీక్ష కారణంగా ఆయన 11 కిలోల బరువు కోల్పోయారని, అందులో కండరాల నష్టం కూడా ఉందని తెలిపారు. ప్రస్తుతం వాంగ్‌చుక్‌ గురుగ్రామ్‌లోని మెదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ‘‘విమర్శించే ముందు ఆయన చేసిన త్యాగాన్ని అర్థం చేసుకోండి. 26 రోజుల పాటు ఒక లక్ష్యం కోసం పోరాడిన వ్యక్తికి కనీసం కాస్త సానుభూతి చూపించండి’’ అంటూ ఆమె విజ్ఞప్తి చేశారు.

ఎందుకు దీక్ష విరమించారు?
నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారం, పరీక్షల సంస్కరణలు, విద్యార్థుల సమస్యలపై చర్యలు తీసుకోవాలంటూ వాంగ్‌చుక్‌ నిరాహార దీక్ష చేపట్టారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌ల నుంచి కొన్ని హామీలు రావడంతో గురువారం ఆయన దీక్షను విరమించారు. శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై చర్యలు తీసుకోకుండా చూడటం, పరీక్షల సంస్కరణలపై పార్లమెంట్‌లో చర్చకు అవకాశం కల్పించడం, నీట్‌ వివాదం నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అంశాన్ని పరిశీలించడం వంటి హామీలు లభించాయని వాంగ్‌చుక్‌ తెలిపారు.

విమర్శల మధ్య కొనసాగుతున్న చర్చ
దీక్ష విరమణ తర్వాత సోషల్‌ మీడియాలో కొందరు ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించారు. అయితే వాంగ్‌చుక్‌ మాత్రం తన పోరాటం వెనుక ఉన్న ఉద్దేశం మారలేదని స్పష్టం చేశారు. ‘‘ఇది వ్యక్తిగత విజయం కోసం చేసిన పోరాటం కాదు.. విద్యార్థుల భవిష్యత్తు కోసం చేసిన ఉద్యమం’’ అని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement