అలా చేస్తే బాధ్యత నుంచి పారిపోయినట్లే..
తేల్చిచెప్పిన ప్రభుత్వ వర్గాలు
న్యూఢిల్లీ: నీట్–యూజీ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం ఎంతమాత్రం లేదని, అది ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాదని ప్రభుత్వ వర్గాలు తేల్చిచెప్పాయి. పదవికి రాజీనామా చేయడం చాలా సులభమైన పనే అయినప్పటికీ.. అలా చేస్తే ప్రజలు అప్పగించిన బాధ్యత నుంచి పారి పోవడమే అవుతుందని శుక్రవారం పేర్కొన్నాయి.
ధర్మేంద్ర ప్రధాన్‌ను తక్షణమే పదవి నుంచి తప్పించాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ, ఆయన రాజీనామా చేయబోరని ప్రభుత్వం విస్పష్టంగా చెబుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘ప్రజలు మాకు అధికారాన్ని కట్టబెట్టారు. వారి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత మాపై ఉంది’’అని ప్రభుత్వం తేల్చిచెప్పింది. సీజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్ సమావేశమైన రోజే ప్రభుత్వ వర్గాల నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం.
పేపర్ లీకేజీలను అరికట్టే విషయంలో నామమాత్రపు చర్యలు చేపట్టడానికి బదులుగా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ)లో వ్యవస్థాగత లోపాలను సరిదిద్దడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్‌టీఏకు సంబంధించిన లోపాలపై సమగ్ర జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. త్వరలోనే వీటిని సరిదిద్దేందుకు కార్యాచరణ ప్రారంభం కానుంది. పేపర్ లీకేజీల్లో ప్రమేయం ఉన్న ముఠాలను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దోషులపై తదుపరి చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే దాకా జంతర్‌మంతర్‌వద్ద ఆందోళన కొనసాగిస్తామని సీజేపీ ఇప్పటికే ప్రకటించింది.


