ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పించాల్సిందే.. రాజీ ప్రసక్తే లేదు! | CJP demand for Dharmendra Pradhan resignation in a meeting with Govt | Sakshi
Sakshi News home page

ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పించాల్సిందే.. రాజీ ప్రసక్తే లేదు!

Jul 25 2026 5:09 AM | Updated on Jul 25 2026 6:27 AM

CJP demand for Dharmendra Pradhan resignation in a meeting with Govt

బాధిత విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం చెల్లించాలి 

విద్యార్థులపై పెట్టిన కేసులన్నీ బేషరతుగా ఎత్తివేయాలి 

కేంద్ర మంత్రులకు    తేల్చిచెప్పిన సీజేపీ ప్రతినిధులు  

డిమాండ్ల పరిష్కారానికి శనివారం మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్‌ 

ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం వెల్లడిస్తామన్న జేపీ నడ్డా  

ప్రభుత్వం, సీజేపీ ప్రతినిధుల మధ్య 2 గంటలపాటు చర్చలు  

ప్రధాన్‌ రాజీనామా కోసం పదేపదే పట్టుబడుతున్న సీజేపీ  

అందుకు సుముఖతంగా లేని కేంద్ర ప్రభుత్వం  

సాక్షి, న్యూఢిల్లీ: నీట్‌–యూజీ పేపర్‌ లీక్‌ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) తేల్చిచెప్పింది. ప్రధాన్‌ పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని పునరుద్ఘాటించింది. ఈ నెల 20న నిరసన సందర్భంగా విద్యార్థులపై క్రూరంగా దాడి చేసినందుకు కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా క్షమాపణ చెప్పాలని స్పష్టంచేసింది. పేపర్‌ లీక్, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, సీజేపీ ప్రతినిధుల మధ్య శుక్రవారం ఢిల్లీలో రెండో విడత చర్చలు జరిగాయి. 

కేంద్రం తరఫున కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్‌ సింగ్, సీజేపీ తరఫున పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్‌ దాస్, జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్‌ రాంకా పాల్గొన్నారు. తాజా పరిణామాలపై సుమారు రెండు గంటల పాటు చర్చించారు. మూడు ప్రధాన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సీజేపీ ప్రతినిధులు కేంద్ర మంత్రులకు అందజేశారు. ప్రస్తుతం సీజేపీ పోరాటం మొత్తం ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా అంశం చుట్టే తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఆయన రాజీనామా చేసే దాకా విడిచిపెట్టబోమని ఆ పార్టీ పదేపదే చెబుతోంది. ప్రభుత్వం మాత్రం అందుకు సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ మేరకు స్పష్టమైన సంకేతాలిస్తోంది. ప్రధాన్‌ రాజీనామా చేయడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

రెండు డిమాండ్లకు కేంద్రం అంగీకారం! 
కేంద్ర మంత్రులతో సమావేశం అనంతరం సీజేపీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. తమ మూడు డిమాండ్లలో రెండింటికి కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాపై నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి శనివారం మధ్యాహ్నం వరకు గడువు ఇస్తున్నట్లు వెల్లడించారు. గడువులోగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే తమఆందోళనను మరింత ఉధృతం చేస్తామని తేల్చిచెప్పారు.

 విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ పోరాటాన్ని ఆపబోమని పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్‌కు ఉద్వాసన పలుకుతారని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే, సీజేపీ డిమాండ్లలో రెండింటికి తాము అంగీకరించినట్లు కేంద్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం తర్వాత కేంద్రం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  

నేడు మరోసారి చర్చలు: నడ్డా  
సీజేపీ ప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వంతో అంతర్గతంగా చర్చిస్తామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. వారితో శనివారం మధ్యాహ్నం మరోసారి సమావేశం కానున్నట్లు వెల్లడించారు. శుక్రవారం నాటి భేటీ అనంతరం జేపీ నడ్డా మీడియాతో మాట్లాడారు. సీజేపీ ప్రతినిధులు మూడు ప్రధాన డిమాండ్లతోపాటు పరీక్షల కోసం ఐదు సంస్కరణలు సూచించారని వెల్లడించారు. అంతర్గతంగా చర్చించి.. తీసుకున్న నిర్ణయాలను శనివారం మధ్యాహ్నం జరిగే మూడో విడత భేటీలో వారికి తెలియజేస్తామని పేర్కొన్నారు.    

సీజేపీ ప్రధాన డిమాండ్లు  
→ దేశంలో పరీక్షల నిర్వహణ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. ఇందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పదవి నుంచి తప్పుకోవాలి. ఈ డిమాండ్‌ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు.  

→ పేపర్‌ లీకేజీ, పరీక్షల రద్దు తదితర పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తక్షణమే రూ.కోటి చొప్పున ఆర్థిక పరిహారం చెల్లించాలి.  

→ న్యాయమైన హక్కుల సాధన కోసం దేశవ్యాప్తంగా నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే బేషరతుగా కొట్టివేయాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement