నిరసనలపై విచారణ 27న రెండు పిల్స్‌పై విచారిస్తాం | Supreme Court has agreed to hear on July 27 police excesses case | Sakshi
Sakshi News home page

నిరసనలపై విచారణ 27న రెండు పిల్స్‌పై విచారిస్తాం

Jul 25 2026 4:39 AM | Updated on Jul 25 2026 4:39 AM

Supreme Court has agreed to hear on July 27 police excesses case

మీడియాది తప్పుడు ప్రచారం: సీజేఐ

న్యూఢిల్లీ: జంతర్‌మంతర్‌లో విద్యార్థులపై పోలీసుల దాష్టీకంపై ఈ నెల 27న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రకటించింది. ఈ అంశంపై దాఖలైన రెండు వేర్వేరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ చేస్తామని ఛీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌ యాదవ్‌ జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ వి.మోహనలతో కూడిన బెంచ్‌ తెలిపింది. ‘‘విద్యార్థులపై పోలీసులు అతిగా బలం ఉపయోగించారు’’అని, ఇది రోజూ జరుగుతున్నందున అత్యవసరంగా విచారణ జరపాలని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకరనారాయణన్‌ ప్రస్తావించగా సీజేఐ స్పందించారు. 

నీట్‌ పరీక్ష పత్రాల లీకేజీలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాక్రోచ్‌ జనతా పార్టీ నెలరోజులుగా ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జూలై 20వ తేదీన నిర్వహించిన ‘ఛలో సంసద్‌’ర్యాలీలో పోలీసులు విద్యార్థులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా పోలీసుల చర్యను గర్హిస్తూ జూలై 22న ఢిల్లీ హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయ. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు కేంద్రం, ఢిల్లీ పోలీసుల స్పందనను కోరింది. పోలీసుల చర్యకు సంబంధించిన అన్ని రికార్డులను, సీసీటీవీ ఫుటేజ్‌లను భద్రపరచాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.  

మీడియాది అతి నిర్లక్ష్యం: సీజేఐ 
ఛలో సంసద్‌ సందర్భంగా విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్‌ అంశంపై సత్వర విచారణను తాను నిరాకరించినట్లు వచ్చిన వార్తలను సీజేఐ సూర్యకాంత్‌ యాదవ్‌ తీవ్రంగా ఖండించారు. ఆ అంశంపై ఎలాంటి రిట్‌ పిటిషన్‌ దాఖలు కాలేదని, ఒక రిప్రెజెంటేషన్‌ మాత్రమే అందిందని ఆయన శుక్రవారం వ్యాఖ్యానించారు. తమ కేసులను అత్యవసరంగా లిస్ట్‌ చేయాలని న్యాయవాదులు కోరుతున్న సమయంలో సీజేఐ మాట్లాడుతూ ‘‘రెండు రోజులుగా పిటిషన్‌ ఫైల్‌ అయినట్లు తప్పుడు ప్రచారం జరుగుతోంది. మీడియా అన్ని రకాల బాధ్యతల నుంచి తప్పించుకని చీఫ్‌ జస్టిస్‌ ఆ పిటిషన్‌ను లిస్ట్‌ చేసేందుకు నిరాకరించారని తప్పుడు రిపోరి్టంగ్‌ చేస్తోంది’’అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఆ రోజు ఉదయం పదిగంటల వరకూ ఒక్క కాగితమూ దాఖలు కాలేదు.

 ఒక రిప్రజెంటేషన్‌ మాత్రమే.. మిశ్రానో ఇంకెవరో పంపారు. దాన్ని రిట్‌ పిటిషన్‌గా ఎలా పరిగణిస్తా’’అని ప్రశ్నించారు. బుధవారం ఒక న్యాయవాది విద్యార్థులపై లాఠీఛార్జ్‌ విషయమై అత్యవసర విచారణ జరపాలని సీజేఐని కోరుతూ.. ‘‘పోలీసుల అకృత్యాలపై నా దగ్గర వీడియోలున్నాయి.... కేసు రేపు (గురువారం) లిస్ట్‌ చేయగలిగితే... విద్యార్థులు ఉన్నారు’’అని విన్నవించారు. అయితే సీజేఐ ఈ విజ్ఞప్తిని తిరస్కరించడంతోపాటు కేసులు ప్రస్తావించే సమయంలో వీడియోలు చూడలేమని స్పష్టం చేశారు. విద్యార్థులను బాగా కొట్టారని న్యాయవాది తెలపగా.. ‘‘మా సమయం వృథా చేయవద్దు. మేము వీడియోలు చూడదలచుకోలేదు’’అని ఘాటుగా సమాధానమిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement