ఢిల్లీలో యువత దీక్షలకు మద్దతుగా ర్యాలీలు
మూతపడ్డ ప్రైవేట్ విద్యా సంస్థలు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్: ‘నీట్’ నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యంపై నిరసన ర్యాలీలు.. ఎన్‌టీఏ రద్దు... ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద యువత దీక్షలకు మద్దతుగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి, యువజన సంఘాలు నిర్వహించిన విద్యాసంస్థల బంద్ ప్రశాంతంగా జరిగింది. ప్రైవేట్ విద్యాసంస్థలు, ఇంజనీరింగ్, ఐటీఐ తదితర వృత్తివిద్యా కళాశాలలు దాదాపుగా మూతపడ్డాయి. విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ పిలుపుతో స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. కేంద్ర మానవ వనరుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
నీట్ లీకేజ్‌తో దేశంలో సుమారు 24 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డాయి. మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో ఫార్మసీ పరీక్షలను నిలిపివేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని యూనియన్ నాయకులను బందరు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం, రాజానగరంలో విద్యార్థులు ధర్నాలు చేపట్టారు. పలుచోట్ల ద్విచక్ర ర్యాలీలు నిర్వహించారు.

అనంతపురంలోని కేఎస్‌ఆర్ ప్రభుత్వ బాలికల పాఠశాల వద్ద విద్యార్థి, యువజన సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పుట్టపర్తిలోని గణేష్ కూడలిలో ఉరితాడుతో నిరసన తెలిపి దున్నపోతుకు వినతిపత్రం అందజేశారు. కడపలో పాఠశాలల వద్ద విద్యార్థి సంఘాలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పత్తికొండలో పీటీఎం సమావేశాలను విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. కాగా, విద్యార్థుల న్యాయమైన పోరాటంపై ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ నిందలు వేసి తప్పుడు ఆరోపణలు చేయడాన్ని విద్యార్థి, యువజన సంఘాలు తీవ్రంగా ఖండించాయి.


