శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు పాడిందే‘పాట’ | Atrocities by followers of Srisailam TDP MLA Budda Rajasekhara Reddy | Sakshi
Sakshi News home page

శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు పాడిందే‘పాట’

Jul 25 2026 3:45 AM | Updated on Jul 25 2026 3:45 AM

Atrocities by followers of Srisailam TDP MLA Budda Rajasekhara Reddy

మల్లన్న దేవస్థానం దుకాణాల టెండర్లలో దౌర్జన్యం

చక్రం తిప్పిన ఎమ్మెల్యే బుడ్డా ముఖ్య అనుచరుడు 

వేలంలో పాల్గొంటే ఇబ్బందులు తప్పవని ఇతరులకు బెదిరింపులు  

ఆన్‌లైన్‌ పాటదారులకూ హెచ్చరికలు 

ఎమ్మెల్యే సూచించిన వారికే దుకాణాలివ్వాలని అధికారులకు హుకుం 

మల్లన్న ఆదాయానికి తీవ్రంగా గండి కొడుతున్నా ట్రస్ట్‌ బోర్డు మౌనం

సాక్షి, టాస్క్ ఫోర్స్:  శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అనుచరుల దౌర్జన్యాలు రోజురోజుకూ శ్రుతిమించుతున్నాయి. శ్రీశైల దేవస్థానం వాణిజ్య సముదాయంలో దుకాణాలకు ఇటీవల టెండర్లు నిర్వహించారు. ఈ బహిరంగ వేలాల్లో ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు చక్రంతిప్పాడు. ఎమ్మెల్యే చెప్పిన వారికే దుకాణాలు కట్టబెట్టాలని అధికారులకు హుకుం జారీ చేశాడు. వేలంలో పాల్గొంటే ఇబ్బందులు తప్పవని కార్యకర్తలతో  కలిసి పాటదారులను బెదిరించాడు. దుకాణాలకు పోటీ లేకుండా చేయడంతో మల్లన్న ఆదాయానికి తీవ్రంగా గండి పడింది.

బెదిరింపులతో వెనుదిరిగారు 
మొత్తం 31 దుకాణాలకు, మూడు ఖాళీ ప్రదేశాలకు జూన్‌ 26, 27వ తేదీల్లో దేవస్థానం పరిపాలన భవనంలో బహిరంగవేలం నిర్వహించారు. వేలంలో పాల్గొనేందుకు 101 పాటదారులు వచ్చారు. ఈ వేలంలో పాల్గొనేందుకు ఎలాంటి అర్హతా లేకపోయినా ఎమ్మెల్యే బుడ్డా ముఖ్య అనుచరుడు అక్కడికి చేరుకుని హల్‌చల్‌చేశాడు. పాటదారులను బెదిరించాడు. ఇబ్బంది పడతారంటూ హెచ్చరించాడు. దీంతో పాటదారులు వేలంలో పాల్గొనకుండా వెనుతిరిగి వెళ్లారు. ఈ తతంగమంతా దేవస్థానం రెవెన్యూ విభాగం అధికారుల సమక్షంలోనే జరిగి­నా అందరూ చోద్యం చూస్తూ ఉండిపోయారు.  

ఎమ్మెల్యే ఆదేశాలతోనే..
దేవస్థానం దుకాణాలకు బహి­రంగ వేలం, ఆన్‌లైన్‌ టెండరింగ్‌ కూడా అధికారులు చేపట్టారు. ఆన్‌లైన్‌లో షాపులకు టెండర్లు వేసిన వ్యాపారులనూ టీడీపీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు బెదిరించినట్టు విశ్వసనీయ సమాచారం. భారీగా డిమాండ్‌ ఉన్న ఐదు దుకాణాలపై కన్నేసిన కొందరు వ్యాపారులు ఎమ్మెల్యేను సంప్రదించి హామీ పొందినట్లు తెలిసింది. ఆయన ఆదేశాలతో రంగంలోకి దిగిన ముఖ్య అనుచరుడు బహిరంగ వేలం, ఆన్‌లైన్‌ టెండర్‌లో పాల్గొన్న వ్యాపారులను బెదిరించి వెనక్కిపంపారు. 

ఎమ్మెల్యే సూచించిన వారితో టెండర్లు వేయించి, అప్‌సెట్‌ ప్రైస్‌ కంటే రూ.5వేలు అదనంగా పెంచినట్లు పాటపాడి దుకాణాలు కట్టబెట్టేందుకు పావులు కదిపినట్టు తెలుస్తోంది. దుకాణాలు కావాలని కోరిన వ్యాపారులతో ఎమ్మెల్యే, ఆయన ముఖ్య అనుచరుడు ముందే బేరం కుదుర్చుకున్నట్టు సమాచారం. ఒక్కో దుకాణానికి రూ.పది లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్టు తెలుస్తోంది. ఇంత జరిగినా.. దేవస్థాన అధికారులు, ట్రస్టుబోర్డు నోరుమెదపడం లేదు. దుకాణాల కేటాయింపు అంశాన్ని ఈ నెల 28న జరుగనున్న ట్రస్ట్‌బోర్డు సమావేశంలో అనుమతి కోసం అజెండాలో చేర్చినట్టు తెలిసింది.  

ట్రస్ట్‌బోర్డు అనుమతితోనే కేటాయిస్తాం
దుకాణాలకు బహిరంగ వేలాలు నిబంధనల మేరకే నిర్వహించాం. ప్రత్యేకంగా ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే సరిదిద్దుతాం. డిఫాల్టర్‌గా ఉన్న వారికి దుకాణాలు కేటాయించబోం. ట్రస్ట్‌బోర్డు అనుమతితోనే దుకాణాలు కేటాయిస్తాం. – ఎం.శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement