ధరలు దారుణంగా పతనం
కిలో టమాటాకు రైతులకు దక్కుతుంది రెండు రూపాయలే.. మార్కెట్‌లో జోక్యం చేసుకోకుండా సర్కారు మొద్దునిద్ర
రైతులను ఆదుకోవాల్సింది పోయి నాణ్యత లేదని.. సీమ మార్కెట్లను సరుకు ముంచెత్తిందని ప్రకటనలు
సాక్షి, అమరావతి: టమాటా ధరలు మరోసారి దారుణంగా పతనమవుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ధరలు పడిపోతుంటే మార్కెట్‌లో జోక్యం చేసుకుని ఆదుకోవాల్సిన సర్కారు.. మార్కెట్‌కు సరుకు పోటెత్తిందని, నాణ్యత లేదని ప్రకటనలు చేయడంపై టమాటా రైతులు మండిపడుతున్నారు. దేశంలోనే అతిపెద్ద టమాటా మార్కెట్‌గా పేరుపొందిన మదనపల్లెలో గురువారం కిలో టమాటా కేవలం రూ.2 పలికింది. వారం పది రోజులుగా ధరలు పతనమవుతున్నాయని రైతులు మొత్తుకుంటున్నా ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తోంది. మార్కెట్‌లో జోక్యం చేసుకుంటే ఎక్కడ ఆ భారంభరించాల్సి వస్తుందోనని మార్కెట్‌పై, రైతులపై నెపం మోపుతోంది. ఒకేసారి సరుకు ఎక్కువగా వచ్చిందని.. నాణ్యత లేదని సాకులు చెబుతోంది.
బోర్డులపై ఒక రేటు.. దక్కేది మరో ధర
మదనపల్లె మార్కెట్‌లో కాస్త క్వాలిటీ ఉన్న టమాటాలను 15 కిలోల ట్రే గురువారం రూ.30 నుంచి రూ.50 మధ్య కొనుగోలు చేశారు. అంటే కిలో టమాటా రూ.2 నుంచి రూ.3.20 ధర పలికింది. శుక్రవారం కూడా ఇంచుమించుగా అదే పరిస్థితి కొనసాగింది. మార్కెట్‌లోని బోర్డులపై ప్రదర్శించిన రేట్లకు, రైతులకు దక్కిన ధరలకు ఏమాత్రం పొంతన లేదు. బోర్డులపై ఫస్ట్ క్వాలిటీ రూ.9 – రూ.11.50 ఉన్నట్లు చూపించినా రైతులకు మాత్రం రూ.7 నుంచి రూ.10 మాత్రమే ఇచ్చారు.
ఇక సెకండ్ క్వాలిటీ రూ.5 – రూ.8 ఉన్నట్లు బోర్డులపై చూపించి రైతులకు ఇచ్చింది మాత్రం కేవలం రూ.3 నుంచి రూ.4.50 మాత్రమే. రాష్ట్రంలో వివిధ మార్కెట్లకు 12,215 మెట్రిక్ టన్నులు టమాటా రాగా అందులో 5,564 మెట్రిక్ టన్నుల ఫస్ట్ గ్రేడ్, 6,650 మెట్రిక్ టన్నుల సెకండ్ గ్రేడ్‌గా నిర్ధారించారు. అత్యధికంగా రాప్తాడు ప్రైవేట్ మార్కెట్‌కు 6,750 టన్నులు రాగా మదనపల్లి మార్కెట్‌కే 1,180 టన్నులు టమాటా వచ్చింది. మార్కెట్‌కు వచ్చిన నాణ్యమైన టమాటాలకు సైతం ధర లేకుండా చేసేందుకు రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు.
ఎంతోకొంతకు తీసుకోవాలంటూ వ్యాపారులను వేడుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. ప్రభుత్వం తమకేమీ పట్టనట్టుగా దిక్కులు చూస్తోంది. అధిక ఉత్పత్తి, స్థానిక మార్కెట్లకు భారీగా వస్తున్న సరుకు, కర్ణాటక, చిత్తూరు, హిమాచల్ ప్రదేశ్‌లలో స్థానికంగా సరఫరా పెరగడం వల్ల మన రాష్ట్రంలో టమాటా ధరలు తగ్గుముఖం పట్టాయని చెబుతున్నారు.
రెండేళ్లుగా ఇదే దుస్థితి..
గత రెండేళ్లుగా ఒకటి రెండు సందర్భాల్లో మినహా సీజన్ మొత్తం సరాసరిన టమాట కిలో రూ.3–6కి మించి పలకని దుస్థితి నెలకొంది. ఎకరాకు రూ.3–4 లక్షల వరకు ఖర్చవుతుండగా పంట చేతికొచ్చే సమయంలో ధర లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను మూటగట్టుకుంటున్నారు. గతేడాది కూడా ఇదేరీతిలో ధరలు పతనమైన సందర్భంలో కిలో రూ.8 చొప్పున ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందంటూ నమ్మబలికి చివరికి చేతులెత్తేశారు.
ఈసారి పరిస్థితి మరింత దయనీయంగా ఉన్నా ప్రభుత్వం జోక్యం చేసుకునేందుకు ముందుకు రావడంలేదు. నాణ్యత లేదనే సాకుతో గురువారం వ్యాపారులు కొనుగోలు నిలిపివేయడంతో మదనపల్లె మార్కెట్‌కు తెచ్చిన వందలాది టన్నుల టమాటాను కొనేవారు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. సాధారణంగా ఎకరాకు 20–30 టన్నుల మధ్య దిగుబడులు వస్తుండగా ఈ ఏడాది 20 టన్నులకు మించి రాలేదని రైతులు చెబుతున్నారు.
నాడు మార్కెట్ జోక్యంతో అండగా..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ధరలు పతనమైన ప్రతి సందర్భంలోనూ తక్షణమే మార్కెటింగ్ శాఖను రంగంలోకి దింపి వ్యాపారులతో పోటీ పడుతూ సేకరించేలా ఆదేశించింది. ధరల స్థిరీకరణ నిధితో ఆదుకుంది. ఇలా మొత్తం రూ.18 కోట్ల విలువైన 8,460 టన్నుల టమాటాలను సేకరించి రైతులకు అండగా నిలిచింది.

వైఎస్ జగన్ ప్రభుత్వంలో టమాట రైతులను ఆదుకున్నారిలా..
రెండేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం ధరలు పతనమవుతుంటే తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. పైగా రాయలసీమ మార్కెట్లను టమాటా ముంచెత్తడం వలనే ధరలు పెరిగిపోతున్నాయంటూ ప్రకటనలు గుప్పిస్తోంది. నాణ్యత లేకపోవడంతో ధరలు పతనమవుతున్నాయని.. మార్కెట్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ రవి పఠ్టన్ శెట్టి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


