రిజిస్ట్రేషన్లు చేయిస్తారా.. బదిలీ అయిపోతారా? | Minister warns sub registrars over document writers strike | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్లు చేయిస్తారా.. బదిలీ అయిపోతారా?

Jul 25 2026 3:41 AM | Updated on Jul 25 2026 3:41 AM

Minister warns sub registrars over document writers strike

డాక్యుమెంట్‌ రైటర్ల సమ్మెపై సబ్‌ రిజిస్ట్రార్లకు మంత్రి అనగాని వార్నింగ్‌లు 

రిజిస్ట్రేషన్లు చేయించకపోతే బదిలీయేనని హెచ్చరికలు 

కొనసాగుతున్న సమ్మె..

సాక్షి, అమరావతి:  రిజిస్ట్రేషన్ల వ్యవస్థ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డాక్యుమెంట్‌ రైటర్ల సమ్మె నేపథ్యంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ నేరుగా బెదిరింపులకు దిగారు. సబ్‌ రిజిస్ట్రార్లకు ఫోన్లు చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రే­షన్లు ఆగకూడదని, ఆ బాధ్యత మీదేనని, ఎప్పటి­లా  రిజిస్ట్రేషన్లు జరక్కపోతే బదిలీ అయిపోతారని వార్నింగ్‌లు ఇచ్చినట్లు సమాచారం. స్టాంపులు,  రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ బీఆర్‌ అంబేద్కర్‌ ద్వారా డాక్యుమెంట్‌ రైటర్లపై ఒత్తిడి తెచ్చి సమ్మె విరమింపజేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో శుక్రవారం నేరుగా ఆయనే రంగంలోకి దిగా­రు. 

రాష్ట్రంలోని ప్రధాన సెంటర్లలో పని చేస్తున్న సబ్‌ రిజిస్ట్రార్లకు స్వయంగా ఫోన్లు చేసి రిజిస్ట్రేషన్లు జరిగేలా వెంటనే స్థానిక డాక్యుమెంట్‌ రైటర్లతో మాట్లాడి ఒప్పించాలని ఒత్తిడి చేసినట్లు తెలిసింది. వారు వినడంలేదని చెప్పిన వారిపై ఆగ్ర­హం వ్యక్తం చేసి తాను చెప్పినట్లు చేయకపోతే బది­లీ చేస్తానని హెచ్చరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సమ్మెలో ఉన్న తమ కార్యాలయాల పరిధిలో ఉన్న రైటర్లతో సబ్‌ రిజిస్ట్రార్లు మాట్లాడి  రిజిస్ట్రేషన్లకు సహకరించాలని కోరారు. అయితే ఇందుకు చాలాచోట్ల రైటర్లు అంగీకరించలేదు. 

రిజిస్ట్రేషన్ల వ్యవస్థను ప్రైవేటీకరిస్తే తమ జీవన భృతి పోతుందని, ప్రజల ఆస్తులకు భద్రత కూడా ఉండదని డాక్యుమెంట్‌ రైటర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కూడా పెద్దగా  రిజిస్ట్రేషన్లు జరగలేదు. మంత్రి, ఉన్నతాధికారులు, అధికారులు ఒత్తిడి చేస్తున్నా డాక్యుమెంట్‌ రైటర్లు  రిజిస్ట్రేషన్లకు ముందుకు రావడంలేదు. టీడీపీ నేతల ఒత్తిడితో అక్కడక్కడా ఓ మోస్తరుగా  రిజిస్ట్రేషన్లు జరిగాయి. రోజుకు 10 వేల  రిజిస్ట్రేషన్లు జరగాల్సివుండగా శుక్రవారం 1500 లోపే జరిగాయి. దీన్నిబట్టి బెదిరింపులు పని చేయలేదని స్పష్టమవుతోంది. 

మొదటి మూడు రోజులు రోజుకు 300 లోపే రిజిస్ట్రేషన్లు జరగ్గా బెదిరింపులతో విజయవాడ వంటి చోట్ల మాత్రమే వాటి సంఖ్య స్వల్పంగా పెరిగింది. మిగిలిన చోట్ల  రిజిస్ట్రేషన్లు స్తంభించాయి. నాలుగు రో­జులుగా ప్రభుత్వానికి రూ.200 కోట్ల మేర నష్టం వచ్చింది. అయినా చంద్రబాబు ప్రభుత్వం సమ్మె­ను సీరియస్‌గా తీసుకోలేదు. ప్రభుత్వం తమను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకపోవడం, తమ గోడు వినేందుకు సైతం సిద్ధంగా లేకపోవడంతో డాక్యుమెంట్‌ రైటర్లు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement