విల్లుపురం: ఒకే ఒక్క కోతి.. దాదాపు మూడు నెలల నుంచి ఆకస్మికంగా దాడులు చేస్తూ గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. చిన్నారులపై దాడులు చేస్తోంది. ఇటీవల ఓ బాలిక చెవి కొరికేసింది. గ్రామస్తుల అభ్యర్థన మేరకు అటవీ అధికారులు రంగంలోకి దిగారు. ఆ రౌడీ వానరాన్ని బంధించేందుకు గ్రామంలోనే ఏకంగా క్యాంపు ఏర్పాటు చేసుకున్నారు. పలు చోట్ల బోన్లను అమర్చారు. అవసరమైతే మత్తిచ్చి పట్టుకునేందుకు ట్రాంక్విలైజర్ల బృందాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు.
ఒకట్రెండు రోజుల్లోనే ఆ వానరం చిక్కడం ఖాయమని ధీమాతో చెబుతున్నారు. తమిళనాడులోని విల్లుపురం జిల్లా మరుతెరి గ్రామంలో ఓ వానరం చిన్నారులు, ఆ దారిని వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తోంది. ఈ నెల 21వ తేదీన 8వ తరగతి చదివే బాలికపై పడి, చెవి కొరికేసింది. ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో అటవీ అధికారులు రంగప్రవేశం చేశారు. ఆ వానరం ఒంటరిగానే సంచరిస్తోందని, ఏదైనా సర్కస్ కంపెనీకి చెందనది అయి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


