సాక్షి, చైన్నె : చైన్నె శివారులోని చెంగల్పట్టు జిల్లా తాంబరం సమీపంలో ఉన్న అగరం దక్షిణం గ్రామంలో సుమారు రూ.300 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై వారం రోజుల్లోగా చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే కేసును సీబీఐకి అప్పగిస్తామని న్యాయస్థానం తీవ్రంగా హెచ్చరించింది. మాడంబాక్కం ప్రాంతానికి చెందిన సంతానం అనే వ్యక్తి ఈ వ్యవహారంపై హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అగరం దక్షిణం పంచాయతీ అధ్యక్షుడు, కొంతమంది కుమ్మకై ్క నకిలీ వారసత్వ ధృవీకరణ పత్రాలు, మరణ ధృవీకరణ పత్రాలు, ఫోర్జరీ పట్టాలను సృష్టించి విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించారని వివరించారు. దాన్ని బ్యాంకుల్లో పెట్టి రూ.3 కోట్ల వరకు రుణాలు తీసుకున్నారని, ఆ మొత్తాన్ని ఎన్నికల నిధులుగా మళ్లించి మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారుల అండదండలతోనే ఈ వ్యవహారం జరిగిందని, దీనిపై విజిలెన్స్ విభాగానికి, తాంబరం పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ కృష్ణన్ రామస్వామి ధర్మాసనం విచారించింది. న్యాయవాది వాదనలు వినిపిస్తూ భూ కుంభకోణంలో డీఎంకే మాజీ మంత్రి సోదరితో పాటు పలువురు నాయకుల హస్తం ఉండడం వల్లే పోలీసులు చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారని ఆరోపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ప్రభుత్వ భూమిని ఆక్రమించి మోసానికి పాల్పడిన నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. వారం రోజుల్లో చర్యలు తీసుకోని పక్షంలో ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సి ఉంటుందని హెచ్చరించారు. విచారణను వచ్చే వారం రోజులకు వాయిదా వేశారు.


