మూర్ఛ వస్తే ప్రాణమే పోయింది!
–మృతుడు తమిళనాడు వాసి
గుడిపాల: మూర్ఛకు గురై లారీ డ్రైవర్ మృతి చెందిన విషాద సంఘటన శుక్రవారం మండలంలోని అల్లా ఫుడ్స్ ఫ్యాక్టరీలో చోటుచేసుకుంది. గుడిపాల ఎస్‌ఐ రామ్మోహన్ తెలిపిన వివరాలు.. తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా వాలాజా మండలం, కొండకుప్పం పంచాయతీకి చెందిన రామచంద్రన్(31) ఎస్‌ఆర్‌ఎం కంపెనీలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం అల్లా ఫుడ్స్ ఫ్యాక్టరీలో ఖాళీ బ్యారెల్ డ్రమ్ములను లోడ్ చేస్తుండగా అతను ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో కుప్పకూలాడు. అతనితో పాటు ఉన్న జయరామ్, రాజశేఖర్ వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి వచ్చిన సిబ్బంది రామచంద్రన్‌ను పరీక్షించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు హుటాహుటిన ఇక్కడి వచ్చారు. భోరున విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చైన్నె కీల్పాకంలో కలకలం
– దాడిలో ఖైదీ మృతి
సాక్షి, చైన్నె : చైన్నె కీల్పాక్కంలోని ప్రభుత్వ మానసిక ఆరోగ్య సంస్థలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని క్రిమినల్ వార్డులో చికిత్స పొందుతున్న ఒక విచారణ ఖైదీపై తోటి రోగి దాడి చేశాడు. దీంతో అతను చికిత్స పొందుతూ మరణించాడు. కోయంబత్తూరు జిల్లా అలియార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో అరెస్టయిన జహీర్ మానసిక ఆరోగ్య సమస్యలతో కీల్పాక్కం ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలోని క్రిమినల్ వార్డులో చేరాడు. అదే వార్డులో తెన్కాసి జిల్లా కడయం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో అరెస్టయిన అరవింద్ స్వామి చికిత్స పొందుతున్నాడు. ఈనెల 20న టాయిలెట్ సమీపంలో జహీర్, అరవింద్ స్వామి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన అరవింద్ స్వామి, జహీర్‌పై దాడి చేశాడు. కేకలు విని అక్కడికి వచ్చిన ఆసుపత్రి సిబ్బంది అతన్ని రక్షించి మెరుగైన వైద్యం కోసం స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను శుక్రవారం మరణించాడు. దీనిపై డాక్టర్ సుమిత్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్రటేరియట్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేశారు. అరవింద్ స్వామిని పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.
యువకుడి హత్య
తిరువొత్తియూరు : తూత్తుకుడి జిల్లా ఒట్టపిడారం సమీపంలోని కచ్చేరి దళవాయిపురంలో యువకుడు హత్యకు గురయ్యాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దళవాయిపురం ఉత్తర వీధికి చెందిన మరియప్పన్ కుమారుడు మలైరాజ్ (30) టైల్స్ వేసే కూలి కార్మికుడు. అతను ప్రతిరోజూ సాయంత్రం ఊరి చివరన ఉన్న వాగు ప్రాంతంలో తన స్నేహితులతో కలిసి మద్యం సేవించేవాడు. గురువారం సాయంత్రం స్నేహితులతో కలిసి వాగు ప్రాంతానికి వెళ్లాడు. చాలా సమయమైనా మలైరాజ్ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు వెతకడం ప్రారంభించారు. వాగు ప్రాంతంలో మలైరాజ్ శవమై పడి ఉండడాన్ని చూశారు. ఒట్టపిడారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ కార్తీక్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. మలైరాజ్ మతదేహాన్ని స్వాధీనం చేసుకుని తూత్తుకుడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో జరిగిన గొడవ కారణంగానే మలైరాజ్ హత్యకు గుర య్యాడా? లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.
మహిళ హత్య కేసులో
దంపతుల అరెస్టు
అన్నానగర్: పుదుచ్చేరి, కరువాడికుప్పం, సెంగేరి అమ్మన్ కోవిల్ స్ట్రీట్‌లోని సర్‌ప్రైజ్ పేరిట మహిళ కళ్లకు గంతలు కట్టి కర్రతో కొట్టి హత్య చేసిన కేసులో దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. సెంగేరి అమ్మన్ కోవిల్ స్ట్రీట్‌లో ఉన్న అపార్ట్‌మెంట్ భవనంలో మణి, రమణి (43) దంపతులు నివసిస్తున్నారు. వారు హోటల్ నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం మణి కూరగాయలు కొనడానికి పెద్ద సంతకు వెళ్లాడు. రమణి తన హోటల్ పని ముగించుకుని ఇంటికి వచ్చింది. మణి ఇంటికి వచ్చేసరికి భార్య కనిపించలేదు. పక్కన ఉన్న చిన్న సందులో ఆమె మృతిచెంది ఉంది. పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఇన్‌స్పెక్టర్ బాలమురుగన్ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిశీలించారు. ముఖం, తలపై కత్తిరితో పొడిచినట్లు గుర్తించారు. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు, చెవిపోగులు లేవు. ఆభరణాల కోసమే హత్య చేసినట్టు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ పుటేజీల ఆధారంగా పరిశీలించగా రమణి సోదరి కుమారుడి స్నేహితుడైన ప్రవీణ్‌కుమార్‌పై అనుమానం వచ్చింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా నగల కోసం రమణిని చంపినట్లు ఒప్పుకున్నాడు. తనకు అప్పులు ఎక్కువగా ఉన్నాయని తెలిపాడు. రమణి పగలు ఒంటరిగా ఉంటుందని, ఆమె నగలు చోరీ చేయాలని ప్లాన్ చేసినట్టు పేర్కొన్నాడు. భార్య ఈశ్వరి, తాను చీర కొని ఆమె ఇంటికి వెళ్లినట్టు తెలిపాడు. చీరను రమణికి సర్‌ప్రైజ్‌గా ఇచ్చి ఇంకో సర్‌ప్రైజ్ ఉందని ఆమె కళ్లకు గంతలు కట్టి సందులోకి తీసుకువెళ్లామని పేర్కొన్నాడు. అక్కడ ఆమెను కొట్టి హత్య చేసినట్టు అంగీకరించాడు. ఆమె నగలు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు తెలిపాడు. దీంతో ప్రవీణ్ కుమార్ (24), అతని భార్య ఈశ్వరి (21)ని పోలీసులు అరెస్టు చేశారు.


