తిరుత్తణి: ఆడ బిడ్డలు పుట్టారన్న సాకుతో భర్త విడిచిపెట్టాడని, అతనిని తమతో కలపాలని ఒక మహిల తన ఇద్దరి బిడ్డలతో కలిసి తిరుత్తణి ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం ఆత్మహత్యకు యత్నించింది. ఆర్కేపేట యూనియన్‌లోని వంగనూరుకు చెందిన గీత(27)కు అమ్మయార్‌కుప్పానికి చెందిన మోహన్(30)తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మొదట పాప జన్మించింది. ఆడబిడ్డ పుట్టడంతో భార్యపై కోపం పెంచుకున్న భర్త వరకట్నం తీసుకురావాలని పుట్టింటికి పంపారు. గతేడాది పెద్దలు పంచాయితీ చేసి దంపతులను ఒకటి చేశారు. దీంతో గీత రెండో సారి గర్భం దాల్చింది. ఆరు నెలల కిందట మళ్లీ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మోహన్, అతని కుటుంబ సభ్యులు ఆగ్రహం చెంది గీతను ఇద్దరి బిడ్డలతో సహా బలవంతంగా పుట్టింటికి పంపారు. అప్పటి నుంచి భర్తతో కాపురం కోసం గీత పోరాడుతోంది. తిరుత్తణి మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా లాభం లేకపోవడంతో శుక్రవారం తన ఇద్దరి బిడ్డలతో తిరుత్తణి ఆర్డీఓ కార్యాలయం చేరుకుంది. తనకు న్యాయం చేయడం లేదని వాపోయింది శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. అక్కడే వున్న పోలీసులు ఆమెను కాపాడారు. అధికారులు పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. మహిళా పోలీస్ స్టేషన్ పోలీసులు వచ్చి గీత, ఆమె బిడ్డలకు న్యాయం చేస్తామని తీసుకెళ్లారు.


