పళ్లిపట్టు: దుండగులు నూకాలమ్మ ఆలయ తాళం పగులగొట్టి అమ్మవారి తాళిబొట్టు, హుండీలోని కానుకలను చోరీ చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పళ్లిపట్టు యూనియన్‌లోని అత్తిమాంజేరిలో నూకాళమ్మ ఆలయంలో ప్రతిఏటా యాదవులు కొలుపు వేడుకలు నిర్వహించడం పరిపాటి. ఈ ఏడాది కొలుపు వేడుకలు సోమవారం నుంచి బుధవారం వరకు వేడుకగా నిర్వహించారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి దుండగులు ఆలయ తాళం పగులగొట్టి అమ్మవారి తాళిబొట్టు, హుండీలోని కానుకలు చోరీ చేశారు. హుండీని ముళ్ల పొదల్లో పడేశారు. శుక్రవారం ఉదయం ఆలయానికి వెళ్లిన పూజారి చోరీ జరిగిన విషయం గుర్తించి ఆలయ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. పొదటూరుపేట ఇన్‌స్పెక్టర్ రాఖీకుమారి తన సిబ్బందితో ఆలయం వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. వేలిముద్ర నిపుణులు, డాగ్ స్క్వాడ్ బృందం ఆధారాలు సేకరించారు. చోరీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతవారం ఇదే తరహాలో ఆర్కేపేట సమీపంలోని ఎస్‌వీజీపురంలో అమ్మవారి ఆలయంలో చోరీ చోటుచేసుకోవడం గమనార్హం.


