తిరువళ్లూరు: శిశువు జన్మించినప్పటి నుంచి దశల వారి ఎదుగుదలను నిశితంగా గమనించాలని చిన్నపిల్లల వైద్యనిపుణుడు డాక్టర్ జగదీష్ సూచించారు. తిరువళ్లూరు మెడికల్ కళాశాల ఆవరణంలో సెరిబ్రల్ పాల్సీ అవగాహన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరువళ్లూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బాలాజీ అద్యక్షత వహించగా, సెరిబ్రల్ పాల్సీపై చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా డాక్టర్ జగదీష్ ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులలో సెరిబ్రల్ పాల్సీ గురించి అవగాహన కల్పించడం, పిల్లలతో అబివృద్ది సంబందిత వైకల్యాలను ముందుగానే గుర్తించడం, సకాలంలో చికిత్స, పునరావస చర్యల ఆవశ్యకతను తెలియజేశారు. సెరిబ్రల్ పాల్సీ బాధిత చిన్నారులకు తల్లిదండ్రులు అండగా వుండాలన్న ఆయన, పిల్లల మానసిక శ్రేయస్సు, వాతావరణం అనుకూలంగా వుండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పిల్లల ఎదుగుదల, అభివృద్ధి దశలను సరిగ్గా పర్యవేక్షించడం, అభివృద్ధిలో జాప్యాన్ని ముందుగానే గుర్తించడం, సరైన మూల్యాంకనం బహుళ విభాగాల చికిత్స ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ సురేష్‌బాబు, వైస్ ప్రిన్సిపల్ తిలకవతి, ఆర్‌ఎంవో రాజ్‌కుమార్, ఏఆర్‌ఎంవో డాక్టర్ ప్రభుశంకర్, డిప్యూటి సూపరిడెంట్ విజయ్‌రాజ్, హెవోడి శ్రీదేవి, నోడల్ అధికారి జయధీష్‌కుమార్, మెడికల్ అధికారి సతీష్‌కుమార్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.


