దీపస్తంభంపై వెలగని కార్తీక దీపం! | - | Sakshi
Sakshi News home page

దీపస్తంభంపై వెలగని కార్తీక దీపం!

Nov 25 2026 12:38 AM | Updated on Nov 25 2026 12:38 AM

● తిరుప్పరకుండ్రంలో ఉద్రిక్తత ● అమలుకు నోచుకోని కోర్టు ఆదేశాలు ● భక్తులలో నిరాశ ● ఎక్కడికక్కడ అరెస్టులతో టెన్షన్‌

సాక్షి, చైన్నె: సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు, మదురై హైకోర్టు తీవ్ర హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మదురైలోని తిరుపరకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభం వద్ద కార్తీక దీపాన్ని వెలిగించలేదు. యథావిధిగా పాత సంప్రదాయం ప్రకారం కొండపై ఉన్న ఉచ్చి పిళ్లయార్‌ ఆలయం సమీపంలోనే మంగళవారం సాయంత్రం దీపాన్ని వెలిగించారు. దీపస్తంభంపై దీప దర్శనం కోసం కొండ దిగువన ఆశగా వేచి ఉన్న లక్షలాది మంది భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తిరుపరకుండ్రంలో ఏటా కార్తీక దీపం పర్వదినాన ఉచ్చి పిళ్లయార్‌ ఆలయం వద్ద మహాదీపం వెలిగిస్తారు. అయితే, కొండ పైభాగంలో ఉన్న పురాతన దీపస్తంభం వద్ద కూడా దీపం వెలిగించాలని హిందూ సంస్థలు ఏళ్లుగా పోరాడుతున్నాయి. ఈ అంశంపై గతేడాది మదురై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు కాగా, ఉచ్చి పిళ్లయార్‌ ఆలయంతో పాటు దీపస్తంభం వద్ద కూడా దీపం వెలిగించాలని కోర్టు తీర్పునిచ్చింది. దీనిని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం కూడా సమర్థించింది. దీనిపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఈనెల 20న విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ ఏడాది కార్తీక దీపాన్ని కొండపై ఉన్న దీపస్తంభం వద్ద వెలిగించాలని ఆదేశించింది. జిల్లా కలెక్టర్‌ నియమించిన ప్రత్యేక బృందం మాత్రమే అక్కడికి వెళ్లి దీపం వెలిగించాలని, ఇతరులను కొండపైకి అనుమతించకూడదని స్పష్టం చేసింది.

రెడ్‌జోన్‌ – 144 సెక్షన్‌ విధింపు.. హైకోర్టు హెచ్చరిక

సుప్రీంకోర్టు తీర్పుపై తమిళనాడు ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయడంతో పాటు, సోమవారం రాత్రి నుంచి తిరుపరకుండ్రం ప్రాంతంలో 144 సెక్షన్‌ నిషేధాజ్ఞలు విధించింది. రెడ్‌జోన్‌గా ఆ పరిసరాలను ప్రకటించారు. దీనిపై మంగళవారం అత్య వసర విచారణ జరిపిన మదురై హైకోర్టు.. సుప్రీంకోర్టు ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని, లేనిపక్షంలో జిల్లా కలెక్టర్‌, పోలీసు కమిషనర్‌ సహా బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఎక్కడికక్కడ అరెస్టులు

తిరుప్పరకుండ్రంలో 144 సెక్షన్‌ అమలుతో బీజేపీ, హిందూ సంఘాలలో ఆగ్రహం బయలు దేరింది. తిరుప్పరకుండ్రం వైపుగా నాయకులు కదిలారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎ క్కడికక్కడ బిజేపీ, హిందూసంఘాల నేతలను అరెస్టు చేసి గృహ నిర్భంధంలో ఉంచారు. కేంద్ర మాజీ మంత్రి ఎల్‌ మురుగన్‌, బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌ నాగేంద్రన్‌ను సైతం తిరుప్పరకుండ్రం వైపు గా వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. తిరుప్పరకుండ్రం పరిసరాలను డేగ కళ్ల నిఘా నీడలోకి తీసుకొచ్చారు. ఆలయం వైపుగా ఎవ్వరు వెళ్లకుండా నిఘా వలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నైనార్‌ నాగేంద్రన్‌ మాట్లాడుతూ, రాజ్యాంగంలోని 25, 26 అధికరణలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని, సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ అనుమతి నిరాకరించడం ప్రభుత్వ ధోరణిని స్పష్టం చేస్తున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు.దీపస్తంభంపై దీపం వెలిగించడానికి నిరాకరించడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని, సీఎం విజయ్‌ దేవాదాయ శాఖను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.

మిగిలింది నిరాశే

ఉదయం నుంచి సాయంత్రం వరకు తీవ్ర ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. సుప్రీం కోర్టు ఆదేశాలు, హైకోర్టు హెచ్చరికల నేపథ్యంలో ఈసారైనా కొండపై దీపస్తంభందీపం వెలుగుతుందని భావించిన లక్షలాది మంది భక్తులు మంగళవారం సాయంత్రం నిరాశ తప్పలేదు. తిరుపరంకుండ్రం కొండ దిగువకు చేరుకుని వేచి ఉన్న భక్తులకు సరిగ్గా సాయంత్రం 6 గంటలకు ఎప్పటిలాగే ఉచ్చి పిళ్లయార్‌ ఆలయం వద్ద మాత్రమే కార్తీక దీపాన్ని వెలిగించారు. దీపస్తంభం వద్ద దీపం వెలగకపోవడంతో భక్తులు తీవ్ర అసంతృప్తి, నిరాశతో వెనుదిరిగారు.హిందూ సంఘాలు అయితే, ఆందోళనకు దిగడంతోఉద్రిక్తత చోటు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement