అమ్మవారి ఆలయంలో కూలిన రావిచెట్టు
తిరుత్తణి: తిరుత్తణి మురుగప్పనగర్‌లో మున్సి పాలిటీ మంచినీటి గుంట గట్టుపై బహిరంగ ప్రదేశంలో నాగాలమ్మ ఆలయం వుంది. నాగదేవతల విగ్రహాలకు మధ్యలో దాదాపు 50 ఏళ్లు నిండిన రావిచెట్టు వుండేది. మహిళలు నాగదేవతలకు పూజలు చేసి రావిచెట్టుకు పాలు పోసి దర్శించుకునేవారు. చాలా కాలంగా చెట్టుకు పాలు పోయడంతో చెట్టు వేర్లు ఎండి చెట్టు అడుగుభాగం మధ్యలో పెద్దగా తొర్ర ఏర్పడింది.ఈ క్రమంలో సోమవారం రాత్రి చెట్టు రెండు భాగాలుగా వేర్లతో కూలింది. చెట్టు పక్కనే వున్న మూడు విద్యుత్ స్తంభాలు కూలడంతో పాటు గుంట ప్రహరిగోడ సైతం ధ్వంసమైంది. రాత్రి సమయం కావడంతో ఆ ప్రాంతం వాసులు లేక పోవడంతో ప్రాణనష్టం నుంచి భక్తులు తప్పించుకున్నారు. మంగళవా రం ఉదయం మున్సిపాలిటీ సిబ్బంది కూలిన చెట్టును తొలగించే పనులు చేపట్టారు. అలాగే విద్యుత్‌శాఖ సిబ్బంది కూలిన విద్యుత్ స్తంభాల నుంచి విద్యుత్ సేవలు నియంత్రించి ప్రత్యామ్నయ మార్గంలో మురుగప్పనగర్ వాసులకు విద్యుత్ సేవలు కల్పించారు.
ఖాళీ స్థలంలో గంజాయి మొక్కలు పెంచిన గుర్తుతెలియని ముఠా
తిరువొత్తియూరు: అంబత్తూర్ సమీపంలోని పుదూర్ ప్రాంతంలో అసిస్టెంట్ కమిషనర్ కుమార్ నేతృత్వంలో పోలీసులు గుట్కా, పొగాకు అక్రమ నిల్వ మరియు విక్రయాలకు సంబంధించి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అక్కడున్న ఒక ప్రైవేట్ వ్యక్తికి చెందిన ఖాళీ స్థలంలో తనిఖీలు చేయగా, అక్కడ గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు గుర్తించా రు. సుమారు ఒకటిన్నర అడుగుల ఎత్తు పెరిగి న ఆ గంజాయి మొక్కలను ఇన్‌స్పెక్టర్ సడైయాండి, సబ్–ఇన్‌స్పెక్టర్ జగన్నాథన్ ఇతర పోలీసులు తొలగించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఖాళీ స్థలంలో గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు తెలిసింది. ఈ విషయమై ఆ ప్రాంతానికి తరచూ వచ్చి వెళ్లే వ్యక్తుల గురించి నిఘా కెమెరా దృశ్యాలను పరిశీలిస్తూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
సుబ్రమణ్యస్వామికి
విశేష పూజలు
కొరుక్కుపేట: కార్తీక దీపం సందర్భంగా చైన్నెలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామికి విశేషంగా పూజలను మంగళవారం నిర్వహించారు. ఆలయ అర్చకులు భాస్కర పంతులు బృందం స్వామివారికి కర్పూర హారతులు పట్టి పూజలు చేశారు . కార్తీక దీపం కావటంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలోతరలివచ్చి స్వామిని దర్శించకుని తరించారు.
వర్షపు నీటి సంరక్షణపై
అవగాహన ర్యాలీ
తిరువొత్తియూరు: వర్షపు నీటి సంరక్షణపై ప్రజలలో అవగాహన కల్పించే ఉద్దేశంతో పూందమల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా, పూందమల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు పాల్గొన్న అవగాహన ర్యాలీ నిన్న జరిగింది.పాఠశాల ఆవరణ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ, ప్రధాన రహదారుల గుండా సాగి తిరిగి పాఠశాలకు చేరుకుంది. ఈ ర్యాలీకి పూందమల్లి మున్సిపల్ కమిషనర్ శరవణన్ అధ్యక్షత వహించి, జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి మురుగన్, టౌన్ ప్లానింగ్ ఇన్‌స్పెక్టర్ సౌందర్య, ఆరోగ్య అధికారి గోవిందరాజ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ కణ్ణన్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు, పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో పాఠశాల విద్యార్థినులు, మున్సిపల్ సిబ్బంది, ఉపాధ్యాయులు వర్షపు నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ చేశారు.
సహజీవనం చేస్తున్న మహిళ బిడ్డ మృతి
అన్నానగర్: చైన్నె పులియంతోపు అంబేడ్కర్ నగర్ ప్రాంతానికి చెందిన పూజ. ఆమె మద్యం, మాదకద్రవ్యాలకు బానిస అని తెలుస్తోంది. ఏడాది క్రితం ఆమె సతీష్ అనే వ్యక్తితో సహజీవనం చేసింది. దీని కారణంగా, గర్భవతిగా ఉన్న పూజ, గర్భం దాల్చిన ఏడవ నెలలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుండి సతీష్ తల్లిదండ్రులు ఆ పాపను చూసు కుంటున్నారు. ఈ స్థితిలో, గత 3 రోజులుగా ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. సోమవారం రాత్రి సుమారు 9 గంటలకు, ఆ చిన్నారి కదలకుండా పడి ఉండటంతో పరీక్షల నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ఆ చిన్నారి మరణించినట్లు నిర్ధారణ అయింది. పులియంతోప్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


