సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన అవినీతి ఆరోపణలపై మద్రాస్ హైకోర్టులో తాజాగా పిటిషన్‌లు దాఖలయ్యాయి. అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ఆర్థిక మంత్రి మరియా విల్సన్ చేసిన వ్యాఖ్యల ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలైంది. అదే సమయంలో మరో కేసుకు సంబంధించి మంత్రులు నిర్మల్‌కుమార్, ఆదవ్ అర్జునలు పిటిషన్‌లు వేశారు. వివరాలు.. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో పాఠశాలల అనుమతుల జారీలో భారీగా లంచాలు చేతులు మారడాన్ని తాను కళ్లారా చూశానని, తానే స్వయంగా దీనికి సాక్షినని ఆర్థిక మంత్రి మరియా విల్సన్ గతంలో అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం రాజకీయ ప్రసంగం కాదని, లంచాలు ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరమేనని వాదిస్తూ న్యాయవాది కె. శివసుబ్రమణియం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి చేసిన ఈ బహిరంగ వ్యాఖ్యలపై చట్టప్రకారం కేసు నమోదు చేయాలని కోరుతూ తాను గతంలోనే అవినీతి నిరోధక విభాగానికి ఫిర్యాదు చేసినట్లు పిటిషనర్ పేర్కొన్నారు. అయితే దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. శాసనసభ లోపల మాట్లాడినప్పటికీ, అవినీతికి సంబంధించిన కీలక సాక్ష్యాల అంగీకారాలకు లేదా వెలుపల జరిగిన నేరాలకు చట్టపరమైన క్రిమినల్ విచారణ నుంచి సంపూర్ణ రక్షణ లభించదని పిటిషన్‌లో ప్రస్తావించారు. మంత్రి మరియా విల్సన్‌పై అవినీతి నిరోధక చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, తగిన దర్యాప్తు జరపాలని డీవీఏసీని ఆదేశించాలని కోరారు. త్వరలోనే ఈ కేసు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు రానుంది.
డీఎంకే పరువు నష్టం కేసు
తమపై డీఎంకే వేసిన పరువు నష్టం కేసును కొనసాగించేందుకు అనుమతిస్తూ ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ మంత్రులు నిర్మల్ కుమార్, ఆదవ్ అర్జున కోర్టును ఆశ్రయించారు. జెమ్ వీరమణి కేసుకు సంబంధించి కోటి రూపాయల నష్టపరిహారం కోరుతూ డీఎంకే పరువు నష్టం దాఖలు చేయగా, ఆ కేసును ముందుకు తీసుకెళ్లేందుకు న్యాయస్థానం అనుమతినిచ్చింది.ఈ అనుమతి ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ మంత్రులు మద్రాస్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. తమపై కేసు నమోదు చేసేటప్పుడు లేదా అనుమతినిచ్చే ముందు ముందుగా నోటీసులు ఇచ్చి ఉండాల్సిందని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తీసుకున్న ఈ చర్య నిబంధనలకు విరుద్ధమని అప్పీల్ తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ అప్పీల్ పిటిషన్‌ను జస్టిస్ ఎన్. సతీష్‌కుమార్, జస్టిస్ జి.కె. ముత్తుకుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. డీఎంకే తరఫున సీనియర్ న్యాయవాది జె. రవీంద్రన్ హాజరై తదుపరి విచారణ వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు ఉండవని కోరగా, న్యాయమూర్తులు ఈ అప్పీల్ విచారణను అక్టోబర్ 13వ తేదీకి వాయిదా వేశారు.
నిర్మల్‌కుమార్, ఆదవ్ అర్జున
మరియా విల్సన్


