వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో కార్తీక బ్రహ్మోత్సవాల్లో ప్రారంభమై గత తొమ్మిది రోజులుగా స్వామి వార్లు వివిధ వాహనాల్లో ఉదయం, సాయంత్రం వేలల్లో మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉత్సవాల్లో భాగంగా 10వ రోజైన మంగళవారం ఉదయం 4 గంటలకు ఆలయం ఎదుటనున్న మూలవర్ సన్నిధిలో భరణిదీపం వెలిగిస్తారు. సాయంత్రం 6 గంటలకు అర్ధనారేశ్వరుడు ఒక సంవత్సరానికి ఒకే సారి ప్రత్యేక వాహనంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇదే సమయంలో అరుణాచలేశ్వరాలయం వెనుకనున్న 2,668 అడుగుల ఎత్తుగల కొండపై మహా దీపాన్ని వెలిగించనున్నారు. మహా దీపం వెలిగించే సమయంలో ఆలయం వద్దనున్న భక్తులు అరుణాచలేశ్వరునికి హరోం.. హరా.. అంటూ నామస్మరణాలు చేసుకుంటారు. ఈ మహా దీపోత్సవాన్ని తిలకించేందుకు వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా సుమారు 40 లక్షల మంది భక్తులు తిలకించనున్నారు. కార్తీక దీపోత్సవం దృష్యా అరుణాచలేశ్వరాలయాన్ని అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. ఈ ఆలయంలో శివ దేవుడు అగ్ని రూపం దాల్చి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ఉత్సవానికి దేశం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరుకానున్నారు.
ప్రత్యేక బస్సులు
దీపోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు కలెక్టర్ వందన కార్క్ తెలిపారు. ఈ సంవత్సరం పుదుచ్చేరి, చైన్నె, తిరిచ్చి, బెంగుళూరు, సేలం, విల్లుపురం, కాట్పాడి తదితర ప్రాంతాల నుంచి ఈనెల 23,24,25వ తేదిల్లో ప్రత్యేక బస్సులను నడిపేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లును సిద్దం చేశారు. కాగా మహా దీపం కొండపైకి భక్తులు ఎక్కిందుకు 11 రోజులకు అనుమతి నిరాకరించారు. కొండపైకి వెళ్లే మొత్తం 12 దారులను మూసి వేసి అక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహా దీపం వెలిగించే ఆలయ అర్చకులు, పారంపర్య వంసస్థలు, ఆలయ సిబ్బందికి మాత్రమే అనుమతి ఉంటుందని వారు కూడా సంరక్షణా పరికరాలతో కొండపైకి ఎక్కిందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.
35 కిలో మీటర్లు కనిపించే మహా దీపం
ఉత్సవాల్లో పదో రోజు వేకువన 4 గంటలకు ఆలయం ముందు భరణి దీపాన్ని గర్భగుడిలో ప్రజ్వలింప జేయటం ఆనవాయితీ. అదే రోజు సాయంత్రం 6 గంటలకు 2,668 అడుగుల ఎత్తుగల శివునిగా బావించే కొండపైనా మహా దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపం 35 కిలో మీటర్ల దూరం నుంచి చూసినా ఈ దీప కాంతి సృష్టంగా కనిపించటం విశేషం. ఈ దీపం పది రోజుల పాటు వెలుగుతూనే భక్తులకు దర్శనం ఇవ్వనుంది. కాగా ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామి వారు కై లాస వాహనంలో మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 9 గంటలకు మూషిక వాహనంలో వినాయకుడు, హంస వాహనంలో వళ్లి దైవాని సమేద మురుగన్, కై లాస వాహనంలో ఉన్నామలై సమేత అన్నామలైయార్, కామదేను వాహనంలో పరాశక్తి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. సోమవారం ఉదయం మూషిక వాహనంలో వినాయకుడు, పురుష ముని వాహనంలో చంద్రశేఖరుడు మాడ వీధుల్లో దర్శనమిచ్చారు.
కొండపై సిద్ధం చేసిన కొప్పరి


