● ఆటిజం ల్యాబ్, ఇ–అంబులెన్స్ సేవలు ● ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య కార్యదర్శి
సాక్షి, చైన్నె: ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన పలు ఆరోగ్య సంరక్షణ, పరిశోధన మౌలిక సదుపాయాలను కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆటిజం ల్యాబ్, ప్రత్యేక నిద్ర పరిశోధన కేంద్రం , ఇ–అంబులెన్స్ సేవలను ఆమె ఆవిష్కరించారు. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది సంక్షేమంతో పాటు, స్వదేశీ ఆరోగ్య సాంకేతికతను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఐఐటీ మద్రాస్ ఈ విస్తృత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా పుణ్య సలీల శ్రీవాస్తవ మాట్లాడుతూ, ‘‘నివారణ ఆరోగ్య సంరక్షణ, సాంప్రదాయ భారతీయ వైద్య పరిజ్ఞానం, ఆధునిక సాంకేతికతలను అనుసంధానించే ఈ కార్యక్రమాలను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. మానసిక ఆరోగ్యం, నిద్ర రుగ్మతలపై పరిశోధన, తక్షణ వైద్య సేవలపై దృష్టి పెట్టడం ప్రశంసనీయం. ఇవి సమాజానికి తక్కువ ఖర్చుతో కూడిన స్వదేశీ పరిష్కారాలను అందిస్తాయని ఆశిస్తున్నాం’’ అని వ్యాఖ్యలు చేశారు. ఐఐటీ మద్రాసు డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి మాట్లాడుతూ, సంస్థాగత శ్రేష్ఠత సమాజ శ్రేయస్సుతో కలిసి సాగాలని మేం నమ్ముతామన్నారు. సాంప్రదాయ వైద్య విజ్ఞానాన్ని, అత్యాధునిక ఇంజనీరింగ్ పరిశోధనలతో జోడించి సరికొత్త ఆరోగ్య పరిష్కారాలను రూపొందించడమే తమ లక్ష్యం అన్నారు.


