సాక్షి,చైన్నె: తమిళనాడులోని గ్రంథాలయాలకు పుస్తకాల కొనుగోలు విషయంలో గత మూడేళ్లుగా భారీ అవకతవకలు జరిగాయని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మద్రాస్ హైకోర్టుకు నివేదించింది. కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో రూపొందించిన నాణ్యత లేని పుస్తకాలను కొనుగోలు చేశారన్న ఆరోపణలపై విచారణ జరిపిన ఏసీబీ, ఈ కుంభకోణంలో మరో రెండు ప్రచురణ సంస్థల ప్రమేయం ఉన్నట్లు గుర్తించింది. కోయంబత్తూరులోని పెరియార్ విజ్ఞాన కేంద్రం, గ్రంథాలయానికి పుస్తకాల కొనుగోలులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ డీఎంకే న్యాయ విభాగం సంయుక్త కార్యదర్శి ఇ. పరంథామన్ తరఫున న్యాయవాది ఎ. దామోదరన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అగల్ విళక్కు,ఫీనిక్స్ ప్రచురణ సంస్థల నుంచి ఏఐ ద్వారా తయారు చేసిన పుస్తకాలను భారీ ఎత్తున కొనుగోలు చేశారని, దీనిపై తాను ఈ నెల 7న ఏసీబీకి ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. న్యాయమూర్తి జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్ ముందు ఈ పిటిషన్ విచారణకు రాగా, ఏసీబీ తరఫున సమగ్ర నివేదికను దాఖలు చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి పెద్ద ఎత్తున పత్రాలను స్వాధీనం చేసుకున్నామని, పలువురు అధికారులకు సమన్లు జారీ చేసి విచారిస్తున్నామని ఏసీబీ తెలిపింది. ఇప్పటికే అరెస్టయిన అగల్ విళక్కు పబ్లిషింగ్ హౌస్ యజమాని మోహన్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నామని పేర్కొన్నారు. ఆ సంస్థకు చెల్లించిన రూ. 1.74 కోట్లకు సంబంధించిన బ్యాంకు ఖాతాను స్తంభింపజేశామన్నారు. ఈ అక్రమాలలో సిగ్మా, విద్యా అనే మరో రెండు ప్రచురణ సంస్థల పాత్ర కూడా ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని కోర్టుకు వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా అక్రమాలు..
కేవలం కోయంబత్తూరులోనే కాకుండా, తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రంథాలయాలకు గత మూడేళ్లుగా ఇదే తరహాలో పుస్తకాలను కొనుగోలు చేసినట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది. ప్రస్తుతం ఆ పుస్తకాలన్నింటినీ గ్రంథాలయాల నుంచి తొలగించారని వివరించారు.. 2024లో హైకోర్టు నిర్దేశించిన పుస్తక సేకరణ నిబంధనలను అధికారులు పాటించి ఉంటే ఈ కుంభకోణం జరిగి ఉండేది కాదని నివేదికలో ప్రస్తావించారు.ఈ కేసు దర్యాప్తును హైకోర్టు మదురై బెంచ్ పర్యవేక్షించాలని ఆదేశించిన నేపథ్యంలో, ఆ ఉత్తర్వుల ప్రతిని సమర్పించడానికి ఏసీబీ సమయం కోరింది. పిటిషనర్ పరంథామన్ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేస్తామని ఏసీబీ హామీ ఇవ్వడంతో, తదుపరి విచారణను న్యాయమూర్తి నవంబర్ 25వ తేదీకి వాయిదా వేశారు. ఈ కుంభకోణంపై సమాచారం ఉన్నవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వవచ్చని ఏసీబీ సూచించింది. కాగా, ఈ పుస్తక స్కాంను డైరెక్టరేట్‌ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటి కరెప్షన్ విభాగం వర్గాలు తీవ్రంగా పరిగణించి ఉన్నారు. ఇప్పటికే అన్ని గ్రంథాలయాలలో సోదాలు చేస్తూ వస్తున్నారు. పలువురు ముఖ్య అధికారులను గురి పెట్టి విచారణను వేగవంతం చేసి ఉండటం గమనార్హం. అదే సమయంలో ఈ స్కాం గత మూడేళ్లుగా సాగుతున్నట్టు కోర్టుకు ఏసీబీ నివేదించడంతో ఈ వివాదం మరింత ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి.


