సాక్షి, చైన్నె: నేటి తరం విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయులు తమ బోధనా పద్ధతులను మార్చుకోవాలని తమిళనాడు పాఠశాల విద్యాశాఖ, తమిళ అభివృద్ధి, సమాచార ప్రచార శాఖ మంత్రి రాజ్‌మోహన్ సూచించారు. సోమవారం ఆలందూరులోని సెయింట్ థామస్ అంతర్జాతీయ శిక్షణా కేంద్రంలో పట్టభద్రులైన ఉపాధ్యాయుల నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. తరగతి గదిలో విద్యార్థులు ఉత్సాహంగా పాఠాలు నేర్చుకునేలా బోధనా ఉపకరణాలను సమర్థవంతంగా వినియోగించాలని, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని మంత్రి ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. తమిళనాడులోని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో గణితం, సైన్స్, ఆంగ్లం బోధించే మొత్తం 2,000 మంది పట్టభద్ర ఉపాధ్యాయులకు రాష్ట్ర విద్యా పరిశోధన , శిక్షణా మండలి ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఇస్తున్నారు. భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జీవశాస్త్రం, గణితం, ఆంగ్ల పాఠాలను విద్యార్థులకు సులభంగా, ఆసక్తికరంగా అర్థమయ్యేలా బోధించే నైపుణ్యాలను పెంపొందించడం దిశగా ముందుకెళ్తున్నారు. సులభమైన బోధనా ఉపకరణాల తయారీ, విద్యా సంబంధ కార్యకలాపాల రూపకల్పన, బోధనలో ఐటీ నైపుణ్యాల వినియోగం , ప్రశ్నాపత్రాల రూపకల్పనపై శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ పూర్తయ్యాక ఉపాధ్యాయులు క్లిష్టమైన పాఠ్యాంశాలను సరళంగా వివరించడమే కాకుండా, విద్యార్థుల సృజనాత్మకత, ఆలోచనా శక్తిని పెంపొందించేలా బోధించగలుగుతారని అధికారులు పేర్కొంటున్నారు.తొలి విడతలో భాగంగా రాష్ట్రంలోని 38 జిల్లాల నుండి 76 మంది గణిత ఉపాధ్యాయులు, 76 మంది సైన్స్ ఉపాధ్యాయులు (మొత్తం 152 మంది) ఈ శిక్షణకు హాజరయ్యారు. ఈనెల 27వ తేదీ వరకు 5 రోజుల పాటు వీరికి రెసిడెన్షియల్ పద్ధతిలో ఈ శిక్షణ కొనసాగనుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి జె. ఇన్నోసెంట్ దివ్య ఐఏఎస్, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ ఎన్. లత, ప్రాథమిక విద్యాశాఖ డైరెక్టర్ కె. శశికళ, జాయింట్ డైరెక్టర్ (శిక్షణ) డాక్టర్ ఎస్. అముదవల్లి, ఇతర విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


