అంకారా: పశ్చిమ టర్కీలో బొగ్గు గని కూలిన ఘటనలో ఐదుగురు కార్మికులు మరణించారు. గనిలో నుంచి తొలుత ముగ్గురు కార్మికుల మృతదేహాలను సహాయక బృందాలు శుక్రవారం వెలికితీశాయని అధికారులు వెల్లడించారు. కాగా టర్కీ సముద్ర తీరప్రాంత పట్టణమైన కిలిమ్లీలో అనుమతి లేని మరో గని ప్రమాదంలో మరో కార్మికుడు మృతి చెందినట్లు సమాచారం. మొదటి ప్రమాదం గురువారం మనీసా ప్రావిన్స్‌లోని ఒక గనిలో చోటుచేసుకుంది. ఇది ఇజ్మీర్ రిసార్ట్ నగరానికి ఈశాన్యంగా దాదాపు 100 కిలోమీటర్ల (60 మైళ్ళు) దూరంలో ఉంది.‘సోమా జిల్లాలో గని కూలిన ఘటన అనంతరం చేపట్టిన గాలింపు, సహాయక చర్యలు పూర్తయ్యాయి. లోపల చిక్కుకుపోయిన కార్మికుల మృతదేహాలను వెలికితీశాం’ అని గవర్నర్ కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా తెలిపింది.
ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. గని కూలిన ఘటనపై నిర్లక్ష్యం వహించారనే అనుమానంతో గని నిర్వహణ సంస్థ మేనేజర్‌తో సహా తొమ్మిది మంది కంపెనీ ఉన్నతాధికారులను అదుపులోకి తీసుకున్నట్లు డీహెచ్‌ఏ వార్తా సంస్థ తెలిపింది. ఒక యూనియన్ ప్రతినిధి ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ప్రస్తుత మైనింగ్ ప్రాంతాలలో బొగ్గు నిల్వలు తరిగిపోవడంతో ఉత్పత్తి తగ్గుముఖం పట్టిందని తెలిపారు. దీనివల్ల గనిలో ఒక కొత్త విభాగాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు.
‘ఈ కొత్త విభాగంలో పనులు ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. కానీ యాజమాన్యంపై ఉన్న ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా పనులను వేగవంతం చేయాలనే ఒత్తిడి పెరిగింది’ అని ఆయన వివరించారు. టర్కీ చరిత్రలోనే అత్యంత ఘోరమైన మైనింగ్ విపత్తు జరిగిన సోమా ప్రాంతంలోనే తాజా ఘటన చోటుచేసుకుంది. 2014లో ఇక్కడే జరిగిన పేలుడు తర్వాత భూగర్భంలో మంటలు చెలరేగి, కార్బన్ మోనాక్సైడ్ విషవాయువు పీల్చడంతో 301 మంది కార్మికులు మరణించారు.
ఇదీ చదవండి: ఒళ్లు గగుర్పొడిచే 10 ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఘటనలు


