ఘన నివాళులు | Nation pays Mahatma Gandhi and Lal Bahadur Shastri birth anniversary | Sakshi
Sakshi News home page

ఘన నివాళులు

Oct 3 2026 6:19 AM | Updated on Oct 3 2026 6:19 AM

Nation pays Mahatma Gandhi and Lal Bahadur Shastri birth anniversary

రాజ్‌ఘాట్‌ సందర్శించిన మోదీ, రాహుల్‌ 

విజయ్‌ఘాట్‌లో లాల్‌బహదూర్‌ శాస్త్రి కి నివాళులు 

ఎక్స్‌ పోస్టుల్లో గాంధీ, శాస్త్రీల స్మరణ

న్యూఢిల్లీ: మహాత్మా గాందీ, మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలు ఇరువురు నేతలకు ఘన నివాళులు అర్పించాయి. ప్రధాని, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేతలు మహాత్మా గాంధీ సమాధి రాజ్‌ఘాట్, లాల్‌ బహదూర్‌ శాస్త్రి సమాధి విజయ్‌ఘాట్‌లను వేర్వేరుగా సందర్శించారు. పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. 

గాం«దీ, శాస్త్రీలిద్దరి సరళత, ధైర్యం, సేవాతత్పరతలు తరతరాలకూ స్ఫూరినిస్తూనే ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్‌’లో కొనియాడగా.. ఎన్నడూ అన్యాయానికి తలవంచకూడదన్న గాంధీ బోధనలు అనుసరణీయమని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్‌లో ఒక పోస్టు చేస్తూ... గాం«దీజీ అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు సత్యాగ్రహాన్ని శక్తిమంతమైన ఆయుధంగా మలచారని కీర్తించారు. ఇది స్వాతంత్య్రోద్యమానికి మాత్రమే కాకుండా... ప్రపంచం మొత్తానికి మానవీయత, శాంతి సందేశాలను ఇచ్చిందని అన్నారు. 

వికసిత్‌ భారత్‌కు మార్గదర్శనం... 
‘‘రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాం«దీకి, విజయ్‌ఘాట్‌లో మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి కి నివాళులు అర్పించాను. భారత ప్రగతికి వారి అచంచల నిబద్ధత ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలుస్తాయి’’అని ప్రధాని వ్యాఖ్యానించారు. మోదీ అంతకుముందు ఎక్స్‌లో ఇంకో పోస్టు చేస్తూ... సత్యం, అహింస, కరుణ, సేవలకు గాంధీ జీవితం ప్రతీకగా నిలిచిందని, యుగయుగాల పాటు మానవాళికి మార్గదర్శనం చేస్తుందని అన్నారు.‘‘బాపూజీ బోధనలు మెరుగైన సమాజం, ‘వికసిత్‌ భారత్‌’వైపు మనకు మార్గనిర్దేశం చేస్తూండాలి’’అని ఆకాంక్షించారు. ‘‘అక్టోబర్‌ రెండున కనీసం ఒక ఖాదీ ఉత్పత్తినైనా కొనుగోలు చేసి, అది స్వదేశీ ఉత్పత్తి అని గర్వంగా చెప్పాలని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాను’’అని ప్రధాని అన్నారు. లాల్‌బహదూర్‌ శాస్త్రి ప్రధానమంత్రిగా స్వల్పకాలమే పని చేసినా దేశ సంక్షేమంపై ఆయనకున్న నిబద్ధత సుస్పష్టమని మోదీ వ్యాఖ్యానించారు. శాస్త్రి ఇచ్చిన ‘జై జవాన్, జై కిసాన్‌’నినాదం దేశానికి మార్గదర్శకమన్నారు.  

అన్యాయానికి ఎదురొడ్డే ధైర్యాన్ని ఇచ్చాయి: రాహుల్‌ గాంధీ 
గాంధీ బోధనలు తనకు అన్యాయాన్ని ఎదురొడ్డే ధైర్యాన్నిచ్చాయని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తన ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. హిందీలో చేసిన ఈ పోస్టులో రాహుల్‌ ‘‘సత్యం, అహింస, నిర్భయత్వం.. ఇవే బాపూజీ అందించిన వారసత్వ విలువ లు. అన్యాయానికి ఎప్పుడూ తలవంచకూడ దని నేర్పాయి. సత్యం, అహింసతో దృఢంగా నిలబడటమే నిజమైన బలం’’అని రాశారు. 

సంవిధాన్‌ సదన్‌లోనూ... 
ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తదితరులు శుక్రవారం సంవిధాన్‌ సదన్‌లో మహాత్మా గాం«దీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, జేపీ నడ్డా, కిరెన్‌ రిజిజు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, బీజేపీ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

ప్రపంచవ్యాప్తంగా... 
బీజింగ్‌/ఇస్లామాబాద్‌: శాంతి, సత్యం, అహింసపై మహాత్మా గాంధీ ఇచి్చన సార్వత్రిక సందేశం నేటికీ అనుసరణీయమని పలు దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు శుక్రవారం గాం«దీజీ 157వ జయంతిని ఘనంగా నిర్వహించాయి. భారత దౌత్యవేత్తలు, ప్రవాస భారతీయులు, స్థానిక ప్రముఖులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని గాంధీజీకి నివాళులు అర్పించారు. బీజింగ్‌లోని జింతాయ్‌ ఆర్ట్‌ మ్యూజియంలో చైనాలో భారత రాయబారి విక్రమ్‌ దొరైస్వామి షాంఘైలో భారత కాన్సుల్‌ జనరల్‌ ప్రతీక్‌ మాథుర్‌తోపాటు బ్రిక్స్‌ దేశాల కాన్సుల్‌ జనరల్స్‌ గాం«దీజీకి నివాళులు అర్పించారు. 

జపాన్‌లో భారత రాయబారి నాగుమా మల్లిక్‌ ప్రవాస భారతీయులతో కలిసి ఎడోగావాలోని గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఇస్లామాబాద్‌లో భారత రాయబార కార్యాలయ తాత్కాలిక ఇన్‌చార్జి సత్యాంజల్‌ పాండే, ఇతర అధికారులు గాం«దీజీకి పుష్పాంజలి ఘటించారు. నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయంలోనూ గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు గాంధీజీకి ఇష్టమైన భజనలు ఆలపించారు. ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో గాంధీ విగ్రహం వద్ద భారత హైకమిషనర్‌ నాగేశ్‌ సింగ్, అధికారులు, ప్రవాస భారతీయులు నివాళులు అర్పించారు. న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్‌ రైల్వే స్టేషన్‌లో గాం«దీజీకి పుష్పాంజలి ఘటించారు. బహ్రెయిన్, దక్షిణ కొరియా, మంగోలియా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కియే తదితర దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement