జీ7 దేశాలు అంగీకరించాయన్న అధ్యక్షుడు ట్రంప్
వాషింగ్టన్: పారిశ్రామిక దేశాల కూటమి జీ7 తమ దేశానికి తక్షణమే 10 కోట్ల బారెళ్ల చమురు, ముఖ్యంగా డీజిల్‌ను సరఫరా చేసేందుకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. మధ్యంతర ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ, దేశంలో ఇంధన ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ సారథ్యంలోని రిపబ్లికన్ పార్టీ ప్రభుత్వం తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది.
ఇరాన్‌తో యుద్ధం, టారిఫ్‌ల యుద్ధం కారణంగా అమెరికాలో ఆయిల్, ఇతర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ట్రంప్ ప్రజాదరణ దారుణంగా పడిపోయింది. శుక్రవారం ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో..‘పెద్ద మొత్తంలో నిల్వ ఉంచుకున్న డీజిల్‌ను విడుదల చేసేందుకు యూరప్ అంగీకరించింది. ఈ చమురును వెంటనే విడుదల చేస్తుంది’అని ప్రకటించారు.
జీ7 అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో గురువారం రాత్రి ట్రంప్ ఫోన్‌లో మాట్లాడారు. తమ దేశంలో పెరుగుతున్న చమురు ధరలను అదుపు చేసేందుకు, పెట్రోలియం ఉత్పత్తుల అవసరం ఏర్పడిందని ఆయనకు తెలిపారు. దీంతో, మేక్రాన్ శుక్రవారం ఉదయం జీ7 దేశాల నేతలతో వర్చువల్ సమావేశం జరిపి, ట్రంప్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని అమెరికాలో ఫ్రాన్స్ దౌత్యాధికారి ఒకరు వెల్లడించారు.


