ఫ్లైదుబాయ్ విమాన ఘటన.. ఆ చిన్నారి లేకపోతే ఎంత ఘోరం జరిగేదో? | How a 6 year old toilet break helped save pilot, passengers on flydubai flight | Sakshi
Sakshi News home page

ఫ్లైదుబాయ్ విమాన ఘటన.. ఆ చిన్నారి లేకపోతే ఎంత ఘోరం జరిగేదో?

Oct 2 2026 6:58 PM | Updated on Oct 2 2026 7:30 PM

How a 6 year old toilet break helped save pilot, passengers on flydubai flight

టెల్ అవీవ్: ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన భయానక ఘటనకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు బయలుదేరిన ఈ విమానాన్ని హైజాక్ చేసేందుకు ఒమన్ జాతీయుడైన కో-పైలట్ ప్రయత్నించాడు. విమానాన్ని నడుపుతున్న భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌పై అతడు కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. అయితే, ఓ ఆరేళ్ల చిన్నారి అప్రమత్తత, ప్రయాణికుల సాహసంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఈ వివరాలను విమాన ప్రయాణికుడు త్వివికా మానేస్ ‘ది న్యూయార్క్ టైమ్స్’కు వెల్లడించారు.

కో-పైలట్ కిరాతక దాడితో కాక్‌పిట్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఆ కుదుపుకు విమానం కూడా అదుపుతప్పే పరిస్థితికి చేరుకుంది. సరిగ్గా అదే సమయంలో కాక్‌పిట్‌కు ఆనుకుని ఉన్న టాయిలెట్‌లో త్వివికా మానేస్ ఆరేళ్ల కూతురు నినా ఉంది. లోపల జరుగుతున్న ఘర్షణ, పైలట్ చేస్తున్న ఆహాకారాలు ఆ చిన్నారి చెవిలో పడ్డాయి.

ప్రాణభయంతో వణికిపోయిన నినా టాయిలెట్ నుంచి బయటకు వచ్చి వెంటనే తన తండ్రి వైపు పరుగెత్తింది. ‘నాన్నా.. కాక్‌పిట్ నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయి.. మనం చనిపోవడం లేదు కదా?’ అంటూ భయంతో వణికిపోయింది. కుమార్తె మాటలతో హతాశుడైన తండ్రి త్వివికా మానేస్.. ఆ క్షణంలో అస్సలు ఆలస్యం చేయకుండా ఉరుకులు పరుగున కాక్‌పిట్ వైపు దూసుకెళ్లారు. ఒకవేళ ఆ చిన్నారి ఆ సమయంలో ఆ మాట అనకపోతే, ఆ తండ్రి సమయానికి స్పందించే వారు కాదు.. ఆ విమానంలో ప్రయాణిస్తున్న 170 మందికి పైగా ప్రాణాలు గాల్లోనే కలిసిపోయేవి!

కాక్‌పిట్‌లో రక్తపాతం 
ఆయన కాక్‌పిట్ వద్దకు వెళ్లి చూసేసరికి దృశ్యం వణికించేలా ఉంది. కాక్‌పిట్ తలుపు పాక్షికంగా తెరుచుకుని ఉండగా.. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో ఉన్న కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ప్రాణాల కోసం పోరాడుతున్నారు. రక్తమోడుతున్నప్పటికీ, తోటి ప్రయాణికులను కాపాడేందుకు ఆయన  కష్టపడి కాక్‌పిట్ తలుపును పూర్తిగా తెరిచారు.

వెంటనే త్వివికా మానేస్‌తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు అసాఫ్ రజువాన్, యానివ్ హయున్ రంగంలోకి దిగి ఆయుధంతో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విమానంలోని హెడ్‌ఫోన్ సెట్ల వైర్లు, కేబుల్స్‌తో నిందితుడిని గట్టిగా కట్టేసి బందీగా మార్చారు.

సౌదీ అరేబియాలో అత్యవసర ల్యాండింగ్..
ఈ పోరాట సమయంలో విమానం ఒక్కసారిగా అదుపుతప్పి తీవ్ర వేగంతో కిందికి దూసుకెళ్లడంతో క్యాబిన్‌లో ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. ఆ తర్వాత విమానంలో ఉన్న మరో ఇద్దరు డ్యూటీలో లేని పైలట్లు కాక్‌పిట్ నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకున్నారు. సౌదీ అరేబియాలోని తబూక్ నగరంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. తీవ్రంగా గాయపడినప్పటికీ వెనకడుగు వేయకుండా పోరాడి వందలాది ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ధైర్యసాహసాలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రత్యేకంగా కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement