breaking news
Flydubai
-
భారత పైలట్ మచ్చార్‌కు యూఏఈ అరుదైన గౌరవం
దుబాయ్: ఫ్లై దుబాయ్ విమానంలో కాక్పిట్పై జరిగిన దాడి సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. సెప్టెంబర్ 30న జరిగిన ఈ ఘటనలో ప్రయాణికుల భద్రతకు, విమానాన్ని సురక్షితంగా ఉంచేందుకు చేసిన కృషిని గుర్తిస్తూ, పైలట్‌తో పాటు సిబ్బందికి గౌరవ పురస్కారాన్ని ప్రకటించింది. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తరఫున ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ II పురస్కారాన్ని అందజేశారు.దుబాయ్ యువరాజు, యూఏఈ ఉప ప్రధాని, రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ పురస్కారాలను అందజేశారు. అంతకుముందు అక్టోబర్ 3న ఇజ్రాయెల్‌లో చికిత్స పొందుతున్న సమయంలో స్మిత్ మచ్చార్‌ను ఆయన పరామర్శించారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భారత పైలట్ స్మిత్ మచ్చార్‌తో కలిసి టార్చ్ వెలిగించేందుకు రావాలని మోదీని ఆహ్వానించారు. ఈ విషయాన్ని నెతన్యాహు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో వెల్లడించారు.ఇదీ చదవండి: పీఎన్బీలో కుంభకోణం.. నగదు మాయంపై ఖాతాదారులు గగ్గోలు! -
కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌కు కానుకగా తలపాగా
జైపూర్: ఫ్లైదుబాయ్ విమానంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి హైజాకర్ బారి నుంచి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌కు బహూకరించేందుకు ప్రత్యేకంగా తలపాగాను సిద్ధం చేశామని రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన షాహీ తాజ్ సంస్థ ఆదివారం తెలిపింది. ఈ తలపాగాను కెప్టెన్ స్మిత్‌కు అందించేందుకు సహకరించాలని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో)ను కోరామని ఆ సంస్థ యజమానులైన జినేశ్, జయంత్ కొఠారి తెలిపారు. హైజాకర్ దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ విధి నిర్వహణలో స్మిత్ మచ్ఛార్ కనబరిచిన ధైర్యసాహసాలు తమను ఎంతో కదిలించి వేశాయన్నారు. మన దేశం పేరు, ప్రతిష్టలను నిలిపిందుకు సంప్రదాయ తలపాగాను ఆయనకు బహూకరించాలని నిర్ణయించుకున్నామన్నారు. రాజస్తాన్ వీరత్వ సంప్రదాయాన్ని, మేవార్ సాంస్కృతిక వారసత్వం, విమానయానానికి సంబంధించిన చిహ్నాలను తలపాగాపై ప్రముఖంగా కనిపించేలా ‘భోపాల్షాహి’స్టయిల్లో రూపొందించామని చెప్పారు. దీంతోపాటు, డిజైన్‌లో 174 అనే సంఖ్యను మరియు సాహసానికి గుర్తుగా వాడామన్నారు. -
ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్
-
సహచర పైలట్ ధైర్యాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటా!:స్మిట్ మచ్ఛార్
ఫ్లై దుబాయ్ విమానంలో జరిగిన ప్రమాదకర ఘటన నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడిన భారతీయ పైలట్ స్మిట్ మచ్ఛార్ తన అనుభవాలను వెల్లడించారు. విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలున్న ఒమన్‌కు చెందిన కో-పైలట్ హమ్మామ్ అల్-హమ్మామీ తనపై గొడ్డలితో దాడి చేసినట్లు తెలిపారు.సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఎఫ్‌జెడ్1073 విమానంలో ఈ ఘటన జరిగింది. దాడిలో తీవ్రంగా గాయపడిన స్మిట్ స్పృహ కోల్పోయి కిందపడిపోయారు. ఆ సమయంలో మరో పైలట్ విమాన నియంత్రణ చేపట్టి పెను ప్రమాదాన్ని నివారించారు.“ఆ రోజు విమానాన్ని కాపాడిన నా సహచరుడి ధైర్యాన్ని చనిపోయే వరకు గుర్తుంచుకుంటా” అని స్మిట్ పేర్కొన్నారు. ప్రయాణికులు కూడా కాక్‌పిట్‌లోకి ప్రవేశించి నిందితుడిని అదుపులోకి తీసుకోవడంలో సహకరించారు.విమానంలో ఉన్న 174 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉండగా, విమానం సౌదీ అరేబియాలోని తబుక్‌లో ల్యాండ్ అయింది. ప్రస్తుతం అబుదాబిలో చికిత్స పొందుతున్న స్మిట్ కోలుకుంటున్నారు.సీఎన్ఎన్-న్యూస్18తో తెలిపిన వివరాల ప్రకారం.. గొడ్డలి దెబ్బతో స్మిట్ మచ్చార్ పుర్రెకు పగులు ఏర్పడింది. ఆ దెబ్బ ఆయన కంటి నరాలపై ప్రభావం చూపడంతో చూపు దెబ్బతిన్నట్లు సమాచారం. ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో జరిగిన సంభాషణలో స్మిట్ మచ్చార్ ఈ ఘటనను వివరించారు. “నేను అతడిని ఆపేందుకు ప్రయత్నించాను. కానీ మొదట పడిన దెబ్బల కారణంగా నా చూపు దాదాపు పూర్తిగా పోయింది. అంతా పూర్తిగా మసకగా కనిపించింది” అని ఆయన చెప్పారు.ఇదీ చదవండి: మేము ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాము -
ఫ్లైదుబాయ్ ఘటనపై కేంద్రం సీరియస్.. ఎన్ఐఏ కేసు నమోదు
సాక్షి,న్యూఢిల్లీ: ఫ్లైదుబాయ్ విమానంలో భారత పైలట్‌పై దాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కేసు నమోదు చేసింది. విమానాన్ని హైజాక్ చేయడానికి, కూల్చేందుకు ప్రయత్నించారనే ఆరోపణల నేపథ్యంలో యాంటీ హైజాకింగ్ చట్టం-2016, ఉపా (UAPA) చట్టం-1967 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానం ఎఫ్‌జెడ్1073లో 174 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. విమానంలో భారత కెప్టెన్ స్మిట్ మచ్చార్‌ను ఒమన్‌కు చెందిన కో-పైలట్ కాక్‌పిట్‌లో కత్తితో పొడిచినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ దాడిలో కెప్టెన్ తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.ప్రయాణికులు, సిబ్బంది కలిసి నిందితుడిని అదుపులోకి తీసుకోగా, ఇతర పైలట్లు విమాన నియంత్రణ చేపట్టి సౌదీ అరేబియాలోని తబుక్‌లో ఉన్న ప్రిన్స్ సుల్తాన్ బిన్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. అనంతరం సౌదీ అధికారులు కో-పైలట్‌ను అరెస్టు చేశారు.ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ చట్టం-2008లోని సంబంధిత నిబంధనల ప్రకారం దర్యాప్తు చేపట్టాలని కేంద్రం ఆదేశించినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అయితే దాడికి గల కారణాలు ఏమిటన్నది మాత్రం ఇంకా వెల్లడికాలేదు. కుట్రలో ఇతరుల ప్రమేయం ఉన్నట్లు కూడా ఎఫ్ఐఆర్లో ప్రస్తావించలేదు.ఇక గాయపడిన కెప్టెన్ స్మిట్ మచ్చార్ ఆరోగ్యం మెరుగుపడుతోందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. అబుదాబిలో శస్త్రచికిత్స అనంతరం ఆయన కోలుకుంటున్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. యూఏఈలోని భారత రాయబార కార్యాలయం కెప్టెన్ కుటుంబ సభ్యులు, వైద్యులతో సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: విమానంలోనే సీజేపీ నేతల నిర్బంధం -
‘9/11’తో స్ఫూర్తి: షాకిస్తున్న ఫ్లైదుబాయ్ కో పైలట్ ప్లాన్!
దుబాయ్: అమెరికాలో 2001 సెప్టెంబర్ 11న జరిగిన ఉగ్రదాడులు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆ దాడులే తనను పైలట్‌గా మారేందుకు ప్రేరేపించాయని ఫ్లైదుబాయ్ విమాన సహ పైలట్ హమామ్ అల్ హమ్మామీ చెప్పినట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధికారులు వెల్లడించారు. దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్లిన విమానాన్ని అదుపులోకి తీసుకుని, ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రయాణికుల టెర్మినల్‌పై దాడి చేయడానికి అతడు కుట్ర పన్నినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు. ఈ ఘటన సెప్టెంబర్ 30న జరిగినట్లు యూఏఈ అటార్నీ జనరల్ హమద్ సైఫ్ అల్ షమ్సీ వెల్లడించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.విమానంతో దాడికి పథకం29 ఏళ్ల హమామ్ అల్ హమ్మామీ సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్లిన విమానంలో సహ పైలట్‌గా విధులు నిర్వహించాడు. ఆ విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకుని బెన్ గురియన్ విమానాశ్రయంలోని ప్రయాణికుల టెర్మినల్‌పైకి దూసుకెళ్లేలా చేయాలని ముందుగానే ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు ఆరోపించారు. సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రాణనష్టం కలిగించడమే అతడి లక్ష్యమని యూఏఈ అటార్నీ జనరల్ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రకటనను ఎమిరేట్స్ ప్రభుత్వ మీడియా ప్రచురించింది. 2001 సెప్టెంబర్ 11న అమెరికాలో జరిగిన దాడుల్లో దుండగులు నాలుగు వాణిజ్య విమానాలను హైజాక్ చేసి మూడు ప్రాంతాల్లో కూల్చివేశారు. ఆ ఘటనల్లో దాదాపు 3,000 మంది ప్రాణాలు కోల్పోయారు.ముందుగానే రెండుసార్లు పరిశీలన?ప్రాథమిక దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 30న జరిగిన ప్రయాణం కంటే ముందే హమ్మామీ రెండుసార్లు బెన్ గురియన్ విమానాశ్రయానికి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఆరోపణల ప్రకారం దాడికి ముందు విమాన మార్గం, విమానాశ్రయం గురించి తెలుసుకునేందుకు ఆ ప్రయాణాలు చేసినట్లు అనుమానిస్తున్నారు. ఇజ్రాయెల్‌లోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయమైన బెన్ గురియన్ను లక్ష్యంగా చేసుకోవాలనుకున్నట్లు గతంలోనే సమాచారం అందిందని ఓ ఇజ్రాయెల్ అధికారి, ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న మరో వ్యక్తి సీఎన్ఎన్కు తెలిపినట్లు వార్తా కథనం పేర్కొంది. అయితే, విమానంలోని కెప్టెన్, పలువురు ప్రయాణికులు హమ్మామీని అదుపులోకి తీసుకోవడంతో విమానాన్ని హైజాక్ చేసే ప్రయత్నం విఫలమైందని అధికారులు తెలిపారు.తీవ్రవాద భావాల వైపు ఎలా మళ్లాడు?యూఏఈ దర్యాప్తు ప్రకారం, హమ్మామీ 2017లో ఆస్ట్రేలియాలో చదువుకుంటున్న సమయంలో తీవ్రవాద భావజాలం వైపు మొగ్గు చూపడం ప్రారంభించాడు. తీవ్రవాద సంస్థలను, ఆత్మాహుతి దాడులను ప్రశంసించే ప్రచురణలు, ఆన్లైన్ సమాచారంతో అతడు ప్రభావితమైనట్లు అధికారులు గుర్తించారు. తన ప్రణాళికను అమలు చేసేందుకు మానసికంగా, శారీరకంగా సిద్ధమయ్యే క్రమంలో ఉగ్రవాదాన్ని ప్రేరేపించే సమాచారాన్ని ఎక్కువగా చదివాడని, వ్యక్తిగత శిక్షకుడి వద్ద బాక్సింగ్ నేర్చుకున్నాడని దర్యాప్తు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అతడి గత ఉద్యోగాలు, విమానయాన సంస్థల్లో పనిచేసిన కాలం, శిక్షణ వివరాలను కూడా అధికారులు పరిశీలించారు.పలు విమానయాన సంస్థల్లో పనిచేసిన హమ్మామీహమ్మామీ 2020 నుంచి 2024 వరకు ఒమన్ ఎయిర్‌లో పనిచేశాడు. 2025లో రాయల్ ఎయిర్ మారోక్‌లో చేరినప్పటికీ, అక్కడ కొద్ది నెలలే ఉన్నట్లు యూఏఈ ప్రకటన తెలిపింది. అనంతరం 2026 జనవరిలో ఫ్లైదుబాయ్‌లో చేరాడు. అయితే, ఒమన్ ఎయిర్ అతడిలోని తీవ్రవాద భావాలపై ఆందోళనతో విమాన శిక్షణ నుంచి తప్పించి, మరో బాధ్యత అప్పగించినట్లు గతంలో ఓ వర్గం సీఎన్ఎన్కు తెలిపింది. మరోవైపు, 2025లో తమ సంస్థలో ఉద్యోగ నియామక ప్రక్రియలో భాగంగా హమ్మామీ మూడు నెలల శిక్షణ పొందాడని, అయితే ఉద్యోగానికి ఎంపిక కాలేదని రాయల్ ఎయిర్ మారోక్ అసోసియేటెడ్ ప్రెస్‌కు తెలిపింది.అర్హతలు, భద్రతా తనిఖీల్లో లోపాలున్నాయా?హమ్మామీ ఫ్లైదుబాయ్‌లో ఎలా నియమితుడయ్యాడన్న అంశంపైనా యూఏఈ అధికారులు దర్యాప్తు చేశారు. అతడికి పైలట్ లైసెన్స్ ఉండటంతో పాటు, మంచి ప్రవర్తనకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం, అవసరమైన పరీక్షల్లో ఉత్తీర్ణత వంటి వృత్తిపరమైన, భద్రతాపరమైన అర్హతలు ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించారు. అయితే, నియామక ప్రక్రియలో అతడి తీవ్రవాద భావజాలం లేదా దాడి చేయాలన్న ఉద్దేశానికి సంబంధించిన సూచనలు ఏవీ బయటపడలేదని అటార్నీ జనరల్ అల్ షమ్సీ తెలిపారు. తాను ఒక్కడే ఈ కుట్రకు పాల్పడ్డానని హమ్మామీ విచారణలో చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, అతడి వాదన నిజమా కాదా అన్న అంశాన్ని నిర్ధారించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.ఇదీ చదవండి: ప్రభుత్వ వ్యవస్థల్లోకి ఏఐ చొరబాటు.. భద్రతపై ట్రంప్ సర్కారు హెచ్చరిక! -
నాడు మాటల్లో... నేడు చేతల్లో!
సెప్టెంబర్ 30న ఫ్లయ్దుబాయ్ విమానంలో ఎదురైన తీవ్ర ప్రాణాంతక పరిస్థితిలో ప్రయాణికులందరినీ కాపాడి వార్తల్లో నిలిచారు కెప్టెన్ స్మిత్ మచ్ఛార్. ఈ సంఘటన తర్వాత, దాదాపు 11 నెలల క్రితం పాడ్‌కాస్టర్ జలక్ మెహ్తాకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడిన ప్రతి మాటా మొన్నటి ఘటనలో ఆయన చూపిన తెగువకు, అసమాన ధైర్యానికి అద్దం పట్టింది. ముఖ్యాంశాలు.. చిన్ననాటి కల కాదు ‘‘చాలామంది పైలట్లకు ఉన్నట్లు విమానయానం అనేది నా చిన్ననాటి కల కాదు. నా జీవితంలోకి చాలా ఆలస్యంగా ఈ ఆలోచన వచ్చింది. స్కూల్ పూర్తయ్యాక, నేను టెక్స్టైల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరాను. ఎందుకంటే అది మా కుటుంబ వ్యాపారం. నేను ఆ కోర్సు పూర్తి చేశాను కానీ అప్పటికి ఇంకా చిన్న వయసే కావటంతో ఇంకొంచెం చదువుకోవాలనుకుని మేనేజ్మెంట్ చేశాను. ఆ కోర్సు చేస్తున్నప్పుడు 19 ఏళ్ల వయసులో నేను ఒక ఏవియేషన్ సదస్సుకు హాజరయ్యాను. అప్పుడే నాకిది బాగా నచ్చేసింది. ఆ విశేషాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి, దాంతో నేను కమర్షియల్ ఫ్లైట్ ట్రైనింగ్ కోసం న్యూజిలాండ్ వెళ్లాను. ఇండియా దాటి బయటి దేశానికి వెళ్లడం నాకు అదే మొదటిసారి.కాపాడేది క్యాబిన్ ‘క్రూ’నే‘‘ప్రయాణికులు తరచూ క్యాబిన్ ‘క్రూ’ని తక్కువగా చూస్తారు లేదా కేవలం ఆహారం, సేవలు అందించే సిబ్బందిగానే భావిస్తారు. కానీ 30,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే మిమ్మల్ని ఎవరు కాపాడతారు? విమానంలో డాక్టర్ ఉంటే అది మీ అదృష్టం. లేకపోతే ఆ క్యాబిన్ ‘క్రూ’నే మిమ్మల్ని కాపాడాలి. వారు భద్రత, అత్యవసర సమయాల్లో అనుసరించాల్సిన పద్ధతులు, ప్రథమ చికిత్స, పల్స్/ప్రాణ సంకేతాలను పరీక్షించడంలో అత్యుత్తమమైన కఠిన శిక్షణను పొంది ఉంటారు. పైలట్లుగా విమానంలో ఏమైనా సమస్య వస్తే మేము చేయగలిగిందల్లా వీలైనంత వేగంగా విమానాన్ని ల్యాండ్ చేసి నేల మీద ఉన్న వైద్యులకు అప్పగించడమే. కానీ విమానం లోపల నిజంగా మీ ప్రాణాలు కాపాడేది మాత్రం ఆ క్యాబిన్ క్రూ సిబ్బందే.ఇదీ చదవండి : అక్టోబర్ 10 సీజేపీ నిరసన : షాకిచ్చిన ఢిల్లీ పోలీసులుక్షేమమొక్కటే కొలమానం‘‘సమయానికి చేరుకోవడం లేదా చాలా స్మూత్‌గా ల్యాండింగ్ చేయడం, వీటిలో ఏది మీకు ఎక్కువ తృప్తినిస్తుంది అని నన్ను అడిగితే, రెండూ కాదు, కేవలం ‘సురక్షితంగా వెళ్లడమే’ అని చెప్తాను. ఒక పైలట్‌గా నాకు సమయానికి వెళ్లే రికార్డుల గురించి ఆలోచన ఉండదు. టైమింగ్స్ చూసుకోవడానికి ఎయిర్‌లైన్స్ వేరే వాళ్లను నియమిస్తుంది. సరైన ప్రదేశంలో, క్షేమంగా విమానాన్ని ల్యాండ్ చేయడమే నా దృష్టిలో మంచి ల్యాండింగ్. అది చాలా స్మూత్‌గా (బటర్–స్మూత్) జరిగితే ఇంకా సంతోషం. ప్రయాణికులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ విమానం దిగి క్షేమంగా, సురక్షితంగా భూమిపైకి అడుగుపెట్టడమే నాకు ఉద్యోగ ధర్మానికి ముఖ్యమైన ఒకే ఒక్క కొలమానం.-ఎడిటోరియల్ టీమ్ -
స్మిట్ మచ్చార్ పుర్రెకు ఫ్రాక్చర్, మెమరీ లాస్, చూపు దెబ్బతిని..
ఫ్లై దుబాయ్ విమానంలో జరిగిన దాడికి సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. విమాన కాక్‌పిట్‌లో భారత పైలట్ కెప్టెన్ స్మిట్ మచ్చార్‌పై ఒమానీ సహ పైలట్ హమామ్ అల్-హమ్మామి గొడ్డలితో దాడి చేసిన ఘటనలో ఆయనకు పుర్రెకు తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది. తలకు, చేతికి కూడా తీవ్రమైన గాయాలైనట్లు సమాచారం. దాడిలో ఆయన చూపు, జ్ఞాపకశక్తిపై కూడా ప్రభావం పడినట్లు తెలుస్తోంది.సీఎన్ఎన్-న్యూస్18తో తెలిపిన వివరాల ప్రకారం.. గొడ్డలి దెబ్బతో స్మిట్ మచ్చార్ పుర్రెకు పగులు ఏర్పడింది. ఆ దెబ్బ ఆయన కంటి నరాలపై ప్రభావం చూపడంతో చూపు దెబ్బతిన్నట్లు సమాచారం. ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో జరిగిన సంభాషణలో స్మిట్ మచ్చార్ ఈ ఘటనను వివరించారు. “నేను అతడిని ఆపేందుకు ప్రయత్నించాను. కానీ మొదట పడిన దెబ్బల కారణంగా నా చూపు దాదాపు పూర్తిగా పోయింది. అంతా పూర్తిగా మసకగా కనిపించింది” అని ఆయన చెప్పారు.మత్తు, నొప్పి తగ్గించే మందులు విమానం సౌదీ అరేబియాలో దిగిన సమయంలో స్మిట్ మచ్చార్ తలకు, చేతికి తీవ్ర గాయాలైనట్లు ఆయన పరిస్థితి గురించి తెలిసిన వర్గాలు తెలిపాయి. సౌదీ అధికారులు ఆయనకు పుర్రె పగులుకు చికిత్స అందించారు. అనంతరం తదుపరి చికిత్స కోసం ఆయనను యూఏఈకి తరలించారు. ఈ గాయాల ప్రభావం ఆయన జ్ఞాపకశక్తిపైనా పడింది.స్మిట్ మచ్చార్ భార్య సోనల్ మచ్చార్ మాట్లాడుతూ.. ఆయనపై ఒత్తిడి పడకూడదన్న ఉద్దేశంతో దాడికి సంబంధించిన వివరాలను కుటుంబం ఆయనతో చర్చించడం లేదని తెలిపారు. తీవ్రమైన తలనొప్పులతో బాధపడుతున్న ఆయనకు అధిక మోతాదులో మత్తు, నొప్పి తగ్గించే మందులు ఇస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. నరాల పనితీరును కూడా వైద్యులు పరిశీలిస్తున్నారు.ప్రస్తుతం అబుదాబిలోని ప్రత్యేక వైద్య కేంద్రంలో చికిత్స పొందుతున్న స్మిట్ మచ్చార్ కొద్దికొద్దిగా నడుస్తూ, ఆహారం తీసుకోవడం ప్రారంభించారని ఆయన పరిస్థితి గురించి తెలిసిన ఓ అధికారి తెలిపారు. కుటుంబం కూడా అందుతున్న వైద్యంపై సంతృప్తి వ్యక్తం చేసింది. యూఏఈ దర్యాప్తు సంస్థలు ఆయన ప్రాథమిక వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు సమాచారం.మళ్లీ విమానం నడపాలని స్మిట్ మచ్చార్ కోరుకుంటున్నారు. ఆయన చూపు పూర్తిగా కోలుకునేలా, భవిష్యత్తులో పైలట్‌గా కొనసాగేందుకు అది అడ్డంకిగా మారకుండా వైద్యులు ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. ఈ ఘటన నుంచి కోలుకుంటున్న సమయంలోనూ ఆయన సానుకూలంగా ఉండటం కుటుంబానికి, వైద్య బృందానికి ఆశాజనకంగా మారింది.ఇదీ చదవండి: 2,700 పిల్లుల చోరీ.. వాటితో ఏం చేస్తారు? -
ఫ్లైదుబాయ్ ఘటనలో బిగ్ ట్విస్ట్
ఆ విమానంలో 170 మందికిపైగా ప్రయాణికులు.. వారిలో ఎక్కువమంది ఇజ్రాయెల్ పౌరులు. దుబాయ్ నుంచి టెల్‌అవీవ్‌కు వెళ్తున్న విమానం ఒక్కసారిగా వేల అడుగుల మేర కిందికి పడిపోయింది. కాక్‌పిట్‌లో పైలట్‌పై కో-పైలట్ దాడి చేశాడు. విమానం అదుపు తప్పుతున్నట్లు కనిపించింది. ఆ సమయంలో ప్రయాణికులు, సిబ్బంది ధైర్యంగా స్పందించకపోయి ఉంటే పెను విషాదమే జరిగేది. ఇప్పుడు ఈ ఘటనపై దర్యాప్తులో వరుసగా కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. ప్లైదుబాయ్ ఘటనను ఉగ్ర దాడిగా అటు యూఏఈ, ఇటు ఇజ్రాయెల్‌లు ప్రకటించాయి. పైగా అల్‌ఖైదా స్పందనతో హమామ్ అల్-హమ్మామీ ఆ సంస్థలోనే ట్రైనింగ్ తీసుకుని ఉంటాడని దాదాపుగా అంచనాకు వచ్చారు. ఈ తరుణంలో ఓ బిగ్ ట్విస్ట్ బయటపడింది. “గాజా ప్రతీకారం కోసం చేశాను.. అమరుడిగా చనిపోవాలనుకున్నా” అంటూ కో-పైలట్ హమామ్ అల్-హమ్మామీ విచారణలో చెప్పినట్లు తాజాగా ఇజ్రాయెల్ మీడియా కథనాలు వెల్లడించాయి. అదే సమయంలో విమానం ఇజ్రాయెల్ వైపు కొనసాగి ఉంటే.. ప్రయాణికులతో నిండిన ఆ విమానాన్ని కూల్చివేయడానికి కూడా ఇజ్రాయెల్ సిద్ధమైందన్న విషయం వెలుగులోకి వచ్చింది.గాజా ప్రతీకారం కోసమా?ఫ్లైదుబాయ్ ఘటనలో ఇరాన్ కోణంపై అమెరికా, ఇజ్రాయెల్‌లు అనుమానాలు వ్యక్తం చేశాయి. అయితే దర్యాప్తులో మాత్రం కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. విచారణలో హమామీ “గాజాకు ప్రతీకారంగా చేశాను. అమరుడిగా చనిపోవాలనుకున్నాను” అని చెప్పినట్లు సమాచారం. దీనిని దర్యాప్తు అధికారులు గనుక ధృవీకరిస్తే.. కీలక సమాధానమే దొరికినట్లవుతుంది. అయితే హమామీ ఒంటరిగానే ఈ దాడికి పాల్పడ్డాడా? ఎవరైనా అతడిని ప్రేరేపించారా? ఎవరైనా సంస్థ అతడిని ఉపయోగించుకుందా? ప్రయాణాలు, పరిచయాలు, విదేశాల్లో ఎవరెవరిని కలిశాడు? ఇలా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఇజ్రాయెల్ దర్యాప్తు వర్గాలు దీనిని లొన్-వోల్ఫ్ దాడి అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాయట. ముందే స్కెచ్ వేశాడా?హమామీ విచారణలో మరో సంచలన విషయం కూడా బయటకొచ్చింది. హమామీ ఫ్లైదుబాయ్‌లో చేరకముందే ఈ దాడికి ప్రణాళిక వేసుకున్నట్లు ఇజ్రాయెల్ అధికారి ఒకరు ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. విమానాన్ని చివరకు టెల్‌అవీవ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంలో కూల్చేయాలన్నది అతడి ఉద్దేశమని ఆ అధికారి చెప్పినట్లు నివేదిక పేర్కొంది. అంతేకాదు.. టెల్‌అవీవ్‌కు వెళ్లే విమానాల్లో పని చేసే అవకాశం కోసం అతడు ఫ్లైదుబాయ్‌లో చేరాడా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. దీంతో.. ఇది అకస్మాత్తుగా జరిగిన దాడి కాదా? ముందే లక్ష్యాన్ని ఎంచుకుని పథకం ప్రకారం చేశాడా? అనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి.విమానం కూల్చేందుకు ఇజ్రాయెల్ రెడీ!ఇక ఈ ఘటనలో మరో ఉత్కంఠభరితమైన విషయం తాజాగా బయటపడింది. విమానం కాక్‌పిట్‌లో దాడి జరిగిన తర్వాత అది సుమారు 14 వేల అడుగుల మేర ఒక్కసారిగా కిందికి పడిపోయింది. ఇజ్రాయెల్ వైమానిక దళం కాక్‌పిట్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించినా స్పందన రాలేదు. దీంతో అక్కడి అధికారులు 9/11 తరహా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముందే రూపొందించుకున్న ప్రోటోకాల్‌ను అమల్లోకి తెచ్చారు. కమాండ్ సెంటర్ ఏర్పాటు చేసి.. యుద్ధ విమానాలను రంగంలోకి దించారు. ఇజ్రాయెల్ గగనతలాన్ని కూడా మూసివేశారు.విమానం ఇజ్రాయెల్‌కు సుమారు 400 మైళ్ల దూరంలో ఉన్నప్పుడు మాత్రం పరిస్థితి మారింది. ఎఫ్‌జెడ్1073 విమానం ఇజ్రాయెల్ వైపు కాకుండా సౌదీ అరేబియా వైపు మళ్లినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను వెనక్కి పిలిచింది. సౌదీ కూడా తన యుద్ధ విమానాలను రంగంలోకి దించింది.170 మందికిపైగా ఉన్నా.. అదే చివరి నిర్ణయం!అయితే విమానం ఇజ్రాయెల్ వైపే కొనసాగి ఉంటే పరిస్థితి మరింత భయంకరంగా ఉండేది. విమానం హైజాక్ అయిందని నిర్ధారణై, కాక్‌పిట్ నుంచి ఎలాంటి స్పందన లేకపోతే యుద్ధ విమానాలు దాని దగ్గరకు వెళ్లి కాక్‌పిట్, ప్రయాణికుల పరిస్థితిని పరిశీలించేవి. ఆ తర్వాత కూడా ముప్పు కొనసాగితే రక్షణ మంత్రి, ప్రధానమంత్రితో అత్యవసర చర్చ జరిగేది.అక్కడే అత్యంత కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చేది. ఇజ్రాయెల్ ప్రోటోకాల్ ప్రకారం.. నియంత్రణలో లేని విమానం కీలక ప్రాంతాల వైపు దూసుకొస్తోందని నిర్ధారణ అయితే దాన్ని కూల్చివేసే అవకాశం ఉంది. ఆ తుది నిర్ణయం ప్రధానమంత్రిదే. ప్రయాణికులతో నిండిన విమానం కూల్చడం కంటే.. అది టెల్‌అవీవ్‌లోని విమానాశ్రయం లేదంటే ఇతర కీలక ప్రాంతాన్ని ఢీకొట్టి వందల మందిని చంపే ప్రమాదాన్ని అడ్డుకోవడమే ఈ విధానం ఉద్దేశమని ఇజ్రాయెల్ వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ మీడియా కథనం ఇచ్చింది.చివరి నిమిషంలో పెను ప్రమాదం తప్పిందిఇదంతా జరుగుతున్న సమయంలో కాక్‌పిట్‌లో మాత్రం మరో పోరాటం సాగుతోంది. హమామీ దాడిలో గాయపడిన భారత పైలట్ స్మిట్ మచ్చార్ అతడిని అడ్డుకోవడానికి పోరాడాడు. చివరకు కాక్‌పిట్ తలుపు తెరవగలిగాడు. దీంతో ప్రయాణికులు, ఫ్లైదుబాయ్ సిబ్బంది లోపలికి వెళ్లి హమామీని అదుపులోకి తీసుకున్నారు. విమానంలో ఉన్న ఇద్దరు ఆఫ్-డ్యూటీ పైలట్లు నియంత్రణ చేపట్టారు. అనంతరం విమానం సౌదీ అరేబియాలోని టబుక్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఫ్లైదుబాయ్ ఘటన వెనుక దాగి ఉన్న కొత్త కోణాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నాయి. దాడి వెనుక అతడొక్కడే ఉన్నాడా? ఎవరైనా అతడిని నడిపించారా? అన్నది తేలాల్సి ఉంది.ఇదీ చదవండి: హమామీ క్లియరెన్స్‌పై ఒమన్ సంచలన వ్యాఖ్యలు -
అతడి విషయంలో ఎక్కడో పెద్ద తప్పే జరిగింది!
ఫ్లైదుబాయ్ ఘటనలో కో-పైలట్ హమామ్ అల్-హమ్మామీ విషయంలో ఒమన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. హమామీ వ్యవహారంలో ఎక్కడో పెద్ద తప్పు జరిగి ఉండొచ్చని అక్కడి సీనియర్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అతడి ఆన్లైన్ కార్యకలాపాలపై గతంలోనే అనుమానాలు వ్యక్తమైనప్పటికీ.. ఆ సమాచారాన్ని సరైన రీతిలో పరిగణనలోకి తీసుకుని ఉంటే ఈ దాడి జరిగి ఉండేది కాదేమోనని వ్యాఖ్యానించాయి.హమామీపై గతంలో ఒమన్ బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏవియేషన్ రంగంలో శిక్షణ పొందుతున్న సమయంలోనే అతడి ఆన్లైన్ కార్యకలాపాలపై నిఘాలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయని ఒమన్ అధికార వర్గాలు తెలిపాయి. తీవ్రవాద, ఉగ్రవాద సంబంధిత కంటెంట్‌పై అతడికి ఆసక్తి ఉన్నట్లు గుర్తించిన తర్వాత.. ఒమన్‌లో ఏవియేషన్ కెరీర్‌ను కొనసాగించకుండా అడ్డుకున్నామని వెల్లడించాయి.హమామీ తండ్రి మా దేశస్థుడే. తల్లి మాత్రం సిరియన్. అయితే అతడు జీవితంలో ఎక్కువ కాలం ఒమన్ వెలుపలే గడిపాడు. గతంలో ఒమన్‌లోని ఓ విమానయాన సంస్థలో కొంతకాలం ట్రైనీగా పనిచేసిన సమయంలో అతడి ఇంటర్నెట్ కార్యకలాపాలను అధికారులు గమనించారు. తీవ్రవాద భావజాలానికి సంబంధించిన వెబ్సైట్లు, కంటెంట్‌పై అతడి ఆసక్తిని గుర్తించిన తర్వాత.. అతడిని ఏవియేషన్ రంగంలో కొనసాగనివ్వలేదు అని ఓ సీనియర్ అధికారి భారత్‌కు చెందిన ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.అయినా పైలట్‌గా ఎలా?ఇదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఒమన్‌లోనే హమామీపై భద్రతాపరమైన అనుమానాలు వ్యక్తమైనప్పుడు.. ఆ తర్వాత అతడు మరోచోట ఏవియేషన్ రంగంలో(రెండు సంస్థల్లో!) ఎలా కొనసాగాడు?. అతడిని నియమించే ముందు అతడి గత రికార్డులపై తనిఖీలు జరిగాయా? ఒమన్‌లో గుర్తించిన అంశాలు ఇతర దేశాలు లేదా సంబంధిత సంస్థలకు ఎందుకు తెలియలేదు? అన్నదానిపై దర్యాప్తు సాగుతోంది.ఈ వ్యవహారంపై ఒమన్ వర్గాలు తీవ్రంగా స్పందించాయి. ‘‘హమామీ విషయంలో ఎక్కడో పెద్ద తప్పు జరిగింది’’ అని వ్యాఖ్యానించాయి. అతడిని కో-పైలట్‌గా నియమించే ముందు భద్రతా ధ్రువీకరణ కోసం ఒమన్‌ను ఎవరూ సంప్రదించలేదని ఆ దేశ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఒకవేళ అధికారికంగా సమాచారం కోరితే.. తమ వద్ద ఉన్న వివరాలన్నింటినీ సంబంధిత వర్గాలతో పంచుకునేవారమని ఆ సీనియర్ అధికారి పేర్కొన్నారు.ఇలాంటి నియామకాల సమయంలో విమానయాన విధివిధానాలను పాటించడంలో లోపం జరిగి ఉండొచ్చని అన్నారాయన. ఇందులో నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం లేదంటే ఉద్దేశపూర్వకంగా విషయాన్ని పట్టించుకోకపోవడం వంటి అంశాలు ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.అయినా ఇజ్రాయెల్ విమానంలో ఎలా?హమామీ ఒమన్ జాతీయుడైతే.. ఇజ్రాయెల్‌కు వెళ్లే విమానంలో కో-పైలట్‌గా ఎలా పనిచేశాడన్న అంశంపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇజ్రాయెల్–యూఏఈ మధ్య ఉన్న విమానయాన ఏర్పాట్ల ప్రకారం సంబంధిత విమానాల్లో యూఏఈ పౌరులు లేదంటే ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు ఉన్న దేశాల పౌరులకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయని ఒమన్ వర్గాలు చెబుతున్నాయి. ఒమన్‌కు ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు లేనందున.. హమామీకి మరో దేశ పౌరసత్వం కూడా ఉండి ఉండొచ్చని ఆ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు.దాడిపై దర్యాప్తుసెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్‌అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ కాక్‌పిట్‌లో కెప్టెన్ స్మిట్ మచ్చార్‌పై దాడి చేశాడు. ఈ ఘటనను యూఏఈ, ఇజ్రాయెల్ అధికారులు ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. ప్రస్తుతం దర్యాప్తులో హమామీ గత రికార్డులు, అతడికి లభించిన భద్రతా అనుమతులు, ఫ్లైట్ సిబ్బందిగా నియామకానికి ముందు జరిగిన తనిఖీలు కీలకంగా మారాయి. ఒమన్‌లో గతంలోనే అనుమానాలు వ్యక్తమైన వ్యక్తి.. చివరకు ఇజ్రాయెల్ వెళ్లే విమానానికి కో-పైలట్‌గా ఎలా నియమితుడు అయ్యాడనే మిస్టరీ వీడాల్సి ఉంది. ఇదీ చదవండి: జర్మనీలో వేల ఏళ్ల కిందటే ఆ టెక్నాలజీ! -
ఫ్లైదుబాయ్ ఘటన.. ఇజ్రాయెల్ మంత్రికి బిగ్ షాక్!
ఫ్లైదుబాయ్ విమానం కూల్చే కుట్ర.. ఇజ్రాయెల్‌లో రాజకీయ దుమారం రేపింది. దుబాయ్ నుంచి టెల్అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చేందుకు ఒమన్‌కు చెందిన కో-పైలట్ ప్రయత్నించిన ఘటన ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టింది. విమాన భద్రతా తనిఖీల్లో లోపాలు బయటపడటంతో.. రవాణా మంత్రి మిరి రెగెవ్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటనపై ఇజ్రాయెల్‌లోని భద్రతా సంస్థలు, ప్రభుత్వ విభాగాల మధ్య బాధ్యతలపై కూడా తీవ్ర చర్చ మొదలైంది. విదేశీ విమానాలు, వాటి సిబ్బందికి సంబంధించిన భద్రతా తనిఖీల్లో రవాణా మంత్రిత్వ శాఖ తగిన చర్యలు తీసుకోవడం లేదని కొన్నేళ్లుగా హెచ్చరికలు వచ్చినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. 2024లో వచ్చిన స్టేట్ కంట్రోలర్ నివేదికలోనూ మంత్రిత్వ శాఖ తన బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించడం లేదని పేర్కొన్నట్లు సమాచారం.బాధ్యత ఎవరిది? 2021లో ఇజ్రాయెల్ భద్రతా కేబినెట్ విదేశీ విమానాల భద్రతకు సంబంధించిన కొన్ని బాధ్యతలను షిన్ బెట్ నుంచి పౌర విమానయాన అథారిటీకి బదిలీ చేసింది. అనంతరం 2024లో విదేశీ వాణిజ్య విమానాల భద్రతా వ్యవస్థపై సమీక్షకు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే ఈ ప్రక్రియ ఏడాది పాటు కొనసాగినప్పటికీ.. విదేశీ విమానాల భద్రతా బాధ్యతను రవాణా మంత్రిత్వ శాఖే చేపట్టాలని నిర్ణయించినట్లు నివేదికలు చెబుతున్నాయి.మరోవైపు.. తమ శాఖపై వచ్చిన ఆరోపణలను మిరి రెగెవ్ ఖండించారు. విదేశీ పైలట్ల నేపథ్యాన్ని తన మంత్రిత్వ శాఖ తనిఖీ చేసే సామర్థ్యం లేదని ఆమె స్పష్టం చేశారు. పైలట్లను గుర్తించడం, ముప్పు స్థాయిని అంచనా వేయడం భద్రతా సంస్థల బాధ్యత అని పేర్కొన్నారు. అయితే ప్రతిపక్ష నేతలు మాత్రం సివిల్ ఏవియేషన్ అథారిటీ తన మంత్రిత్వ శాఖ ఆధీనంలోనే ఉందని, అందువల్ల భద్రతా వైఫల్యానికి ఆమె బాధ్యత వహించాలని అంటున్నారు.ఎన్నికల వేళ షాక్.. ఎన్నికల ముందు రాజకీయ వేడి.. అక్టోబర్ 27న ఇజ్రాయెల్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న గాది ఐసెన్‌కోట్.. ఇలాంటి ఘటన జరిగితే రవాణా మంత్రి రాజీనామా చేయాల్సిందని, ప్రధాని ఆమెను తొలగించి స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాల్సిందని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. ఒమన్‌కు చెందిన పైలట్లు గతంలోనూ ఫ్లైదుబాయ్ విమానాల్లో టెల్‌అవీవ్‌కు వచ్చినట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇజ్రాయెల్‌తో ఒమన్‌కు అధికారిక దౌత్య సంబంధాలు లేవు. అయినప్పటికీ ఆ దేశానికి చెందిన పైలట్ ఇజ్రాయెల్‌కు వెళ్లే విమానంలో కో-పైలట్‌గా ఎలా పనిచేశారన్న ప్రశ్నలు ఇప్పుడు భద్రతా వ్యవస్థపై తలెత్తుతున్నాయి.అసలేం జరిగింది?గత బుధవారం దుబాయ్ నుంచి టెల్అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ బోయింగ్ 737 విమానంలో 29 ఏళ్ల ఒమన్ పౌరుడు, కో-పైలట్ హమామ్.. పైలట్ స్మిట్ మచ్చార్‌పై దాడి చేశాడు. అనంతరం విమానం దాదాపు 30 సెకన్లలో 14 వేల అడుగుల మేర కిందికి పడిపోయింది. పైలట్ ఎలాగోలా కాక్‌పిట్ తలుపు తెరవడంతో ప్రయాణికులు కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. విమానంలో ఉన్న మరో జంట పైలట్లు విమానాన్ని సౌదీ అరేబియాలోని టబుక్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనను యూఏఈ అధికారులు ఉగ్రవాద దాడిగా పరిగణిస్తున్నారు. ఈ ఘటనతో విదేశీ విమానాల భద్రతా తనిఖీల్లో ఎవరి బాధ్యత ఎంత? అన్న ప్రశ్న ఇజ్రాయెల్‌లో రాజకీయ, భద్రతా చర్చకు కేంద్రంగా మారింది. ఎన్నికలకు కొద్ది వారాల ముందు ఈ వ్యవహారం నెతన్యాహు ప్రభుత్వానికి మరో సవాల్‌గా మారింది.ఇదీ చదవండి: అమెరికాకు చైనా, రష్యా సవాల్.. -
మచ్చార్‌ను చంపేసి.. అసలు ప్లాన్ చెప్పేసిన హమామీ!
ఫ్లైదుబాయ్ ఘటనలో పూటకో విస్తుపోయే విషయం బయటపడుతోంది. ఇప్పటికే దీనిని ఉగ్రదాడి కేసుగా దర్యాప్తు జరుపుతున్నారు. విమానంలో భారత కెప్టెన్ స్మిట్ మచ్చార్‌పై దాడి చేసిన ఒమన్ కో–పైలట్ హమామ్ అల్–హమామీ అసలు ఉద్దేశం ఏంటన్న దానిపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కెప్టెన్‌ను హతమార్చి విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకోవడం అతని ప్రధాన ఉద్దేశంగా తేలింది. విచారణలోనూ తన లక్ష్యం విమానాన్ని కూల్చేయడమేనని హమామీ అంగీకరించినట్లు సమాచారం.సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ FZ1073 విమానంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. విమానం సుమారు 36 వేల అడుగుల ఎత్తులో ఉండగా.. హమామీ క్రాష్ యాక్స్‌తో కెప్టెన్ స్మిట్ మచ్చార్‌పై దాడి చేసి కాక్‌పిట్‌ను తన ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించాడు. కెప్టెన్‌ను చంపేసిన తర్వాత విమానాన్ని సాధారణంగానే నడుపుతూ.. ల్యాండింగ్ క్లియరెన్స్ తీసుకుని.. టెల్ అవీవ్(ఇజ్రాయెల్ రాజధాని)లోని ఓ భవనాన్ని ఢీ కొట్టాలని అనుకున్నాడు. ఒకవేళ అది కుదరకుంటే..బెన్ గురియన్ విమానాశ్రయంలో మరో విమానాన్ని ఢీకొట్టడం అతడి ప్లాన్‌గా దర్యాప్తులో తేలింది. అంటే.. ఈ ప్రణాళిక 9/11 తరహా దాడి తరహాలోనే ఉందని అధికారులు అంటున్నారు.జోర్డాన్ గగనతలంలోనే..విమానాన్ని స్వాధీనం చేసుకునేందుకు జోర్డాన్ గగనతలంలోకి ప్రవేశించే వరకు వేచి ఉండాలని హమామీ భావించినట్లు సమాచారం. అక్కడ దాడి చేస్తే.. తన ప్రయత్నాన్ని గుర్తించి అడ్డుకునేందుకు ఇతరులకు తక్కువ సమయం ఉంటుందని అతడు అనుకున్నాడట. జూలైలోనే ఇలాంటి దాడికి ప్రయత్నించాలని భావించినా.. అప్పట్లో ఓ సిబ్బంది తనకు స్నేహితుడు కావడంతో చివరి నిమిషంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.జస్ట్ రెండే నిమిషాల్లో..తన ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో హమామీ మరో ప్లాన్‌కు దిగాడు. కాక్‌పిట్‌లో జరిగిన పెనుగులాట తర్వాత.. ఆటోపైలట్, ఇంజిన్ స్విచ్చ్‌లు ఆప్ చేశాడు. దీంతో బోయింగ్ 737 మ్యాక్స్–8 విమానం కేవలం రెండు నిమిషాల్లో సుమారు 36 వేల అడుగుల నుంచి 17 వేల అడుగులకు పడిపోయింది. ఈ సమయంలో విమానంపై తీవ్ర ఒత్తిడి ఏర్పడటంతో రడ్డర్లోని కొన్ని భాగాలు దెబ్బతిన్నాయి. అప్పటికే హమామీ చేతిలో తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ మచ్చార్ కాక్‌పిట్ తలుపు తెరవగలిగాడు. దీంతో సిబ్బంది, ప్రయాణికులు లోపలికి వెళ్లి హమామీని అదుపులోకి తీసుకున్నారు. విమానంలో ఉన్న మరో ఇద్దరు ఆఫ్–డ్యూటీ పైలట్లు బాధ్యతలు చేపట్టి సౌదీ అరేబియాలోని తబూక్లో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.3 వేలకుపైగా పోస్టులపై ఆరా..హమామీ సోషల్ మీడియా కార్యకలాపాలపైనా దర్యాప్తు సాగుతోంది. ఒమన్ తండ్రి, సిరియా తల్లికి జన్మించిన అతడు చాలా కాలం దుబాయ్‌లో నివసించినట్లు సమాచారం. సిరియా అంతర్యుద్ధ సమయంలో కొంతకాలం అక్కడ ఉన్నాడని.. ఆ సమయంలో ఇస్లామిక్ తీవ్రవాద భావజాలం వైపు ఆకర్షితుడైనట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. అతడి డిలీట్ చేసిన ‘ఎక్స్’ ఖాతాకు సంబంధించిన 3,000కుపైగా పోస్టుల స్క్రీన్షాట్లు ఇంటర్నెట్ ఆర్కైవ్‌లో ఉన్నట్లు సమాచారం. వాటిలో అనేక పోస్టులు ఇస్లామిక్ భావజాలానికి సంబంధించినవిగా దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు.ఆస్ట్రేలియా లింక్‌పైనా ఆరా..హమామీకి ఆస్ట్రేలియాతో ఉన్న సంబంధాలపైనా దర్యాప్తు మొదలైంది. ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్‌కు చెందిన కౌంటర్ టెర్రరిజం బృందం అతడి పరిచయాలు, సంబంధాలను పరిశీలిస్తోంది. ఫ్లైదుబాయ్ సిబ్బందిలో అతడు ఎలా చేరాడు? టెల్ అవీవ్‌కు వెళ్లే విమాన సిబ్బందిలో అతడికి అవకాశం ఎలా లభించింది? అనే అంశాలపైనా ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్ అధికారులు ఆరా తీస్తున్నారు.‘టెర్రరిస్ట్ యాక్ట్’గా తేల్చేశారుఈ ఘటనను యూఏఈ అటార్నీ జనరల్ హమద్ సైఫ్ అల్ షమ్సీ ‘టెర్రరిస్ట్ యాక్ట్’గా అభివర్ణించారు. క్రాష్ యాక్స్‌తో కెప్టెన్‌పై దాడి చేసి విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకునేందుకు హమామీ ప్రయత్నించాడని తెలిపారు. ఈ ఘటన వెనుక మరింత విస్తృత కుట్ర ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం హమామీని వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు.ఒమన్‌లో నిషేధం.. అయినా ఎలా?హమామీపై అతడి సొంత దేశం ఒమన్‌లోనే విమానాలు నడపడంపై నిషేధం ఉన్నట్లు సమాచారం. తీవ్రవాద భావజాలం కారణంగానే ఈ నిషేధం విధించినట్లు తెలుస్తోంది. అలాంటి వ్యక్తి ఫ్లైదుబాయ్ కో–పైలట్‌గా ఎలా కొనసాగాడు? ఇజ్రాయెల్‌కు వెళ్లే విమానాన్ని నడిపే అవకాశం ఎలా దక్కింది? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఘటనకు ముందు ప్రయాణికులు, సిబ్బంది వివరాలను యూఏఈ అధికారులు ఇజ్రాయెల్‌తో పంచుకున్నట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో స్క్రీనింగ్, నియామక ప్రక్రియ, భద్రతా సమాచార మార్పిడిపై కూడా దర్యాప్తు జరుగుతోంది.ఫెయిల్ అయినా మెచ్చుకున్న అల్‌ఖైదా!హమామీ ప్రయత్నాన్ని ఉగ్రసంస్థ ‘అల్‌ఖైదా’ ప్రశంసించడం ఇప్పుడు మరో సంచలనంగా మారింది. యెమెన్‌లోని ‘అల్–బయాన్’ వారపత్రికలో ‘సెప్టెంబర్ 11, సెప్టెంబర్ 30 మధ్య’ పేరుతో ప్రచురించిన సంపాదకీయంలో.. అమెరికా, ఇజ్రాయెల్ విమానాలపై ఇలాంటి మరిన్ని దాడులకు పిలుపునిచ్చింది. 2001 సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడితోపాటు సెప్టెంబర్ 30న ఫ్లైదుబాయ్ FZ1073 ఘటనను ప్రస్తావించింది. ‘యుద్ధం ఇంకా ముగియలేదు’ అంటూ వ్యాఖ్యానించింది. హమామీ హైజాక్ విజయవంతమై ఉంటే ప్రాంతీయ శక్తి సమీకరణాలు మారిపోయేవని పేర్కొంది. అంటే.. విమానాన్ని కూల్చేయాలన్న హమామీ ప్రయత్నం విఫలమైనా.. దాన్ని అల్‌ఖైదా మాత్రం మెచ్చుకుంది. అంతేకాదు.. 9/11 తరహా దాడులతో పోలుస్తూ, అమెరికా–ఇజ్రాయెల్ విమానాలపై మరిన్ని దాడులకు పిలుపునిచ్చింది. ఫ్లైదుబాయ్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే.. హమామీ ప్రయత్నాన్ని అల్‌ఖైదా సమర్థించడం, భవిష్యత్తులో ఇలాంటి దాడులకు ప్రోత్సాహం ఇచ్చేలా పిలుపునివ్వడం భద్రతా వర్గాల్లో మరింత ఆందోళనకు కారణమవుతోంది.ఇదీ చదవండి: ట్రంప్ స్థాపించిన ఈ కొత్త ఫోర్స్.. చీఫ్ ఎవరో తెలుసా? -
ఘటనపై దర్యాప్తు ముమ్మరం
దుబాయ్: ఫ్లై దుబాయ్ విమాన ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. పలుదేశాలు ఇందులో పాలుపంచుకున్నాయి. యూఏఈ నేతృత్వంలోని దర్యాప్తు సంస్థలు నిందితుడైన కో–పైలట్ హమామీ ఉద్దేశాలు, ఇతరులతో అతడికి ఉన్న సంబంధాలపై దృష్టి పెట్టింది. ఒమన్‌కు చెందిన కో–పైలట్‌కు ఆ్రస్టేలియాతో ఉన్న సంబంధాలు, అతడు టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమాన సిబ్బందిలో ఎలా చేరాడనే దానిపై ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్ అధికారులు విచారణ జరుపుతున్నారు. నిందితుడికి ఆస్ట్రేలియాతో ఉన్న సంబంధాలపై ఉగ్రవాద నిరోధక బృందం దర్యాప్తు చేస్తోందని ఆ్రస్టేలియన్ ఫెడరల్ పోలీస్ విభాగం వెల్లడించింది. విమానంలోని కాక్‌పిట్‌లో కో–పైలట్ క్రాష్ గొడ్డలితో కెప్టెన్‌పై దాడి చేసి, విమానంపై నియంత్రణ సాధించడానికి ప్రయత్నించాడని యూఏఈ అటార్నీ జనరల్ హమద్ సైఫ్ అల్ షంసీ పేర్కొన్నారు. కుట్ర కోణం త్వరలో బహిర్గతమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఫ్లై దుబాయ్ విమాన ఘటనకు ముందు యూఏఈ అధికారులు అందులోని ప్రయాణికులు, సిబ్బంది వివరాలను ఇజ్రాయెల్‌తో పంచుకున్నారని సంబంధిత అధికారులు ఆదివారం తెలిపారు. తీవ్రవాద భావజాలం ఉన్న కో–పైలట్‌ను అతడి సొంత దేశమే విమానం నడపకుండా నిషేధించిందని ఇప్పటికే గుర్తించారు. ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు లేని ఒమన్ పౌరుడిని, ఇజ్రాయెల్ పౌరులతో నిండిన విమానాన్ని నడపడానికి ఎలా అనుమతించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
విమానాన్ని కూల్చడమే నా లక్ష్యం
దుబాయ్: ఫ్లై దుబాయ్ విమానంలో భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై దాడి చేసిన కో–పైలట్, ఒమన్ జాతీయుడైన హమామ్ అల్–హమామీ మనసులో పెద్ద కుట్రే ఉన్నట్లు స్పష్టమైంది. ఆ విమానాన్ని కూల్చడమే తన లక్ష్యమని విచారణలో అతను నేరాన్ని అంగీకరించినట్లు ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ పత్రిక తన కథనంలో పేర్కొంది. చావుకు భయపడలేదని అతను వ్యాఖ్యానించాడు. కోపైలట్‌ను యూఏఈ అధికారులు భిన్న కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. దాడి తర్వాత విమానం అత్యవసరంగా సౌదీ అరేబియాలో ల్యాండైన సంగతి తెలిసిందే. నిందితుడిని అక్కడే అదుపులోకి తీసుకొని యూఏఈకి తరలించారు. కో–పైలట్ హమామీ ఒమన్ దేశస్థుడైన తండ్రికి, సిరియా దేశస్థురాలైన తల్లికి జని్మంచాడు. చాలా ఏళ్లు దుబాయ్‌లో నివసించాడు. సిరియాలో అంతర్యుద్ధ జరుగుతున్న సమయంలో అక్కడ కొంతకాలం గడిపాడు. ఆ సమయంలో ఇస్లామిక్ తీవ్రవాదం పట్ల ఆకర్శితుడైనట్లు తెలుస్తోంది. అతడి సోషల్ మీడియా ఖాతాలను దర్యాప్తు అధికారులు జల్లెడ పడుతున్నారు. అతడు తొలగించిన ‘ఎక్స్’ ఖాతాలోని 3,000కు పైగా పోస్టుల స్క్రీన్షాట్లు ఇంటర్నెట్ ఆర్కైవ్‌లో ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. వాటిలోని అనేక పోస్టులు ఇస్లామిక్ భావజాలానికి సంబంధించినవే ఉన్నాయి. -
‘ఫ్లై దుబాయ్’ వీరుడికి అరుదైన గౌరవం!
ఫ్లై దుబాయ్ విమాన ఘటనలో వీరోచితంగా వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం లభిచింది. కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై ప్రశంసలు కురిపించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. ఆయనను ఇజ్రాయెల్, భారత్‌తో పాటు ప్రపంచానికే హీరోగా అభివర్ణించారు. అంతేకాకుండా, ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జ్యోతి వెలిగించాలని ఆహ్వానించారు.సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లై దుబాయ్ విమానం ఎఫ్‌జెడ్1073లో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఉన్న ఒమన్‌కు చెందిన కో-పైలట్ హమ్మామ్ అల్-హమ్మామీ, కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై గొడ్డలితో దాడి చేసి, విమానాన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో విమానం కొద్ది సమయంలోనే వేల అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా కిందికి దూసుకొచ్చింది. ఈ పరిస్థితిలో తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ మచ్చర్ కాక్‌పిట్ తలుపు తెరవడంతో ప్రయాణికులు, సిబ్బంది దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు వీలైంది. విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు పైలట్లు పరిస్థితిని చక్కదిద్ది, సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా దించారు. ఈ ఘటనలో విమానంలోని 174 మంది ప్రాణాలు కాపాడిన కెప్టెన్ మచ్చర్ ధైర్యసాహసాలను పలువురు ప్రశంసించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆయన ధైర్యాన్ని కొనియాడారు.ఈ నేపథ్యంలో కెప్టెన్ మచ్చర్‌తో మాట్లాడిన నెతన్యాహు, ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జ్యోతి వెలిగించేందుకు రావాలని ఆహ్వానించారు.Prime Minister Benjamin Netanyahu in a conversation with the Indian pilot from the flight from Dubai, Captain Smit Machchhar: "You are a hero for Israel, India, and the entire world. I invite Prime Minister @NarendraModi and you to light a flame on Israeli Independence Day." 🇮🇱🇮🇳 During the emotional conversation that took place this evening, the Prime Minister asked Captain Machchhar how it all started, and Machchhar revealed new details about the terrifying moments in the cockpit.— Prime Minister of Israel (@IsraeliPM) October 3, 2026 -
ఫ్లైదుబాయ్ హీరో స్మిట్ మచ్చార్‌ను కలిసిన దుబాయ్ యువరాజు
విమానం గాలిలో ప్రయాణిస్తుండగా తన కో-పైలట్ దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి, నగరంలోని ఒక ఆసుపత్రిలో కోలుకుంటున్న భారతీయ పైలట్, స్మిట్ మచ్చార్‌ను దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పరామర్శించారు. తను తీవ్రంగా గాయపడినప్పటికీ కాక్‌పిట్ తలుపు తెరిచి, తద్వారా 172 మంది ప్రయాణికులతో పాటు విమానంలో ఉన్న సిబ్బంది ప్రాణాలను కాపాడినందుకు ఆ పైలట్ ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. దాంతో దుబాయ్ యువరాజు ఆ పైలట్‌పై తన ప్రశంసలు, అభినందనలు తెలిపారు.మా తరపున, దేశ నాయకత్వం తరపున, ఆయనకు మా సంపూర్ణ ప్రశంసలు, అభినందనలు. ఆయన మా బృందంలో భాగమైనందుకు... మా దేశ చరిత్రలో భాగమైనందుకు... కరుణామయ దేశంగా... శాంతి దేశంగా... జీవన దేశంగా నిలిచే యూఏఈలో భాగమైనందుకు మేము గర్విస్తున్నామని ఆయన Xలో రాశారు.దుబాయ్ యువరాజు పైలట్ మచ్చార్‌తో కలిసి అతన్ని ఆలింగనం చేసుకుంటున్న ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో దర్శనమిస్తున్నాయి. దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానానికి మచ్చార్ కెప్టెన్‌గా ఉన్నారు. ఒమన్ జాతీయుడైన హమామ్ అల్హమ్మమీ అతని కో-పైలట్‌గా ఉన్నారు. విమానాన్ని కూల్చివేయాలనే ప్రయత్నంలో భాగంగా అతను అకస్మాత్తుగా కాక్‌పిట్ క్రాష్ యాక్స్‌తో కెప్టెన్‌పై దాడి చేశాడు.ఇద్దరు పైలట్ల మద్య జరిగిన ఘర్షణ సమయంలో విమానం నిమిషాల వ్యవధిలోనే వేల అడుగులు కిందకు పడిపోయింది. కూలిపోయే దిశగా దూసుకుపోతోంది. చుట్టూ అన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. తన అసాధారణమైన సమయస్ఫూర్తితో ధైర్యంగా మచ్చార్ కాక్‌పిట్ తలుపు తెరిచి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. దాంతో వారు లోపలికి పరుగెత్తుకొచ్చి, దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానాన్ని నిలకడగా ఉంచారు. వెంటనే విధుల్లో లేని పైలట్లు విమానాన్ని ల్యాండ్ చేశారు.భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పైలట్ వీరోచితాన్ని ఇప్పటికే ప్రశంసించారు. విమానాన్ని కూల్చివేయడానికి కో-పైలట్ ప్రయత్నించాడన్న ఆరోపణల వెనుక ఉన్న ఉద్దేశ్యంపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. అయితే, అతని తీవ్రవాద భావజాలంపై ఉన్న ఆందోళనల కారణంగా అల్-హమ్మామీని గతంలో ఒమన్‌లో విమానాలు నడపకుండా నిషేధించారని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.ప్రస్తుతం ఈ దర్యాప్తునకు నాయకత్వం వహిస్తున్న యూఏఈ, ఈ ఘటనకు ఏదైనా "ఉగ్రవాద కార్యకలాపాలు లేదా ఉద్దేశ్యంతో" సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. హమామ్ అల్-హమ్మామీ ఒమన్ పౌరుడు. అతను యూఏఈలో ఒమన్ తండ్రికి, సిరియా తల్లికి జన్మించాడు. తన జీవితంలోని చాలా సంవత్సరాలు యూఏఈలోనే గడిపాడని ఆ నివేదిక పేర్కొంది.స్మిట్ మచ్చార్ తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం కోలుకుంటున్నారుకెప్టెన్ స్మిట్ ప్రస్తుతం వైద్య సంరక్షణలో ఉన్నారు. బాగా కోలుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం. స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాము. వారి సంరక్షణను చూస్తున్న యూఏఈ ప్రభుత్వానికి మా ధన్యవాదాలు. ఆయన ఆరోగ్యం కోసం శ్రేయోభిలాషులతో కలిసి మేము ప్రార్థిస్తున్నామని యూఏఈలోని భారత రాయబార కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. స్మిట్ మచ్చార్ గాయాలు పూర్తిగా నయం కావడానికి కొంత సమయం పడుతుందని అతని తండ్రి భూపేంద్ర మచ్చార్ మీడియాకి తెలిపారు. -
ఫ్లైదుబాయ్ ఘటన.. ఉగ్రదాడే: యూఏఈ సంచలన ప్రకటన!
ఫ్లైదుబాయ్ విమాన ఘటనపై ఇప్పటివరకు ఉన్న అనుమానాలకు తెరదించే కీలక ప్రకటన వెలువడింది. కెప్టెన్ స్మిట్ మచ్చార్‌పై కాక్‌పిట్‌లోని క్రాష్ యాక్స్తోనే కో-పైలట్ హమామ్ అల్-హమ్మామీ దాడికి యత్నించాడని యూఏఈ తెలిపింది. అంతేకాదు.. ఈ ఘటనను ఉగ్రదాడిగా దాదాపుగా నిర్ధారించింది.దుబాయ్ నుంచి టెల్అవీవ్ వెళ్తున్న ఎఫ్‌జెడ్1073 విమానంలో కో-పైలట్ హమామ్ అల్-హమ్మామీ.. కెప్టెన్ స్మిట్ మచ్చార్‌పై కాక్‌పిట్‌లోని క్రాష్ యాక్స్‌తో దాడి చేసి, విమానాన్ని తన నియంత్రణలోకి తీసుకునేందుకు ప్రయత్నించాడని యూఏఈ ప్రాసిక్యూటర్ జనరల్ హమద్ సైఫ్ అల్ షమ్సీ శనివారం వెల్లడించారు. ఈ చర్యను ‘టెర్రరిస్ట్ అటాక్’గా పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన పరిస్థితులు, ఉద్దేశం, ఇతరులతో సంబంధాలు, ఫిజికల్-డిజిటల్ ఆధారాలపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.విమానం కంట్రోల్ కోసం ప్రయత్నంసెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్అవీవ్ బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాక్‌పిట్‌లో కో-పైలట్ స్మిట్ మచ్చార్‌పై దాడి చేసిన అనంతరం విమాన నియంత్రణను చేపట్టేందుకు ప్రయత్నించాడని యూఏఈ అధికారులు తెలిపారు. సాధారణంగా విమానాల్లో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే క్రాష్ యాక్స్ కాక్‌పిట్‌లోనే ఉంటుంది. అదే పరికరాన్ని దాడికి ఉపయోగించినట్లు తాజా దర్యాప్తు వివరాలు వెల్లడిస్తున్నాయి.వేల అడుగుల మేర ఒక్కసారిగా కిందికికాక్పిట్లో ఘర్షణ జరుగుతున్న సమయంలో విమానం ఒక్కసారిగా వేగంగా కిందికి దిగింది. వివిధ నివేదికల ప్రకారం విమానం దాదాపు 14 వేల నుంచి 17 వేల అడుగుల మేర ఎత్తు కోల్పోయింది. విమానంలో 170 మందికి పైగా ఉన్నారు. తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ మచ్చార్ కాక్‌పిట్ తలుపు తెరవగలిగారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లి కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఆ ఇద్దరు పైలట్లతోనే విమానం సేఫ్విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు ఆఫ్-డ్యూటీ పైలట్లు పరిస్థితిని చక్కదిద్దేందుకు ముందుకొచ్చారు. వారు విమాన నియంత్రణ చేపట్టి దానిని సౌదీ అరేబియాలోని టబుక్ విమానాశ్రయానికి మళ్లించారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఘటన అనంతరం సౌదీ అధికారులు కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని విచారణ కోసం యూఏఈకి తరలించారు.హమామ్.. గతంపైనా దర్యాప్తుకో-పైలట్‌ను హమామ్ అల్-హమ్మామీగా గుర్తించారు. అతడు ఒమన్ జాతీయుడని దర్యాప్తు వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. అతడి గత రికార్డులపైనా ఇప్పుడు అధికారులు దృష్టి పెట్టారు. 2024లో ఒమన్ ఎయిర్‌లో కో-పైలట్ ట్రైనీగా ఉన్న సమయంలో అతడి వద్ద తీవ్రవాద భావజాలానికి సంబంధించిన మెటీరియల్ లభించడంతో విమానాలు నడపకుండా నిలిపివేసినట్లు అమెరికా అధికారులు తెలిపినట్లు ఏబీసీ న్యూస్ పేర్కొంది. అయితే ఆ తర్వాత అతడు పరిపాలనా విభాగంలో కొనసాగినట్లు సమాచారం. అసలు అలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తి తర్వాత ఫ్లైదుబాయ్‌లో కో-పైలట్‌గా ఎలా చేరాడు? అతడికి క్లియరెన్స్ ఎలా లభించింది? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ప్రశ్నలే ప్రస్తుతం విచారణలో కీలకంగా మారాయి.ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నాయా?కో-పైలట్ ఒంటరిగానే ఈ దాడికి పాల్పడ్డాడా? లేదంటే ఏదైనా తీవ్రవాద సంస్థతో సంబంధం ఉందా? ముందస్తు ప్రణాళిక ఉందా? ఎవరైనా అతడిని ప్రేరేపించారా? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. యూఏఈ ప్రాసిక్యూటర్ జనరల్ ప్రకారం భౌతిక, డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యాక తుది వివరాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.మచ్చార్ ధైర్యంతో తప్పిన పెను ప్రమాదందాడిలో తీవ్రంగా గాయపడిన కెప్టెన్ స్మిట్ మచ్చార్ మాత్రం పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ కాక్‌పిట్ తలుపు తెరిచారు. దీంతో ప్రయాణికులు లోపలికి వెళ్లి దాడి చేసిన కో-పైలట్‌ను అదుపులోకి తీసుకోగలిగారు. మరోవైపు ఆఫ్-డ్యూటీ పైలట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. మచ్చార్ ప్రస్తుతం కోలుకుంటున్నారు.ఇదీ చదవండి: సిరియన్ అమ్మ.. ఒమన్ తండ్రి.. అల్‌ఖైదాకు వీరాభిమాని! -
ఫ్లైదుబాయ్ ఘటన: ఇతడే ఆ కో-పైలట్.. విస్తుపోయే నిజాలు!
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పైలట్ స్మిట్ మచ్చార్‌పై దాడి విమానం కూల్చేందుకు యత్నించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కో-పైలట్ మామూలోడు కాదని తెలుస్తోంది. తీవ్రవాద భావజాలం ఉన్న అతనిపై యెమెన్ గతంలో విమానం నడపకుండా బ్యాన్ కూడా విధించిందట. అలాంటప్పుడు ఫ్లైదుబాయ్‌లో పైలట్‌గా అతనెలా చేరాడు? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.సదరు కో-పైలట్ పేరు హమామ్ అల్-హమ్మామీ(Hamam al-Hammami). గతంలో ఒమన్ ఎయిర్‌పోర్టులో ఏడేళ్లపాటు పనిచేసినట్లు పలు మీడియా కథనాలు చెబుతున్నాయి. ఆ సమయంలో ట్రైనీ కో-పైలట్‌గా ఉన్నప్పుడు అతని వద్ద అనుమానాస్పద, తీవ్రవాద భావజాలానికి సంబంధించిన మెటీరియల్ లభించడం కలకలం రేపింది. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో ‘ఫ్రీ పాలస్తీన్’ వర్గాలకు సంబంధించిన కరపత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అతడిని పైలట్ విధుల నుంచి సస్పెండ్ చేశారు. అయితే పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగించకుండా.. పరిపాలనా విభాగంలో కొనసాగించారు. ఇది 2024లోనే జరిగింది. ఆ తర్వాత అతను మొరాకోకు చెందిన రాయల్ ఎయిర్ మొరాక్లో కో పైలట్‌గా విధులు నిర్వహించాడు. అక్కడి నుంచి ఫ్లైదుబాయ్‌లో చేరాడు. అసలు అలాంటి వ్యక్తి ఆ తర్వాత ఫ్లైదుబాయ్‌లో ఎలా చేరాడు? కో-పైలట్‌గా క్లియరెన్స్ ఎలా లభించింది?. అదీ ఇజ్రాయెల్‌కు వెళ్లే విమానంలోకి ఎలా వచ్చాడు? ఇప్పుడు దర్యాప్తు అధికారుల ముందున్న ప్రధాన ప్రశ్న ఇదే. ఒమన్‌లో ఉన్న అతడి భద్రతా రికార్డు ఇతర దేశాల అధికారులకు లేదంటే విమానయాన సంస్థలకు చేరిందా? ఫ్లైదుబాయ్‌లో ఉద్యోగం పొందే సమయంలో అతడిపై మళ్లీ భద్రతా తనిఖీలు జరిగాయా? అనే అంశాలను లోతుగా పరిశీలిస్తున్నారు.ప్రొఫైల్ ఏంటంటే..హమామ్ అల్-హమ్మామీ.. యెమన్ పౌరుడు!. తల్లి ఓ సిరియన్, తండ్రి ఒమన్ దేశస్తుడు. అయితే హమామ్ యూఏఈలోనూ ఎక్కువ కాలం నివసించాడని.. అతనికి ఒమన్, యూఏఈ ద్వంద్వ పౌరసత్వం ఉండొచ్చని పలు కథనాలు చెబుతున్నాయి. అంతేకాదు మతాచారాలను కఠినంగా పాటించేవాడని.. మహిళా ఉద్యోగులతో కనీసం షేక్‌హ్యాండ్ కూడా చేసేవాడు కాదని అతనితో గతంలో పని చేసిన ఓ ఉద్యోగిణి చెప్పినట్లు స్టేట్మెంట్ వైరల్ అవుతోంది. అంతేకాదు.. అతని సోషల్ మీడియాలోనూ రాడికల్ కంటెంట్ పోస్ట్ అయ్యిందని తెలుస్తోంది. ఘటన జరిగిన రోజున ఆ ఖాతాలో రెండు పోస్టులు కనిపించాయి. ఒక పోస్టులో బోయింగ్ 737 మ్యాక్స్ కాక్‌పిట్‌లో తీసిన వీడియోలు ఉన్నట్లు సమాచారం. ఆ వీడియో చివర అల్‌ఖైదా మాజీ అధినేత అయ్మన్ అల్-జవాహిరి, 2009లో ఆత్మాహుతి దాడికి పాల్పడిన హుమామ్ ఖలీల్ అబు-ములాల్ అల్-బలావీ చిత్రాలు ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఇటు కో–పైలట్ సోషల్ మీడియా ఖాతాల్లో యూదులను హత్య చేయడం, జిహాదీ భావజాలానికి సంబంధించిన కంటెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ పోస్టులను హమ్మామీయే పెట్టాడా? లేక మరెవరైనా అప్లోడ్ చేశారా? అవి ముందుగానే షెడ్యూల్ చేశారా? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. దర్యాప్తు వర్గాలను ఉటంకిస్తూ.. విమానాన్ని ఇజ్రాయెల్‌లో కూల్చేయాలనే ఉద్దేశం తనకు ఉన్నట్లు కో-పైలట్ చెప్పినట్లు కూడా రిపోర్టులు వెలువడ్డాయి.విమానం కూల్చాలనుకున్నాడుదర్యాప్తు వర్గాలను ఉటంకిస్తూ.. విమానాన్ని ఇజ్రాయెల్‌లో కూల్చేయాలనే ఉద్దేశం తనకు ఉన్నట్లు కో–పైలట్ వెల్లడించినట్లు నివేదికలు వచ్చాయి. కెప్టెన్ స్మిట్ మచ్చార్‌ను కత్తితో పొడిచి విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించిన అతడు.. తనను చంపేయాలని కూడా సిబ్బందిని కోరినట్లు ఇజ్రాయెలీ అధికారి ఒకరు ‘టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’కు తెలిపారు. అవసరమైతే ఆత్మహత్య చేసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.సెప్టెంబర్ 30న ఏం జరిగిందంటే..ఫ్లైదుబాయ్ ఎఫ్‌జెడ్1073 విమానం దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్‌కు బయలుదేరింది. విమానంలో 174 మంది ఉన్నారు. జోర్డాన్ గగనతలంలో ఉండగా కో-పైలట్ .. భారత్‌కు చెందిన కెప్టెన్ స్మిట్ మచ్చార్‌పై దాడి చేశాడు. ఆ తర్వాత విమానం ఒక్కసారిగా కిందకి పడిపోయింది. దాదాపు 30 సెకన్లలో 14 వేల అడుగులకు పైగా ఎత్తు కోల్పోయినట్లు ఫ్లైట్ డేటా వెల్లడించింది. తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ మచ్చార్ ఎలాగోలా కాక్‌పిట్ తలుపు తెరవగలిగారు. దీంతో ప్రయాణికులు లోపలికి దూసుకెళ్లి కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. విమానంలో ఉన్న మరో ఇద్దరు ఆఫ్-డ్యూటీ పైలట్లు నియంత్రణ చేపట్టి విమానాన్ని సౌదీ అరేబియాలోని టబుక్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు.టబుక్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యాక సౌదీ అరేబియా అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఆ కో-పైలట్‌ను యూఏఈ అధికారులకు అప్పగించింది. ప్రస్తుతం యూఏఈ దర్యాప్తు ప్రధానంగా కొనసాగుతోంది. ఇజ్రాయెల్ అధికారులు కూడా అతడిని ప్రశ్నించనున్నారు. ఉగ్రవాద సంబంధం, ముందస్తు ప్రణాళిక, ఇతరుల ప్రమేయం వంటి అంశాలపై విచారణ జరుగుతోంది.నెతన్యాహు సంచలన వ్యాఖ్యలుఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ.. కో-పైలట్ ‘ఇస్లామిస్ట్ రాడికల్ ఇండోక్ట్రినేషన్’కు గురయ్యాడని, అంటే అతివాద భావజాలంతో ప్రభావితమయ్యాడని తెలిపారు. విమానాన్ని కూల్చేయాలనే ఉద్దేశంతోనే అతడు వ్యవహరించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నామని చెప్పారు. ఈ ఘటన వెనుక ఎవరైనా ఉన్నారా? అతడిని ఎవరైనా పంపించారా? అన్నదానిపైనా దర్యాప్తు చేస్తున్నామని.. “అతడిని ఎవరైనా పంపి ఉంటే.. వారు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది” అంటూ హెచ్చరించారు. ఇప్పటివరకు ఇరాన్ ప్రమేయానికి ఆధారాలు లభించలేదని భద్రతా వర్గాలు తెలిపాయి.మరి ఇజ్రాయెల్ ఫ్లైట్‌లోకి ఎలా వచ్చాడు?ఇక్కడే ఇప్పుడు మరో పెద్ద ప్రశ్న తలెత్తింది. ఒమన్‌కు ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు లేవు. ఇలాంటి దేశాల పైలట్లను ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో ఎలా అనుమతించారు?. పోనీ భద్రతా పరమైన నిబంధనలు ఉన్నాయా?అంటే.. ఇజ్రాయెల్-యూఏఈ ద్వైపాక్షిక విమాన ఒప్పందంలో అలాంటిదేం లేదని తెలుస్తోంది. అయినప్పటికీ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా ఫ్లైదుబాయ్ ఎలా నియమించుకుందనేదే అసలు ప్రశ్న. ఇటు ఇజ్రాయెల్ భద్రతా పర్యవేక్షణపైనా ప్రశ్నలు తలెత్తాయి. ఇజ్రాయెల్ అధికారులు పైలట్లను ముందుగానే స్క్రీన్ చేసే విధానాన్ని మరింత కఠినతరం చేయాలని చూస్తున్నారు. ప్రధాని నెతన్యాహు కూడా పైలట్లను ముందుగానే స్క్రీన్ చేయడంలో ఉన్న “లొసుగు”పై సమీక్ష అవసరమని వ్యాఖ్యానించారు.మచ్చార్.. ది హీరోప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడిన సందర్భంగా.. విమానం కిందికి వెళ్తోందని తెలుసుకుని ప్రయాణికులకు ఏం కాకూడదనే ఉద్దేశంతో గాయాలతో నేలపై ఉన్నప్పటికీ కాక్‌పిట్ తలుపు తెరవాలని నిర్ణయించుకున్నానని మచ్చారు వివరించారు. భారత కెప్టెన్ స్మిట్ మచ్చారు సమయస్ఫూర్తి, ధైర్యం వల్లే ఫ్లైదుబాయ్ ఘటనలో ఘోర ప్రమాదం తప్పింది. గాయపడినా హనుమాన్ చాలీసా పటిస్తూ బలం తెచ్చుకుని.. కాక్‌పిట్ తలుపు తెరవగలిగాడు స్మిట్. దీంతో ప్రయాణికులు లోపలికి వెళ్లి దాడి చేసిన హమామ్ను అదుపులోకి తీసుకోగలిగారు. విమానంలోని వాళ్ల ప్రాణాలు కాపాడారు. అందుకే ప్రపంచం మొత్తం ఆయన్ని హీరోగా ప్రశంసిస్తోంది.2024లోనే భద్రతా ముప్పుగా గుర్తించి విమానాలు నడపకుండా నిషేధించిన వ్యక్తి.. ఆ తర్వాత మరో రెండు అంతర్జాతీయ విమానయాన సంస్థల్లో కో-పైలట్‌గా ఎలా చేరాడు? అతడి గత రికార్డులు ఎందుకు అడ్డుకాలేదు? టెల్అవీవ్ వెళ్లే విమానానికి అతడు ఎలా క్లియర్ అయ్యాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఇదీ చదవండి: ఇదేం ట్విస్ట్?? యూదులను చంపేయాలా! -
ఒళ్లు గగుర్పొడిచే 10 ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఘటనలు
సెప్టెంబర్ 30న ఫ్లై దుబాయ్ విమానంలో కెప్టెన్ స్మిత్ మచ్చార్ అపారమైన ధైర్యసాహసాలను ప్రదర్శించి ఒక పెను విమాన విపత్తును నివారించారు. తన కో-పైలట్ చేతిలో కత్తిపోట్లకు గురై, కదలలేని స్థితికి చేరినప్పటికీ, విమానంలోని 174 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందిని కాపాడారు. ఇదే తరహాలో విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు విమానాలను పైలట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వస్తుంది. విమానయాన చరిత్రలోని 10 ప్రధాన ఎమర్జెన్సీ ల్యాండింగ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..యూఎస్ ఎయిర్వేస్ ఫ్లైట్ 1549: ‘ది మిరాకిల్ ఆన్ ది హడ్సన్’ (2009)న్యూయార్క్ లాగార్డియా విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే, ఒక ఎయిర్‌బస్ ఏ320 కెనడా గీస్ (బాతుల గుంపు)ను ఢీకొంది దీంతో రెండు ఇంజన్లూ ధ్వంసమయ్యాయి. రన్‌వేను చేరుకునేందుకు విమానం చాలా తక్కువ ఎత్తులో, తక్కువ వేగంతో ఉందని గుర్తించిన కెప్టెన్ చెస్లీ సుల్లీ సులెన్బెర్గర్, ఫస్ట్ ఆఫీసర్ జెఫ్రీ స్కిల్స్ విమానాన్ని గడ్డకట్టే హడ్సన్ నదిపై ల్యాండ్ (గ్లైడ్) చేశారు. విమానంలో ఉన్న మొత్తం 155 మంది ప్రాణాలతో బయటపడ్డారు.ఎయిర్ కెనడా ఫ్లైట్ 143: ‘ది గిమ్లీ గ్లైడర్’ (1983)ఇంధనం నింపే సమయంలో జరిగిన మెట్రిక్ మార్పిడి పొరపాటు కారణంగా.. బోయింగ్ 767 విమానం కెనడా మీదుగా 41,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు ఇంధనం పూర్తిగా అయిపోయింది. అనుభవజ్ఞుడైన గ్లైడర్ పైలట్ కెప్టెన్ రాబర్ట్ పియర్సన్ విమాన వేగం పెరగకుండా ఎత్తును వేగంగా తగ్గించడానికి ‘సైడ్స్లిప్’ విన్యాసాన్ని ఉపయోగించారు. గిమ్లీ (మానిటోబా)లోని ఒక నిరుపయోగ మిలిటరీ రన్‌వేపైన ఆ విమానాన్ని దించారు. అయితే ఆ సమయంలో ఆ రన్‌వేను స్పోర్ట్స్ కార్ల రేసింగ్ కోసం వాడుతున్నారనే విషయం ఆయనకు తెలియదు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు.టాకా ఫ్లైట్ 110: ది లెవీ ల్యాండింగ్ (1988)న్యూ ఓర్లీన్స్కు చేరుకుంటున్న సమయంలో ఒక బోయింగ్ 737.. తీవ్రమైన ఉరుములు, మెరుపుల తుఫాను గుండా ప్రయాణించింది. భారీ వడగళ్లు, నీరు ఇంజన్లలోకి చేరడంతో రెండు ఇంజన్లు ఒకేసారి ఆగిపోయాయి. కెప్టెన్ కార్లోస్ డార్డానో కిందనున్న నాసా ఇండస్ట్రియల్ లెవీకి చెందిన ఒక గడ్డితో కూడిన గట్టును గుర్తించి, విమానాన్ని నేర్పుగా గాల్లో తేలియాడిస్తూ, ఆ గడ్డి నేలపై ల్యాండ్ చేశారు. మొత్తం 45 మంది ప్రయాణికులు ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. విమానం ఏమాత్రం దెబ్బతినకపోవడంతో ఇంజనీర్లు అక్కడే మరమ్మతులు పూర్తి చేసి, కొన్ని వారాల తర్వాత ఆ గట్టు పైనుంచే దాన్ని తిరిగి గాల్లోకి ఎగరేశారు.డీహెచ్ఎల్ (డీహెచ్ఎల్).. బాగ్దాద్ క్షిపణి దాడి(2003)బాగ్దాద్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే.. ఉపరితలం నుండి గగనతలంలోకి దూసుకెళ్లే క్షిపణిఎయిర్బస్ ఏ300 కార్గో జెట్‌ను తాకింది. దీంతో ఎడమ రెక్కలో కొంత భాగం తెగిపడటంతో పాటు మూడు స్వతంత్ర హైడ్రాలిక్ వ్యవస్థలు పూర్తిగా పనిచేయకుండా పోయాయి. కంట్రోల్ వీల్, రడ్డర్ లేదా ఫ్లాప్స్ ఏవీ పనిచేయని స్థితిలో కెప్టెన్ ఎరిక్ జెన్నోట్, ఆయన సిబ్బంది విమానంలోని ఎడమ, కుడి ఇంజన్ల థ్రోటిల్స్ను (త్రస్ట్ వెక్టరింగ్) నియంత్రించారు. తీవ్రమైన గాలి ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, మంటలు చెలరేగిన విమానాన్ని తిరిగి బాగ్దాద్ విమానాశ్రయానికి చేర్చారు. ఫ్లైట్ కంట్రోల్స్ ఏవీ లేకుండా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసిన మొట్టమొదటి విజయవంతమైన ఘటన ఇది.అలోహా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 243: పైకప్పు లేని కన్వర్టబుల్ జెట్ (1988)24,000 అడుగుల ఎత్తులో లోహం అలసట (metal fatigue) కారణంగా పేలుడు తరహా డీకంప్రెషన్ సంభవించి, ఎగువ క్యాబిన్ పైకప్పులోని ఏకంగా 5.5 మీటర్ల భాగం ఊడిపోయింది. దీంతో ప్రయాణికులు బహిరంగ ఆకాశం కింద కూర్చున్న పరిస్థితి ఏర్పడింది. కెప్టెన్ రాబర్ట్ షోర్న్స్టీమర్, ఫస్ట్ ఆఫీసర్ మిమి టాంప్కిన్స్ తీవ్రమైన గాలి నిరోధకతను, ఒక ఇంజన్ వైఫల్యాన్ని ఎదుర్కొన్నారు. వంగుతున్న విమాన బాడీని నియంత్రిస్తూ, అత్యవసరంగా కిందికి దిగి, హవాయిలోని మౌయిలో ఆ దెబ్బతిన్న విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేశారు. విమానంలోని 95 మందిలో 94 మందిని కాపాడారు.యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 232: సియోక్స్ సిటీ మిరాకిల్ (1989)విమానం తోక భాగంలో ఉన్న డీసీ-10 ఇంజన్ గాల్లో ఉండగానే పేలిపోయింది. దాని శకలాలు మూడు హైడ్రాలిక్ వ్యవస్థలను కోసేయడంతో కాక్‌పిట్ ఫ్లైట్ కంట్రోల్స్ పూర్తిగా నిరుపయోగంగా మారాయి. విమానంలో ప్రయాణికుడిగా ఉన్న సీనియర్ చెక్ ఎయిర్‌మ్యాన్ సహాయంతో కెప్టెన్ అల్ హేన్స్, ఆయన సిబ్బంది టీమ్‌వర్క్‌తో ఇంజన్ల వేగ వ్యత్యాసం ఆధారంగా ఆ భారీ జెట్‌ను నియంత్రించారు. అయోవాలోని సియోక్స్ సిటీ రన్‌వేపై విమానం వేగంతో ఢీకొట్టి ధ్వంసమైనప్పటికీ, సిబ్బంది చూపిన నైపుణ్యం వల్ల విమానంలోని 296 మందిలో 184 మంది ప్రాణాలతో బయటపడ్డారు.బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్ 9: అగ్నిపర్వత బూడిద మేఘంలోనికి. (1982)హిందూ మహాసముద్రం మీదుగా రాత్రి వేళ ప్రయాణిస్తుండగా, బోయింగ్ 747 విమానం.. అగ్నిపర్వత బూడిద మేఘంలోకి ప్రవేశించింది. ఆ రాపిడి ధూళి ఇంజన్లను ఉక్కిరిబిక్కిరి చేయడంతో నాలుగు ఇంజన్లూ ఒకేసారి ఆగిపోయాయి. దాంతో ఆ భారీ జంబో జెట్ పూర్తిగా శక్తిహీనమైపోయింది. కెప్టెన్ ఎరిక్ మూడీ స్థిరమైన గ్లైడ్ను ఏర్పాటు చేసుకుని, అత్యవసరంగా కిందికి దిగడం ప్రారంభించారు. బూడిద మేఘం అంచును దాటి స్వచ్ఛమైన గాలిలోకి రాగానే, సిబ్బంది తిరిగి ఇంజన్లను పనిచేయించడంలో విజయం సాధించారు. ఇసుక తుఫాను తాకిడికి విండ్‌షీల్డ్ పూర్తిగా మసకబారి ఎదురుగా ఏమీ కనిపించకపోయినప్పటికీ, వారు జకార్తాలో కేవలం పరికరాల ఆధారంగా ల్యాండింగ్ చేశారు.ఎయిర్ ట్రాన్సాట్ ఫ్లైట్ 236: రికార్డు స్థాయి గ్లైడింగ్ (2001)అట్లాంటిక్ మహాసముద్రంపై ప్రయాణిస్తుండగా ఇంధన లీకేజీ కారణంగా ఎయిర్‌బస్ ఏ330 ఇంధన ట్యాంకులు ఖాళీ అయ్యాయి. ఏ భూభాగానికీ చేరువలో లేని వందల మైళ్ల దూరంలో రెండు ఇంజన్లు ఆగిపోయాయి. కెప్టెన్ రాబర్ట్ పిచే ప్రాథమిక అత్యవసర విద్యుత్, హైడ్రాలిక్ శక్తి కోసం ‘రామ్ ఎయిర్ టర్బైన్’ను ఉపయోగించారు. ఆయన ఆ భారీ విమానాన్ని సముద్రంపై ఏకంగా 120 కిలోమీటర్ల దూరం గాల్లో తేలియాడిస్తూ తీసుకెళ్లారు. ఇది ప్రయాణికుల విమానయాన చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన గ్లైడింగ్. అనంతరం అజోర్స్‌లోని సైనిక స్థావరంలో సురక్షితంగా ల్యాండ్ చేసి, 306 మంది సముద్రంలో మునిగిపోకుండా కాపాడారు.లాట్ పోలిష్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 16: బెల్లీ ల్యాండింగ్ (2011)నెవార్క్ నుండి వస్తున్న బోయింగ్ 767 విమానంలో సెంట్రల్ హైడ్రాలిక్ లీకేజీ కారణంగా ప్రధాన ల్యాండింగ్ గేర్ వ్యవస్థ పూర్తిగా పనిచేయకుండా పోయింది. బ్యాకప్ గ్రావిటీ-డ్రాప్ మెకానిజం కూడా విఫలమవడంతో, చక్రాలు తెరచుకోకుండానే ల్యాండ్ కావాల్సిన పరిస్థితి తలెత్తింది. కెప్టెన్ తడేయుజ్ వ్రోనా వార్సాలోని చోపిన్ విమానాశ్రయం చుట్టూ విమానాన్ని తిప్పుతూ అదనపు ఇంధనాన్ని వినియోగించారు. ఈలోగా అత్యవసర సిబ్బంది రన్‌వేపై మంటలను నిరోధించే ఫోమ్‌ను సిద్ధం చేశారు. రన్‌వే తారుపై లోహం రాసుకుపోతున్నప్పుడు రెక్కలు సమాంతరంగా ఉండేలా చూసుకుంటూ ఆయన అత్యంత స్థిరమైన, ఫ్లాట్ బెల్లీ ల్యాండింగ్ చేశారు. విమానానికి మంటలు అంటుకోకుండా ఆగిపోయింది. 231 మంది ప్రయాణికులు ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటకు వచ్చారు.కథే పసిఫిక్ ఫ్లైట్ 780: అధిక వేగంతో ల్యాండింగ్ (2010)సురబయ వద్ద తీసుకున్న కలుషిత ఇంధనం కారణంగా ఒక ఎయిర్‌బస్ ఏ330 ఇంధన వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిని, గాల్లో ఉండగానే ఇంజన్ థ్రోటిల్స్ జామ్ అయ్యాయి. ఒక ఇంజన్ పూర్తిగా ఆగిపోగా, మరొక ఇంజన్ అత్యధిక థ్రస్ట్ వద్ద లాక్ అయిపోయింది. ల్యాండింగ్ కోసం వేగాన్ని తగ్గించడానికి నిరాకరించింది. కెప్టెన్ మాల్కం హిక్స్, ఫస్ట్ ఆఫీసర్ డేవిడ్ కాసాస్ అత్యంత భయానక పరిస్థితిని ఎదుర్కొన్నారు. సాధారణ ల్యాండింగ్ వేగం కంటే రెండు రెట్లు ఎక్కువ వేగంతో విమానాన్ని ల్యాండ్ చేయాల్సి వచ్చింది. వారు ఆ భారీ విమానాన్ని హాంకాంగ్ రన్‌వేపై దించి, గరిష్ట ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఉపయోగించి, విమానం సముద్రంలో పడటానికి కొద్ది క్షణాల ముందు నిలువరించారు. తద్వారా మొత్తం 322 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు.ఇదీ చదవండి: ‘వర్క్ ఫ్రమ్ ఫారెస్ట్’.. మూడు రోజులకు రూ.14 వేలు! -
‘ఫ్లై దుబాయ్’ హీరోకు రూ.కోటి నజరానా..
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానం క్రాష్ అవకుండా తన ప్రాణాలకు తెగించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు ప్రముఖ ఫార్మా సంస్థ మాన్‌కైండ్ ఫార్మా రూ.కోటి నజరానాను ప్రకటించింది. ఆయన ధైర్యసాహసాలను గుర్తిస్తూ ఈ మొత్తాన్ని కెప్టెన్ మచ్చార్, ఆయన కుటుంబానికి అందించనున్నట్లు సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ జునేజా లేఖ ద్వారా తెలిపారు.సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ FZ1073 విమానంలో కెప్టెన్ మచ్చార్ అసమాన తెగువను చూపించారు. సుమారు 33 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో కాక్‌పిట్‌లో కెప్టెన్ మచ్చార్‌తో కో-పైలట్ ఘర్షణకు దిగి తీవ్రంగా గాయపరిచాడు. ఈ క్రమంలో విమానం ప్రమాదం దిశగా తీవ్ర వేగంతో కిందికి దూసుకెళ్తుందని గమనించిన కెప్టెన్ మచ్చార్ అతి కష్టం మీద కాక్‌పిట్ తలుపు తెరవడంతో సిబ్బంది, ప్రయాణికులు లోపలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి సహకరించారు. అనంతరం విమానం టబుక్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలో సిబ్బంది సహా 182 మంది ప్రయాణికులు ఉన్నారు.ఈ ఘటనలో కెప్టెన్ మచ్చార్ చూపిన ధైర్యాన్ని ప్రశంసిస్తూ.. ‘సంక్షోభ సమయంలో ఆయన ప్రదర్శించిన ధైర్యం, సమయ స్ఫూర్తి, బాధ్యత ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ప్రభావితం చేశాయని మాన్‌కైండ్ ఫార్మా ఎండీ రాజీవ్ జునేజా పేర్కొన్నారు. ఆయన కాపాడిన ప్రాణాల విలువను డబ్బును పోల్చలేమని, ఈ రూ.కోటి నజరానా తమ కృతజ్ఞతను వ్యక్తం చేసే చిన్న ప్రయత్నం మాత్రమేనని తెలిపారు.కాగా, ఈ ఘటనలో కెప్టెన్ మచ్చార్ పాత్రను భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ప్రశంసించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ ఆయన చూపిన తెగువ విమానంలో ఉన్నవారిని రక్షించడంలో కీలకంగా నిలిచిందని నెతన్యాహు పేర్కొన్నారు. -
ఫ్లైదుబాయ్ విమాన ఘటన.. ఆ చిన్నారి లేకపోతే ఎంత ఘోరం జరిగేదో?
టెల్ అవీవ్: ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన భయానక ఘటనకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు బయలుదేరిన ఈ విమానాన్ని హైజాక్ చేసేందుకు ఒమన్ జాతీయుడైన కో-పైలట్ ప్రయత్నించాడు. విమానాన్ని నడుపుతున్న భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌పై అతడు కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. అయితే, ఓ ఆరేళ్ల చిన్నారి అప్రమత్తత, ప్రయాణికుల సాహసంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఈ వివరాలను విమాన ప్రయాణికుడు త్వివికా మానేస్ ‘ది న్యూయార్క్ టైమ్స్’కు వెల్లడించారు.కో-పైలట్ కిరాతక దాడితో కాక్‌పిట్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఆ కుదుపుకు విమానం కూడా అదుపుతప్పే పరిస్థితికి చేరుకుంది. సరిగ్గా అదే సమయంలో కాక్‌పిట్‌కు ఆనుకుని ఉన్న టాయిలెట్లో త్వివికా మానేస్ ఆరేళ్ల కూతురు నినా ఉంది. లోపల జరుగుతున్న ఘర్షణ, పైలట్ చేస్తున్న ఆహాకారాలు ఆ చిన్నారి చెవిలో పడ్డాయి.ప్రాణభయంతో వణికిపోయిన నినా టాయిలెట్ నుంచి బయటకు వచ్చి వెంటనే తన తండ్రి వైపు పరుగెత్తింది. ‘నాన్నా.. కాక్‌పిట్ నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయి.. మనం చనిపోవడం లేదు కదా?’ అంటూ భయంతో వణికిపోయింది. కుమార్తె మాటలతో హతాశుడైన తండ్రి త్వివికా మానేస్.. ఆ క్షణంలో అస్సలు ఆలస్యం చేయకుండా ఉరుకులు పరుగున కాక్‌పిట్ వైపు దూసుకెళ్లారు. ఒకవేళ ఆ చిన్నారి ఆ సమయంలో ఆ మాట అనకపోతే, ఆ తండ్రి సమయానికి స్పందించే వారు కాదు.. ఆ విమానంలో ప్రయాణిస్తున్న 170 మందికి పైగా ప్రాణాలు గాల్లోనే కలిసిపోయేవి!కాక్‌పిట్‌లో రక్తపాతం ఆయన కాక్‌పిట్ వద్దకు వెళ్లి చూసేసరికి దృశ్యం వణికించేలా ఉంది. కాక్‌పిట్ తలుపు పాక్షికంగా తెరుచుకుని ఉండగా.. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో ఉన్న కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ప్రాణాల కోసం పోరాడుతున్నారు. రక్తమోడుతున్నప్పటికీ, తోటి ప్రయాణికులను కాపాడేందుకు ఆయన కష్టపడి కాక్‌పిట్ తలుపును పూర్తిగా తెరిచారు.వెంటనే త్వివికా మానేస్తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు అసాఫ్ రజువాన్, యానివ్ హయున్ రంగంలోకి దిగి ఆయుధంతో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విమానంలోని హెడ్‌ఫోన్ సెట్ల వైర్లు, కేబుల్స్‌తో నిందితుడిని గట్టిగా కట్టేసి బందీగా మార్చారు.సౌదీ అరేబియాలో అత్యవసర ల్యాండింగ్..ఈ పోరాట సమయంలో విమానం ఒక్కసారిగా అదుపుతప్పి తీవ్ర వేగంతో కిందికి దూసుకెళ్లడంతో క్యాబిన్లో ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. ఆ తర్వాత విమానంలో ఉన్న మరో ఇద్దరు డ్యూటీలో లేని పైలట్లు కాక్‌పిట్ నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకున్నారు. సౌదీ అరేబియాలోని తబూక్ నగరంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. తీవ్రంగా గాయపడినప్పటికీ వెనకడుగు వేయకుండా పోరాడి వందలాది ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ధైర్యసాహసాలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రత్యేకంగా కొనియాడారు. -
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ఇరాన్ హస్తం?.. వెలుగులోకి ఆధారాలు?
టెల్ అవీవ్: దుబాయ్ నుండి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానం హైజాక్ యత్నం ఘటనలో విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. భారతీయ పైలట్‌పై కత్తితో దాడి చేసి విమానాన్ని కూల్చేందుకు యత్నించిన ఒమన్ కో-పైలట్‌కు సంబంధించిన మరిన్ని సంచలన వివరాలను ఇజ్రాయెల్ మీడియా, అధికారులు బయటపెట్టారు.నిందితుడు తన సోషల్ మీడియా ఖాతాలలో యూదులను చంపడం గురించి తరచూ చర్చించాడని ఓ ఇజ్రాయెల్ అధికారి ‘ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’తో పేర్కొన్నారు. దాడికి పాల్పడిన ఒమన్ జాతీయుడు పూర్తిగా ఇస్లామిస్ట్ ఉగ్రవాద భావజాలానికి బానిసయ్యాడని, అతని సోషల్ మీడియా పోస్టులే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అధికారులు వెల్లడించారు.కరపత్రాల్లో ఏముందంటే? ఎమిరేట్స్ వర్గాలను ఉటంకిస్తూ ‘ఐ24న్యూస్’ జర్నలిస్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడైన కో-పైలట్ లగేజీలో ‘ఫ్రీ పాలస్తీనా’ గ్రూపులకు సంబంధించిన కరపత్రాలు, ప్రచురణలు, ఇతర పాలస్తీనా అనుకూల సామగ్రి లభించాయి. ఆ పైలట్ పదేపదే పాలస్తీనియన్లకు మద్దతు తెలుపుతూ, ఇజ్రాయెల్ పట్ల తీవ్రమైన శత్రుత్వాన్ని వ్యక్తం చేశాడని ఆ మూలం తెలిపింది. కో-పైలట్ ఇస్లామిక్ తీవ్రవాద భావజాలం, ఉగ్రవాద ఉద్దేశ్యాల కోణంలో ఈ ఆధారాలు కీలకంగా మారాయి.నన్ను చంపండి.. నన్ను చంపండిప్రయాణికులు, సిబ్బంది కలిసి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని కట్టేసిన తర్వాత, అతను విమాన సిబ్బందిని ఉద్దేశించి ‘నన్ను చంపండి.. నన్ను చంపండి’ అంటూ అరిచాడని అధికారులు తెలిపారు. ఇతను ఆత్మహత్య చేసుకోవడానికి, విమానంతో సహా కుప్ప కూలిపోవడానికి పక్కా ప్రణాళికతో వచ్చినట్లు స్పష్టమవుతోందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ‘ఫాక్స్ న్యూస్’తో అన్నారు.అక్కడ ఉన్న ప్రయాణికుల భద్రత, నిందితుడి ఇస్లామిస్ట్ ధోరణులు, తీవ్రవాద భావజాలం, దొరికిన కరపత్రాలను పరిగణనలోకి తీసుకుంటే ఇదొక ఉగ్రవాద యత్నంగా భావించడానికి తగిన ఆధారాలున్నాయని నెతన్యాహు పేర్కొన్నారు. అయితే, దర్యాప్తు పూర్తిగా ముగిసే వరకు తుది ఉద్దేశంపై కచ్చితమైన నిర్ధారణకు రాలేమని, సౌదీ అరేబియా, యూఏఈ, ఇజ్రాయెల్ దర్యాప్తు బృందాలు సంయుప్తంగా విచారణ జరుపుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఎఫ్‌జెడ్ 1073 విమానంలో ఏం జరిగింది?ఫ్లైదుబాయ్ విమానం ఎఫ్‌జెడ్ 1073 యూఏఈలోని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ఇజ్రాయెల్ మెట్రో నగరం టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ ఎయిర్‌పోర్టుకు బయలుదేరింది. ప్రయాణం ప్రారంభమైన సుమారు రెండున్నర గంటల తర్వాత, ఒమన్ జాతీయుడైన కో-పైలట్ అకస్మాత్తుగా విమానాన్ని హైజాక్ చేసి కూల్చేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కాక్‌పిట్‌లో ఆపత్కాలంలో సిబ్బంది వినియోగించే క్రాష్ యాక్స్‌తో భారతీయ సంతతి పైలట్ స్మిత్ మచ్చార్‌పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ పెనుగులాట కారణంగా విమానం ఒక్కసారిగా 33 వేల అడుగుల క్రూయిజింగ్ ఎత్తు నుంచి దాదాపు 16,600 అడుగుల ఎత్తు వరకు (17 వేల అడుగులకు పైగా) కుప్పకూలినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా స్పష్టం చేసింది.ప్రాణాలకు తెగించి.. సురక్షిత ల్యాండింగ్ఈ ప్రమాదకర సమయంలో తీవ్ర గాయాలనప్పటికి, కెప్టెన్ స్మిత్ మచ్చర్ వెనకడుగు వేయలేదు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించి కాక్‌పిట్ డోర్ తెరిచి విమానాన్ని అదుపులోకి తెచ్చేందుకు పోరాడారు.ఇంతలో అప్రమత్తమైన సిబ్బంది, ప్రయాణికులు వెంటనే కాక్‌పిట్‌లోకి చొచ్చుకెళ్లి దాడి చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకుని కట్టేశారు. ఆ తర్వాత కెప్టెన్ మచ్చార్ సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. -
ప్రయాణికులను కాపాడాలన్న సంకల్పమే నడిపించింది
న్యూఢిల్లీ: ఫ్లై దుబాయ్ విమానంలో కో–పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడి, రక్తమోడుతున్నా సరే ప్రయాణికులను కాపాడాలన్న సంకల్పం మాత్రం చెక్కుచెదరలేదు. తనకు ఏం జరిగినా ఫర్వాలేదు వారు బతికుంటే చాలు అని భావించారు. ఒకవైపు కత్తి దూస్తున్న కో–పైలట్‌తో పెనుగులాడుతూనే మరోవైపు కాక్‌పిట్ తలుపు తెరిచారు. అంతటి విపత్కర పరిస్థితిలో ఆయన తీసుకున్న ఆ ఒక్క నిర్ణయమే 174 మంది ప్రయాణికులను కాపాడింది. ఫ్లై దుబాయ్ విమానంలో భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ ప్రదర్శించిన ధైర్య సాహసాలను ప్రపంచమంతా కొనియాడుతోంది. కష్టాల్లో ఉన్నప్పుడల్లా హనుమాన్ చాలీసాను పఠిస్తానని స్మిత్ చెప్పారు. విమానంలో తనపై దాడి జరిగిన తర్వాత కూడా హనుమాన్ చాలీసాను పఠించడం తనకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిందని తెలిపారు. ఇదే విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పంచుకున్నారు. కో–పైలట్ దాడిలో గాయపడి, యూఏఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్మిత్ మచ్ఛార్తో శుక్రవారం మోదీ వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. కెప్టెన్ ప్రదర్శించిన ధైర్యం, సమయస్ఫూర్తి, సంయమనాన్ని ప్రశంసించారు. ఆయన తీసుకున్న తక్షణ నిర్ణయం ఎంతోమంది ప్రాణాలను కాపాడిందని పేర్కొన్నారు. జరిగిన సంఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్మిత్ భావోద్వేగానికి గురయ్యారు. ‘మీరే నాకు స్ఫూర్తి’అని మోదీతో అన్నారు. ప్రధానమంత్రితో స్మిత్ ఏం చెప్పారంటే.. అది అత్యంత క్లిష్టమైన సమయం ‘‘దాడిలో గాయపడి కాక్‌పిట్‌లో నేలపై ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్నప్పటికీ ప్రయాణికులంతా సురక్షితంగా ఉండాలన్న దృఢ సంకల్పంతో నాలో మిగిలి ఉన్న శక్తితోనే సమయస్ఫూర్తిగా వ్యవహరించి విమానాన్ని కాపాడగలిగాను. అప్పుడు నేను నా ప్రాణాల కోసం పోరాడుతున్నాను. కానీ, ఇతరులు చనిపోకూడదని నిర్ణయించుకున్నాను. అది అత్యంత క్లిష్టమైన సమయం. ఏదో ఒకటి చేయకపోతే ప్రమాదం తప్పదని నాకు అనిపించిన క్షణం అది. కాక్‌పిట్‌లో నేను కిందపడి ఉన్నప్పటికీ, విమానం కిందకు పడిపోతోందని గ్రహించగలిగాను. సహ పైలట్ నన్ను కత్తితో పదేపదే పొడిచాడు. చాలా గాయాలయ్యాయి. అయినా సరే లేచి ఏదో ఒకటి చేయాలని నాకు నేను చెప్పుకున్నాను. ఆ సమయంలో నేను సరిగ్గా స్పందించకపోతే పరిస్థితి భయానకంగా మారుతుందని తెలుసు. 17 ఏళ్లుగా విమానాలు నడుపుతున్నాను, గత 11 ఏళ్లుగా కెప్టెన్‌గా ఉన్నాను. కళ్లు మూసుకున్నా కూడా విమానంలో ఏం జరుగుతుందో గుర్తించగలను. కాక్‌పిట్ తలుపు తెరవడమే తక్షణ మార్గమని ఆ క్షణంలో ఆలోచన వచ్చింది. తలుపు తెరిచిన వెంటనే మిగిలిన వారందరూ లోపలికి వచ్చారు. విమానాన్ని కాపాడడంలో వారందరూ నాతో సమానమైన పాత్ర పోషించారు. ప్రయాణికులను ఎలాగైనా కాపాడాలన్న సంకల్పమే నన్ను ముందుకు నడిపించింది. కళ్లముందే వారు మరణిస్తూ ఉంటే చూస్తూ ఉండలేను కదా!’’అని స్మిత్ పేర్కొన్నారు. మన సంస్కృతికి దూరం కాకూడదు ఈ ఘటన తర్వాత, భారతీయులు ఇతరుల ప్రాణాలు తీసేవారు కారని, పైగా ఇతరులను కాపాడటం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధపడే వీరులుగా దేశం గర్వంగా చెప్పుకోగలదని మచ్ఛార్తో ప్రధాని మోదీ అన్నారు. ‘‘ఆ సమయంలో మీరు ఎన్నో గాయాలకు గురయ్యారు, ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితిలో పోరాడారు. మీ సొంత భద్రతను పక్కన పెట్టి, ప్రయాణికుల భద్రతకే ప్రాధాన్యతనిచ్చారు. 140 కోట్ల మంది భారతీయుల గౌరవాన్ని పెంచారు. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను’’అని పేర్కొన్నారు. మోదీ ప్రశంసలకు మచ్ఛార్ ప్రతిస్పందించారు. హనుమాన్ చాలీసా పఠించడం గురించి మాట్లాడారు. ‘‘నాకు నొప్పి లేదా బాధ కలిగినప్పుడల్లా నా మనసులో మెదిలే విషయం హనుమాన్ చాలీసా పఠనమే. విమానంలో దాడి తర్వాత కూడా హనుమాన్ చాలీసానే పఠిస్తూ ఉన్నాను. ఆ దేవుడే నన్ను కాపాడాడని తెలుసు. మోదీని ఆదర్శప్రాయుడిగా, స్ఫూర్తిప్రదాతగా భావిస్తున్నాను. మీరు చేసిన ఫోన్‌కాల్ నాలో ఎంతో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపింది. నాకు ఎంతో గర్వంగా అనిపిస్తోంది. మీ నుంచి ఫోన్‌కాల్ రావడం నాకు గర్వకారణం. మీ ముందు ఇలా భావోద్వేగంతో రోదిస్తున్నందుకు క్షమించండి’’అని మోదీతో చెప్పారు. దీనికి స్పందిస్తూ.. నా ముందు కన్నీళ్లు పెట్టుకోలేకపోతే ఇక ఎవరి ముందు పెట్టుకుంటారని మచ్ఛార్తో అన్నారు. ‘‘అయ్యా, ప్రతిరోజూ ఉదయం నేను ప్రార్థన చేసుకునేటప్పుడు నా రెండేళ్ల కుమారుడు నా ఒడిలో కూర్చుంటాడు. అప్పుడు నేను అతడికి హనుమాన్ చాలీసా వినిపిస్తాను. ఎందుకంటే చిన్నప్పుడు నాకు కూడా అలాగే నేరి్పంచారు. మనం నేడు మన దేశానికి దూరంగా ఉన్నప్పటికీ, మన సంస్కృతికి మాత్రం దూరంగా ఉండకూడదు’’అని మచ్ఛార్ చెప్పారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తనను ప్రేమ, శ్రద్ధతో బాగా చూసుకుంటున్నారని తెలియజేశారు. కత్తిపోట్లను కేవలం ఒక గాయంగా చూడటం లేదని, అలా చేస్తే కోలుకోవడం మరింత కష్టమవుతుందని అన్నారు. దీనిని నెమ్మదిగా సాగే ఒక ప్రయాణంలా భావిస్తున్నానని వెల్లడించారు. తాను త్వరగా కోలుకొని, పూర్తి ఆరోగ్యవంతుడిగా మారుతానని విశ్వాసం వ్యక్తం చేశారు. An unforgettable conversation with Captain Smit, filled with pride and emotions. pic.twitter.com/CCf46PKOWR— Narendra Modi (@narendramodi) October 2, 2026అహింసకు అర్థాన్ని చెప్పారు స్మిత్ మచ్ఛార్ త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయని, చాలామంది భారతీయులు మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తున్నారని ప్రధాని మోదీ చెప్పారు. ‘‘మీరు ధైర్యవంతులు, మీకు స్వాగతం పలికేందుకు భారత్ ఎదురుచూస్తోంది’’అని కెప్టెన్‌తో అన్నారు. భగవద్గీత బోధనలు, విలువలతో తన బిడ్డను పెంచిన మచ్ఛార్ తల్లి గీతా బెన్ గురించి మోదీ ప్రస్తావించారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మచ్ఛార్తో మాట్లాడటానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. దేశ గౌరవాన్ని పెంచారంటూ మచ్ఛార్‌ను ప్రశంసించారు. ఆసుపత్రిలో ఆయనను చక్కగా చూసుకున్నందుకు సౌదీ అరేబియా, యూఏఈ ప్రభుత్వాలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ పైలట్ల ప్రతిష్టను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారని, ఇకపై ప్రపంచం వారిని కొత్త కోణంలో చూస్తుందని మచ్ఛార్తో అన్నారు. ‘‘ఈ రోజు గాంధీ జయంతి. అహింస నిజమైన అర్థం ఏమిటో మీరు ప్రపంచానికి చాటిచెప్పారు’’అని శ్లాఘించారు. మచ్ఛార్ స్వస్థలం గుజరాత్. ఆయనతో మోదీ కొద్దిసేపు గుజరాతీ భాషలో మాట్లాడడం విశేషం. అనంతరం ఆ వీడియో కాల్ గురించి మోదీ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ‘‘కెప్టెన్ స్మిత్‌తో గర్వం, భావోద్వేగాలతో కూడిన ఒక చిరస్మరణీయ సంభాషణ జరిగింది’’అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: మీరే నాకు స్ఫూర్తి.. మోదీతో మచ్చార్ -
ఫ్లైదుబాయ్ ఘటనపై బిగ్ బ్లాస్ట్.. ఇరాన్ సంచలన ఆరోపణలు!
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఫ్లైదుబాయ్ విమాన ఘటన మరో వివాదానికి దారితీసింది. ఈ ఘటన వెనుక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఉన్నారంటూ ఇరాన్ సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఘటనను ఉద్దేశపూర్వకంగా సృష్టించిన ‘ఫాల్స్ ఫ్లాగ్’ ఆపరేషన్‌గా అభివర్ణించింది. దీంతో, ఈ ఘటన మరో టర్న్ తీసుకుంది.ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ప్రెస్ టీవీ కథనం ప్రకారం.. ఫ్లైదుబాయ్ ఘటనను ఉపయోగించుకుని అక్టోబర్ 7 హమాస్ దాడిపై నెతన్యాహుపై వస్తున్న విమర్శల నుంచి దృష్టి మళ్లించడం, ఆయన రాజకీయ స్థితిని బలోపేతం చేయడం, ఇరాన్‌తో మరోసారి ఘర్షణకు కారణాన్ని సృష్టించడం లక్ష్యంగా ఈ ఘటనను రూపొందించారని ఆరోపించింది. అయితే ఈ వాదనను సమర్థించే ఆధారాలను మాత్రం సదరు కథనం వెల్లడించలేదు. ఇజ్రాయెల్‌కు సంబంధించిన విమానంలో భద్రతా ఘటనను సృష్టించి, దాన్ని ఉగ్రదాడిగా చూపడం ద్వారా ఇరాన్‌పై అనుమానాలు వచ్చేలా చేయాలని కుట్ర పన్నారని ఆరోపించింది. ఈ ఘటనను నెతన్యాహు రాజకీయంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నించారని పేర్కొంది. అదే సమయంలో నెతన్యాహు, యూఏఈ అధ్యక్షుడు బిన్ జాయెద్ మధ్య ఈ ఘటనకు ముందు జరిగిన సమావేశాన్ని కూడా ఇరాన్ మీడియా ప్రస్తావించింది.फ्लाईदुबई विमान केस में ईरान का इज़राइल पर बड़ा आरोप, नेतन्याहू की साज़िश का दावा#Flydubai #Iran #Israel #Netanyahu #12Baje12Reporter #ATVideo @SumitDefence | @ashraf_wani pic.twitter.com/b08Ffba9Cu— AajTak (@aajtak) October 2, 2026సోషల్ మీడియాలోనూ ‘ఫాల్స్ ఫ్లాగ్’ ప్రచారంఫ్లైదుబాయ్ ఘటన జరిగిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలోనూ దీనిని ‘ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్’గా పేర్కొంటూ పోస్టులు భారీగా వైరల్ అయ్యాయి. ఇజ్రాయెల్, మొసాద్, నెతన్యాహు ఈ ఘటనను కావాలనే సృష్టించారంటూ పలువురు ఆరోపణలు చేశారు. అయితే ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థలు, అధికారిక వర్గాలు ఇటువంటి వాదనలకు ఇప్పటివరకు ఆధారాలు లేవని పేర్కొన్నాయి.ఇజ్రాయెల్ ఖండనమరోవైపు ఇజ్రాయెల్ ఈ ‘ఫాల్స్ ఫ్లాగ్’ ప్రచారాన్ని ఖండించింది. ఇలాంటి ఆరోపణలు కుట్ర సిద్ధాంతాలేనని, సోషల్ మీడియాలో నిరాధారమైన ప్రచారం జరుగుతోందని పేర్కొంది. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ముందుగానే ఎలాంటి నిర్ణయానికి రావడం సరికాదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.ట్రంప్ కీలక వ్యాఖ్యలుఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ ఘటనలో ఇరాన్ ప్రమేయం ఉండొచ్చని వ్యాఖ్యానించారు. తనకు అందుతున్న సమాచారాన్ని బట్టి కో-పైలట్‌కు ఇరాన్‌తో సంబంధం ఉండే అవకాశం ఉందని, అయితే దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఇరాన్ ప్రమేయం నిర్ధారణ అయితే ఆ దేశంపై అమెరికా తీవ్ర చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. అయితే ఇరాన్ ప్రమేయానికి సంబంధించి ఇప్పటివరకు దర్యాప్తు సంస్థలు తుది నిర్ధారణకు రాలేదు. యూఏఈ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విమాన ఘటనకు గల కారణాలు, ఉద్దేశం, ముందస్తు ప్రణాళిక లేదా ఉగ్రవాద సంబంధాలపై విచారణ చేపట్టింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఊహాగానాలు, ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయొద్దని యూఏఈ అధికారికంగా కోరింది.అసలు ఏం జరిగింది?సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానం FZ1073లో కాక్‌పిట్‌లో తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. కాక్‌పిట్‌లో భారతీయ కెప్టెన్ స్మిట్ మచ్చార్‌పై ఒమన్‌కు చెందిన కో-పైలట్ దాడి చేశాడు. కెప్టెన్ గాయపడినప్పటికీ కాక్‌పిట్ తలుపు తెరవగలిగారు. దీంతో ప్రయాణికులు, విమాన సిబ్బంది జోక్యం చేసుకుని దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇతర పైలట్లు విమానాన్ని నియంత్రణలోకి తీసుకుని సురక్షితంగా ల్యాండ్ చేశారు. -
ఫ్లైదుబాయ్ హీరోకు ప్రధాని మోదీ వీడియోకాల్
ఫ్లైదుబాయ్ విమానంలో పెను ప్రమాదాన్ని తప్పించిన భారత పైలట్ కెప్టెన్ స్మిట్ మచ్చార్‌తో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం యూఏఈలోని అబుదాబిలో చికిత్స పొందుతున్న ఆయన .. ఘటనకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు. ఆ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణికులను కాపాడిన ఆయన ధైర్యసాహసాలను ప్రధాని ప్రశంసించగా.. మచ్చార్ భావోద్వేగానికి లోనయ్యారు.కో-పైలట్ తనపై ఎలా దాడి చేశాడో.. ఆ సమయంలో తనకు ధైర్యం ఇచ్చిన విషయాలేంటో కెప్టెన్ స్మిట్ మచ్చర్ ప్రధాని మోదీకి వివరించారు. దాడిలో తీవ్రంగా గాయపడి లేవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ.. విమానం ఒక్కసారిగా కిందకు దిగడాన్ని గమనించానని చెప్పారు. ఆ సమయంలో ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదం ఉందన్న భయంతో ఎలాగైనా కాక్‌పిట్ తలుపు తెరవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.“ఏదో విధంగా నిలబడి కాక్‌పిట్ తలుపు తెరిచాను. ప్రయాణికులు లోపలికి రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది” అని స్మిట్ వివరించారు. ప్రమాద సమయంలో తనకు ధైర్యం ఇచ్చింది హనుమాన్ చాలీసా అని, దానిని చదువుకుంటూ ధైర్యం తెచ్చుకున్నానని చెప్పారు. “ఆ భగవంతుడే నన్ను కాపాడాడు. మీతో మాట్లాడతానని నేను అనుకోలేదు. నాకు మీరే నాకు స్ఫూర్తి” అంటూ మచ్చార్ భావోద్వేగానికి లోనయ్యారు. #WATCH | Flydubai Captain Smit Machchhar turns emotional as he recounts his ordeal before PM Modi; he says, "You are my biggest idol. I feel proud of the way you are encouraging me today. I had so many injuries, but I told myself I have to get up and act. At the time, I told… pic.twitter.com/eqGloeCTSl— ANI (@ANI) October 2, 2026అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ స్మిట్ మచ్చర్ చూపిన సమయస్ఫూర్తి, ధైర్యాన్ని ప్రధాని మోదీ అభినందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మోదీ.. త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా.. నేను ఫోన్లో అందుబాటులో ఉంటాను అంటూ మచ్చార్‌కు మోదీ మాటిచ్చారు.బుధవారం ఉదయం దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ ఎఫ్‌జెడ్1073 విమానంలో కో-పైలట్ దాడి చేసిన ఘటనలో కెప్టెన్ స్మిట్ మచ్చర్ తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆయన కాక్‌పిట్ తలుపు తెరిచి సహాయం కోరడంతో పాటు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు కీలకంగా వ్యవహరించారు. ఈ ఘటనలో విమానంలో ఉన్న 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కాపాడటంలో స్మిట్ మచ్చర్ పాత్ర కీలకంగా మారింది. గాయాలతో పోరాడుతూనే ఆయన చూపిన ధైర్యంపై అంతర్జాతీయంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.ఘటన అనంతరం తొలుత సౌదీ అరేబియాలోని తబూక్ ఆస్పత్రిలో ఆయనకు వైద్యం అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం యూఏఈకి ఎయిర్‌లిఫ్ట్ చేశారు. ప్రస్తుతం స్మిట్ మచ్చర్ యూఏఈలోని అబుదాబిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిందని.. ఆయన మాట్లాడగలుగుతున్నారని.. త్వరలో కోలుకుంటారని వైద్యులు, ఇటు భారత రాయబార కార్యాలయమూ ఒక ప్రకటన చేసింది.కెప్టెన్ స్మిట్ మచ్చార్ సాహసం చూసి దేశం గర్విస్తోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇంతకు ముందు అభినందించారు. మరో 9/11 తరహా దాడి జరగకుండా మచ్చార్ అడ్డుకోగలిగారంటూ పొగిడారు. అంతేకాదు.. అతని కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆయన అధైర్య పడొద్దని.. భారత ప్రభుత్వం తరఫున అన్నివిధాల సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇదీ చదవండి: ఫ్లైదుబాయ్ ఘటన.. వీడియోలో భయానక దృశ్యాలు -
ఫ్లైదుబాయ్ ఘటనలో కొత్త ట్విస్టులు
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న వేళ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాక్‌పిట్‌లో జరిగిన దాడి వెనుక ఉద్దేశం ఏమిటి? విమానాన్ని కూల్చే ప్రయత్నమేనా? లేక మరేదైనా కారణమా? అన్న అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీశాయి.ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెతన్యాహూ.. ఒమన్‌కు చెందిన కో-పైలట్ ఇస్లామిక్ తీవ్రవాద భావజాలానికి ప్రభావితుడై ఉండొచ్చని తెలిపారు. అతడి వ్యక్తిగత సమాచారంలో కొన్ని అంశాలు బయటపడ్డాయని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. అదుపులోకి తీసుకున్న సమయంలో కో-పైలట్ “కిల్ మీ.. కిల్ మీ” అంటూ అరచినట్లు పేర్కొన్నారు. అతడు ఆత్మహత్యా ధోరణిలో ఉన్నట్లు కనిపించిందని, విమానాన్ని ప్రమాదంలోకి నెట్టే ఉద్దేశం ఉండి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఫ్లైదుబాయ్ ఘటనను తీవ్రంగా పరిగణించారు. భారత పైలట్ స్మిట్ మచ్చార్‌పై దాడి చేసిన ఆ కోపైలట్‌కు ఇరాన్‌తో లింకులు ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు. దర్యాప్తు జరుగుతోందని.. అదే గనుక నిజమని తేలితే ఇరాన్‌పై భీకరదాడులు జరుపుతామని హెచ్చరించారు.కాక్‌పిట్‌లో రక్తపాతం..వీడియో బయటకుఫ్లైదుబాయ్ ఎఫ్‌జెడ్1073 విమానం దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. విమానంలో 174 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారు. విమాన కాక్‌పిట్‌లో కో-పైలట్ భారతీయ కెప్టెన్ స్మిట్ మచ్చార్‌పై దాడి జరిగింది. ఈ సమయంలో విమానం ఒక్కసారిగా వేల అడుగుల ఎత్తు నుంచి కిందికి దిగడంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.బయటకు వచ్చిన వీడియోల్లో విమానం లోపల గందరగోళ పరిస్థితులు కనిపించాయి. ప్రయాణికులు కాక్‌పిట్ వైపు పరుగులు తీస్తూ కనిపించారు. “అతడు విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడు” అంటూ కొందరు ప్రయాణికులు అరుస్తున్న దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి.గాయాలతోనే తలుపు తెరిచి..దాడిలో తీవ్రంగా గాయపడిన కెప్టెన్ స్మిట్ మచ్చర్ రక్తస్రావంతో ఉన్నప్పటికీ కాక్‌పిట్ తలుపు తెరిచినట్లు ఆ దృశ్యాలు ఉన్నాయి. దీంతో ప్రయాణికులు లోపలికి వెళ్లి కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. “అతడు నన్ను చాలా సార్లు కొట్టాడు” అంటూ కెప్టెన్ చెప్పిన దృశ్యాలు వీడియోల్లో కనిపించినట్లు సమాచారం.ఈ సమయంలో కొందరు ప్రయాణికులు ధైర్యంగా ముందుకు వచ్చారు. ట్జ్వికా మానెస్, అసఫ్ రాజువాన్, యానివ్ హయూన్ వంటి ప్రయాణికులు కాక్‌పిట్‌లోకి వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంలో సహకరించారు.ప్లంబర్, డెంటిస్ట్.. ప్రయాణికులే హీరోలుఈ ఘటనలో ప్రయాణికుల పాత్ర కీలకంగా మారింది. విమానంలో ఉన్న డెంటిస్ట్ షోటా ముసాయెవ్ గాయపడిన కెప్టెన్‌కు ప్రథమ చికిత్స అందించారు. అలాగే విమానంలో ఉన్న ఆఫ్-డ్యూటీ పైలట్లు పరిస్థితిని చక్కదిద్దడంలో సహకరించారు. ప్రయాణికుడు యానివ్ హయూన్.. విమాన ప్రమాదాలకు సంబంధించిన టీవీ షోలు చూసిన అనుభవం ఆ సమయంలో తనకు ఉపయోగపడిందని చెప్పినట్లు సమాచారం.కోలుకుంటున్న భారత పైలట్ఘటన తర్వాత సౌదీ అరేబియాలోని టబూక్ ఆస్పత్రిలో చికిత్స పొందిన కెప్టెన్ స్మిట్ మచ్చర్‌ను అనంతరం యూఏఈకి తరలించారు(ఎయిర్‌లిఫ్ట్). యూఏఈలో భారత రాయబారి దీపక్ మిట్టల్ ఆస్పత్రికి వెళ్లి కెప్టెన్, ఆయన కుటుంబ సభ్యులను కలిశారు. స్మిట్ ఆరోగ్యం నిలకడగా ఉందని, కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారని తెలిపారు. “ధైర్యవంతుడైన భారత ముద్దుబిడ్డ” అంటూ స్మిట్‌ను ఆయన ప్రశంసించారు. మానవ ప్రాణాలను కాపాడటంలో ఆయన గొప్ప సేవ చేశారని పేర్కొన్నారు.కో-పైలట్ UAE అదుపులోకిఘటన తర్వాత సౌదీ అధికారులు కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం అతడిని యూఏఈ అధికారులకు అప్పగించారు. ఈ ఘటన ఉగ్రవాద సంబంధమా? ముందస్తు ప్రణాళిక ఉందా? కో-పైలట్ ఒక్కడే ఈ చర్యకు పాల్పడ్డాడా? అన్న అంశాలపై దర్యాప్తు జరుగుతోంది. ఈ దర్యాప్తులో ఇజ్రాయెల్ కూడా భాగం కావొచ్చని సమాచారం. ఘటనపై అనుమానాలు?ఈ ఘటన తర్వాత విమాన భద్రతా వ్యవస్థపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒమన్, ఇజ్రాయెల్‌కు అధికారిక దౌత్య సంబంధాలు లేనప్పటికీ.. ఆ దేశానికి చెందిన వ్యక్తి ఇజ్రాయెల్ వెళ్లే విమానంలో విధులు నిర్వహించడం ఎలా సాధ్యమైందన్న చర్చ మొదలైంది. ఏమైనా లోపాలు జరిగాయా? అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.మరోవైపు.. అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్లంబర్ అయిన యానివ్ హయూన్ ఆ సమయంలో విమానం కంట్రోల్ చేశాడన్న కోణాన్ని ఏకిపారేస్తున్నాయి. హయూన్ నేరుగా ప్రధాని నెతన్యాహూను కలవడం, ఆ సమయంలో జరిగిందంతా డ్రామాగా అభివర్ణిస్తూ కథనాలు ఇస్తున్నాయి. ఇటు ఒమన్‌కు చెందిన వ్యక్తికి.. ఇజ్రాయెల్‌కు విమానం నడిపే అవకాశం ఎలా దక్కింది? అని మాజీ పైలట్లు ప్రశ్నిస్తున్నారు. ఇంకోవైపు ఎన్నికల్లో లబ్ధి కోసమే నెతన్యాహూ ఈ డ్రామాలు ఆడుతున్నారేమో అని ఇజ్రాయెల్ ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదీ చదవండి: ఎలక్షన్ దాకా ఆగడం ఎందుకు? బాంబులేస్తే పోలా! -
ఫ్లైదుబాయ్ ఘటనలో ఇరాన్ హస్తం? ట్రంప్ అనుమానాలు
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ ప్రయాణికుల విమానంలో చోటుచేసుకున్న దాడి వెనుక ఇరాన్ ప్రమేయం ఉండొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ప్రాథమికంగా తనకు అందిన సమాచారం ప్రకారం ఇరాన్‌తో సంబంధం ఉండే అవకాశాలున్నాయని గురువారం వైట్‌హౌస్‌లో విలేకరులకు తెలిపారు.ఇరాన్ ప్రమేయం ఉంటే తీవ్ర పరిణామాలుఈ ఘటన వెనుక ఇరాన్ ఉన్నట్లు దర్యాప్తులో తేలితే అమెరికా ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్‌పై తీవ్రంగా దాడి చేస్తామని హెచ్చరించారు.సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం ఎఫ్‌జెడ్1073లో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం ఇజ్రాయెల్ వైపు ప్రయాణిస్తున్న సమయంలో కోపైలట్ కెప్టెన్‌పై కత్తితో దాడి చేసి, విమానాన్ని అదుపులోకి తీసుకుని కూల్చేందుకు ప్రయత్నించినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. దాడిలో గాయపడిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రతిఘటించి కాక్‌పిట్ తలుపు తెరవడంతో ప్రయాణికులు, సిబ్బంది జోక్యం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.విమానం తీవ్రంగా కిందకు దిగడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. అనంతరం ప్రత్యామ్నాయ సిబ్బంది విమానాన్ని సౌదీ అరేబియాలోని టబుక్ విమానాశ్రయంలో అత్యవసరంగా దించారు. విమానంలో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడగా, గాయపడిన పైలట్లకు చికిత్స అందించారు.దర్యాప్తులో అసలు కారణాలపై ఆరాఈ ఘటనకు సంబంధించి నిందితుడి నేపథ్యం, దాడికి దారితీసిన పరిస్థితులు, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయా అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కోపైలట్ తీవ్రవాద భావజాల ప్రభావానికి లోనై ఉండొచ్చని వ్యాఖ్యానించినప్పటికీ, దాడి వెనుక అసలు ఉద్దేశం ఇంకా స్పష్టంగా తెలియలేదు. -
నేడు 2026... నాడు 1986 ఆకాశమంత త్యాగం
తమ ప్రాణాల కంటే ప్రయాణికుల ప్రాణాలు ముఖ్యం అనుకుని విమానయాన సిబ్బందిలో కొందరు చరిత్రలో నిలబడిపోయారు. తాజా ‘ఫ్లయ్ దుబాయ్’ ఘటనలో కత్తి పోట్లకు వెరవలేదు కెప్టెన్ స్మిత్ మచ్చార్. 40 ఏళ్ల క్రితం 1986లో ప్రాణాలొడ్డడానికి వెనుకాడలేదు ఎయిర్ హోస్టెస్ నీర్జా బానోత్. ఇద్దరూ కీలక సమయంలో తలుపు తెరవడం వల్లే ప్రయాణికులు బతికారు. స్మిత్‌ను ఆలింగనం చేసుకుంటూ నీర్జాకు అంజలి ఘటించాల్సిన సందర్భం ఇది.విమానం... ఆకాశంలో అత్యంత సురక్షితమైన ప్రదేశం అనుకుంటాం. కానీ ఆ ఇనుప పక్షి లోపలే అత్యంత ప్రమాదం పొంచి ఉన్నప్పుడు? కాక్‌పిట్‌లో కూర్చున్న వ్యక్తే కూల్చాలనుకున్నప్పుడు?హైజాకర్లు తుపాకీ పట్టుకుని క్యాబిన్ లో నిలబడినప్పుడు? ఆ క్షణంలో టెక్నాలజీ కాదు, ఒక మనిషి ధైర్యమే ప్రయాణికుల ప్రాణాలకు ఆక్సిజన్ అవుతుంది. అలాంటి ధైర్యానికి రెండు పేర్లు – నీర్జా భానోట్, స్మిత్ మచ్చర్. ఒకరు ధీరోదాత్తుడిగా నిలబడితే 1986లో మరొకరు తన సాహసంతో చిరంజీవి అయ్యారు.నేడు 2026 దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానం 1073. గాల్లో 174 మంది ప్రయాణికులు, అందులో 27 మంది చిన్న పిల్లలు. కాక్‌పిట్‌లో ఒక్కసారిగా కలకలం. పక్క సీట్లో ఉన్న కో–పైలట్.... పైలెట్‌గా విధుల్లో ఉన్న కెప్టెన్ స్మిత్ మచ్చర్ పై కత్తితో దాడి చేసి విమానాన్ని కూల్చేయడానికి ప్రయత్నించాడు. విమానం 30 సెకన్లలోనే దాదాపు 14,000 అడుగులు కిందకు దూసుకుపోయింది. ఆ క్షణంలో స్మిత్ ఒంటినిండా రక్తం. నేలపై పడిపోయి ఉన్నాడు. కానీ స్పృహ తప్పలేదు. ఎలాగోలా శక్తి కూడదీసుకున్నాడు. సమయస్ఫూర్తితో స్పందించాడు. అతి కష్టమ్మీద రక్తపు చేతులతో కాక్‌పిట్ డోర్ రిలీజ్ బటన్ నొక్కాడు. ఆ ఒక్క క్లిక్ చారిత్రక ఘట్టం అయ్యింది. వెంటనే బయట ఉన్న ప్రయాణికులు, సిబ్బంది లోపలికి దూసుకొచ్చి కో–పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు దుబాయ్ పైలట్లు కాక్‌పిట్‌లోకి వచ్చి విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్మిత్‌ను ప్రాణదాత’ అని పొగిడాడు. స్పైస్‌జెట్ యాజమాన్యం ‘ఇండియా గర్విస్తోంది’ అంది. ప్రస్తుతం తబుక్ ఆసుపత్రిలో సర్జరీ తర్వాత స్మిత్ కోలుకుంటున్నారు.నాడు 1986సరిగ్గా 40 ఏళ్ల క్రితం జరిగిన ఇలాంటి ఘటనను దేశం మర్చిపోలేదు. 1986 సెప్టెంబర్ 5న ముంబై నుంచి కరాచీ మీదుగా ఫ్రాంక్ఫర్ట్ వెళుతున్న పాన్ ఆమ్ ఫ్లైట్ 73 కరాచీలో ల్యాండ్ అయిన వెంటనే నలుగురు సాయుధ హైజాకర్లు విమానాన్ని హైజాక్ చేశారు. అప్పుడు ఆ విమానంలో సీనియర్ ఫ్లైట్ పర్సన్ గా ఉన్నది 23 ఏళ్ల ముంబై అమ్మాయి నీర్జా భానోట్. హైజాకర్ల ఉద్దేశం అమెరికన్లను చంపడం. వారిని గుర్తించడానికి అందరి దగ్గరా పాస్‌పోర్ట్‌లు లాక్కుంటుంటే నీర్జా తన తోటి సిబ్బందితో కలిసి వాటిని దాచేసింది. కొన్నింటిని చెత్త కుండీలో పడేసింది. దాంతో హైజాకర్లకు ప్రయాణికుల్లో అమెరికన్లు ఎవరో తెలియలేదు. 17 గంటల తర్వాత వాళ్లు సహనం కోల్పోయి కాల్పులు మొదలుపెట్టినప్పుడు నీర్జా ధైర్యంచేసి ఎమర్జెన్సీ డోర్ తెరిచింది. ఆ ఒక్క నిర్ణయం చరిత్రలో నిలబడిపోయింది. డోర్ తెరవడమే కాదు నీర్జా ప్రయాణికులను బయటకు తోసేసింది. కాని చివర్లో ముగ్గురు చిన్నపిల్లలను తన శరీరంతో తూటాలకు అడ్డుగా కప్పి ఆమె ప్రాణాలు కోల్పోయింది. విమానంలోని 379 మందిలో 359 మంది బతికారు.ఇద్దరినీ కలిపే దారంనీర్జా... క్యాబిన్ క్రూ. స్మిత్... కాక్‌పిట్ క్రూ. ఒకరు హైజాకర్ల నుంచి, ఒకరు సొంత కో–పైలట్ నుంచి ప్రయాణికులను కాపాడారు. ఇద్దరూ చేసింది ఒకటే... తలుపు తెరవడం. నీర్జా తలుపు తెరిచి ప్రయాణికులను బయటకు పంపింది, స్మిత్ తలుపు తెరిచి ప్రయాణికులను లోపలికి రానిచ్చాడు. ఇది విధి నిర్వహణలో భారత విమానయాన సిబ్బంది నిబద్ధత.నీర్జా భానోట్కు మరణానంతరం అశోకచక్ర వచ్చింది. ఆమె పేరుమీద ఇప్పటికీ ధైర్యానికి అవార్డు ఇస్తారు. స్మిత్ మచ్చర్ ఇంకా బతికే ఉన్నాడు, ఆసుపత్రి మంచం మీద ఉన్నాడు. 40 ఏళ్ల తర్వాత చరిత్ర మళ్లీ ఒక హీరోను ఇచ్చింది. కానీ ఈసారి ఆ హీరోను మనం సన్మానించే అవకాశం ఉంది. విమానంలో సాంకేతిక లోపం వస్తే ఇంజినీర్లు చూసుకుంటారు, వాతావరణం బాగోలేకపోతే రాడార్ చూసుకుంటుంది. కానీ మనిషిలోని మృగం మేల్కొన్నప్పుడు మనిషి ధైర్యమే రన్ వే అవుతుంది. అలాంటి ధైర్యాన్ని, త్యాగాన్ని ప్రదర్శించిన నీర్జాను తలుచుకుంటూ, స్మిత్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. -
మళ్లీ ఉన్మాద ఛాయలు!
కొన్ని హఠాత్సంఘటనలు అరుదైన వ్యక్తులనూ, మనుషుల్లోని అసాధారణతనూ ప్రపంచం ముందు ఆవిష్కరిస్తాయి. బుధవారం ఒక దుండగుడి హైజాక్ యత్నంలో చిక్కుబడి, ప్రమాదపుటంచుల్లోపడిన ఫ్లై దుబాయ్ విమానం తిరిగి నిలదొక్కుకున్న ఉదంతంలో ఆ విమానం పైలెట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ పేరు ఇప్పుడు ప్రపంచం మూలమూలనా మార్మోగటానికి ఆయన ప్రదర్శించిన తెగువ, సాహసాలే కారణం. కో కెప్టెన్ దాడితో శరీరంనిండా కత్తిపోట్లున్నా, నెత్తురోడుతూ అపస్మారకంలోకి పోతున్నా కెప్టెన్ మచ్ఛర్ ఏమాత్రం జంకక సమయస్ఫూర్తితో, విమానాన్ని రక్షించి తీరాలన్న పట్టుదలతో కాక్‌పిట్ తలుపు లాక్ తెరవడం చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే సన్నివేశం. ఆయన స్ఫూర్తిదాయక వ్యవహారశైలి దేశదేశాల్లోని పైలెట్లకు, మొత్తం విమానయాన సిబ్బందికి భవిష్యత్తులో ఒక అధ్యయనాంశంగా మారుతుంది.సరిగ్గా పాతికేళ్లనాడు అమెరికాలో నాలుగు విమానాల్ని దారిమళ్లించి కూల్చివేసి, వేలాదిమంది మరణానికి కారణమైన ఉగ్రవాద ఉన్మాదంనుంచి ప్రపంచ దేశాలింకా సరైన గుణపాఠం నేర్చుకోలేదని ఈ హైజాక్ యత్నం రుజువుచేసింది. అది ఆత్మాహుతి దాడా... మరేదైనానా అన్నది తేల్చాల్సివున్నదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో సహా పలువురు చెబుతున్నా, దీనివెనక ఇరాన్ హస్తమున్నదని బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్‌హామ్ ఆరోపిస్తున్నారు. ఈ దుండగానికి కారకుడైన కో పైలెట్ ఒమన్ జాతీయుడు. 174 మంది ప్రయాణిస్తున్న ఆ విమానం ఎన్నో అవాంతరాలెదురైనా చివరకు సురక్షితంగా సౌదీ అరేబియాలో అడుగుపెట్టింది. కెప్టెన్ మచ్ఛర్‌పై కో పైలెట్ దాడి,వారి పెనుగులాట... అనుకోకుండా కాక్‌పిట్ తలుపు లాక్ తెరుచుకోవడం వంటి వరస పరిణామాలు అందులో ప్రయాణిస్తున్న వారందరినీ దిగ్భ్రాంతిలో పడేశాయి. ఈమధ్యలోనే విమానం నియంత్రణ కోల్పోయి నిమిషంలోపే 34,000 అడుగుల ఎత్తునుంచి 17,000 అడుగులకు పడిపోవటంతో ప్రయాణికులంతా ప్రాణభయంతో కేకలు వేయటం వీడియోలో రికార్డయింది. మరో 2,000 అడుగుల కిందకు జారాక అది మళ్లీ క్రమేపీ గాల్లోకి లేవడం ఒకరకంగా అదృష్టమని చెప్పాలి. ప్రయాణికుల్లో కొందరు చొరవగా లోపలికెళ్లి జరిగిందేమిటో గ్రహించి కోపైలెట్‌ను అదుపు చేయటం, ప్రయాణికుల్లో ఒకరైన డెంటిస్టు రక్తస్రావం కాకుండా కెప్టెన్‌ను కాపాడటం ప్రశంసించ దగ్గ పనులు. ఇంకా ఆశ్చర్యకరమైన సంగతేమంటే... అనుకోకుండా ఆ విమానంలో రిలీఫ్ పైలెట్లు ఉండటం. అత్యవసర సమయంలో విమానం నడపాల్సిన కో పైలెటే నేరగాడు కావటం, పైలెట్‌కు స్పృహ లేకుండా పోవడం వంటి పరిణామాల మధ్య ఆ రిలీఫ్ పైలెట్లు లేకుంటే ఏం జరిగివుండేదో ఊహించుకుంటేనే వణుకొస్తుంది. అమెరికాలో జరిగిన ఉగ్రదాడి తర్వాత పైలెట్ లేదా కో పైలెట్ కోరుకుంటే తప్ప కాక్‌పిట్ తలుపు తెరుచుకోకుండా విమానాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. బయటినుంచి తెరిచే ప్రయత్నం దుర్లభమయ్యేంత పటిష్టంగా ఆ తలుపుంటుంది. హైజాక్ యత్నం, బెదిరింపులు వంటివి క్యాబిన్లో మాత్రమే జరుగుతాయనీ,కాక్‌పిట్ సురక్షితంగా ఉండేలా చూస్తే సరిపోతుందనీ ఈ సాంకేతికత తీసుకొచ్చారు. కానీ తాజా ఉదంతంలో ప్రమాదం క్యాబిన్లో కాకుండా, కాక్‌పిట్‌లోనే పొంచివుండటం గమనించదగ్గది. వీటి సంగతలావుంచి అసలు దుబాయ్‌లో కో పైలెట్ చాకుతో విధులకు ఎలా రాగలిగాడు? అంటే భద్రత విషయంలో మునుపటి అప్రమత్తత సన్నగిల్లిందన్నమాట! నిత్యం వేలాదిమంది ప్రయాణించే దుబాయ్ విమానాశ్రయంలో ఇలాంటి భద్రతాపరమైన లోపం చోటుచేసుకోవటం ఊహకందనిది. ప్రపంచం కక్షలు, కార్పణ్యాలతో భయానకంగా మారింది. ఇప్పుడు జరిగిన ఉదంతానికి పురిగొల్పిన పరిణామాలేమిటన్నది ఇంకా తెలియాల్సే వున్నా ఇజ్రాయెల్ గాజాలో సాగిస్తున్న మారణకాండకు ప్రతీకారంగా కో పైలెట్ ఆ దేశ పౌరులు అధికంగా వున్న విమానాన్ని కూల్చేయదల్చుకున్నాడన్న కథనాలు వెలువడుతున్నాయి. ‘కంటికి కన్ను...’ సిద్ధాంతం మనిషిని ఉన్మాదిగా మారుస్తుంది. సహేతుక పోరాటాలపై నీలినీడలు కమ్మేలా చేస్తుంది. ఒక ఉన్మాదానికి మరో ఉన్మాదం ఎప్పటికీ జవాబు కాదు. -
ఫ్లైదుబాయ్ ఘటన: ఒక్కడు కాదు.. ఐదుగురు హీరోలు
ఆకాశంలో వేల అడుగుల నుంచి అమాంతం కిందకు జారిన విమానం.. కాక్‌పిట్‌లో రక్తపు మడుగులో పైలట్.. మరో పైలట్ విమానాన్ని నేలవైపు మళ్లించే ప్రయత్నం.. బయట ప్రయాణికుల హాహాకారాలు.. ఏం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితి. అలాంటి సమయంలో కొందరు ప్రయాణికులు ప్రాణాలకు తెగించి కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లారు. సమయస్ఫూర్తిని ప్రదర్శించి.. చివరకు 174 మంది ప్రాణాలతో బయటపడగలిగారు. దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఈ ఘటనలో ఇప్పుడు ఐదుగురిని హీరోలుగా కొనియాడుతున్నారు.విమానంలో ప్రయాణిస్తున్న ఒమన్‌కు చెందిన కో–పైలట్.. భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై దాడి చేసి కత్తితో పొడిచినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడినప్పటికీ మచ్చార్ కాక్‌పిట్ తలుపును తెరవగలిగారు. దీంతో బయట ఉన్న ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లే అవకాశం లభించింది. ఇదే సమయంలో విమానం వేల అడుగుల ఎత్తును అత్యంత వేగంగా కోల్పోయింది. చివరకు ప్రయాణికులు, సిబ్బంది కలిసి కో–పైలట్‌ను అదుపులోకి తీసుకోవడం, విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ‘హమ్మయ్యా’ అనుకున్నారు. భారత పైలట్‌కు ప్లంబర్ ధైర్యంఇజ్రాయెల్కు చెందిన ప్లంబర్ యానివ్ హయూన్ ఈ ఘటనలో కీలకంగా వ్యవహరించారు. గాయపడిన మచ్చార్‌కు సాయం చేసిన అతను.. రక్తపు దుస్తులతోనే ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టాడు. నేరుగా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును కలిసి జరిగింది వివరించారు. మచ్చార్ గాయపడినప్పటికీ కాక్‌పిట్ తలుపు తెరవడం వల్లే మిగతావారు లోపలికి వెళ్లగలిగారని హయూన్, నెతన్యాహుతో చెప్పారు. దీంతో ఆయన మచ్చార్‌ను ప్రశంసించారు. ఆ సమయంలో జరిగింది ఏంటో ఆయన మీడియాకు వివరించారు.AMAFOTO: Minisitiri w'Intebe wa Israel, @netanyahu, yashimiye Yaniv Hayoun, umwe mu bagenzi bafashije guhagarika ishimutwa ry’indege ya @flydubai no gusubiza indege ku murongo.Hayoun yavuze ko yinjiye mu cyumba cy’abapilote, afata umupilote wungirije wari ku bikoresho... pic.twitter.com/kPyGvitwE6— BIGEZWEHO TV (@bigezweho_tv) October 1, 2026కాక్‌పిట్‌లోకి వెళ్లిన ఆయన.. తీవ్రంగా గాయపడి నేలపై పడివున్న మచ్చార్‌ను చూసి ‘‘నువ్వు చనిపోవు బ్రో.. నీకేం కాదు’’ అంటూ ధైర్యం చెప్పారు. అనంతరం కో–పైలట్‌ను వెనక్కి లాగి కాక్‌పిట్ నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. విమానం అదుపు తప్పుతున్న సమయంలో కంట్రోల్ స్టిక్‌ను వెనక్కి లాగి దాన్ని స్థిరీకరించేందుకు కూడా హయూన్ ప్రయత్నించారు. Il premier israeliano Benjamin Netanyahu ha incontrato Yaniv Hayoun, passeggero del volo FlyDubai atterrato in emergenza in Arabia Saudita dopo che un pilota avrebbe aggredito un collega. Netanyahu ha definito Hayoun un eroe per aver contribuito a neutralizzare l'aggressore. pic.twitter.com/lIEXD38d1u— LaPresse (@LaPresse_news) October 1, 2026ఇక్కడే ఓ ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. విమానం కంట్రోల్స్‌ను ఎలా ఆపరేట్ చేయాలో తనకు పెద్దగా తెలియదని చెబుతున్న హయూన్.. టీవీలో వచ్చే ఎయిర్ క్రాష్ ఇన్వెస్టిగేషన్(Air Crash Investigation) కార్యక్రమం చూసిన అనుభవం గుర్తొచ్చిందని చెప్పారు. ‘‘నేను ఆ షో చూస్తుంటాను’’ అంటూ నెతన్యాహుతో జరిగిన భేటీలో ఆయన చెప్పడం.. చిరునవ్వులు చిందించడం ఇప్పుడు వైరల్‌గా మారింది.బ్యాంకర్.. బిజినెస్‌మన్ కూడా రంగంలోకికో–పైలట్‌ను అదుపులోకి తీసుకోవడంలో మరో ఇద్దరు ఇజ్రాయెలీ ప్రయాణికులు జ్వికా మానెస్, అసఫ్ రాజువాన్ కీలకంగా వ్యవహరించారు. బ్యాంక్ లియూమి అండర్‌రైటింగ్ కంపెనీ సీఈవో అయిన మానెస్.. విమానంలో ఇచ్చిన హెడ్‌ఫోన్ కేబుళ్లతో దాడి చేసిన వ్యక్తిని కట్టేసినట్లు చెప్పారు. విమానం వేగంగా కిందికి దూసుకెళ్తుండగా ప్రయాణికులు భయంతో కేకలు వేస్తున్నారని ఆయన వివరించారు. ఇన్సూరెన్స్ ఏజెన్సీ నిర్వహించే రాజువాన్ కూడా కాక్‌పిట్‌లోకి వెళ్లి కో–పైలట్‌ను అదుపులోకి తీసుకోవడంలో సహకరించారు. కొంతసేపు అతడిని అదుపులోనే ఉంచి, విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యే వరకు పరిస్థితిని అదుపులో ఉంచినట్లు ఆయన తెలిపారు.డెంటిస్ట్ ప్రాణదాతగా..ఈ ఘటనలో డాక్టర్ షోటా ముసాయెవ్ పాత్ర కూడా కీలకంగా మారింది. దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన తీవ్రంగా గాయపడిన కెప్టెన్ మచ్చార్ వద్దకు వెళ్లారు. తలకు, చేతులకు తీవ్ర గాయాలై రక్తస్రావం అవుతున్న మచ్చార్‌కు ప్రాథమిక వైద్యం అందించి రక్తస్రావాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యే వరకు ఆయన పరిస్థితిని స్థిరంగా ఉంచడంలో ముసాయెవ్ సహకరించారు.ఇద్దరు ఆఫ్-డ్యూటీ పైలట్లు కూడా..కాక్‌పిట్‌లో పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు ఆఫ్-డ్యూటీ పైలట్లు కంట్రోల్స్ చేపట్టారు. వారి సహాయంతో విమానం మళ్లీ స్థిరపడింది. అనంతరం అత్యవసర పరిస్థితిని ప్రకటించి సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయానికి మళ్లించారు. అలా విమానంలోని మొత్తం 174 మంది సురక్షితంగా బయటపడ్డారు. లేకుంటే మరో 9/11 అయ్యేది.హెర్జోగ్ కీలక నిర్ణయంఈ ఘటనలో ప్రాణాలకు తెగించి స్పందించిన నలుగురు ఇజ్రాయెలీలకు దేశ అత్యున్నత పౌర వీరత్వ పురస్కారానికి సిఫార్సు చేయనున్నట్లు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ప్రకటించారు. యానివ్ హయూన్, జ్వికా మానెస్, అసఫ్ రాజువాన్, డాక్టర్ షోటా ముసాయెవ్ల పేర్లను ఆయన సిఫార్సు చేశారు. కాక్‌పిట్‌లోకి వెళ్లి దాడిచేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం, విమానాన్ని స్థిరీకరించడం, తీవ్రంగా గాయపడిన పైలట్‌కు ప్రాణరక్షక వైద్యం అందించడం వంటి చర్యలను హెర్జోగ్ ప్రశంసించారు.ఫ్లైదుబాయ్ ఘటన వెనుక కో–పైలట్ ఉద్దేశం ఏమిటన్నది ఇంకా దర్యాప్తులోనే ఉంది. ఫ్లైదుబాయ్ కూడా అధికారులతో కలిసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఘటన అనంతరం FZ1073 టబుక్‌లో సురక్షితంగా దిగిందని, ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని సంస్థ అధికారికంగా వెల్లడించింది.ఇదీ చదవండి: కెప్టెన్ మచ్చార్.. యూ ఆర్ రియల్ హీరో -
కెప్టెన్ స్మిట్ మచ్చార్‌కు సెల్యూట్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఫ్లైదుబాయ్ విమాన కెప్టెన్ స్మిట్ మచ్చార్‌పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశంసలు కురిపించారు. ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడేందుకు ఆయన అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారని కొనియాడారు.ఫ్లైదుబాయ్ విమాన ఘటన విషయమై వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా.. ‘ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా కెప్టెన్ స్మిట్ మచ్చార్ ధైర్యంగా నిలిచారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఆయన ధైర్యం, త్యాగం, నిస్వార్థ సేవ ప్రశంసనీయమని అన్నారు. ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడేందుకు ఆయన అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారు. స్మిట్ మచ్చార్ దేశం గర్వించదగ్గ నిజమైన హీరో అని కొనియాడారు. అలాగే, కెప్టెన్ స్మిట్ మచ్చార్ త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.Hats off to Captain Smit Machchhar for his extraordinary courage in saving the lives of the passengers and crew. Despite being seriously injured, he remained steadfast in his commitment to passenger safety.A pride of India, he showed the world the meaning of courage and… pic.twitter.com/rXIOK1iIWS— YS Jagan Mohan Reddy (@ysjagan) October 1, 2026ఇదీ చదవండి: ‘భారత్ గర్విస్తోంది’.. స్మిట్ మచ్చార్ ధైర్యానికి మోదీ ఫిదా! -
ఫ్లైదుబాయ్ ట్విస్ట్: ఇంతకీ ఆ కో-పైలట్ ఎవరంటే..
ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా నిలిచిన భారత పైలట్ కెప్టెన్ స్మిట్ మచ్చార్ ప్రాణాలకు తెగించి పోరాడటంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అతనిపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ఇంతటి ప్రమాదకర చర్యకు పాల్పడిన కో-పైలట్ ఎవరు? అతడి ఉద్దేశం ఏమిటి? అనే మిస్టరీ ఇంకా వీడలేదు.ఇజ్రాయెల్ అధికారుల ప్రకారం.. దాడికి పాల్పడిన కో-పైలట్ ఒమన్ జాతీయుడు. అతడి పూర్తి పేరును మాత్రం ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. ఫ్లైదుబాయ్లోనే పనిచేస్తున్న అతడు.. సంస్థలో చేరి ఏడాది కూడా కాలేదని తెలుస్తోంది. అయితే ఏ ఉద్దేశంతో దాడి చేశాడన్నది కూడా తెలియరాలేదు. ఘటన తర్వాత సౌదీ అరేబియా అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల సహకారంతో అతన్ని ప్రశ్నిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఫ్లైదుబాయ్ ప్రకారం.. ఘటనకు దారితీసిన అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. అందువల్ల కో-పైలట్ ఉద్దేశం గురించి ముందస్తు ఊహాగానాలు చేయొద్దని సంస్థ హెచ్చరించింది. నెతన్యాహు ఏమన్నారంటే..ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. కో-పైలట్ మొదట కెప్టెన్ స్మిట్ మచ్చార్‌పై కత్తితో దాడి చేసి.. అనంతరం విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది జోక్యం చేసుకోవడంతో ఆ ప్రయత్నం విఫలమైందని వివరించారు. విమానంలో మొత్తం 174 మంది ఉన్నారని, వారిలో ఎక్కువ మంది ఇజ్రాయెల్ పౌరులేనని తెలిపారు.స్మిట్ మచ్చార్ తీవ్రంగా గాయపడినా చివరి శక్తిని ఉపయోగించి కాక్‌పిట్ తలుపు తెరిచారని నెతన్యాహు కార్యాలయ ప్రతినిధి డోరన్ స్పీల్‌మన్ తెలిపారు. దీంతో ప్రయాణికులు లోపలికి వెళ్లి దాడి చేసిన కో-పైలట్‌ను అదుపులోకి తీసుకోగలిగారని చెప్పారు. నెతన్యాహు స్వయంగా స్మిట్ మచ్చార్‌ను “నిజమైన హీరో”గా అభివర్ణించి, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 174 మంది ప్రాణాలను కాపాడటంలో ఆయన కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు.My salute to the Indian pilot Captain Smit Machchhar for his extraordinary bravery.Despite being stabbed and seriously injured, he fought back, resisted, opened the cockpit door, and enabled passengers and crew to overpower the attacker — preventing a catastrophic mid-air…— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) September 30, 2026ట్రంప్ ఏమన్నారంటే..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ ఘటనపై నెతన్యాహుతో మాట్లాడినట్లు తెలిపారు. అనంతరం ఓవల్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నెతన్యాహు నుంచి తనకు అందిన వివరాలను చెప్పారు. విమానంలో ఉన్న ఓ ఇజ్రాయెలీ ప్లంబర్ కాక్‌పిట్‌లోకి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకోవడంలో సహకరించాడు. కో-పైలట్ విమాన నియంత్రణ వ్యవస్థను దెబ్బతీయడానికి ప్రయత్నించాడు. అతడు “టెర్రరిస్ట్ అయి ఉండొచ్చు.. లేదంటే మరేదైనా కారణం ఉండొచ్చు” అనే అర్థంలో వ్యాఖ్యానించారు. ఇటు ప్రయాణికుల్ని కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిట్ మచ్చార్‌ను మాత్రం ట్రంప్ అభినందించారు.ఇజ్రాయెల్ బలగాలు ఏం చెప్పాయి?ఇజ్రాయెల్ అధికారులు ఈ ఘటనను తీవ్రమైన భద్రతా ఘటనగా అభివర్ణించారు. కో-పైలట్ స్మిట్ మచ్చార్‌పై దాడి చేసిన తర్వాత విమానం దాదాపు 14 వేల అడుగుల మేర అత్యంత వేగంగా కిందకు దిగిపోయిందని చెప్పారు. ఈ సమయంలో ప్రయాణికులు, సిబ్బంది కాక్‌పిట్‌లోకి వెళ్లి కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అనంతరం విమానంలో ఉన్న మరో జంట ఫ్లైదుబాయ్ పైలట్లు బాధ్యతలు చేపట్టి విమానాన్ని సౌదీ అరేబియాలోని టబుక్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. రక్తస్రావంతో నేలపై పడిపోయిన స్మిట్ మచ్చార్ తన మిగిలిన శక్తినంతా ఉపయోగించి కాక్‌పిట్ తలుపు తెరిచారు. లోపలికి వెళ్లిన ప్రయాణికులు కో-పైలట్ కంట్రోల్ ప్యానెల్‌పై దాడి చేస్తున్నట్లు చూశారని అధికారులు వివరించారు.హైజాకింగ్? లేదంటే..ఇక్కడే అసలు మిస్టరీ కొనసాగుతోంది. నెతన్యాహు ప్రకారం ఇది సాధారణ హైజాకింగ్ ఘటనలా కనిపించడం లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కో-పైలట్ విమానం నడపడానికి ప్రయత్నించకుండా కంట్రోల్ ప్యానెల్‌ను దెబ్బ తీసే ప్రయత్నం చేశాడట. ఓ ప్రయాణికుడు ఇచ్చిన వాంగ్మూలాన్నే నెతన్యాహు ప్రస్తావించారు. అందువల్ల ఇది ఆత్మహత్యా ప్రయత్నం కావొచ్చనే అభిప్రాయమూ వ్యక్తం చేశారాయన. తనిఖీలు ముమ్మరంఈ ఘటన తర్వాత ఇజ్రాయెల్ భద్రతా అధికారులు విదేశీ విమానాల పైలట్లపై తనిఖీలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించారు. ఇజ్రాయెల్‌కు వచ్చే విమానాల పైలట్ల గుర్తింపును ముందుగానే తెలుసుకుని, భద్రతా ప్రక్రియలను మరింత పటిష్టం చేయనున్నట్లు ప్రధాని కార్యాలయ ప్రతినిధి తెలిపారు. మరోవైపు ఈ ఘటన నేపథ్యంతో.. ఇజ్రాయెల్‌కు అన్ని సర్వీసులను ఫ్లైదుబాయ్ రద్దు చేసింది.అలా.. కో-పైలట్ ఎవరు? ఎందుకు స్మిట్ మచ్చార్‌పై దాడి చేశాడు? విమానాన్ని నిజంగానే కూల్చాలనుకున్నాడా? ఉగ్రవాద కోణముందా? పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌తో ఏమైనా సంబంధముందా? అన్న ప్రశ్నలకు ఇంకా పూర్తిస్థాయి సమాధానాలు రావాల్సి ఉంది. 🚨✈️ TERROR EN EL AIRE El vuelo Flydubai FZ1073 (Dubái–Tel Aviv) con 180 pasajeros, entre ellos unos 30 niños. El copiloto @puñ@l0 al capitán en cabina, pasajeros israelíes y tripulación consiguieron entrar, reducir al copiloto y estabilizar el avión#Internacional pic.twitter.com/fKUM3oHdmh— Crónica NLD (@CronicasLDN) September 30, 2026ఇదీ చదవండి: నువ్వు రియల్ హీరో బ్రో.. భారత పైలట్‌పై ప్రశంసల జల్లు -
ప్రాణాలకు తెగించి విమానం కూల్చే ప్రయత్నాన్ని అడ్డుకున్న ఇండియన్ పైలట్
-
‘భారత్ గర్విస్తోంది’.. స్మిట్ మచ్చార్ ధైర్యానికి మోదీ ఫిదా!
దుబాయ్–టెల్అవీవ్ ఫ్లై దుబాయ్ విమానంలో చోటుచేసుకున్న ఘటనలో భారత పైలట్ కెప్టెన్ స్మిట్ మచ్చార్ ప్రదర్శించిన ధైర్యసాహసాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ పరిస్థితిని ఎదుర్కొని.. విమానంలోని వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా కీలకంగా వ్యవహరించారని అన్నారు.‘‘కెప్టెన్ స్మిట్ మచ్చార్ ఒక హీరో. భారత్ ఆయనను చూసి గర్విస్తోంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. స్మిట్ మచ్చార్ తెగువను కొనియాడుతూ మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోనూ, తీవ్రంగా గాయపడినప్పటికీ ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ఆయన అపారమైన ధైర్యం, వెనక్కి తగ్గని సంకల్పాన్ని ప్రదర్శించారని అన్నారు. ఆయన చూపిన తెగువ వందలాది మంది ప్రాణాలను కాపాడటంతోపాటు పెను విషాదాన్ని తప్పించిందని పేర్కొన్నారు. స్మిట్ మచ్చార్ త్వరగా కోలుకోవాలని, మరింత శక్తితో పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.Captain Smit Machchhar is a HERO.In the face of the gravest danger and despite being seriously injured, he showed immense courage and an unwavering resolve to protect the lives of others. His valour helped save hundreds of lives and avert a great tragedy.India is proud of…— Narendra Modi (@narendramodi) October 1, 2026బుధవారం దుబాయ్ నుంచి టెల్‌అవీవ్‌కు బయలుదేరిన ఫ్లై దుబాయ్ విమానం FZ1073లో ఈ ఘటన చోటుచేసుకుంది. బోయింగ్ 737 విమానం సుమారు 34 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా.. కాక్‌పిట్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. సహ పైలట్ విమానాన్ని ప్రమాదానికి గురిచేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన కెప్టెన్ స్మిట్ మచ్చార్‌పై అతడు దాడి చేసి కత్తితో పొడిచినట్లు సమాచారం.దాడితో మచ్చార్ తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో విమానం భారీ వేగంతో కిందికి దిగడం ప్రారంభించింది. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. దాదాపు 37 సెకన్లలోనే విమానం 14,300 అడుగుల మేర కిందికి దిగింది. ఒక దశలో నిమిషానికి సుమారు 23 వేల అడుగుల వేగంతో కిందికి దూసుకెళ్లినట్లు సమాచారం. దీంతో విమానంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.కుటుంబానికి మోదీ ధైర్యంకెప్టెన్ స్మిట్ మచ్చార్ కుటుంబంతోనూ గురువారం ఉదయం ప్రధాని మోదీ ఫోన్లో పరామర్శించినట్లు తెలుస్తోంది. మచ్చార్ తల్లిదండ్రులతో పాటు అతని భార్యతోనూ మోదీ మాట్లాడినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. స్మిట్ సాహసాన్ని ప్రస్తావిస్తూ అధైర్య పడొద్దని.. అవసరమైన సాయం అందిస్తామని ఆయన చెప్పినట్లు సమాచారం. గాయాలతోనే ఎదురుదాడి..ఈ సమయంలో తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ మచ్చార్ వెనక్కి తగ్గలేదు. సహ పైలట్‌ను ప్రతిఘటిస్తూ కాక్‌పిట్ తలుపు తెరిచినట్లు సమాచారం. దీంతో ముందు వరుసలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది కాక్‌పిట్‌లోకి చేరుకుని దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు సహకరించారు. విమానంలో ఉన్న మరో ఇద్దరు రిలీఫ్ పైలట్లు అనంతరం నియంత్రణ బాధ్యతలు చేపట్టారు. విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయానికి మళ్లించారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ల్యాండింగ్ అనంతరం గాయపడిన స్మిట్ మచ్చార్, సహ పైలట్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులకు కూడా విమానాశ్రయంలో వైద్య సాయం అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.9,750 గంటల ఫ్లయింగ్ అనుభవంస్మిట్ మచ్చార్ భారతీయుడు. ఫ్లై దుబాయ్‌లో చేరకముందు స్పైస్‌జెట్‌లో సుమారు 11 ఏళ్లు పనిచేశారు. బోయింగ్ 737 విమానాల్లో 13 ఏళ్లకు పైగా వాణిజ్య విమానయాన అనుభవం ఉంది. ఆయన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. దాదాపు 9,750 గంటల ఫ్లయింగ్ అనుభవంతోపాటు లైన్ ట్రైనింగ్ కెప్టెన్‌గా కూడా పనిచేశారు.ట్రంప్, నెతన్యాహు ప్రశంసలుస్మిట్ మచ్చార్ ధైర్యాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ప్రశంసించారు. దాడిలో గాయపడినప్పటికీ విమానాన్ని, ప్రయాణికులను రక్షించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలను కొనియాడారు. ప్రయాణికులు, సిబ్బంది సైతం దాడిచేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంలో కీలకంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. ఇటు ట్రంప్ కూడా స్మిట్‌ను హీరో అని, కోపైలట్‌ను టెర్రరిస్ట్ అని అభివర్ణించారు.ఈ ఘటనకు దారితీసిన కారణాలు, సహ పైలట్ ఎందుకు దాడికి పాల్పడ్డాడు? విమానాన్ని ఎందుకు కిందికి దించాడు? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే తీవ్ర ప్రమాదం ఎదురైన సమయంలో గాయాలను లెక్కచేయకుండా స్మిట్ మచ్చార్ తీసుకున్న చర్యలు ఇప్పుడు ఈ ఘటనలో ప్రధానంగా చర్చనీయాంశంగా మారాయి.ఇదీ చదవండి: ప్చ్.. డంకీ ఎంత పని చేసింది? -
‘హ్యాట్సాఫ్ రియల్ హీరో..’ భారత పైలట్‌పై ట్రంప్, నెతన్యాహు ప్రశంసలు
విమానం గాల్లో ఉంది.. ఒక్కసారిగా కాక్‌పిట్‌లో కలకలం. కో-పైలట్ కత్తితో కెప్టెన్‌పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడినప్పటికీ ఆ భారత పైలట్ వెనక్కి తగ్గలేదు. కాక్‌పిట్ తలుపు తెరిచి బయటకు వచ్చి సంకేతం ఇచ్చాడు. ప్రయాణికులు, ఇతర సిబ్బంది వెంటనే స్పందించడంతో పెను విమాన ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత పైలట్ స్మిట్మచ్చర్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రశంసలు కురిపించారు.ఫ్లైదుబాయ్ విమానం FZ1073లో జరిగిన ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ‘‘భారత పైలట్ కెప్టెన్ స్మిట్ మచ్చర్ అసాధారణ ధైర్యానికి నా సెల్యూట్’’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడినప్పటికీ మచ్చర్ ప్రతిఘటించి కాక్‌పిట్ తలుపు తెరిచారని తెలిపారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోగలిగారని పేర్కొన్నారు. ఈ చర్య పెను విమాన ప్రమాదాన్ని నివారించిందని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్మిట్ మచ్చర్‌ను ‘హీరో’గా అభివర్ణించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తనకు చెప్పిన వివరాలను మీడియాతో పంచుకున్న ట్రంప్.. తీవ్రంగా గాయపడినప్పటికీ పైలట్ చేసిన చర్యను అద్భుతమైనదిగా పేర్కొన్నారు.30 సెకన్లలో 14 వేల అడుగులు కిందకు!భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం దుబాయ్-టెల్అవీవ్ మధ్య ప్రయాణిస్తున్న బోయింగ్ 737 MAX 8 విమానం పైలట్, కో-పైలట్ మధ్య కాక్‌పిట్‌లో ఘర్షణతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో కో-పైలట్ కెప్టెన్ మచ్చర్‌పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. అనంతరం విమానం ఒక్కసారిగా ఎత్తు కోల్పోయింది. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం కేవలం 30 సెకన్లలో దాదాపు 14 వేల అడుగుల మేర కిందికి పడిపోయింది.విమానంలోని ప్రయాణికులకు పరిస్థితి అర్థమయ్యేలోపే కాక్‌పిట్ నుంచి అరుపులు వినిపించాయి. ఇదే సమయంలో గాయపడిన కెప్టెన్ మచ్చర్ కాక్‌పిట్ తలుపు తెరిచారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లే అవకాశం ఏర్పడింది.‘‘విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడు’’ఈ దాడికి సంబంధించి సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. కో-పైలట్ విమానం వ్యవస్థలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రయాణికుడు యానివ్ తెలిపిన వివరాల ప్రకారం.. మచ్చర్ కాక్‌పిట్ తలుపు తెరిచి కుప్పకూలిన తర్వాత ప్రయాణికులు లోపలికి వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానంలో ఉన్న మరో సెట్ పైలట్లు కాక్‌పిట్‌లోకి చేరుకుని విమానాన్ని కంట్రోల్ చేయగలిగారు. అటు నుంచి సౌదీ అరేబియాలోని టబుక్‌కు మళ్లించారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.ఎవరీ స్మిట్మచ్చర్?స్మిట్ మచ్చర్ భారత పౌరుడు. బోయింగ్ 737 విమానాలపై ఆయనకు 13 ఏళ్లకు పైగా వాణిజ్య విమానయాన అనుభవం ఉంది. సుమారు 9,750 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉన్నట్లు ఆయన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆధారంగా వివరాలు వెల్లడయ్యాయి. 2011లో స్పైస్‌జెట్‌లో చేరిన మచ్చర్.. అక్కడ లైన్ ట్రైనింగ్ కెప్టెన్, సీనియర్ కమాండర్‌గా పనిచేశారు. 2022 జూన్‌లో స్పైస్‌జెట్‌ను వీడి ఫ్లై దుబాయ్‌లో డైరెక్ట్ ఎంట్రీ కెప్టెన్‌గా చేరారు. ఆయన సోదరుడు కూడా ఇటీవల ఫ్లై దుబాయ్‌లో చేరినట్లు సమాచారం.ఆసుపత్రిలో చికిత్స.. పరిస్థితి నిలకడగాకాక్పిట్ ఘటనలో తీవ్రంగా గాయపడిన మచ్చర్‌ను సౌదీ అరేబియాలోని టబుక్ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు చికిత్స కొనసాగుతోంది. భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్ ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులతోనూ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.‘‘180 మంది ప్రాణాలు కాపాడారు’’ఇజ్రాయెల్ అంబాసిడర్ రూవెన్ అజార్ కూడా మచ్చర్‌ను ప్రశంసించారు. అనుభవజ్ఞుడైన, ప్రతిభావంతుడైన భారత పైలట్‌గా అభివర్ణించారు. మచ్చర్‌తో పాటు ప్రయాణికులు, సిబ్బంది చూపిన ధైర్యం 180 మంది ప్రాణాలను కాపాడిందని పేర్కొన్నారు.విమానం టబుక్‌లో సురక్షితంగా దిగిన తర్వాత ప్రయాణికులు సుమారు ఎనిమిది గంటలు సౌదీ అరేబియాలో ఉన్నారు. అనంతరం ప్రత్యామ్నాయ ఫ్లై దుబాయ్ విమానంలో ఇజ్రాయెల్‌కు బయలుదేరారు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడినా.. విమానాన్ని కాపాడేందుకు చివరి వరకు పోరాడిన భారత పైలట్ స్మిట్మచ్చర్ ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటున్నారు.ఇదీ చదవండి: యూఏఈలో వాహనదారులకు షాక్ -
9/11 తరహా దాడికుట్ర భగ్నం!
దుబాయ్/జెరూసలేం: అమెరికాలో రెండు దశాబ్దాల క్రితం విమానాన్ని హైజాక్‌చేసి ఆకాశహర్మ్యాలను ఢీకొట్టి వందలాది మంది చావుకు కారణమైన సెప్టెంబర్ 11 దాడుల తరహాలో ప్రయాణికుల విమానాన్ని తన వశం చేసుకుని కుప్పకూల్చేందుకు ఒక కోపైలట్ దుస్సాహసం చేసిన ఉదంతం జోర్డాన్ గగనతలంలో జరిగింది. 174 మంది ప్రయాణికుల ప్రాణాలను గాల్లో కలిపేందుకు కోపైలట్ చేసిన ప్రయత్నాన్ని ఒక భారతీయ కెప్టెన్ అత్యంత ధైర్యసాహసాలతో వమ్ముచేశారు. కత్తిపోట్లకు గురైనా సరే విమానం కోపైలట్ చేతుల్లోకి వెళ్లకుండా విజయవంతంగా అడ్డుకున్నాడు. దీంతో ప్రయాణికులందరి ప్రాణాలు నిలబడ్డాయి. రక్తమోడుతున్న కెప్టెన్ కుప్పకూలడం, అదే సమయానికి కాక్‌పిట్‌లోకి దూసుకొచ్చిన ప్రయాణికులు కోపైలట్‌ను నిలువరించడం, అదే విమానంలో ప్రయాణిస్తున్న ఇతర పైలట్లు వెంటనే సమయస్ఫూర్తితో విమానాన్ని తమ అదీనంలోకి తెచ్చుకుని సౌదీఅరేబియాలో సురక్షితంగా ల్యాండ్చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. దీంతో క్రాష్‌ల్యాండింగ్ వంటి మారణహోమంతో ముగియాల్సిన ఈ ఉదంతం అనూహ్యంగా సుఖాంతంగా పరిసమాప్తి అయింది. కత్తితో దాడికి పాల్పడిన కోపైలట్‌ను సౌదీలో అరెస్ట్‌చేసి అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇజ్రాయెల్ శివారు గ్రామాలపై హమాస్ సాయుధులు మెరుపుదాడిచేసి వందలాది మంది ఇజ్రాయెలీలను అంతంచేసిన ఘటన జరిగి మరో వారంలో మూడేళ్లు పూర్తవుతున్న వేళ ఈ విమాన హైజాక్ ఘటన జరగడం గమనార్హం. అసలేం జరిగింది? దర్యాప్తు సంస్థలు, ప్రత్యక్షసాక్షులైన ప్రయాణికులు, ఇజ్రాయెల్ ప్రభుత్వం, అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం బుధవారం ఉదయం 6.05 గంటలకు ఫ్లైదుబాయ్ విమానయాన సంస్థకు చెందిన బోయింగ్737 మ్యాక్స్ రకం ఎఫ్‌జెడ్1073 నంబర్ విమానం 27 మంది చిన్నారులుసహా 174 మంది ప్రయాణికులతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్అవీవ్ సమీప బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరింది. దాదాపు రెండు గంటల ప్రయాణం తర్వాత విమానం జోర్డాన్ గగనతలానికి చేరుకుంది. ఉదయం 8.31 గంటలప్పుడు విమానం 34,000 అడుగుల ఎత్తులో వెళ్తోంది. అదే సమయంలో కోపైలట్‌గా ఉన్న వ్యక్తి విమానాన్ని తన అధీనంలోకి తీసుకుని కుప్పకూల్చేందుకు ప్రయత్నించాడు. దీంతో విమానం హఠాత్తుగా 30 సెకన్లలోనే 20వేల అడుగుల కిందకు జారిపోయింది. ఇది గమనించిన కెప్టెన్ వెంటనే అతని చర్యను అడ్డుకున్నాడు. ఈ క్రమంలో విమానం గుండ్రంగా తిరిగి 5,000 అడుగులుపైకి, మళ్లీ 7,000 అడుగులు కిందకు జారింది. దీంతో ప్రయాణికులు హాహాకారాలు చేయడం మొదలెట్టారు. తనను అడ్డుకున్న కెప్టెన్‌ను కోపైలట్ కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. అయినాసరే కోపైలట్ దుశ్చర్యను కెప్టెన్ అడ్డుకునేందుకు శతథా ప్రయత్నించాడు. ‘విమానం పడిపోవచ్చు. ఎవరైనా వచ్చి నాకు సాయంచేయండి’’అని కెప్టెన్ అరిచాడు. దీంతో కాక్‌పిట్‌లో గొడవ జరుగుతున్న విషయం గమనించి ముందు వరసలో కూర్చున్న ఇజ్రాయెల్ ప్రయాణికులు, విమాన సిబ్బంది వెంటనే కాక్‌పిట్‌లోకి పరుగెత్తారు. కత్తితో దాడిచేస్తున్న కోపైలట్‌ను పట్టుకుని కిందకు అదిమిపట్టారు. అయినాసరే విమానంలోని భద్రతావ్యవస్థలను కోపైలట్ నాశనంచేసేందుకు యత్నించగా అందరూ కలిసి అతడిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులకు సైతం రక్తంమరకలు అంటాయి. ఇదంతా చూసిన వెనకవైపు కూర్చున్న డ్యూటీలో లేని ఇద్దరు యూరప్, బ్రిటన్‌కు చెందిన పైలట్లు సమయస్ఫూర్తితో వెంటనే కాక్‌పిట్‌లోకి వచ్చి విమానాన్ని తమ అ«దీనంలోకి తెచ్చుకున్నారు. ఇదంతా జరిగేలోపే కెప్టెన్ విమానం నుంచి 7700 కోడ్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది సాధారణ ఎమర్జెన్సీకి సంబంధించిన సిగ్నల్. వెనువెంటనే 7500 కోడ్ ఇచ్చాడు. ఇది హైజాక్ లేదా అనధికారంగా విమానాన్ని తమ వశం చేసుకోవడానికి సంబంధించిన సిగ్నల్. ఈ సిగ్నల్ అందుకున్న ఇజ్రాయెల్ వాయుసేన వెనువెంటనే తన అత్యాధునిక ఫైటర్జెట్లను ఈ విమానానికి తోడుగా పంపింది. పైలట్లు విమానాన్ని 9.45 గంటలకు సౌదీ అరేబియాలోని తబుక్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. రక్తమోడుతున్న కెప్టెన్‌ను వెంటనే ఆస్పత్రిలో చేరి్పంచారు. దాడిచేసిన కోపైలట్‌కు సైతం గాయా లయ్యాయని, ఇతడిని ఆస్పత్రిలో చేరి్పంచి చికిత్సచేయించాక అరెస్ట్‌చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇతడిని సౌదీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇతను ఒమన్ దేశస్తుడని వార్తలొచ్చాయి.హీరో కెప్టెన్ కోపైలట్‌తో వీరోచితంగా పోరాడి అందర్నీ కాపాడిన పైలట్ స్మిత్ మచ్ఛార్‌పై అభినందనల వర్షం కురిసింది. ఈయన గతంలో స్పైస్‌జెట్‌లో పనిచేశారు. తర్వాత 2022లో ఫ్లైదుబాయ్ సంస్థలో చేరారు. ఈయనకు పైలట్‌గా 13 ఏళ్ల అనుభవం ఉంది. ఏకంగా 9,750 గంటలకుపైగా విమానం నడిపారు. విమానసిబ్బంది వనరుల నిర్వహణలో, విమాన ప్రమాణాలు, నిబంధనలను పాటించడంలో, బోయింగ్ 737 రకం విమానాలను నడపడంలో నిష్ణాతుడు.చచ్చిపోతాననుకున్నా... విమానం వేగంగా కిందకు పడిపోతున్న దృశ్యాలను భయపడుతూనే అందులోని ప్రయాణికులు తమ ఫోన్లలో బంధించారు. ‘‘చచ్చిపోతాననుకున్నా. విమానం ఇష్టమొచ్చినట్లు గాల్లో గింగిరాలు తిరిగింది. బతుకుతాననుకోలేదు’’అని ఒక ప్రయాణికురాలు ఏడుస్తూ చెప్పింది. ‘‘దాడికి యత్నించిన ఉగ్రవాదిని పట్టుకున్నాం. ఇప్పుడు విమానం ల్యాండ్కాబోతోంది. ఈ ప్రాంతం సౌదీ అనుకుంటున్నా’’అని ముఖంపై రక్తం మరకలున్న ఒక ప్రయాణికుడు సెల్ఫీ వీడియోను పోస్ట్‌చేశారు. ‘ఐదుగురు కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లి సాహసోపేతంగా వ్యవహరించడంతో ఇప్పుడు మేమంతా బతికిబయటపడ్డాం’’అని దలియా పిగెల్ అనే ప్రయాణికుడు చెప్పారు. సౌదీలో దిగిన అదే విమానం రాత్రికల్లా గమ్యస్థానమైన ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. ప్రయాణికులను పొగిడిన నెతన్యాహూ... ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ స్పందించారు. ‘‘ఇది ఉగ్రదాడే. ఈ ప్రయాణికుల్లో ఎక్కువ మంది ఇజ్రాయెలీలే ఉన్నారు. వీళ్లను చంపేందుకు కోపైలట్ విమానాన్ని కుప్పకూల్చాలని పథకం పన్నాడు. ఈ కుట్రను ఇజ్రాయెలీ ప్రయాణికులు విజయవంతంగా వమ్ముచేశారు. అత్యంత సాహసోపేతంగా కోపైలట్‌ను పట్టుకుని మీకు సెల్యూట్. క్రాష్‌ల్యాండింగ్ కాకుండా అందర్నీ కాపాడిన మీరంతా హీరోలే. కోపైలట్‌ను సౌదీ అధికారులు ప్రశ్నిస్తున్నారు’’అని నెతన్యాహూ చెప్పారు. -
ప్రాణాలకు తెగించి అడ్డుకున్న ఇండియన్ పైలట్.. 180 మంది సేఫ్
-
గజ గజ వణికిన ప్రయాణీకులు : ఎమర్జెన్సీ ల్యాండింగ్‌తో సంబరాలు, వీడియో
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరిన 'ఫ్లైదుబాయ్' (flydubai) ప్రయాణికుల విమానంలో అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో విమానం సౌదీ అరేబియాలోని తబూక్ (Tabuk) విమానాశ్రయంలో సురక్షితంగా అత్యవసర ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికుల సంబరాలు చేసుకున్నారు. ఇంత సంక్షోభం మధ్య విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసిన పైలట్‌కు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.తబూక్ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా దిగిన తర్వాత ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. హెబ్రూ భాషలో "మా తండ్రి ఇంకా జీవనే ఉన్నారు" అని అర్థం వచ్చే "ఒడ్ అవిను చాయ్" (Od Avinu Chai) అనే గీతాన్ని పాడుతూ కేరింతలు కొట్టారు. గాయపడిన పైలట్ వీరత్వాన్ని ప్రయాణికులుప్రశంసిస్తూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారని, సంబంధిత అధికారులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నారని ఎయిర్‌లైన్స్ ధృవీకరించింది.בשירת "עוד אבינו חי": תיעוד מרגעי נחיתת המטוס בסעודיה @akivanovick pic.twitter.com/MmCxbz52ST— כאן חדשות (@kann_news) September 30, 2026పైలట్ల మధ్య గొడవ, వణికిపోయిన ప్యాసింజర్స్ ఇజ్రాయెల్ మీడియా, భద్రతా అధికారుల కథనం ప్రకారం, విమాన కాక్‌పిట్‌లో ఇద్దరు పైలట్ల మధ్య వివాదం తలెత్తి అది శారీరక ఘర్షణకు దారితీసింది. ప్రయాణికులు ముందు భాగం నుంచి కేకలు, అరుపులు వినపడినట్లు తెలిపారు. కొంతమంది ప్రయాణీకులు కూడా జోక్యం చేసుకకుని వారిని శాంతింప చేసినట్టు తెలుస్తోంది. గాయపడిన పైలట్‌కు ప్రయాణికులు కాపలాగా ఉన్నారు. ఈ ఘర్షణలో ఒక ప్రయాణికుడి టీ-షర్ట్‌కు రక్తపు మరకలు అయినట్లు ఫొటోలు వైరల్ అయ్యాయి. FlightRadar24 డేటా ప్రకారం, దుబాయ్ నుండి బయలుదేరిన సుమారు రెండున్నర గంటల తర్వాత, ఈ విమానం కేవలం నిమిష వ్యవధిలోనే సుమారు 33,000 అడుగుల నుండి 17,000 అడుగులకు అకస్మాత్తుగా పడిపోయింది.#BREAKING🚨 Cockpit video is now outShows a bloody altercation, with one of the pilots seen soaked in bloodA Flydubai flight from Dubai to Tel Aviv was forced to divert to Saudi Arabia after what authorities described as a “violent incident” between two pilotsThe aircraft… pic.twitter.com/p3eIQ58Ndw— Nabila Jamal (@nabilajamal_) September 30, 2026 ఉద్దేశపూర్వక కుట్ర కోణం విమానంలో ఏదో అసాధారణ ఘటన జరగడంతో పాటు ఒక ప్రయాణికుడు వీడియోలో 'విమానం హైజాక్ అయింది' అని చెప్పడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇది ఉగ్రదాడి కావచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.పైలట్లలో ఒకరు విమానాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చేయడానికి ప్రయత్నించగా, మరో పైలట్ దాన్ని అడ్డుకున్నారా అనే కోణంలో కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎయిర్‌లైన్స్ లేదా సంబంధిత దేశాలు అధికారికంగా ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు.హైజాక్ లేదా ఇజ్రాయెల్ ప్రజలపై దాడి జరిగే అవకాశం ఉందన్న అనుమానంతో ఇజ్రాయెల్ వెంటనే తన యుద్ధ విమానాలను (Fighter jets) గాల్లోకి దించింది. అయితే కొద్దిసేపటి తర్వాత హైజాక్ వార్తలను, అనుమానాలను అధికారులు తోసిపుచ్చారు.ఇదీ చదవండి : మీరట్ బ్లూ డ్రమ్ కేసు : కోర్టు సంచలన తీర్పు -
అమాంతం వేల అడుగుల కిందకు.. దుబాయ్–టెల్అవీవ్ విమానంలో కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంతో తాజాగా జరిగిన ఓ పరిణామం తీవ్ర కలకలం రేపింది. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో అత్యవసర పరిస్థితి నెలకొంది. విమానం తొలుత ఎమర్జెన్సీ కోడ్ పంపింది. కొద్దిసేపటికే హైజాక్ కోడ్ పంపడంతో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఫ్లై దుబాయ్ విమానంలో జరిగిన ఘటన ఉగ్రవాద చర్యేనన్న అంశంపై ఇజ్రాయెల్ భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఒమన్‌కు చెందిన సహ పైలట్ విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించినట్లు అనుమానిస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ప్రధాన పైలట్ సిబ్బంది, కొంతమంది ఇజ్రాయెల్ ప్రయాణికుల సాయంతో అక్కడి పరిస్థితులను తమ అధీనంలోకి తీసుకున్నట్లు ఇజ్రాయెల్ భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఘటనపై సౌదీ అరేబియాలో జరుగుతున్న దర్యాప్తులో ఇజ్రాయెల్ అధికారులు కూడా పాల్గొంటున్నారు. ఫ్లై దుబాయ్‌కి చెందిన ఎఫ్‌జెడ్ 1073 విమానం బుధవారం దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయానికి బయలుదేరింది. విమానంలో 174 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో 27 మంది చిన్నారులు ఉన్నారు. ప్రయాణంలో భాగంగా విమానం అకస్మాత్తుగా భారీగా కిందికి దిగింది. సుమారు 34,000 అడుగుల ఎత్తు నుంచి కొద్ది సమయంలోనే 14,000 అడుగులకు పడిపోయింది. ఒక దశలో నిమిషానికి 30,976 అడుగుల వేగంతో కిందికి దిగినట్లు విమాన పర్యవేక్షణ వివరాలు చూపించాయి.జోర్డాన్ గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత విమానం మొదట అత్యవసర పరిస్థితిని సూచించే 7700 సంకేతాన్ని ప్రసారం చేసింది. అనంతరం విమానాన్ని హైజాక్ చేసినట్లు సూచించే 7500 సంకేతాన్ని పంపింది. దీంతో ఇజ్రాయెల్‌లో భద్రతా వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. వైమానిక దళానికి చెందిన 2 యుద్ధ విమానాలను కూడా గాల్లోకి పంపించారు.కాక్‌పిట్‌లో భారీగా రక్తం విమానం తర్వాత సౌదీ అరేబియా వైపు మళ్లీ, తక్కువ ఎత్తులో ప్రయాణించింది. చివరకు తబూక్ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. ప్రయాణికుల కథనాల ప్రకారం కాక్‌పిట్‌లో భారీగా రక్తం కనిపించింది. దుబాయ్‌కు చెందిన విమానయాన సంస్థ కూడా విమానంలో హింసాత్మక ఘటన జరిగినట్లు ధ్రువీకరించింది.విమానంలో ఉన్న మిరియం అనే ప్రయాణికురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కాక్‌పిట్ నుంచి అరుపులు వినిపించాయని, అక్కడికి వెళ్లినప్పుడు భారీగా రక్తం కనిపించిందని చెప్పారు. ఒక వ్యక్తి పైలట్‌ను చిన్న కత్తితో పొడిచినట్లు ఆమె పేర్కొన్నారు. “విమానం కూలిపోతుందని అనిపించింది. నేను ‘షెమా ఇజ్రాయెల్’ అని అరిచాను” అని ఆమె చెప్పింది. వైద్యుడు, నర్సు పైలట్‌కు ప్రాథమిక చికిత్స అందించారని, ఇజ్రాయెల్ ప్రయాణికులు సిబ్బందితో కలిసి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని ఆమె వివరించారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రయాణికులను సౌదీ అరేబియా నుంచి తిరిగి తీసుకురావడానికి సైనిక విమానాలను పంపాలని ఆదేశించారు. ఈ ఘటన ఉగ్రవాద చర్యగా నిర్ధారణ అవుతుందా, విమానంలో అసలు ఏం జరిగిందనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. 🚨✈️🇦🇪🇮🇱 Un vol Flydubai reliant Dubaï à Tel-Aviv a déclenché le code d’urgence signalant un possible détournement alors qu’il transportait environ 180 passagers.L’appareil a été dérouté vers l’Arabie saoudite. pic.twitter.com/JCAcaidYT0— KRONIK Insights (@KRONIKInsights) September 30, 2026పైలట్ల మధ్య గొడవ?విమానంలో ఏం జరిగిందన్న దానిపై ప్రాథమికంగా భిన్న కథనాలు వెలువడ్డాయి. కాక్‌పిట్‌లో ఇద్దరు పైలట్ల మధ్య భౌతికంగా గొడవ జరిగినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఈ ఘటన నేపథ్యంలోనే.. నొక్కుకుపోయి ఎమర్జెన్సీ సిగ్నల్ పంపినట్లు సమాచారం. 7500 కోడ్ సాధారణంగా హైజాక్ సమయంలో ఉపయోగిస్తారు. అందుకే ఇజ్రాయెల్ అధికారులు తొలుత అప్రమత్తమయ్యారు. అయితే అసలు విమానంలో ఏం జరిగిందన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.UPDATE: The plane has landed safely in Saudi Arabia. The assessment in Israel is that the emergency signal on the plane was activated during a violent altercation between the pilots in the cockpit, and not due to a highjacking. https://t.co/Cz2W33I5qO— Ariel Oseran أريئل أوسيران (@ariel_oseran) September 30, 2026ఇదీ చదవండి: ఇండియన్ సినిమాలు.. ఓ ఆటాడుకుంటున్న ఇరాన్! -
విశాఖకు ఫ్లైదుబాయ్ ఫ్లైట్
విశాఖకు ఫ్లైదుబాయ్ ఫ్లైట్ Flydubai Flight to visakha విశాఖ,ఫ్లైదుబాయ్, ఫ్లైట్,Flydubai, Flight, visakha గోపాలపట్నం: విశాఖ విమానాశ్రయంలో మరో అందమైన విమానం వాలబోతోంది. అది దుబాయ్‌కి మరో సర్వీసుగా అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఎయిరిండియా విమానం దుబాయ్ నుంచి విశాఖకు సర్వీసులు అందిస్తోంది. దీనికి ప్రయాణికుల తాకిడి పెరగడంతో ఫ్లైదుబాయ్ విమాన సంస్ధ కూడా ఇటు వైపు ఉవ్విళ్లూరుతోంది. దీనికి తాజాగా ముహూర్తం కూడా పెట్టేసింది. అక్టోబరు 25 నుంచి దుబాయ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి సర్వీసులు అందించడానికి రంగం సిద్ధం చేసినట్లు ఆ సంస్ధ వర్గాలు తెలిపాయి.


