నాడు మాటల్లో... నేడు చేతల్లో! | Indian Pilot Smit Machchhar Podcast Goes Viral After Flydubai Incident | Sakshi
Sakshi News home page

Smit Machchhar నాడు మాటల్లో... నేడు చేతల్లో!

Oct 9 2026 3:03 PM | Updated on Oct 9 2026 3:12 PM

Indian Pilot Smit Machchhar Podcast Goes Viral After Flydubai Incident

వ్యూ  పాయింట్‌ 

పాడ్‌కాస్ట్‌:బోనా–ఫైడ్‌ బ్యాంటర్‌

అతిథి : కెప్టెన్‌ స్మిత్‌  మచ్ఛార్‌

హోస్ట్‌:జలక్‌ మెహ్‌తా, ఆంత్రప్రెన్యూర్, పాడ్‌కాస్టర్‌

సెప్టెంబర్‌ 30న ఫ్లయ్‌దుబాయ్‌ విమానంలో ఎదురైన తీవ్ర ప్రాణాంతక పరిస్థితిలో ప్రయాణికులందరినీ కాపాడి వార్తల్లో నిలిచారు కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛార్‌. ఈ సంఘటన తర్వాత, దాదాపు 11 నెలల క్రితం పాడ్‌కాస్టర్‌ జలక్‌ మెహ్‌తాకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడిన ప్రతి మాటా మొన్నటి ఘటనలో ఆయన చూపిన తెగువకు, అసమాన ధైర్యానికి అద్దం పట్టింది. ముఖ్యాంశాలు.. 

చిన్ననాటి కల కాదు

 ‘‘చాలామంది పైలట్లకు ఉన్నట్లు విమానయానం అనేది నా చిన్ననాటి కల కాదు. నా జీవితంలోకి చాలా ఆలస్యంగా ఈ ఆలోచన వచ్చింది. స్కూల్‌ పూర్తయ్యాక, నేను టెక్స్‌టైల్‌ ఇంజనీరింగ్‌ కోర్సులో చేరాను. ఎందుకంటే అది మా కుటుంబ వ్యాపారం. నేను ఆ కోర్సు పూర్తి చేశాను కానీ అప్పటికి ఇంకా చిన్న వయసే కావటంతో ఇంకొంచెం చదువుకోవాలనుకుని మేనేజ్‌మెంట్‌ చేశాను. ఆ కోర్సు చేస్తున్నప్పుడు 19 ఏళ్ల వయసులో నేను ఒక ఏవియేషన్‌ సదస్సుకు హాజరయ్యాను. అప్పుడే నాకిది బాగా నచ్చేసింది. ఆ విశేషాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి, దాంతో నేను కమర్షియల్‌ ఫ్లైట్‌ ట్రైనింగ్‌ కోసం న్యూజిలాండ్‌ వెళ్లాను. ఇండియా దాటి బయటి దేశానికి వెళ్లడం నాకు అదే మొదటిసారి.

కాపాడేది క్యాబిన్‌ ‘క్రూ’నే
‘‘ప్రయాణికులు తరచూ క్యాబిన్‌ ‘క్రూ’ని తక్కువగా చూస్తారు లేదా కేవలం ఆహారం, సేవలు అందించే సిబ్బందిగానే భావిస్తారు. కానీ 30,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే మిమ్మల్ని ఎవరు కాపాడతారు? విమానంలో డాక్టర్‌ ఉంటే అది మీ అదృష్టం. లేకపోతే ఆ క్యాబిన్‌ ‘క్రూ’నే మిమ్మల్ని కాపాడాలి. వారు భద్రత, అత్యవసర సమయాల్లో అనుసరించాల్సిన పద్ధతులు, ప్రథమ చికిత్స, పల్స్‌/ప్రాణ సంకేతాలను పరీక్షించడంలో అత్యుత్తమమైన కఠిన శిక్షణను పొంది  ఉంటారు. పైలట్లుగా విమానంలో ఏమైనా సమస్య వస్తే మేము చేయగలిగిందల్లా వీలైనంత వేగంగా విమానాన్ని ల్యాండ్‌ చేసి నేల మీద ఉన్న వైద్యులకు అప్పగించడమే. కానీ విమానం లోపల నిజంగా మీ ప్రాణాలు కాపాడేది మాత్రం ఆ క్యాబిన్‌ క్రూ సిబ్బందే.

ఇదీ చదవండి : అక్టోబర్‌ 10 సీజేపీ నిరసన : షాకిచ్చిన ఢిల్లీ పోలీసులు

క్షేమమొక్కటే కొలమానం
‘‘సమయానికి చేరుకోవడం లేదా చాలా స్మూత్‌గా ల్యాండింగ్‌ చేయడం, వీటిలో ఏది మీకు ఎక్కువ తృప్తినిస్తుంది అని నన్ను అడిగితే, రెండూ కాదు, కేవలం ‘సురక్షితంగా వెళ్లడమే’ అని చెప్తాను. ఒక పైలట్‌గా నాకు సమయానికి వెళ్లే రికార్డుల గురించి ఆలోచన ఉండదు. టైమింగ్స్‌ చూసుకోవడానికి ఎయిర్‌లైన్స్‌ వేరే వాళ్లను నియమిస్తుంది. సరైన ప్రదేశంలో, క్షేమంగా విమానాన్ని ల్యాండ్‌ చేయడమే నా దృష్టిలో మంచి ల్యాండింగ్‌. అది చాలా స్మూత్‌గా  (బటర్‌–స్మూత్‌) జరిగితే ఇంకా సంతోషం. ప్రయాణికులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ విమానం దిగి క్షేమంగా,  సురక్షితంగా భూమిపైకి అడుగుపెట్టడమే నాకు ఉద్యోగ ధర్మానికి ముఖ్యమైన ఒకే ఒక్క కొలమానం.

-ఎడిటోరియల్‌ టీమ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement