పుణె: పుణె నుంచి గౌహతికి 192 మందితో బయలుదేరిన ఇండిగో విమానం అత్యవసరంగా వెనక్కి మళ్లింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత ల్యాండింగ్ గేర్ లోపలికి ముడుచుకోకుండా అలాగే ఉండిపోయింది. దీంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే అధికారులకు సమాచారం అందించి, అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు.
ఫ్లైట్ నంబర్ 6E 0623 (VT-IZE) ఆదివారం ఉదయం 9:04 గంటలకు పుణె విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలో మొత్తం 192 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వారందరినీ క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. పైలట్ నుంచి సమాచారం అందుకున్న వెంటనే పుణె విమానాశ్రయ అధికారులు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ), ఇండిగో సిబ్బంది అప్రమత్తమయ్యారు. భారత వైమానిక దళం ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్‌లు, అత్యవసర సహాయక బృందాలను సిద్ధంగా ఉంచారు. ల్యాండింగ్ గేర్ పరిస్థితిని పరిశీలించేందుకు విమానం రన్‌వేపై తక్కువ ఎత్తులో ఒకసారి చక్కర్లు కొట్టింది.
అప్రమత్తమైన సహాయక బృందాలు
విమానం సురక్షితంగా దిగిన అనంతరం మూడు అగ్నిమాపక వాహనాలు, రెండు అంబులెన్స్‌లు దానికి ఎస్కార్ట్‌గా వెళ్లాయి. విమానాన్ని బే నంబర్ 7 వద్దకు తరలించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని నిర్ధారించుకున్న అధికారులు ఉదయం 9:10 గంటలకు ఫుల్ ఎమర్జెన్సీని ఉపసంహరించారు. అనంతరం ఏరోబ్రిడ్జిని అనుసంధానించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా విమానం నుంచి దిగారు.
ప్రయాణికుల కోసం మరో విమానం ఏర్పాటు
ఈ ఘటనతో గువాహటికి వెళ్లాల్సిన ప్రయాణికులు పుణెలోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో ఇండిగో సంస్థ వారికి ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేస్తోంది. బెంగళూరు నుంచి మరో విమానాన్ని పుణెకు పంపించి, అక్కడి నుంచి ప్రయాణికులను గౌహతికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విమానాశ్రయ అధికారులు, ఏటీసీ, విమానయాన సంస్థ సమన్వయంతో అత్యవసర చర్యలు చేపట్టడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకే ప్రాధాన్యమిస్తూ అన్ని భద్రతా నిబంధనలను పాటించినట్లు అధికారులు తెలిపారు.


