నా అసలైన కల అదే.. శుభాంశు శుక్లా కీలక వ్యాఖ్యలు | Shubhanshu Shukla says real mission is to see Tricolour on Moon by 2040 | Sakshi
Sakshi News home page

నా అసలైన కల అదే.. శుభాంశు శుక్లా కీలక వ్యాఖ్యలు

Nov 15 2026 11:20 AM | Updated on Nov 15 2026 11:24 AM

Shubhanshu Shukla says real mission is to see Tricolour on Moon by 2040

చండీగఢ్‌: అంతరిక్షంలోకి వెళ్లి రావడం తన ప్రయాణంలో ఒక మైలురాయి మాత్రమేనని.. చంద్రుడిపై భారతీయుడు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే రోజును చూడటమే తన అసలైన లక్ష్యమని తొలి భారతీయ అంతరిక్ష కేంద్రం సందర్శకుడు కెప్టెన్‌ శుభాంశు శుక్లా అన్నారు. 2040 నాటికి ఈ కల సాకారం కావాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం భారత మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ విజయవంతం కావడానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

చండీగఢ్‌లో జరిగిన 10వ మిలిటరీ లిటరేచర్‌ ఫెస్టివల్‌లో శుభాంశు శుక్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ఫైటర్‌ కాక్‌పిట్‌ నుంచి అంతరిక్ష నౌక వరకు అంతరిక్ష రంగంలో భారత్‌ కొత్త ప్రయాణం’ అనే అంశంపై మాట్లాడారు. 2025 జూన్‌లో ఆక్సియమ్‌-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తన అనుభవాలను వివరించారు. మొత్తం 20 రోజులు, 3 గంటల పాటు సాగిన ఆ అంతరిక్ష ప్రయాణంలో తాను ఎప్పుడూ ఒంటరిగా భావించలేదని చెప్పారు. దేశం మొత్తం తనతోనే ఉందన్న భావన కలిగిందని పేర్కొన్నారు.

అంతరిక్ష ప్రయాణం అంత సులభం కాదు!
అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్‌ క్యాప్సూల్‌లో తిరుగు ప్రయాణం ప్రారంభించినప్పుడు పరిస్థితులు తాను ఊహించిన దానికంటే భిన్నంగా, తీవ్ర గందరగోళంగా ఉన్నాయని శుక్లా తెలిపారు. ప్రయాణం మొదలైన క్షణంలో అసలు అంతరిక్షానికి వెళ్లాలన్న నిర్ణయం సరైందేనా అనే సందేహం కూడా కలిగిందని వెల్లడించారు. ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనే సమయంలో తొలుత ఆందోళన, అయోమయం సహజమేనని చెప్పారు. స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌-9 రాకెట్‌లో 20 రోజులకు పైగా గడిపిన అనుభవాన్ని వివరిస్తూ.. అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల తొలుత శరీరం ఇబ్బందికి గురవుతుందని తెలిపారు. బరువులేని పరిస్థితుల్లో శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయని, ఎత్తు పెరగడం, గుండె పరిమాణం తగ్గడం వంటి మార్పులను అనుభవిస్తామని వివరించారు. ముందస్తు శిక్షణ ఎంత ఉన్నా.. పరిశోధనల ద్వారా సమాజానికి తిరిగి సేవ చేయాలన్న సంకల్పమే సవాళ్లను ఎదుర్కొనే అసలైన బలమని పేర్కొన్నారు.

యువతకు శుభాంశు సందేశం
యువత సైన్స్‌పై ఆసక్తి పెంచుకోవాలని, పెద్ద కలలు కనడానికి భయపడకూడదని శుక్లా సూచించారు. తరగతి గదుల్లోనే గొప్ప ఆలోచనలు, కలలు పుడతాయని.. వాటిని ధైర్యం, పట్టుదలతో నిజం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తన ఆక్సియమ్‌-4 మిషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పెగ్గీ విట్సన్‌ ఉదాహరణను ప్రస్తావించారు. అంతరిక్ష యాత్రకు ఎంపికయ్యే ముందు ఆమె తొమ్మిదిసార్లు తిరస్కరణకు గురయ్యారని, 39 ఏళ్ల వయసులో అంతరిక్ష ప్రయాణానికి ఎంపికయ్యారని తెలిపారు. ప్రస్తుతం అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యోమగామిగా ఆమె నిలవడం.. నిరాశ చెందేవారికి గొప్ప ప్రేరణ అని చెప్పారు. ఆక్సియమ్‌-4 మిషన్‌ అనుభవంతో పాటు ప్రస్తుతం గగన్‌యాన్‌ మిషన్‌ విజయవంతం కావడానికి తాను చురుగ్గా పనిచేస్తున్నట్లు శుభాంశు శుక్లా వెల్లడించారు. భారత అంతరిక్ష ప్రయాణంలో మరో కీలక ఘట్టానికి సిద్ధమవుతున్న వేళ.. 2040 నాటికి చంద్రుడిపై భారతీయుడు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలన్న తన ఆకాంక్షను ఆయన మరోసారి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: స్టేజ్‌పై నుంచి మైక్‌ విసిరికొట్టిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement