సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శుక్రవారం రాత్రి 11.51 గంటలకు ప్రయోగించిన ఎన్‌వీఎస్–03 నావిగేషన్ ఉపగ్రహం, తన మొదటి విడత కక్ష్య దూరం పెంపు ప్రక్రియను శనివారం సాయంత్రం విజయవంతంగా పూర్తి చేసుకుంది. మొదటి విడత ఆపరేషన్ తరువాత ఉపగ్రహం కక్ష్య (భూమికి దగ్గరి, దూరపు స్థానాలు)లో మార్పులు చేశారు. భూమికి అత్యంత దగ్గరగా ఉండే దూరం (పెరిజీ)మొదట 170.3 కిలోమీటర్లు ఉండగా, దానిని 5,477.6 కిలోమీటర్లకు పెంచారు.
భూమికి అత్యంత దూరంగా ఉండే దూరం (అపోజీ) మొదట 38,080 కిలోమీటర్లు ఉండగా, అది ప్రస్తుతం 37,833.4 కిలోమీటర్ల వద్ద స్థిరపడింది. కక్ష్య దూరాన్ని పెంచే అపరేషన్‌ను బెంగళూరులోని ఇస్ట్రాక్ కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు ఉపగ్రహంలో లామ్ ఇంజిన్‌ను 2,174.8 సెకండ్లు మండించి విజయవంతం చేశారు. మరో మూడు విడతల్లో ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ నుంచి భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియోఆర్బిట్‌లోకి ప్రవేశపెడతామని కూడా శాస్త్రవేత్తలు తెలియజేశారు.


