ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం
మచిలీపట్నానికి 1200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం
రేపటికి తుపానుగా మారి కావలి వద్ద తీరందాటే అవకాశం
కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఈదురు గాలులు
మత్స్యకారులు వేటకు వెళ్ల వద్దని హెచ్చరించిన వాతావరణ శాఖ
సాక్షి, అమరావతి : కోస్తాంధ్రను అతలాకుతలం చేసిన అర్నబ్ తుపాను గాయాలు ఇంకా సలుపుతుండగానే, రాష్ట్రాన్ని మరో తుపాను ముప్పు వణికిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ సముద్ర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం శనివారం వాయుగుండంగా మారింది. ఇది మరింత బలపడి తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇది శ్రీ విజయపురానికి 330, చెన్నైకి 1140, మచిలీపట్నానికి 1200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఇది పశ్చిమ వాయువ్య దిశగా ఏపీ తీరం వైపు కదులుతూ ఆదివారానికి తీవ్ర వాయుగుండంగా, సోమవారానికి ఏపీ తీరానికి దగ్గరగా చేరుకుని తుపానుగా బలపడనుంది. మంగళవారం కావలి సమీపంలో తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఆది, సోమ, మంగళవారాల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదివారం కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి.
మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్
కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో సోమవారం అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అదే రోజు ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పుగోదావరి, కోనసీమ, నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
మంగళవారం కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలు, యానాంలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి. బుధవారం అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు
తీరం వెంబడి ఆదివారం సాయంత్రం నుంచి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సోమవారం మధ్యాహ్నానికి గాలుల తీవ్రత గరిష్టంగా 85 కిలోమీటర్లకు, సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు గంటకు గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది.


