కూటమికి ఓటెందుకు వేయాలి చంద్రబాబూ?
నిగ్గదీస్తున్న రాష్ట్ర ప్రజానీకం
28 నెలల పాలనలో కూటమి సర్కార్ ఘోర వైఫల్యం
సూపర్ సిక్స్... సూపర్ సెవెన్ హామీల ఎగవేత
143 ఎన్నికల హామీలు గాలికి.. మేనిఫెస్టో బుట్టదాఖలు
రెడ్‌బుక్ రాజ్యాంగంతో అరాచకం..
రెండున్నరేళ్లలో 1,002 హత్యలు.. 378 అత్యాచారాలు
యథేచ్ఛగా మద్యం, గంజాయి దందా
అన్నింటా బరితెగించి అవినీతి
ధరాఘాతంతో సామాన్యుడి బతుకు భారం
ప్రజలను ఓట్లు అడిగే నైతిక అర్హత లేని చంద్రబాబు
అందుకే దాడులు, దౌర్జన్యాలతో ఎన్నికల అక్రమాలు
టీడీపీ గూండాలు, పచ్చ ఖాకీలతో విధ్వంస కాండ
కొమ్ముకాస్తున్న ఎన్నికల కమిషన్, అధికార యంత్రాంగం
బలవంతపు ఏకగ్రీవాలతోకూటమి బుకాయింపు
అయినా ఎన్నికలు ఎదుర్కొనేందుకు వెనుకంజే
కూటమి సర్కార్ వైఫల్యాలను సర్వత్రా నిలదీస్తున్న ప్రజలు
అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు, అవినీతిపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహం
సమాధానం చెప్పే ధైర్యం లేక మొహం చాటేస్తున్న చంద్రబాబు
‘టీడీపీ కూటమికి ఎందుకు ఓటు వేయాలి చంద్రబాబూ...?’
రాష్ట్ర ప్రజానీకం సూటిగా అడుగుతున్న ప్రశ్న ఇదీ...!
‘రెండున్నరేళ్లలో మీరు ఏం చేశారని మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయాలి...?’
వెల్లువెత్తుతున్న ప్రజా చైతన్యం కూటమి సర్కార్‌ను కుదిపి వేస్తున్న ప్రశ్న ఇదీ...
సాక్షి, అమరావతి: సర్వత్రా వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సీఎం చంద్రబాబు నుంచి కనీస స్పందన లేకపోగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కిమ్మనడం లేదు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లకు సమాధానం చెప్పలేక ముఖం చాటేస్తున్నారు. ఇదిగో..! ఇది చేశాం కాబట్టి మాకు ఓటు వేయండి! అని ఒక్క మాట చెప్పలేక చల్లగా జారుకుంటున్నారు. రాష్ట్రంలో పోలీసు మార్కు గూండాయిజం, టీడీపీ రౌడీమూకలతో బీభత్సం సృష్టించి బలవంతంగా చేయించుకున్న ఏకగ్రీవాలపై ప్రజలు సూటిగా నిలదీస్తుండటంతో ప్రభుత్వ పెద్దలు బెంబేలెత్తుతున్నారు.
మరోవైపు పచ్చముఠాల అరాచకాలు, దౌర్జన్య కాండకు ఎదురొడ్డి రాష్ట్రంలో మెజార్టీ స్థానాల్లో స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ధీరోదాత్తంగా బరిలో నిలిచారు. ఆదివారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పట్టణ ఓటర్లు తీర్పు చెప్పేందుకు సిద్ధమయ్యారు. ప్రజాభిప్రాయాన్ని బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తం చేయనున్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా.. ప్రజాస్వామ్యయుతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తే అసలు సిసలైన ప్రజా తీర్పు వెలువడుతుంది. అందుకే ఎంతటి విధ్వంసమైనా సృష్టించి ఎన్నికల అక్రమాలకు బరి తెగించాలని చంద్రబాబు ముఠా కుట్రలకు పదును పెడుతోంది.
పోలింగ్ ముంగిట సామాన్య ఓటరు అడుగుతున్న ఒకే ఒక ప్రశ్న సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసలు టీడీపీ కూటమికి ఎందుకు ఓటు వేయాలి..? రాష్ట్రంలో 28 నెలలుగా సాగుతున్న టీడీపీ సర్కార్ అసమర్థ, అవినీతి, అరాచక పాలనను ఆమోదించటానికి కూటమికి ఓటు వేయాలా? అని ప్రజలు నిగ్గదీస్తున్నారు. ప్రజలు అంటే మరీ అంత చులకనా? అని ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి జవాబు చెప్పే ధైర్యం లేక చంద్రబాబు తనకు అలవాటైన రీతిలో కుట్రపూరిత రాజకీయాలకు పదును పెడుతున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
నామినేషన్లు కూడా వేయనివ్వకుండా..
రెండున్నరేళ్ల పాలనలో పూర్తిగా వైఫల్యం చెందిన చంద్రబాబు ఎన్నికలు అంటేనే హడలెత్తిపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి రావడంతో దండోపాయానికి తెరతీశారు. పోలీసు యంత్రాంగాన్ని టీడీపీ రౌడీమూకల మాదిరిగా తయారు చేసి అరాచకాలకు తెర తీశారు. బెదిరింపులు, దాడులు, విధ్వంసానికి తెగబడ్డారు. డీజీపీ నుంచి ఎస్సై వరకూ యావత్తు పోలీసు యంత్రాంగం టీడీపీ గూండాగిరీకి ఊడిగం చేసిందన్నది బహిరంగ రహస్యంగా మారింది.
ఇక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం టీడీపీ ప్రధాన కార్యాలయంగా మారిపోయిందన్నది నగ్న సత్యం. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకునేందుకు పోలీసులు, ఇతర అధికార యంత్రాంగాన్ని నిస్సిగ్గుగా దుర్వినియోగం చేశారు. టీడీపీ గూండాలు కాలకేయుల మాదిరిగా మారణాయుధాలతో విరుచుకుపడ్డారు. టీడీపీ వీర విధేయ పోలీసులు అధికారిక రౌడీలుగా మారి ప్రభుత్వ ప్రాయోజిత రౌడీయిజానికి తెగబడ్డారు. టీడీపీ గూండాలు, కూటమి ప్రభుత్వం పెంచి పోషిస్తున్న గంజాయి బ్యాచ్‌ల దాడులు, దౌర్జన్యాలు, హత్యా యత్నాలు అడ్డూ అదుపూ లేకుండా సాగాయి.
ఎన్నికల కమిషనర్ నుంచి కలెక్టర్లు, జేసీలు, ఆర్డీవోలు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు... ఇలా మొత్తం అధికార యంత్రాంగం టీడీపీ ఎన్నికల అక్రమాలకు వత్తాసు పలికింది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో టీడీపీ మూకలు విచ్చలవిడిగా దాడులు, దౌర్జన్యాలకు తెగబడ్డాయి. ఇతర జిల్లాల్లోనూ టీడీపీ రౌడీయిజం వెర్రితలలు వేసింది. అటు శ్రీకాకుళం నుంచి ఇటు సత్యసాయి జిల్లా వరకు టీడీపీ రౌడీలు, పచ్చ ఖాకీ మూకలు యథేచ్ఛగా సాగించిన విధ్వంసకాండ చూసి యావత్ దేశం నివ్వెరపోయింది.

ఇప్పటికే రూ.2,06,744.46 కోట్లు ఎగ్గొట్టినందుకు ఓటేయాలా?
కూటమి ప్రజా కంటక పాలనతో విసుగెత్తిపోయిన ప్రజానీకం స్థానిక ఎన్నికల పోలింగ్ ముంగిట సూటిగా సంధిస్తున్న ప్రశ్నలు చంద్రబాబును కలవరపాటుకు గురి చేస్తున్నాయి. టీడీపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలు, సూపర్ సిక్స్‌లను గుర్తు చూస్తూ ఎందుకు నెరవేర్చలేదని నిలదీస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే రూ.2,06,744.46 కోట్ల మేర ప్రజలకు ఎగ్గొట్టి దారుణంగా వంచించింది.
విద్యార్థులు, ఉద్యోగులకు దగా
రూ.40 వేల కోట్ల బకాయిల సంగతేంటన్న ఉద్యోగుల ప్రశ్నకు కూటమి అభ్యర్థుల నుంచి సమాధానం కరువైంది. ఐఆర్ లేదు.. ఐదు డీఏలు పెండింగ్.. పైగా వేధింపులంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఫీజు రీయింబర్స్‌మెంట్ అసలే లేదు.. వసతి దీవెనా లేదని.. కూటమి ప్రభుత్వ నిర్వాకం వల్ల చదువులు మానేయాల్సి వస్తుంది’ అని విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు సర్కార్ దారుణ వైఫల్యాలు, మోసాలను నిలదీస్తూ ప్రజలు సంధిస్తున్న కొన్ని ప్రశ్నలివీ...!
సూపర్ సిక్స్ పేరిట నిలువునా మోసం..
» ఇప్పటికే ప్రజలకు రూ.2.06 లక్షల కోట్లు ఎగవేత, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల పేరిట చంద్రబాబు మోసాలపై ప్రజలు మండిపడుతున్నారు. హామీలిచ్చి అమలు చేయనందుకు ఓటు వేయాలా బాబూ? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో పథకాన్ని లెక్కలతో గుర్తు చేసి చంద్రబాబు మోసాలను ఎండగడుతున్నారు.
» 2024 జనవరి నాటికి రాష్ట్రంలో 66.34 లక్షల మంది పింఛన్‌దారులు ఉంటే... 2026 అక్టోబరులో కూటమి ప్రభుత్వం 60.13 లక్షలమందికే పింఛన్ పింపిణీ చేసింది. అంటే చంద్రబాబు వచ్చాక ఏకంగా 6.21 లక్షల మంది పింఛన్లను రద్దు చేశారన్నది స్పష్టమవుతోంది.
» 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం... ఇవ్వలేకపోతే నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని చంద్రబాబు గాలికి వదిలేశారు. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు చొప్పున ప్రతి నెలా రూ.600 కోట్లు చెల్లించాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం 2024–25, 2025–26, 2026–27 బడ్జెట్‌లలో నిరుద్యోగ భృతికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అంటే మూడేళ్లలో రాష్ట్రంలో నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం ఏకంగా రూ.21,600 కోట్ల మేర మోసం చేసింది!
» 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం కింద ఏటా రూ.18 వేలు చొప్పున ఇస్తామన్న హామీని చంద్రబాబు తుంగలో తొక్కారు. హామీ ప్రకారం రాష్ట్రంలో 1.80 కోట్ల మంది మహిళలకు ఏడాదికి రూ.32,400 కోట్లు ఇవ్వాలి. కానీ మూడేళ్లుగా బడ్జెట్‌లో పైసా కేటాయించకుండా కూటమి ప్రభుత్వం మొత్తం రూ.97,200 కోట్లు మహిళలకు ఎగ్గొట్టింది.
» ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న హామీ కూడా నీటిమూటే అయ్యింది. ఆ కేటగిరీలో రాష్ట్రంలో 20 లక్షల మందికిపైగా ఉన్నారు. వారికి నెలకు రూ.4 వేలు చొప్పున ఏడాదికి రూ.9,600 కోట్లు ఇవ్వాలి. కానీ మూడేళ్లలో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. తద్వారా మూడేళ్లలో మొత్తం రూ.28,800 కోట్లు ఎగ్గొట్టారు.
» తల్లికి వందనం పథకం అమలులో చంద్రబాబు తన వక్రబుద్ధిని చూపారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని కూటమి హామీ ఇచ్చింది. రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు చదువుతున్నారు. ఏడాదికి రూ.15 వేలు చొప్పున మొత్తం రూ.13,112.82 కోట్లు పంపిణీ చేయాలి. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 2024–15లో ఈ పథకం అమలు చేయకుండా డబ్బులు ఎగ్గొట్టారు. ఇక 2025–26లో 67,27,124 మందికి రూ.10,090 కోట్లు పంపిణీ చేశామని సీఎం చంద్రబాబే స్వయంగా ప్రకటించారు. కానీ వాస్తవానికి ఇప్పటికీ 66 లక్షల మందికి రూ.6,377 కోట్లు మాత్రమ చెల్లించారు. అంటే ఒక్కొక్క విద్యార్థికి రూ.8 వేలు, రూ.9 వేలు, రూ.10 వేలు చొప్పునే చెల్లించినట్టు స్పష్టమవుతోంది. ఇక 2026–27లో జమ చేస్తోంది దాదాపు రూ.6,377 కోట్లే. అంటే ఈ పథకం కింద ఇప్పటికే తల్లులకు ప్రభుత్వం రూ.26,554 కోట్లు బకాయి పెట్టి నిలువునా మోసం చేసింది.
» రైతులను చంద్రబాబు ప్రభుత్వం నిలువునా ముంచేసింది. కేంద్ర పథకం పీఎం కిసాన్‌తో నిమిత్తం లేకుండా అన్నదాతా సుఖీభవ కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేలు చొప్పున పెట్టుబడి సహాయం అందిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వారికి ఏడాదికి రూ.10,716.53 కోట్లు పెట్టుబడి సహాయం కింద అందించాలి. మూడేళ్లలో మొత్తం రూ.32,149.59 కోట్లు కేటాయించాలి. కానీ తొలి ఏడాది ఇవ్వకుండా ఎగ్గొట్టారు. 2025–26లో 46,85,838మంది రైతులకు ఒక్కొక్కరికీ రూ.14 వేలే ఇచ్చారు. 2026–27లో 46.85 లక్షల మంది రైతులకు సగటున రూ.పది వేలే విదిల్చారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు అన్నదాతా సుఖీభవ కింద ఇప్పటికి రూ.20,905 కోట్లు బకాయి పెట్టింది. ఇక కౌలు రైతులకు పూర్తిగా సాయాన్ని ఎగ్గొట్టింది.
» దీపం పథకం కింద రాష్ట్రంలో 1,59,20,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సిలిండర్ ధర రూ.855. ఆ లెక్కన ఏడాదికి మూడు సిలిండర్ల చొప్పున ఇవ్వలంటే రూ.4,083.48 కోట్లు కేటాయించాలి. కానీ తొలి ఏడాది ఒక సిలిండర్ చొప్పున మాత్రమే రూ.865 కోట్లు ఇచ్చారు. అంటే రూ.3,218.48 కోట్లు ఎగ్గొట్టారు. ఇక 2025–26 బడ్జెట్‌లో ఈ పథకం కోసం రూ.2,601 కోట్లు కేటాయించారు. అంటే రెండో ఏడాది రూ.1,482.48 కోట్లు బకాయి పెట్టారు. 2026–27 బడ్జెట్‌లో రూ.2,601 కోట్లే కేటాయించారు. తద్వారా మూడేళ్లలో మొత్తం రూ.6,143.96 కోట్ల మేర కూటమి ప్రభుత్వం దీపం లబ్ధిదారులను మోసం చేసింది.
» మహిళలు అందరికీ ఉచిత బస్సు ప్రయాణ పథకం అంటూ కూటమి ప్రభుత్వం మరో మోసం చేసింది. ఈ పథకం అమలు కోసం ఏడాదికి రూ.3,200 కోట్లు కేటాయించాలి. 2024–25లో అసలు ఈ పథకం అమలు చేయలేదు. 2025 ఆగస్టు 15 నుంచి అమలు చేస్తున్నట్టు ప్రకటించినా కనికట్టు చేశారు. మొత్తం 16 రకాల ఆర్టీసీ బస్ సర్వీసులు ఉండగా కేవలం 5 రకాల సర్వీసుల్లోనే ఈ పథకం వర్తింపజేశారు. తద్వారా మహిళలను సైతం చంద్రబాబు మోసం చేశారు.
బెదిరింపులు.. కిడ్నాప్‌లు.. ఫోర్జరీలు..
స్థానిక ఎన్నికల్లో వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ చైర్మన్ స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకునేందుకు పచ్చముఠాలు బరితెగించి దాడులకు పాల్పడ్డాయి. ఆయుధాలు చేతబట్టి విధ్వంసం సాగించిన టీడీపీ గూండాలకు పోలీసులు వెన్నుదన్నుగా నిలిచి ప్రజాస్వామ్యం పీక నులిమారు. ఈ దౌర్జన్యాలకు ఎదురొడ్డి నామినేషన్లు వేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై టీడీపీ రౌడీమూకలు విరుచుకుపడ్డాయి. విపక్ష అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులను బెదిరించి... కిడ్నాప్‌లకు పాల్పడి మరీ నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేశారు.
కొన్నిచోట్ల అధికారులే ఫోర్జరీ సంతకాలతో విపక్ష అభ్యర్థుల నామినేషన్లు ఉపసంహరించడం ఎన్నికల అక్రమాలకు పరాకాష్ట. శాంతియుత జిల్లాగా పేరుపొందిన శ్రీకాకుళంలో ఐదుగురు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థుల సంతకాలను ఫోర్జరీ చేసి నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించడం దీనికి మచ్చుతునక. ఇక వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు నేరుగా పోలీసు అధికారులే ఫోన్లు చేసి మరీ నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేయడం వ్యవస్థల దిగజారుడుతనానికి నిదర్శనం. గూడూరు డీఎస్పీ నరసింహమూర్తి, నెల్లూరు సీఐ సీతారాం తదితరులు వైఎస్సార్‌సీపీ నేతలను బెదిరించిన ఆడియో రికార్డులు వెలుగులోకి రావడం చంద్రబాబు ప్రభుత్వ బరితెగింపును బట్టబయలు చేసింది. రాష్ట్రంలో టీడీపీ కూటమికి అన్ని స్థానాలు ఏకగ్రీవమయ్యాయి... ఇన్ని స్థానాలు ఏకగ్రీవమయ్యాయంటూ చంద్రబాబు చెప్పుకుంటున్న మాటల వెనుక లోగుట్టు, కుతంత్రం ఇదే!
రెడ్‌బుక్ అరాచకం... కాలకేయుల పైశాచికం
2024 వరకూ ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని రావణకాష్టంగా చేసినందుకు కూటమి ప్రభుత్వానికి ఓటు వేయాలా? అని ప్రజలు చంద్రబాబును నిగ్గదీసి అడుగుతున్నారు. కాలకేయుల రాక్షసత్వాన్ని తలదన్నేలా కూటమి పార్టీల గూండాలు సాగిస్తున్న దారుణాలు, మారణకాండను గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు రెడ్‌బుక్ పాలన అరాచకం సృష్టిస్తోంది. 28 నెలల్లో ఏకంగా 1,002 హత్యలు జరగడం రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు నిదర్శనం. వాటిలో 31 రాజకీయ హత్యలే. మహిళలపై అత్యాచారాలతో రాష్ట్రం హడలెత్తిపోతోంది.
రెండున్నరేళ్లలో 379 మంది మహిళలు, బాలికలపై అత్యాచారాల ఘటనలు దిగ్భ్రాంతికర వాస్తవం. వీరిలో 17 మందిపై హత్యాచారాలు వెలుగులోకి వచ్చాయి. ఇక రెడ్‌బుక్ వేధింపులు, దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసకాండ అంతూ పొంతూ లేకుండా సాగుతోంది. ఇప్పటికే 10 వేలకు పైగా దాడులు, దౌర్జన్యాలకు తెగబడటం రాష్ట్రంలో కొనసాగుతున్న విధ్వంసకర పాలనకు తార్కాణం. కూటమికి ఓటు వేయడం ద్వారా తాము ఆ అరాచకాలకు ఆమోదముద్ర వేయాలా? అని ప్రజలు నిలదీస్తున్నారు.
» రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకాల్లో చంద్రబాబు ప్రభుత్వం బరితెగించి అక్రమాలకు పాల్పడింది. మంత్రి లోకేశ్ సర్వం తానై ఈ భారీ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియగా నిలిచారు. స్పోర్ట్స్ కోటా ముసుగులో రాత పరీక్ష అవసరం లేకుండా ఉపాధ్యాయ పోస్టులు కట్టబెట్టేందుకు జీవో జారీ చేశారు. అనంతరం నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో ఉపాధ్యాయ పోస్టులను అమ్ముకున్నారు. టీడీపీ ఎంపీ ఎం.శ్రీభరత్, మంత్రి టీజీ భరత్, టీడీపీ ఎమ్మెల్యే కూన రవి కుమార్, శాప్ చైర్మన్ రవి నాయుడు... ఇలా మొత్తం లోకేశ్ కోటరీనే డీఎస్సీ స్కామ్‌ను సాగించింది. దీనిపై నిలదీసిన నిరుద్యోగ యువతను అక్రమ కేసులతో వేధించారు. ఉద్యోగ నియామకాల్లో ఇంతటి దారుణమైన అక్రమాలకు పాల్పడిన కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేయాలి? అని ప్రజలు నిలదీస్తున్నారు. కూటమికి ఓటు వేస్తే డీఎస్సీ అక్రమాలను సమ్మతించినట్టు అవుతుంది కదా అని ప్రశ్నిస్తున్నారు.
» అన్నదాతలను చంద్రబాబు ప్రభుత్వం నిలువునా ముంచేసింది. ఉచిత పంటల బీమాను ఎత్తేశారు. సున్నా వడ్డీకి చాపచుట్టేశారు. రెండున్నరేళ్లుగా ఏ ఒక్క పంటకూ మద్దతు ధర లేకున్నా రైతులను ఆదుకునేందుకు కనీస ప్రయత్నం చేయలేదు. దాదాపు 18 సార్లు ప్రకృతి వైపరీత్యాలు విరుచుకుపడి లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా ఏ ఒక్క రైతుకు పైసా పరిహారం ఇవ్వలేదు. రెండున్నరేళ్లుగా రైతులకు పంటల బీమా పరిహారం కూడా అందకుండా మోకాలడ్డారు. ఇంతటి అమానవీయ ప్రభుత్వానికి మద్దతు తెలిపేందుకు తాము కూటమికి ఓటు వేయాలా? అని ప్రజలు విరుచుకుపడుతున్నారు.
» రాష్ట్రంలో మద్యం, సారాయి, డ్రగ్స్ మాఫియా బరితెగించి దోపిడీ సాగిస్తోంది. మరెందుకు మీకు ఓటు వేయాలని చంద్రబాబును ప్రజలు నిలదీస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భూస్థాపితం చేసిన మద్యం సిండికేట్ భూతాన్ని చంద్రబాబు మళ్లీ బయటకు తీశారు. టీడీపీ సిండికేట్ రాష్ట్రంలో మద్యం దుకాణాలను ఏకపక్షంగా సొంతం చేసుకుని ఏటా రూ.5 వేల కోట్ల దోపిడీకి పాల్పడుతోంది. పర్మిట్ రూమ్‌లు, లక్షకు పైగా బెల్ట్ దుకాణాలతో ఊరూవాడా మద్యం ఏరులై పారుతోంది. టీడీపీ పెద్దలు రాష్ట్రంలో నకిలీ మద్యం రాకెట్‌ను వ్యవస్థీకృతం చేశారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో బయటపడిన నకిలీ మద్యం దందా వెనుక టీడీపీ పెద్దలే ఉన్నారని వెల్లడైంది.
వైఎస్సార్‌సీపీ హయాంలో రాష్ట్రంలో గంజాయి దందాను రూపుమాపింది. టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే ఏఎస్‌ఆర్ జిల్లాలో గంజాయి సాగు మళ్లీ జోరందుకుంది. ఏకంగా డోర్ డెలివరీ సాగిస్తూ గంజాయి, డ్రగ్స్ దందా యథేచ్ఛగా సాగుతోంది. టీడీపీ పెద్దల కుటుంబాలే వెన్నుదన్నుగా గంజాయి మాఫియా ఏటా రూ.10 వేల కోట్ల దోపిడీకి పాల్పడుతోంది. రాష్ట్రంలో కాలేజీలు, యూనివర్సిటీల వరకూ గంజాయి సరఫరా చెయిన్‌ను విస్తరించినందుకా టీడీపీకి ఓటు వేయాలి అని ప్రజలు నిలదీస్తున్నారు. యువత, భావి తరాల ఉజ్వల భవిష్యత్‌ను నాశనం చేస్తున్న టీడీపీ కూటమి మాఫియా ఆగడాలను సమ్మతించాలా...? అందుకే కూటమికి ఓటు వేయాలా? అని ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
» రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పూర్తిగా పడకేసింది. మరోవైపు చంద్రబాబు, లోకేశ్ బినామీలకు పరిశ్రమల పేరుతో ప్రభుత్వ భూములను ధారాదత్తం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో గంపగుత్తగా భూములను 99 పైసలకే కట్టబెట్టడం విభ్రాంతి కలిగిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఆర్థిక ఉగ్రవాదానికి బరితెగిస్తోందని జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి పెద్దలు రెవెన్యూ రికార్డులను తారుమారు చేస్తూ భూకుంభకోణాలకు తెగబడుతున్నారు. ఈ భూదందాలకు ఆమోదం తెలిపేందుకు తాము టీడీపీ కూటమికి ఓటు వేయాలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
» చంద్రబాబు ప్రభుత్వ అసమర్థ పాలనతో సామాన్యుడి జీవనం దుర్భరంగా మారింది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. టీడీపీ సిండికేట్ కృత్రిమ కొరత సృష్టించి మరీ ధరలను అమాంతంగా పెంచేసి దోపిడీకి పాల్పడుతోంది. కేజీ బియ్యం రూ.100కు చేరడం గమనార్హం. దాంతోపాటు కిలో కందిపప్పు రూ.190, చింతపండు రూ.350కు చేరితే ఇక ఏం కొనాలి... ఏం తినాలి? అని పేద, మధ్యతరగతి వర్గాలు వాపోతున్నాయి. లీటర్ పెట్రోల్ రూ.117కు చేరింది. అధికారంలోకి వస్తే వంద రోజుల్లో నిత్యావసర వస్తువులు, పెట్రో ధరలు తగ్గిస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు నమ్మబలికారు. కానీ ప్రస్తుతం ధరలు చుక్కలను తాకుతున్నా చేష్టలుడిగి చూస్తున్నారు. ఈ నిర్వాకాలకు ఆమోదం తెలిపేందుకా తాము కూటమికి ఓటు వేయాలి అని సామాన్యులు సూటిగా నిలదీస్తున్నారు.
» మున్సిపాలిటీలు, పంచాయతీల్లో పాలన పడకేసింది. కనీసంనిర్వహణ ఖర్చులకు కూడా నిధులు కేటాయించకుండా కూటమి ప్రభుత్వం మొహం చాటేసింది. మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ ప్రత్యేక విమానాల్లో తరచూ దేశ, విదేశీ పర్యటనలు చేస్తూ ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ప్రభుత్వ నిధులు ధారపోస్తున్నారు. విద్య, వైద్య–ఆరోగ్య, రవాణా, మున్సి³ల్, పంచాయతీరాజ్, విద్యుత్, సంక్షేమం.. ఇలా అన్ని శాఖల్లోనూ అవినీతి విచ్చలవిడిగా సాగుతోంది. అన్ని రంగాల్లో ఇంతటి ఘోర వైఫల్యం చెందిన కూటమి ప్రభుత్వానికి మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎందుకు ఓటు వేయాలి? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.


