ఓటుపై 'వేటు' | Coalition leaders threatening officials in municipalities | Sakshi
Sakshi News home page

ఓటుపై 'వేటు'

Nov 1 2026 4:36 AM | Updated on Nov 1 2026 4:36 AM

Coalition leaders threatening officials in municipalities

వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చి ఓటరు స్లిప్‌లు చూసుకుంటున్న ఓటర్లు

ఓటరు చేతికి స్లిప్పులు చేరకుండా అడ్డుకుంటున్న వెన్నుపోటు పార్టీ

మున్సిపాలిటీల్లో అధికారులను బెదిరిస్తున్న కూటమి నేతలు 

ఓటర్లను బూత్‌కు రాకుండా చేసి, రిగ్గింగ్‌కు పాల్పడాలనే ఎత్తుగడ 

ఆన్‌లైన్‌లో ఓటరు స్లిప్పులు అందుబాటులో ఉంచుతామన్న ‘ఎస్‌ఈసీ’ 

పచ్చ పార్టీ ప్రయోజనాల కోసం ఆ వెసులుబాటునూ కల్పించని కమిషన్‌ 

ఓటు ఏ పోలింగ్‌ బూత్‌లో ఉందో తెలియక అయోమయంలో ఓటర్లు 

సాక్షి, అమరావతి/ జమ్మలమడుగు రూరల్‌: పదవుల కోసం ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతూ ఎన్నికల్లో వెన్నుపోటు పార్టీ చేస్తున్న కుట్రలు పరాకాష్టకు చేరాయి. ఇప్పటికే నామినేషన్లు వేయకుండా టీడీపీ గూండాలు అడుగడుగునా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడ్డుకున్నారు. కొన్నిచోట్ల నామినేషన్‌ పత్రాలను బలవంతంగా లాక్కుని చించేశారు. నామినేషన్‌ వేసేందుకు వెళుతున్న వారిపై పోలీసులు, పచ్చ రౌడీలతో దారుణంగా కొట్టించారు. అయినా ఎవరైనా నామినేషన్‌ వేస్తే, వారిని బెదిరించి, కిడ్నాప్‌ చేసి నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేశారు. 

ఇవన్నీ చాలవన్నట్లు చివరికి ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కూడా దూరం చేయాలనే దుర్మార్గ ఆలోచనలు చేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల అధికారులు చేయాల్సిన విధులను సైతం అడ్డుకుంటున్నారు. ఓటర్లకు స్లిప్పులు అందకుండా చేస్తున్నారు. కూటమి చేస్తున్న ఈ కుతంత్రాలను చూసి రాష్ట్ర ప్రజలతో పాటు దేశం మొత్తం ఆశ్చర్యపోతోంది. ఏపీలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారంటూ దుమ్మెత్తి పోస్తోంది.

యథేచ్ఛగా అధికార దుర్వినియోగం
వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు మున్సిపల్‌ ఎన్నికల వేళ టీడీపీ దౌర్జన్యకాండకు తెగబడింది. శనివారం ఓటర్లకు ఎన్నికల స్లిప్పుల పంపిణీ చేస్తున్న అధికారులను అడ్డుకుని ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేయవద్దంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి అధికారులకు హుకుం జారీ చేశారు. ఓటర్లకు సంబంధించిన స్లిప్పులన్నింటినీ సేకరించి తమ వ్యక్తిగత కార్యాలయానికి తీసుకురావాలని అధికారులను హెచ్చరించారు. ఇది కేవలం ఈ ఒక్క చోటే పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. మున్సిపల్‌ ఎన్నికలు ఆదివారం జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు అధికారులు, ఓటర్లలో ఆందోళనకు కారణమవుతున్నాయి.

ఎన్నికల్లో ‘రిగ్గింగ్‌’కోసం
సార్వత్రిక ఎన్నికల ఓటరు జాబితాలకు, పోలింగ్‌ బూత్‌లకు మున్సిపల్‌ ఎన్నికల్లో జాబితాలు, బూత్‌లకు పొంతన ఉండదు. ఓటర్లుకు తమ ఓటు ఏ పోలింగ్‌ బూత్‌ పరిధిలో ఉందనే విషయంగానీ, ఓటర్ల జాబితాలో తమ ఓటు సీరియల్‌ నెంబర్‌ గానీ తెలిసే అవకాశం తక్కువ. దీనిని దృష్టిలో ఉంచుకునే బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌(బీఎల్‌వో)లు ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులు అందిస్తుంటారు. ఆ స్లిప్పుల్లో వివరాల ఆధారంగా ఓటర్లు బూత్‌కు వెళ్లి ఓటు వేయడం సులువు అవుతుంది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. కూటమి నేతలు ఉద్దేశ్యపూర్వకంగా ఓటర్లకు స్లిప్పులు అందకుండా చేసి, తామే దొంగ ఓట్లు (రిగ్గింగ్‌) వేసేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

సాగిలపడ్డ ఎస్‌ఈసీ
ఎన్నికల్లో ఓటరు తనకు నచ్చిన అభ్యర్థికి స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంటుంది. ఓటరు స్లిప్పుల పంపిణీ వంటి సాధారణ ఎన్నికల ప్రక్రియలోనూ రాజకీయ జోక్యం ఉంటే ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం కలిగే ప్రమాదం ఉంది. ఓటర్లకు స్లిప్పులు అందకుండా అడ్డుకోవడం, వాటిని రాజకీయ నాయకుల వ్యక్తిగత కార్యాలయాల­కు తరలించాలంటూ ఆదేశించడం వంటి చర్యలు ఎన్నికల నిబంధనలకు తీవ్ర విరుద్ధం. ఎన్నికల నిర్వహణలో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఏ పార్టీకి చెందిన నేతలైనా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. 

మరోవైపు, అధికారులను హెచ్చరించినట్లు వస్తున్న ఆరోపణలపై ఎన్నికల అధికారులు స్పందించి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ ఇలాంటి దౌర్జన్యాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) మౌనం వహించడం విమర్శలకు తావిస్తోంది. నిజానికి ఎన్నికల సంఘం మొదటి నుంచీ పచ్చ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. ఓటరు స్లిప్పులను ఎస్‌ఈసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని, ఓటర్లు ఆన్‌లైన్‌లోనే వాటిని డౌన్‌లోన్‌ చేసుకుని పోలింగ్‌ బూత్‌కు తీసుకువెళ్లవచ్చని తొలుత కమిషన్‌ వెల్లడించింది. కానీ చివరికి అలాంటి ఏర్పాటు ఏదీ చేయకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement