తరగతి గదిలోకి వెళ్లి.. ఎలక్ట్రిక్‌ రంపంతో కోసి.. | Incident at Raptadu ZP High School in Anantapur district | Sakshi
Sakshi News home page

తరగతి గదిలోకి వెళ్లి.. ఎలక్ట్రిక్‌ రంపంతో కోసి..

Nov 1 2026 4:21 AM | Updated on Nov 1 2026 4:21 AM

Incident at Raptadu ZP High School in Anantapur district

విద్యార్థిని గోపిక , నిందితుడు హేమంత్‌

పదో తరగతి బాలికపై ఉన్మాది దాష్టీకం 

తరగతి గదిలో పిల్లలందరి మధ్య విచక్షణారహితంగా దాడి 

అడ్డుకోబోయిన మరో విద్యార్థినికీ తీవ్ర గాయాలు 

చదువుల తల్లి ఒడిలో రక్తపాతం.. వణికిపోయిన విద్యార్థులు 

అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ హైస్కూల్‌లో ఘటన 

నిందితుడిని ధర్మవరం రైల్వేగేటు వద్ద పట్టుకున్న పోలీసులు 

దారుణ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 

క్షీణించిన శాంతిభద్రతలకు నిదర్శనమని ధ్వజం

తరగతి గదిలో ఉపాధ్యాయురాలు పాఠం చెబుతుండగా పదో తరగతి విద్యార్థినులు శ్రద్ధగా వింటున్నారు. అంతలో ఒక్కసారిగా ఎలక్ట్రిక్‌ రంపంతో ఓ యువకుడు దూసుకొచ్చాడు. బర్ర్‌ర్ర్‌... అనే మోత.. ఏం జరుగుతోందో అర్థంచేసుకునేలోపే ఓ బాలికపై విచక్షణా రహితంగా దాడి.. చెయ్యి, మెడ, వీపుపై రంపపు కోత.. తరగతి గదంతా రక్తసిక్తం.. విద్యార్థినుల హాహాకారాలు.. అడ్డుకోబోయిన మరో విద్యార్థినికీ గాయాలు.. పాఠశాల ప్రాంగణం దద్దరిల్లింది. అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ప్రభుత్వ పాఠశాలల్లో భద్రతను ప్రశ్నార్థకంగా మార్చింది.  

రాప్తాడు రూరల్‌ : ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడుతున్న ఓ యువకుడు, తన ప్రేమను నిరాకరించిందనే అక్కసుతో బాలికపై ఎలక్ట్రిక్‌ రంపంతో దాడికి దిగడం సభ్య సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ హైస్కూల్లో శనివారం ఉదయం 10.20 గంటలకు రెండో పీరియడ్‌లో టీచర్‌ గణితం పాఠం చెబుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హేమంత్‌ అనే యువకుడు ఎలక్ట్రిక్‌ రంపంతో తరగతి గదిలోకి ప్రవేశించి.. గోపిక (15) అనే పదో తరగతి విద్యార్థినిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. 

ఈ దాడిలో ఆమె ముఖంపై తీవ్ర గాయాలుకాగా, కుడిచేయి దాదాపు తెగిపోయింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని లక్ష్మీపైనా దాడి చేయడంతో ఆమె కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో పడివున్న విద్యార్థినులను హుటాహుటిన అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఫోరెన్సిక్‌ నిపుణులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 

              రాప్తాడు జెడ్పీ స్కూల్‌లోని ఘటనాస్థలిలో నిందితుడు ఉపయోగించిన రంపం   

ఒళ్లంతా గాయాలే 
హేమంత్‌ జరిపిన పాశవిక దాడిలో గోపిక శరీరమంతా లోతైన గాయాలయ్యాయి. ముఖంపై లోతైన గాయం కావడంతో సగ భాగం పూర్తిగా చెక్కేసినట్‌లైంది. ఎడమ చేతి ఎముక భాగం విరిగింది. ఎదపై లోతైన గాయమైంది. శరీరం ముందు భాగంలో చాలా చోట్ల రంపపు గాట్లు పడ్డాయి. వీపుపై కూడా లోతైన గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దాదాపు మూడు గంటలకు పైగా వైద్యులు శ్రమించి బాలికకు శస్త్రచికిత్స చేశారు. అనంతరం శనివారం సాయంత్రం మరింత మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 

పోలీసుల అదుపులో నిందితుడు  
పాఠశాలలో ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ధర్మవరం మండలం నాగలూరు గ్రామానికి చెందిన హేమంత్‌గా గుర్తించారు. తల్లిదండ్రులు లేని ఈ యువకుడు కొన్నేళ్లుగా అయ్యవారిపల్లి గ్రామంలోనే సోదరి వద్ద ఉంటూ అనంతపురం శివారులోని టమాటా మండీలో పని చేస్తున్నాడు. బాలికకు బంధువు కూడా. కొంత కాలంగా ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్నాడు. బాలిక నిరాకరించడంతో ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన తర్వాత బైకులో పరారైన నిందితుడు హేమంత్‌ను ధర్మవరం రైల్వే గేటు  సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఆ కుటుంబానికి తీరని శోకం.. 
రాప్తాడు మండలం అయ్యవారిపల్లికి చెందిన వెంకటరాముడు, నరసమ్మ దంపతులకు కుమారుడు, కుమార్తె సంతానం. వెంకటరాముడు ద్రాక్ష తోటల్లో కూలి పనులు, నరసమ్మ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుమారుడు ఇందువర్దన్‌ చదువు మానేసి కడ్డీల కార్మికుడిగా వెళ్తున్నాడు. ఒక్కగానొక్క కుమార్తె గోపికను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. చదువుకుని ఉన్నత స్థాయికి చేరుతుందన్న ఆశలతో పెంచుకుంటున్న బిడ్డపై బంధువే రాక్షసంగా దాడి చేయడం ఆ కుటుంబాన్ని తీరని వేదనలోకి నెట్టింది. 

బడిలో భద్రత ఏదీ?  
పాఠశాలలో నిర్మాణ పనులు జరుగుతుండటంతో కార్మికుడేమోనని భావించామని, ఘటన సమయంలో వాచ్‌మన్‌ గేటు వద్ద లేకపోవడంతో నిందితుడు లోపలికి ప్రవేశించాడని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి తెలిపారు. దాడి జరుగుతున్న సమయంలో పిల్లల కేకలతో ఏం జరుగుతోందో అర్థంకాక షాక్‌కు గురయ్యానని వివరించారు. ఈ ఘటనతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భద్రతపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాఠశాలల్లోకి ఎవరు పడితే వారు ప్రవేశించే పరిస్థితి ఎందుకు ఉంది? గేటు వద్ద పటిష్ట నిఘా ఎందుకు లేదు? విద్యార్థుల ప్రాణాలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. 

ఉన్మాదిపై చట్టపరమైన చర్యలు : కలెక్టర్‌
రాప్తాడు జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థినిపై దాడి చేసిన ఉన్మాదిపై చట్టపరమైన చర్యలు తప్పవని అనంతపురం కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ అన్నారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలిని శనివారం మధ్యాహ్నం కలెక్టర్‌ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు బాలిక ఆరోగ్యంపై ఆరా తీస్తూ పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పారు. 

పాఠశాలల్లోనే భద్రత లేకపోతే ఎలా? 
పాఠశాలల్లోనే విద్యార్థుల మాన ప్రాణాలకు రక్షణ లేకపోతే ఇక ఎక్కడ భద్రత ఉంటుందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం అనంతపురం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గోపికను, ఆమె కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు.  

108 వాహనం ఆలస్యం 
ఉన్మాది హేమంత్‌ దాడిలో తీవ్రంగా గాయపడిన గోపికా, లక్ష్మీలను ఆస్పత్రికి వెంటనే తరలించడానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు 108కు ఫోన్‌ చేశారు. సమస్య తీవ్రతను వివరించారు. అయినా వాహనం రావడం ఆలస్యమైంది. దీంతో ఆందోళనకు గురైన ఉపాధ్యాయులు తొలుత ఆటోను పిలిపించి విద్యార్థినులను అందులో ఆస్పత్రికి తరలించారు. కొంతదూరం వెళ్లిన తర్వాత మార్గంమధ్యలో 108 వాహనం రావడంతో ఆటో నుంచి అంబులెన్స్‌లోకి మార్చి ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. అత్యవసర సమయంలో 108 వాహనం సకాలంలో అందుబాటులోకి రాకపోవడం చర్చనీయాంశమైంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement