నేడే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ | Municipal election polling today | Sakshi
Sakshi News home page

నేడే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌

Nov 1 2026 4:05 AM | Updated on Nov 1 2026 4:06 AM

Municipal election polling today

మొత్తం ఓటర్లు 99,36,014 మంది.. 11,378 పోలింగ్‌ కేంద్రాలు 

13 నగరపాలక సంస్థలు, 79 మున్పిపాలిటీలకు ఎన్నికలు 

13 మేయర్‌ పదవులకు పోటీలో 153 మంది 

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవులకు పోటీలో 367 మంది 

బందోబస్తుకు 36,351 మంది పోలీసులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 13 నగరపాలక సంస్థలు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఆదివారం పోలింగ్‌ జర­గనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్‌ జరుగుతుంది. మొత్తం 99,36,014 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 11,378 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 13 నగరాల్లో ఉన్న 59,97,918 మంది ఓటర్ల కోసం 6,384 పోలింగ్‌ కేంద్రాలు, 79 మున్సిపాలిటీల్లో ఉన్న 39,38,096 మంది ఓటర్ల కోసం 4,994 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

ఎన్నికల బందోబస్తుకు మొత్తం 36,351 మంది పోలీస్‌ సిబ్బందిని నియమించారు. 13 నగర కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు ప్రకటించగా, వీటిలో 8 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్, కౌన్సిలర్‌ పదవులన్నీ వివిధ పార్టీలకు ఏకగ్రీవమయ్యాయి. మరో 9 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్‌పర్సన్‌ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 13 కార్పొరేషన్లు, 70 మున్సి­పా­లిటీలు, నగర పంచాయతీల్లో మేయర్, చైర్‌పర్సన్, డివిజన్లు, వార్డులకు పోలింగ్‌ జరగనుంది. మరో 9 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డులకే పోలింగ్‌ జరగనుంది. 

సగం సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలే 
మొత్తం 11,378 పోలింగ్‌ కేంద్రాల్లో 5,737 కేంద్రాలను సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, తీవ్ర సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఈ కేంద్రాల వద్ద లోపలా బయటా వేర్వేరుగా మొత్తం 12,666 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 13 కార్పొరేషన్లలో 1,788 సమస్యాత్మక, 941 అత్యంత సమస్యాత్మక, 46 తీవ్ర సమస్యాత్మక కేంద్రాలు గుర్తించారు. 79 మున్సిపాలిటీల పరిధిలో 1,747 సమస్యాత్మక, 1,190 అత్యంత సమస్యాత్మక, 25 తీవ్ర సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. సమస్యాత్మక కేంద్రా­ల్లో 1+2 బందోబస్తు కల్పిస్తారు. అత్యంత సమస్యాత్మక కేంద్రా­ల్లో 1+4 బందోబస్తు కల్పిస్తారు. తీవ్ర సమస్యాత్మక కేంద్రాల్లో అప్పటి పరిస్థితిని బట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తారు.

పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య 
13 కార్పొరేషన్ల మేయర్‌ పదవులకు – 153 మంది 
కార్పొరేషన్లలోని 804 డివిజన్లకు – 3,073 మంది 
70 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్‌పర్సన్‌ పదవులకు –  367 మంది 
79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని 2,382 వార్డు కౌన్సిలర్‌ పదవులకు – 6,669 మంది 

పోలింగ్‌ సిబ్బంది ఇలా.. 
రిటర్నింగ్‌ అధికారులు (ఆర్వోలు) – 1,449 మంది 
సహాయ రిటర్నింగ్‌ అధికారులు – 2,543 మంది 
ప్రిసైడింగ్‌ అధికారులు – 13,504 మంది 
అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు – 13,504 మంది 
ఇతర పోలింగ్‌ అధికారులు – 51,716 మంది 
మైక్రో అబ్జర్వర్లు – 3,720 మంది 
వెబ్‌కాస్టింగ్‌ సిబ్బంది – 1,835 మంది  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement