‘స్థానిక’ కుట్రలపై సుప్రీం కొరడా! | Supreme Court issues sensational orders to check irregularities in local body elections | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ కుట్రలపై సుప్రీం కొరడా!

Nov 1 2026 4:02 AM | Updated on Nov 1 2026 4:02 AM

Supreme Court issues sensational orders to check irregularities in local body elections

అక్రమాలకు చెక్‌పెడుతూ సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు!

నామినేషన్‌ కేంద్రాల నుంచి కౌంటింగ్‌ కేంద్రాల వరకు అన్నిచోట్ల సీసీటీవీ నిఘా ఉండాల్సిందే 

ఎన్నికల పిటిషన్ల దాఖలు గడువు వరకు సీసీటీవీ ఫుటేజీ భద్రపరచాలి 

పిటిషన్‌ పరిష్కారం అయ్యే వరకు ఆ ఫుటేజీ భద్రంగా ఉంచాలి 

రాజకీయ పార్టీల, అభ్యర్థుల భయాలను, ఆందోళనలను తొలగించాలి 

నిర్భయంగా, స్వేచ్ఛగా పోటీచేసేందుకు అందరికీ సమానావకాశాలుండాలి 

అవసరమైతే నామినేషన్ల గడువు పెంచాలి.. కలెక్టర్లే నామినేషన్లు స్వీకరించాలి 

రాష్ట్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు విస్పష్టమైన ఆదేశాలు 

మా ఆదేశాలను, ఎన్నికల కమిషన్‌ సర్క్యులర్లను డీజీపీ అమలు చేసి తీరాలి 

నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు బందోబస్తు ఏర్పాటు చేయాలి 

ఎన్నికల వేళ శాంతి భద్రతల బాధ్యత మొత్తం డీజీపీదే 

నామినేషన్లు వేయలేకపోయిన వారు ఎన్నిక ఫలితాన్ని సవాలు చేయవచ్చు 

సాక్ష్యాధారాలతో వారు నిరూపిస్తే వారి నామినేషన్‌ తిరస్కరణ అక్రమమే అవుతుంది 

ఇందుకు అనుగుణంగా ఎన్నికల ట్రిబ్యునల్‌ తగిన నిర్ణయం వెలువరించాలి 

రాతపూర్వకంగా ఆదేశాలు జారీ.. ఆదేశాల కాపీ తాజాగా అందుబాటులోకి..

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల వేళ రాష్ట్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. మున్సిపల్‌ ఎన్నికలతో పాటు త్వరలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికల్లో అన్ని నామినేషన్‌ కేంద్రాలు, రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయా­లు, పోలింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూంలు, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసి తీరాలని రాష్ట్ర ఎన్నికల సంఘా­న్ని ఆదేశించింది. ఎన్నికల అక్రమాలపై అభ్య­ర్థులు ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేసుకునేందుకు చట్టం నిర్దేశించిన కాలపరిమితి వరకు సీసీటీవీ ఫుటేజీని భద్రపరచాలని కూడా ఆదేశించింది. ఒకవేళ ఎన్నికల పిటిషన్‌ దాఖలైతే, ఆ వ్యాజ్యం తేలేంత వరకు ఆ సీసీటీవీ ఫుటేజీని భద్రపరచాలని తేల్చి చెప్పింది. 

ఎన్నికల ట్రిబ్యునల్‌ కోరినప్పుడు ఆ ఫుటేజీ ఇవ్వాలంది. ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేసిన అభ్యర్థులు, అందులో ప్రతివాదులుగా ఉన్న వారు ఎవరైనా కూడా ఆ సీసీటీవీ ఫుటేజీ కోసం దరఖాస్తు చేసుకుంటే, దానిని వారికి అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తాము జారీ చేసిన ఆదేశాలతో పాటు ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను డీజీపీ తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులందరూ ఎలాంటి అడ్డంకులు లేకుండా సజావుగా నామినేషన్లు దాఖలు చేయడానికి వీలుగా నామినేషన్‌ కేంద్రాల వద్ద తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని డీజీపీని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

మొత్తం ఎన్నికల ప్రక్రియ అంతటా శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత డీజీపీదేనని స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలకు, ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులకు ఉన్న భయాలు, అనుమానాలు, ఆందోళనలను తొలగించడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అభ్యర్థులందరూ ఎలాంటి ఒత్తిళ్లు, భయాలు లేకుండా స్వేచ్ఛగా, న్యాయంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి సమాన అవకాశాలు ఉండేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘానిదేనని తేల్చి చెప్పింది.   

నామినేషన్ల గడువు పెంచాలి.. 
కలెక్టర్లే నామినేషన్లు స్వీకరించేలా ఏర్పాట్లు చేయాలి ‘శాంతి భద్రతల విఘాతం కారణంగా అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోతున్నారని రాజకీయ పార్టీలు లేదా అభ్యర్థులు వినతి పత్రాలు సమర్పిస్తే, వాటిని రాష్ట్ర ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోవాలి. ఆ వినతి పత్రాల్లో లేవనెత్తిన అంశాల్లో వాస్తవం ఉందని భావిస్తే, పరిస్థితిని చక్కదిద్దడానికి ఎన్నికల సంఘం తగిన చర్యలు చేపట్టాలి. అందులో భాగంగా నామినేషన్ల గడువును పెంచాలి. స్థానిక కేంద్రాల వద్ద భయాందోళనలు ఉంటే, అవసరమైన చోట నేరుగా జిల్లా కలెక్టర్‌ వద్దే నామినేషన్లు స్వీకరించేలా ఏర్పాట్లు చేయాలి. 

ఎన్నికల ఫలితాలను సవాలు చేసే పూర్తి హక్కు వారికి ఉంది 
‘ఎవరైనా అభ్యర్థి ఆటంకాలు లేదా నిరోధాల కారణంగా తన నామినేషన్‌ను దాఖలు చేయలేకపోతే, ఆ అభ్యర్థి చట్టప్రకారం ఎన్నికల పిటిషన్‌ను దాఖలు చేసుకునే పూర్తి హక్కు కలిగి ఉంటారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక అభ్యర్థి సమర్పించిన నామినేషన్‌ పత్రాన్ని... ఆ అభ్యర్థికి తెలియకుండా లేదా అతని అనుమతి లేకుండా ఉపసంహరించినా, లేదా పరిశీలన సమయంలో రిటర్నింగ్‌ అధికారి అక్రమంగా, తప్పుగా తిరస్కరించినా.. ఆ అభ్యర్థి ఆయా కారణాలను ఆసరాగా చేసుకుని ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేసి ఎన్నికల ఫలితాలను సవాలు చేసే పూర్తి హక్కు కలిగి ఉంటారు.’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. 

ఆధారాలతో నిరూపిస్తే.. అది అక్రమ తిరస్కరణే అవుతుంది 
‘హింస లేదా అడ్డంకుల వల్ల నామినేషన్‌ దాఖలు చేయలేకపోయిన అభ్యర్థులు, అలాగే తమ వినతులను రాష్ట్ర ఎన్నికల సంఘం సానుకూలంగా పరిశీలించలేదని భావించినవారు.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చట్టప్రకారం ఎన్నికల ట్రిబ్యునల్‌ ముందు వ్యక్తిగతంగా ఎన్నికల పిటిషన్‌ ద్వారా ఆ ఫలితాన్ని సవాల్‌ చేయవచ్చు. 

ఎన్నికల పిటిషన్‌ వేసిన అభ్యర్థి తాను నిర్దేశిత సమయంలో నామినేషన్‌ కేంద్రానికి వెళ్లానని, అయితే బలప్రయోగం, బెదిరింపులు లేదా ఆటంకాల వల్ల నామినేషన్‌ వేయలేకపోయానని తగిన సాక్ష్యాధారాలతో ట్రిబ్యునల్‌ ముందు నిరూపించుకోవాలి. తనను అడ్డుకున్నారని అభ్యర్థి ఆధారాలతో నిరూపిస్తే, రిటర్నింగ్‌ ఆఫీసర్‌ లేదా ఎన్నికల అధికారి నామినేషన్‌ను అక్రమంగా తిరస్కరించడంగా పరిగణించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికల ట్రిబ్యునల్‌ ఈ ప్రాతిపదికన సదరు పిటిషన్‌ను విచారించి చట్టప్రకారం తుది నిర్ణయం తీసుకోవాలి’ అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

కార్పొరేషన్‌ ఎన్నికను రెండు నెలల్లో.. మునిసిపాలిటీ ఎన్నికను 15 రోజుల్లో సవాల్‌ చేయాలి 
‘పంచాయతీ లేదా మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలను కేవలం ‘ఎలక్షన్‌ పిటిషన్‌’ ద్వారా మాత్రమే ప్రశ్నించడానికి, సవాల్‌ చేయడానికి అవకాశం ఉంటుంది. వేరే ఏ ఇతర ప్రత్యక్ష మార్గం లేదా పిటిషన్‌ ద్వారా ఎన్నికలను నేరుగా సవాలు చేయలేరు. మున్సిపల్‌ కార్పొరేషన్ల చట్టం, 1955లోని సెక్షన్‌ 71 ప్రకారం, ఎన్నికలను ఎలక్షన్‌ పిటిషన్‌ ద్వారా మాత్రమే సవాల్‌ చేయాలి. ఏ అభ్యర్థి అయినా లేదా ఓటరైనా ఈ పిటిషన్‌ను దాఖలు చేసుకోవచ్చు. సెక్షన్‌ 75 కింద ఏర్పాటు చేసిన ఎలక్షన్‌ ట్రిబ్యునల్‌ ముందు, గెలిచిన అభ్యర్థి ఎన్నికైన తేదీ నుంచి రెండు నెలల వ్యవధిలో సెక్షన్‌ 79లో నిర్దేశించిన విధి విధానాల ఆధారంగా ఎన్నికల పిటిషన్‌ను దాఖలు చేయాలి. 

మున్సిపాలిటీలు–నగర పంచాయతీల ఎన్నికల వివాదాలను కూడా ఎలక్షన్‌ పిటిషన్‌ ద్వారా తప్ప వేరే ఏ విధంగానూ ఎన్నికను ప్రశ్నించలేరు. ఎలక్షన్‌ ట్రిబ్యునల్‌ ఎదుట ఫలితాలు ప్రకటించిన తేదీ నుండి పదిహేను రోజుల్లోపు పిటిషన్‌ దాఖలు చేయాలి’ అని సుప్రీకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్‌ జోయ్‌ మాల్య బాగ్చీ, జస్టిస్‌ వి.మోహన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల కాపీ తాజాగా అందుబాటులోకి వచ్చింది.  

అదనపు నామినేషన్‌ కేంద్రాల కోసం న్యాయ పోరాటం 
స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడమే కాకుండా, భౌతిక దాడులతో అధికార పార్టీల నేతలు విధ్వంసం సృష్టిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ లేదా ఎన్నికల అధికారి లేదా ఆర్డీవో వద్ద నామినేషన్‌లు దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ వైఎస్సార్‌సీపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి జస్టిస్‌ మండవ కిరణ్మయి, అదనపు నామినేషన్‌ కేంద్రాల విషయంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థనను తోసిపుచ్చుతూ ఉత్తర్వులిచ్చారు. దీనిపై వైఎస్సార్‌సీపీ ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేసింది. దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టే నాటికి నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. దీంతో ధర్మాసనం ఈ వ్యవహారంలో జోక్యానికి నిరాకరించింది.  

ఆలస్యం చేయకుండా.. ఆగమేఘాలపై సుప్రీంకోర్టుకు.. 
హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ అత్యవసరంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యాజ్యంపై ఈ నెల 21న న్యాయమూర్తులు జస్టిస్‌ జోయ్‌ మాల్య బాగ్చీ, జస్టిస్‌ వి.మోహన ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. వైఎస్సార్‌సీపీ తరఫు సీనియర్‌ న్యాయవాదులు మణీందర్‌ సింగ్, నిఖిల్‌ గోయల్, న్యాయవాది మెహఫూజ్‌ నజ్కీలు వాదనలు వినిపించారు. అధికార పార్టీ నేతల విధ్వంసం, అరాచకాలు, ఆగడాలపై వైఎస్సార్‌సీపీ సుప్రీంకోర్టు ముందు అన్నీ ఆధారాలను ఉంచింది.  

అరాచకాలను అడ్డుకోకుంటే.. చూస్తూ ఊరుకోబోమన్న సుప్రీంకోర్టు 
వాటిని పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, కండబలం చూపుతూ దౌర్జన్యం చేస్తుంటే తాము చేతులు ముడుచుకుని కూర్చోలేమని తేల్చి చెప్పింది. అధికార పార్టీ నేతలపై ఒక కేసు కూడా నమోదు చేయకపోవడాన్ని ఆక్షేపించింది. అంత హింస జరుగుతుంటే నామినేషన్ల కేంద్రాల వద్ద శాంతి భద్రతలు లేకుంటే ఎలా? ఇలాంటి పరిస్థితుల్లో నామినేషన్లు వేయడానికి ఎవరొస్తారు? సామాన్యులు నామినేషన్‌ కేంద్రాలవైపు కన్నెత్తి చూసే ధైర్యం చేయగలరా? అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. విపక్షంతో సహా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అందరికీ సమానంగా ఉండాలని, అరాచకాలను అడ్డుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేసింది. 

నామినేషన్ల గడువు పెంపునకు ఆదేశాలు 
అంతేకాక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు తక్షణ భద్రత కల్పించాలని, నామినేషన్‌ కేంద్రాల వద్ద సీసీటీవీలు కూడా ఏర్పాటు చేయాలని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అధికార పార్టీ నేతల తీరు వల్ల నామినేషన్లు వేయలేని చోట్ల గడువు పెంచాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. 48 గంటల పాటు గడువు పెంచాలని తేల్చి చెప్పింది. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లే నామినేషన్లు స్వీకరించేలా ఏర్పాట్లు చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. తమ ఈ ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని అటు డీజీపీని, ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

అధికార పార్టీ అరాచకాలను సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చిన వైఎస్సార్‌సీపీ 
వైఎస్సార్‌సీపీ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ నెల 27న మరోసారి విచారణ జరిపింది. ఈ  సందర్భంగా అధికార కూటమి నేతల ఆగడాలు, దుర్మార్గాలను వైఎస్సార్‌సీపీ సీనియర్‌ న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. స్థానిక ఎన్నికల్లో ఏకంగా 53 శాతానికి పైగా స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని వివరించారు. విపక్ష అభ్యర్థులను భయాందోళనలకు గురిచేస్తూ, నామినేషన్‌ కేంద్రాల దరిదాపుల్లోకి కూడా వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారని తెలిపారు. ఇందుకు పోలీసులు, ఎన్నికల అధికారులు యథేచ్ఛగా సహకరించారన్నారు. రాష్ట్రంలో దాదాపు 1,200 మంది అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని వారు కోర్టుకు నివేదించారు. 

అందుబాటులోకి సుప్రీంకోర్టు ఆదేశాలు 
ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించే దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి, డీజీపీకి తగిన ఆదేశాలు జారీ చేస్తామని ఈ నెల 27న మౌఖికంగా స్పష్టం చేసింది. ఇందుకు అనుగుణంగా తాజాగా ఆ ఆదేశాలను రాతపూర్వకంగా ఇచ్చింది. ఆ ఆదేశాల కాపీ శనివారం అందుబాటులోకి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement