గృహ నిర్బంధంలో ప్రజాస్వామ్యం! | Sakshi Editorial On Law and order under Chandrababu govt By Vardhelli Murali | Sakshi
Sakshi News home page

గృహ నిర్బంధంలో ప్రజాస్వామ్యం!

Nov 1 2026 12:40 AM | Updated on Nov 1 2026 12:42 AM

Sakshi Editorial On Law and order under Chandrababu govt By Vardhelli Murali

చెట్లను నరికే రంపాన్ని భుజాన వేసుకొని ఒక ఉన్మాది బేఫర్వాగా ప్రభుత్వ పాఠశాలలోకి ప్రవేశించగలడు. టీచర్‌ పాఠం చెబుతున్న తరుణంలో తరగతి గదిలోకి నింపాదిగా అడుగుపెట్టనూ గలడు. అన్నెం పున్నెం ఎరుగని ఓ పదో క్లాస్‌ బాలికను రాక్షసంగా నరికేసి సునాయాసంగా వెళ్లిపోనూగలడు. అనంతపురం సమీపంలోని రాప్తాడులో శనివారం జరిగిన ఈ దారుణం సమాజాన్ని గగుర్పాటుకు గురిచేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల ఉన్నతి కోసం ప్రారంభమైన కార్యక్రమాలను ఇప్పటికే చాప చుట్టేశారు. కనీస భద్రతను కూడా వదిలేస్తే ఎలా? కష్టజీవులైన తల్లిదండ్రులు తమ కంటి పాపల బాగోగుల కోసం సర్కారు బడులనే ఆశ్రయిస్తారు. ఆ పేద బిడ్డల జీవితాలను గాలిలో దీపాలుగా మార్చేసిన అమానవీయత ఇప్పుడు రాజ్యమేలుతున్నది.

నిరుపేద ఆడబిడ్డల హాస్టళ్లలో నెలకొంటున్న అధ్వాన్న పరిస్థితులు అప్పుడప్పుడూ వార్తలుగా వెలుగు చూస్తున్నాయి. కలుషిత నీళ్లు కాటేసి అనేక మంది బాలికలు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఏడాది కిందనే ఏపీలో వెలుగులోకి వచ్చింది. కొద్ది రోజుల్లోనే మీడియా దాన్ని మరుగున పడేసింది. ఇవాళ్టి రాప్తాడు ఘటనలో కూడా ప్రభుత్వ బాధ్యతా రాహిత్యాన్ని మన మీడియా ప్రశ్నించదు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వ పెద్దలు ఆగమేఘాల మీద స్పందించిన వైనం టెలివిజన్ల సమయాన్ని, పత్రికల స్థలాన్ని ఆక్రమిస్తుంది. ఎలివేషన్స్, గూస్‌బంప్స్‌ అనే మాటలు తెలుగు సినిమా ప్రేక్షకు లకు ఇప్పుడు ఊత పదాలుగా మారిపోయాయి. సినిమా హీరోను యోధానుయోధునిగా, ధీరోదాత్తునిగా బలంగా ముద్రించడం కోసం ప్రత్యేకమైన సందర్భాలనూ, సంభాషణ లనూ దర్శకులు సృష్టిస్తారు. మన సినిమా గ్రామర్‌లో హీరో ఎలివేషన్‌ అనేది ఒక ప్రధాన నియమంగా మారింది. ఈ నియమాన్ని ఎల్లో మీడియా రాజకీయాల్లోకి దిగుమతి చేసింది. సమయం సందర్భం లేకుండా వారి అభిమాన నేతల ఎలివే షన్లతో ఎల్లో మీడియా ఊదరగొడుతున్నది. రాప్తాడు దుర్ఘటన కూడా మినహాయింపు కాలేదు.

స్థానిక సంస్థల ఎన్నికలు అడుగు దూరంలో ఉన్న వేళ తమ హీరో ఎలివేషన్లు ఎల్లో మీడియాలో మామూలుగా లేవు. అర్ణబ్‌ తుపాను ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఒక రోబోలా పర్యటిస్తు న్నారనీ, డెబ్బై ఐదేళ్ల వయసులో ఆయన శ్రమ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదనీ, రాత్రింబవళ్లు ఆయన సమీక్షలు చేస్తున్నారనీ, ఇదంతా ఎలా సాధ్యమవుతున్నదోనని ఎల్లో మీడియా నిబిడా శ్చర్యాన్ని నటించింది. ఆ వయసులో ఆయన పర్యటనలు చేయడం సరే, కానీ బాధితులకు ఒరిగిందేమిటన్నదే కదా ఇప్పుడు ప్రధాన సమస్య. తుపాను తీరాన్ని తాకి బలహీనపడి మూడు రోజులు గడిచిన తర్వాత కూడా అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాని ఎందుకు పునరుద్ధరించలేకపోయారు? తుపాను తీరాన్ని తాకే సమయాన్ని, ప్రాంతాన్ని గురించీ, దాని విధ్వంసక శక్తి గురించీ చాలా ముందుగానే హెచ్చరికలు వెలువడిన తర్వాత కూడా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోకుండా ఎందుకు నిరోధించలేకపోయారు? ఏడాది కిందటి మోంథా తుపాను బాధితులకు ఈనాటికీ పరిహారం ఎందుకు అందలేదు? రైతులందరికీ ప్రమాద బీమా ప్రీమియాన్ని ప్రభు త్వమే చెల్లించే గత సంప్రదాయాన్ని ఎందుకు వదిలేశారు? ఎందుకు రైతాంగాన్ని నట్టేట ముంచారు?... ఇవికదా చర్చనీ యాంశాలు. ఈ ప్రశ్నలు తలెత్తకుండా ఉండేందుకే రోబో, రాంబో ఎలివేషన్లకు ఎల్లో మీడియా తెరలేపిందనుకోవాలి.

ఆంధ్రప్రదేశ్‌లో నేడు నెలకొని ఉన్న ఒక భయానకమైన స్టేట్‌ టెర్రర్‌ వాతావరణంపై ముసుగు కప్పి ఉంచడానికి కూడా ఈ తుపాను ఎలివేషన్లు మరికొంతకాలం కొనసాగుతాయి. అవి జాతీయ మీడియాకు కూడా విస్తరించవచ్చు. ఈ వారం రోజుల్లో ఎవరైనా బయటి వ్యక్తులు పులివెందులకు వెళ్లివుంటే అక్కడ మార్షల్‌ లా అమల్లో ఉందేమోనని భావించేవారు. పులివెందులే కాదు. పుంగనూరు, చిత్తూరు, మైదుకూరు, మాచర్ల... ఇలా రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లోని అనేకచోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిపక్ష వైసీపీకి బలమైన దుర్గాల్లోనే వారిని ఓడించామని చెప్పుకోవడానికి ఉబలాటపడుతున్న కూటమి ప్రభుత్వం ప్రమాదకరమైన క్రీడను ప్రారంభించింది. ఈ ప్రాంతాల్లో ప్రజాస్వామ్యాన్ని గృహనిర్భంధంలో ఉంచారు. భారత రాజ్యాంగం అక్కడ చెల్లుబాటు కావడం లేదు. పోలీస్‌ యంత్రాంగం పాలక పార్టీ ప్రైవేట్‌ ఆర్మీ మాదిరిగా పని చేస్తున్నదనడానికి కావలసినన్ని ఆధారాలు లభ్యమవు తున్నాయి. అనేక ప్రాంతాల్లో రిటర్నింగ్‌ అధికారులు అమ్ముడు    పోయారనే కామెంట్లు వినబడుతున్నాయి. అధికార, పోలీసు యంత్రాంగాల్లో ఎవరికెంత రేటు పలికిందనే అంశాన్ని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. భారత రాజ్యాంగానికి మూలస్తంభం వంటి ‘చట్టం ముందు అందరూ సమానులేనని’ చెప్పే ఆర్టికల్‌ 14ను ఏపీ అధికారులు యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు.

ఒక్క పులివెందులలోనే వైసీపీ కార్యకర్తలు, అభిమాను లుగా ఉన్న 900 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. పోలింగ్‌ రోజున వీళ్లెవరూ బయటకు రాకుండా పన్నిన వ్యూహమిది. అదే సమయంలో పాలక కూటమి తరఫున రెండువేల మందిని పక్క నియోజకవర్గాల నుంచి సమీకరించి పులివెందులలో ఉంచారనీ, వారి ద్వారా ఓటర్లను బెదిరించి రిగ్గింగ్‌ చేసుకోవడానికి పథకం వేశారనీ వైసీపీ నాయకత్వం ఆధారాలతో సహా ఎన్నికల సంఘా నికి ఫిర్యాదు చేసింది. ఫలితం శూన్యం. ప్రతిపక్షం చేస్తున్న ఫిర్యాదులను సంబంధిత శాఖాధిపతులకు డిస్పాచ్‌ చేయడం మినహా ఎన్నికల సంఘం చూపుతున్న చొరవ ఏమాత్రం లేదు. 2021లో జరిగిన స్థానిక ఎన్నికల సమయంలో నిమ్మగడ్డ రమేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా చేసిన స్వైర విహారాన్ని ఇప్పుడు పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన అధికారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ పార్టీ నుంచి ఫిర్యాదులు అందీ అందకముందే కలెక్టర్లు, ఎస్పీలతో సహా ఉన్నతాధికారులను ఆయన బదిలీ చేశారు. వారి స్థానాల్లో కొత్తవారిని ఆయనే నియమించారు. పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలను కూడా ఆయన బదిలీ చేశారు.

ప్రస్తుత కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా కూడా చంద్రబాబు నియమించిన అధికారే. 2019 సాధారణ ఎన్నికల్లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని చీఫ్‌ సెక్రెటరీగా ఉన్న ఆయన్ను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఈ కమిషనర్‌కు 59 మంది పోలీసు అధికారులపై వైసీపీ తగిన ఆధారాలతో ఫిర్యాదులు చేసింది. నామినేషన్ల ఘట్టం నాటి నుంచి నేటి దాకా సుమారు 75 పిటిషన్లు వైసీపీ వారు కమిషన్‌ ముందుంచారు. ఒక్క విషయంలో కూడా కమిషన్‌ నుంచి క్రియాశీలక స్పందన కనిపించలేదు. చిలకలూరిపేట ఎస్‌ఐ మాజీ మంత్రి విడుదల రజనీని కిందకు నెట్టేసిన వీడియో జాతీయ స్థాయిలో వైరల్‌గా మారి దుమారం చెలరేగడంతో ఆ అధికారిని మాత్రం బదిలీ చేశారు. 19 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో రీనామినేషన్లకు సుప్రీంకోర్టు ఆదేశించినా  రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ మాత్రం తప్పుడు నివేదికలు తెప్పించుకొని పరిమిత సంఖ్యలో వార్డులకు మాత్రమే రీనామినేషన్లకు అవకాశమిచ్చారు.

పోలీసు అధికారులే స్వయంగా ఫోన్లు చేసి వైసీపీ తరపున నామినేషన్లు వేయవద్దని హెచ్చరిస్తున్న ఆడియోలు వెలు వడ్డాయి. ప్రతిపక్ష అభ్యర్థులపై దాడిచేసి నామినేషన్‌ పత్రాలను కూటమి దండు చింపిపారేస్తుంటే పోలీసులు వారికే వంత పాడారు. ఈ వీడియోలు దేశవ్యాప్తంగా వైరల్‌గా మారాయి. వేలమంది ప్రతిపక్ష కార్యకర్తలపై బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. మహిళల్ని కూడా వదల్లేదు. పోలింగ్‌ రోజున వైసీపీ తరపున పనిచేసే కార్యకర్తలుగానీ, ఏజెంట్లుగా కూర్చునేవారు గానీ ఉండకుండా చేయాల్సిన అరాచకాలన్నీ పోలీసు–అధికార వర్గాల సమన్వయంతో చేసుకొస్తున్నారు. వైసీపీ తరపున ఏజెంట్లుగా కూర్చునేవారి వివరాలు ముందుగానే తమకంద జేయాలని పోలీసు అధికారులు పలుచోట్ల బెదిరించారు. అనేక చోట్ల పోలింగ్‌ సిబ్బంది ఓటర్లకు స్లిప్పులు పంచలేదు. దొంగ ఓట్ల నమోదు కోసం వేసిన ఎత్తుగడలో ఇదొక భాగం.

కూటమి సర్కార్‌ రెండున్నరేళ్ల పాలనపై ప్రజల్లో విపరీతమైన అసంతృప్తి కనిపిస్తున్నది. మీడియా భజంత్రీలు ఎన్ని గొప్పలు ప్రచారం చేసినా జనజీవితాల్లో పాలనా వైఫల్యాల దుష్ఫలితాలు కనిపిస్తున్నాయి. సోనా మసూరి బియ్యం ధర కిలో వంద రూపాయలకు చేరువైంది. నిత్యావసర సరుకుల ధరలన్నీ ఈ రెండేళ్లలోనే రెట్టింపునకు పైగా పెరిగాయి. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల హామీ సగంకాలం గడిచినా పట్టాలెక్క లేదు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి వంటివి దేవతా వస్త్రాలను వెక్కిరిస్తున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తున్నదనే లెక్కలు పడిపోతున్న జీవన ప్రమాణాలకు దర్పణం పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు ముంచుకొచ్చాయి. అక్రమాలు లేకుండా స్వేచ్ఛగా ఎన్నికలు జరిగినట్లయితే విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రతిష్ఠాత్మక నగరాల్లో కూడా వైసీపీ జెండా ఎగరడం ఖాయమనే అంచనాలు వెలవడుతున్నాయి. ఇక కృష్ణా నది దక్షిణ భూభాగం సంగతి చెప్పనక్కరలేదు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయాలు సాధిస్తే 2024 నాటి ఈవీఎమ్‌ గెలుపుపై మళ్లీ విస్తృతంగా చర్చ మొదలువుతుంది. 96 శాతం స్ట్రయిక్‌ రేట్, చరిత్ర ఎరుగని విజయం అంటూ కూటమి పెద్దలు చెబుతున్న మాటలు పోసుకోలు కబుర్లని తేలిపోతుంది. అందుకే ఈ ప్రజాస్వామ్య హనన కార్యక్రమం. కూటమి కోసమో, పార్టీ కోసమో ప్రజాస్వామ్యాన్ని ఫణంగా పెడితే భవి ష్యత్తులో తీవ్రమైన దుష్ఫలితాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ క్లిష్ట సమయంలో ప్రజాస్వామ్యాన్ని నియంతల చెరనుంచి విడిపించుకోవడం ప్రజలందరి బాధ్యత.

 

 

 

 

 

 

 

వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement