ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికలకు నామినేషన్ల పర్వంనుంచీ కూటమి మూకలు చెలరేగి సృష్టించిన భీతావహ పరిస్థితులు సద్దుమణగక ముందే ఆంధ్రప్రదేశ్‌పై పెను తుపాను అర్నబ్ విరుచుకుపడింది. వివిధ ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాంధ్రపైనా, గోదావరి జిల్లాలపైనా దీని ప్రభావం ఎక్కు వుంది. కోతకొచ్చిన లక్షలాది హెక్టార్ల వరి పంట నీట మునగడం, అరటి, మొక్కజొన్న తీవ్రంగా దెబ్బతినడం, వేలాది కొబ్బరి చెట్లు, మహావృక్షాలు కుప్పకూలడం తుపాను బీభత్సం ఏ స్థాయిలో ఉన్నదో వెల్లడిస్తుంది.
తీరం దాటిన సమయంలో దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులతో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉమ్మడి పశ్చిమ గోదావరి, పార్వతీపురం, మన్యం జిల్లాలతోపాటు కాకినాడ, కోనసీమ జిల్లాలు చిగురుటాకుల్లా వణికాయి. భారీవర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ తుపాను బీభత్సం సృష్టించిన భారీ నష్టాలనుంచి ఇంకా కోలుకోకముందే అండమాన్ దగ్గర మరో అల్పపీడనం ఏర్పడిందన్న వార్తలు సహజంగానే ఆందోళన కలిగిస్తున్నాయి. అదింకా బలపడి వాయుగుండమై, తుపానుగా మారు తుందా అన్నది వాతావరణ విభాగం ఇంకా చెప్పలేకపోతోంది. కుండపోత వర్షాలైతే తప్పక పోవచ్చంటున్నారు.
తుపాను తీరం దాటకముందే వందిమాగధ బృందాల భజన మొదలైంది. సీఎంచంద్రబాబు తెల్లవార్లూ నిరంతరాయంగా టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహించారని కూడా చెప్పుకున్నారు. కూటమిలో పరస్పరం అభినందనల పర్వం, తమను తాము వేనోళ్ల పొగుడుకోవటం వగైరాలన్నీ సరేసరి. కానీ తన సుదీర్ఘ పాలనలో పదులకొద్దీ తుపానులు చూసిన ముఖ్యమంత్రిగా ముందస్తు ఆలోచనతో చంద్రబాబు రైతులకు చేసిందేమిటి? ఒక లెక్క ప్రకారం సుమారు 34 లక్షల ఎకరాల్లో వరిపంట దెబ్బతిన్నది. ఒక్కో రైతు ఎకరానికి సగటున రూ. 40,000 పెట్టుబడి పెట్టారనుకున్నా, ఇన్ని లక్షల ఎకరాల్లో రైతులు ఎంత నష్టపోయి ఉంటారు?
ఆ నష్టాన్ని గరిష్ఠంగా పూడ్చడానికి ఏం చేయాలన్న ఆలోచనేదీ లేకుండా... పంటల బీమా పథకాన్ని పక్కనపెట్టినందుకు పశ్చాత్తాపపడకుండా ఈ స్తోత్రపాఠాలేమిటి? వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అయిదేళ్లూ అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం సౌకర్యాన్ని కొనసాగించివుంటే రైతులకు కలిగిన నష్టం పూడ్చుకొనేందుకు అవకాశం ఉండేది. అది లేదు సరిగదా... ఇన్‌పుట్ సబ్సిడీలు సైతం నిర్లక్ష్యం చేయటంవల్ల రైతులకు సాగు వ్యయం అపారంగా పెరిగింది. దీన్నెలా భర్తీ చేస్తారు? నిరుడొచ్చిన మొంథా తుపానుకు రూ. 5,244 కోట్ల నష్టం వచ్చిందన్న సర్కారు ఈనాటికీ రైతులకు పైసా పరిహారం ఇవ్వలేదు.
కృష్ణా గోదావరి డెల్టాలో కోతకు సిద్ధంగా ఉన్న వరిపంట నీట మునిగింది. డ్రైయినేజి వ్యవస్థలు సక్రమంగా ఉంటే ఈ నీటిని వెంటనే బయటకు పంపటం సాధ్యమయ్యేది. కానీ అన్నిచోట్లా ఆ పరిస్థితి ఉందా? ఈసారి సూపర్ ఎల్‌నినో ముంచుకొస్తున్నదనీ, వర్షాభావ పరిస్థితులతోపాటు తుపానువంటి ప్రకృతి వైపరీత్యాలు, వరదల తీవ్రత కూడా ఎక్కువే ఉండొచ్చనీ వాతావరణ శాస్త్రవేత్తలు ఏడెనిమిది నెలలుగా హెచ్చరిస్తున్నారు. కానీ ఆ విషయంలో ఏం చేయగలమన్న ఆలోచనే కూటమి సర్కారుకు కరువైంది. ఎంతసేపూ ప్రత్యర్థుల్ని కష్టాలుపాలు చేయడం ఎలాగన్న వ్యూహాలతోనే దానికి పొద్దుపోతోంది. పర్యవసానంగా డ్రయినేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉంది.
తుపాను విపత్తు విషయంలో ఆదుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని లీకులీయటం కాదు. నష్టపోయిన రైతులకు తక్షణం చేసేదేమిటో చెప్పాలి. వరితోపాటు కోనసీమలో కోటికిపైగా ఉండే కొబ్బరిచెట్లలో లక్షల చెట్లు నేలకొరిగాయి. అరటి తోటలు, మొక్కజొన్న తీవ్రంగా దెబ్బతిన్నాయి. మొత్తం అయిదున్నర లక్షల ఎకరాల ఆక్వా సాగు పైనా ప్రభావం పడిందంటున్నారు. తుపాను ఉపశమించి 24గంటలు గడిచినా చాలాచోట్ల విద్యుత్ పునరుద్ధరణ జరగక ఆక్వా సాగు దెబ్బతింటు న్నదని రైతులు మొత్తుకుంటున్నారు. తక్షణం పంటల నష్టాన్ని మండలాలవారీగాఅంచనా వేసి త్వరగా పరిహారం అందిస్తే తదుపరి సీజన్‌కు రైతు కోలుకునే అవకాశంఉంటుంది. స్వోత్కర్షలవల్ల ప్రజానీకానికి ఒరిగేదేమీ ఉండదని గుర్తించాలి.


