తాడేపల్లి : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియలో కూటమి ప్రభుత్వం సృష్టించిన అరాచకంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ కేంద్రాలను ఆక్రమించడం తొలిసారిగా చూస్తున్నామని, నామినేషన్ల సమయంలోనే అనేక దారుణాలు జరిగాయని ఆయన ధ్వజమెత్తారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పార్టీ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ గుర్తు చేశారు.
ఈరోజు(గురువారం, అక్టోబర్ 29వ తేదీ) తాడేపల్లిలో స్థానిక సంస్థల ఎన్నికల అంశానికి సంబంధించి పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు వైఎస్ జగన్. దీనిలో భాగంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారాయన.
నామినేషన్లలోనే రిగ్గింగ్ చేశారు..
‘నామినేషన్ల పరంగా జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకోవాలి. దీనికోసం పార్టీపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడూ చూడని దారుణాలు చంద్రబాబు ప్రభుత్వంలో చూస్తున్నాం. నామినేషన్ల సమయంలోనే ఇన్ని దారుణాలు జరిగాయి. నామినేషన్ కేంద్రాలను ఆక్రమించడం తొలిసారిగా చూస్తున్నాం. నామినేషన్లలోనే రిగ్గింగ్ చేయడం చూశాం. అభ్యర్థులపై దాడులు చేశారు. పోలీసుల అండదండలతో ఈ దాడులు జరిగాయి. రిటర్నింగ్ ఆఫీసర్లు చంద్రబాబే ఏజెంట్లుగా పనిచేశారు. నామినేషన్ పత్రాల్లోని సర్టిఫికెట్లనే ఆర్వోలే చింపేయడం, తొలగించారు. ఫోర్జరీ సంతకాలు చేసి నామినేషన్ పత్రాలను విత్‌డ్రా చేయించారు. బి-ఫారాలను ఆర్వోలే మాయం చేశారు. బహుశా ఇలాంటివి ఎప్పుడూ మనం చూసి ఉండం.
మాఫియా ముఠా మాదిరిగా చంద్రబాబు ప్రభుత్వం..
ఇన్ని దారుణాలు చేసి ఏకగ్రీవాల పేరుతో గెలిచామని చెప్పకోవడం వీరికే చెల్లింది. ఓసీలకు బీసీ సర్టిఫికెట్లు ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం ఒక మాఫియా ముఠా మాదిరిగా పనిచేస్తోంది. నామినేషన్లు వేయడం, ఓటు వేయడం ప్రజాస్వామ్యంలో కీలక హక్కులు. దశాబ్దాల తరబడి హక్కులు అనుభవిస్తున్న భూములను లాగేసుకుంటున్నారు. ఇక ఈ మాఫియా కొనసాగితే.. రేపు ప్రజల ఆస్తులను కూడా లాక్కుంటారు. ఆస్తి పత్రాలు చింపేసి, ఆ ఆస్తులు తమవే అనేపరిస్థితులు వస్తాయి.
చంద్రబాబు పోలీసులను అడ్డగోలుగా వాడుకుంటున్నారు. పోలీసులు, ఆర్వోలు చంద్రబాబు కనుసైగల్లో పనిచేస్తున్నారు. నవంబర్ 1 న, నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏజెంట్లు అనుసరించాల్సిన విధానంపై ఓరియెంటేషన్ ఇవ్వాలి. వాళ్లు సమర్థవంతంగా తమ విధులను, బాధ్యతను నిర్వర్తించేలా వారిని సన్నద్ధంచేయాలి.
ఆధారాల సేకరణ చాలా ముఖ్యం..
తప్పులు జరిగితే వాటి ఆధారాల సేకరణ కూడా చాలా ముఖ్యం. నామినేషన్ల సమయంలోనే చంద్రబాబు దారుణాలు చేసిన నేపథ్యంలో రేపు పోలింగ్ సమయంలో రిగ్గింగ్‌కు కూడా వెనకడుగు వేయడు. స్ట్రాంగ్ రూంల్లో బ్యాలెట్ బాక్సులను మార్చడానికి, కౌంటింగ్ సెంటర్లను ఆక్రమించడానికి చంద్రబాబు వెనకడుగు వేయడు. వీటిపై సాక్ష్యాలు, ఆధారాల సేకరణ చాలా ముఖ్యం. వీడియో ఆధారాలు చాలా ముఖ్యం. సీసీ కెమెరాలు పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాని, సీసీ కెమెరాలు పెట్టకుండా ఎస్ఈసీ చంద్రబాబుతో కాంప్రమైజ్ అయ్యింది. సాధ్యమైనంతవరకూ చంద్రబాబు చేసే ప్రతి తప్పుపైనా ఆధారాలు సేకరించాలి. వీడియో ఆధారాలు కూడా చాలా ముఖ్యం.
పోలింగ్ కేంద్రాల దగ్గర అప్రమత్తంగా ఉండండి
మన ఓటర్లను పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకు రండి. మన పార్టీ కమిటీలన్నీ క్రియాశీలకంగా పనిచేయాలి. జిల్లా అధ్యక్షులు ప్రతిరోజూ రెండుసార్లు అసెంబ్లీ కో-ఆర్డినేటర్లతో రివ్యూ చేయాలి. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి రండి. లీగల్ సెల్ ద్వారా అన్నిరకాల చర్యలు తీసుకోండి. పార్టీ జిల్లా అధ్యక్షులు పూర్తి పర్యవేక్షణ చేయాలి. నామినేషన్ల విషయంలోనే ఇన్ని దారుణాలు చేసినవారు రేపు అన్నిరకాల దారుణాలకూ దిగుతారు.
ఆ దారుణాల కొనసాగింపు ఈ ఎన్నికల్లో ఉంటుంది. సీసీ కెమెరాలు పోలింగ్ కేంద్ర పెట్టేలా చూడండి.వీలైతే ప్రైవేటుగా పెట్టేలా తగిన చర్యలు తీసుకోండి. అసెంబ్లీ కో-ఆర్డినేటర్ వీటిని ఎదుర్కోవడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలి. జిల్లా అధ్యక్షులు దళపతులు, ఎన్నికలను దగ్గరుండి నడిపించండి. రీజినల్ కో-ఆర్డినేటర్లు, పార్లమెంటు, అసెంబ్లీ అబ్జర్వులు జిల్లా అధ్యక్షులతో కలిసి పనిచేయాలి.
ఇకపై మరింత జాగ్రత్తలు తీసుకోవడం అవసరం
మనం చంద్రబాబు నాయుడు లాంటి రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాం. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగే అవకాశాల్లేవని ఇదివరకు జరిగిన ఘటనలే నిరూపిస్తున్నాయి. అందుకనే ఇకపై మరింత జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. నామినేషన్ల ఘట్టంలో జరిగిన ఘటనలకు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు కూడా సేకరించడం విస్మరించవద్దు. వీటిపై తప్పకుండా న్యాయపోరాటం చేయాలి. వీటి ఆధారంగానే భవిష్యత్తులో లోతైన విచారణ జరగుతుంది. తప్పులు చేసిన వాళ్లు తప్పనిసరిగా బోనులో నిలబడాలి. శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వడ్డీతో సహా వారికి చెల్లింపులు చేయాలి’ అని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు వైఎస్సార్సీపీ లేఖ


