ఆరణీ.. ప్రమాణానికి సిద్ధమా? | Jana Sena Party leader Rajesh Achari makes sensational comments | Sakshi
Sakshi News home page

ఆరణీ.. ప్రమాణానికి సిద్ధమా?

Nov 1 2026 4:32 AM | Updated on Nov 1 2026 4:32 AM

Jana Sena Party leader Rajesh Achari makes sensational comments

రూ.50 లక్షలు అడగలేదని కాణిపాకంలో ప్రమాణం చేస్తారా 

జనసేన పార్టీ నాయకుడు రాజేష్‌ ఆచారి సంచలన వ్యాఖ్యలు

తిరుపతి (అన్నమయ్య సర్కిల్‌): తిరుపతిలో జనసేన నాయకుడు రాజేష్‌ ఆచారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అక్రమంగా డబ్బులు సంపాదించలేదని.. ఏ పార్టీకి కోవర్టును కాదని స్పష్టం చేశారు. 47వ డివిజన్‌ కార్పొరేటర్‌ సీటు కేటాయిస్తానని నమ్మించి మోసం చేసిన తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్‌తో మాత్రమే తన పోరాటమని వ్యాఖ్యానించారు. శనివారం తిరుపతిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘జనసేన పార్టీని అంతం చేసేందుకే ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్‌ పనిచేస్తున్నారు. కార్పొరేటర్‌ సీట్ల కేటాయింపు కోసం పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌కు పంపించిన సిఫార్సు లేఖలో నా కులాన్ని బీసీ నుంచి ఓసీగా మార్చి చూపించారు. 

సంబంధిత పత్రాల్లో కుల వివరాలు తప్పుగా నమోదు చేశారు. తేదీ, సంతకం కూడా లేని పత్రాలను నాకు చూపించి మోసం చేశారు. ఇలా ఎందుకు చేశారని అడిగితే రూ.50 లక్షలు ఇస్తే బీఫారం వచ్చేదని సమాధానం ఇచ్చా­రు. నన్ను రూ.50 లక్షలు అడగలేదని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి క్షేత్రంలో ప్రమాణానికి సిద్ధమా. ఎన్నికల్లో 22 మందికి ఇచ్చిన టికెట్లు, ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో పారదర్శకత లేదు. ఆ 22 మందిలో కొందరు ఎమ్మెల్యేకు డబ్బులిచ్చినట్టు నాకు సమాచారం ఉంది. వారి పేర్లను వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నాను. 

నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పోలీస్‌ స్టేషన్‌కు రావాలంటూ ఫోన్లు చేస్తున్నారు. నేను అక్రమంగా డబ్బులు తీసుకున్నాననే ఆరోపణలు చేస్తున్న కొందరు వ్యక్తులు కాణిపాకం వినాయకస్వామి ఆలయానికి వచ్చి కుటుంబ సమేతంగా ప్రమాణం చేయాలి. నా వద్ద ఉన్న ఆధారాలు, ఆడియో రికార్డులు, పత్రాలను తదుపరి మీడియా సమావేశాల్లో బయటపెడతాను’ అని రాజేష్‌ ఆచారి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement