సీఆర్డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గణపతి రావుకు వినతిపత్రం అందజేస్తున్న తాడికొండ రైతులు
నోటీసులు ఇవ్వకుండా గ్రామసభ ఎలా నిర్వహిస్తారు?
సీఆర్డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌ను ప్రశ్నించిన తాడికొండ రైతులు
తాడికొండ: రెండవ దశ పూలింగ్‌లో భాగంగా తాడికొండలో అదనపు భూ సమీకరణకు అంగీకరించబోమని రైతులు స్పష్టంచేశారు. ఈ మేరకు శనివారం సీఆర్‌డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గణపతిరావును కలిసి తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వేలైన్, కనెక్టింగ్ రోడ్లకు లోపల ఉన్న భూములను పూలింగ్ కింద తీసుకుంటామని ఇటీవల ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. తాడికొండ, కంతేరు గ్రామాల్లో భూసమీకరణ ప్రక్రియను ప్రారంభించింది. అదనపు భూ సమీకరణకు తాము అంగీకరించబోమని గతంలోనే తాడికొండలో నిర్వహించిన గ్రామసభలో రైతులు తేల్చి చెప్పారు.
ఈ నేపథ్యంలో తమకు నోటీసులు ఇవ్వకుండా నవంబర్ 5న గ్రామసభ జరుగుతుందని చెబుతున్నారని, అది ఎంతవరకు సమంజసమని సీఆర్‌డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌ను రైతులు ప్రశ్నించారు. 85శాతం మంది రైతులు భూములిస్తేనే రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామని మంత్రి నారాయణ చెప్పారని, అంతమంది రైతులు ఇక్కడ భూములు ఇవ్వరని, కాబట్టి రాజధాని అవసరాలకు మాత్రమే భూ సమీకరణ చేయాలని సూచించారు. రోడ్లు, రైల్వేలైన్ నిర్మాణానికి అయినా భూముల విలువకు అదనంగా ఐదు రెట్లు పరిహారం ఇస్తేనే ఒప్పుకుంటామని, లేదంటే భూములిచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు గణపతిరావుకు వినతిపత్రం అందజేశారు.


