అర్హతలు, నేపథ్యం తనిఖీ చేయాలన్న నిబంధన లేదు
ఏజెంట్‌ను మారిస్తే ఆ ఫారం ప్రిసైడింగ్ అధికారికి ఇవ్వాలి
పోలింగ్ ఏజెంట్ల నియామకంపై స్పష్టత ఇస్తూ ఎస్‌ఈసీ ఆదేశాలు
సాక్షి, అమరావతి: రాజకీయ పార్టీల అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల్లో నియమించే పోలింగ్ ఏజెంట్ల అర్హతలు, నేపథ్యం తనిఖీ చేయడానికి ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి నిబంధనలు లేవని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) అనిల్‌చంద్ర పునేఠ తెలిపారు. పరిశీలన పేరుతో పోలింగ్ ఏజెంట్లను ప్రిసైడింగ్ అధికారులు, పోలీసులు అడ్డుకోరాదని స్పష్టం చేశారు.
మున్సిపల్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్ల నియామకంపై మరింత స్పష్టత ఇస్తూ శనివారం ఆయన ఆదేశాలు జారీచేశారు. అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల్లో నియమించుకునే ఏజెంట్లను మార్చుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. పోలింగ్ ఏజెంట్‌ను మార్చినప్పుడు, అందుకు సంబంధించిన నియామక, తొలగింపు ఫారాన్ని అభ్యర్థులు సంబంధిత ప్రిసైడింగ్ అధికారికి ఇవ్వాలని పేర్కొన్నారు. ఆ ఆదేశాల్లో మరికొన్ని అంశాలు..
» పోలింగ్ ఏజెంట్‌గా నియమితులయ్యే వ్యక్తి అదే వార్డు లేదా ప్రాదేశిక నియోజకవర్గం పరిధిలోని అదే పోలింగ్ స్టేషన్‌కు లేదా పొరుగున ఉన్న పోలింగ్ స్టేషన్‌కు చెందిన ఓటరై ఉండాలి.
» ఏజెంట్ వద్ద ఓటరు గుర్తింపు కార్డు లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదించిన ఇతర గుర్తింపుపత్రం ఉండాలి. పోలింగ్ స్టేషన్‌లో, ప్రిసైడింగ్ అధికారి జారీచేసిన గుర్తింపు కార్డును కనిపించేలా ఉంచుకోవాలి.
» ఒక అభ్యర్థి ఒక పోలింగ్ స్టేషన్‌లో ఒక పోలింగ్ ఏజెంట్‌ను, మరో ప్రత్యామ్నాయ ఏజెంట్‌ను మాత్రమే నియమించుకోవచ్చు. అయితే ఏ సమయంలోనైనా పోలింగ్ స్టేషన్ లోపల ఒక పోలింగ్ ఏజెంట్‌కు మాత్రమే అనుమతి ఉంటుంది.
» మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ భద్రతతో ఉన్న వ్యక్తులను పోలింగ్ ఏజెంట్లుగా నియమించకూడదు.
» పోలింగ్ ఏజెంట్లు ఓటింగ్ ప్రక్రియను గమనించేలా, ఓటర్లను గుర్తించేలా కూర్చోవాలి. అయితే ఓటింగ్ రహస్యానికి ఎటువంటి భంగం కలగకుండా చూసుకోవాలి.
» పోలింగ్ ఏజెంట్లకు కూర్చునే స్థలాలను రాజకీయ పార్టీల ప్రాధాన్యత మేరకు కేటాయించాలి. తొలుత గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, ఆ తర్వాత గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలు, తర్వాత ప్రత్యేక గుర్తులు కలిగిన నమోదిత రాజకీయ పార్టీలు, ప్రత్యేక గుర్తులు లేని నమోదిత రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లకు వరుస క్రమంలో సీట్లు కేటాయించాలి. రాజకీయ పార్టీల ప్రాతిపదికన కాకుండా నిర్వహించే గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఈ నిబంధన వర్తించదు.
» పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ జరుగుతున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోను తాము గుర్తించిన ఓటర్ల జాబితా ప్రతిని పోలింగ్ కేంద్రం బయటకు తీసుకెళ్లకూడదు. వారు పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లాలంటే, తమ వద్ద ఉన్న ఓటర్ల జాబితాలను ప్రిసైడింగ్ అధికారికి అప్పగించి, అనుమతితోనే వెళ్లాలి.
శాంతిభద్రతలు, ప్రశాంత పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు ముందుకు రావాలని ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠ పిలుపునిచ్చారు. ఆదివారం జరిగే మున్సిపల్ ఎన్నికలకు, నవంబర్ ఐదోతేదీ జరిగే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రశాంత ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్టు పోలీసులు నివేదించారని తెలిపారు. పొలింగ్ రోజున ఎలాంటి ఘటనలు జరగకుండా అదనపు బలగాలు ఏర్పాటు చేస్తున్నామని, ఆయా అంశాలను డీజీపీ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.


