నామినేషన్ల సమయంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై రాళ్లు రువ్వుతున్న ఖాకీలు (ఫైల్)
రాష్ట్రంలో ఏకపక్షంగా పోలీసింగ్
బందోబస్తు పేరుతో బరితెగింపు.. ప్రతిపక్షంపై ఉక్కుపాదం
పోలీస్ బాస్ నుంచి కింది స్థాయి వరకు అధికారపక్షానికి దాసోహం
ప్రతిపక్ష అభ్యర్థులను ఇబ్బందులు పెట్టేలా కార్యాచరణ
ఖాకీల దన్నుతో ప్రజాస్వామ్యానికి పచ్చమూకల తూట్లు
ఎంపిక చేసుకున్న చోట్ల బూత్ క్యాప్చర్, రిగ్గింగ్‌లకు వ్యూహం
పోలింగ్ సమయంలో అరాచకాలకు ప్రణాళిక
శాంతిభద్రతల సాకుతో వైఎస్సార్‌సీపీ నేతలను నిర్బంధించే కుట్ర
నేటి మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై సర్వత్రా ఆందోళనలు
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన బాధ్యతను విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వం.. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు కుట్రలు పన్నుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ బాస్ నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అధికారపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడుగడుగునా అడ్డుకునేలా కార్యాచరణ సాగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఖాకీల అండతో టీడీపీ శ్రేణులు చెలరేగిపోయేందుకు, ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో బూత్ క్యాప్చర్, రిగ్గింగ్‌కు పాల్పడేందుకు రంగం సిద్ధం చేస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పోలింగ్ వేళ అరాచకాలు సృష్టించి, శాంతిభద్రతల సాకుతో వైఎస్సార్‌సీపీ నేతలను నిర్బంధించడం ద్వారా ఎన్నికల ప్రక్రియను తమకు అనుకూలంగా మలుచుకునే కుట్ర జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నేటి మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై సర్వత్రా ఉత్కంఠ, ఆందోళన నెలకొన్నాయి.
ప్రజాక్షేత్రంలో ఓటమి భయంతోనే అరాచకాలు
ప్రజాక్షేత్రంలో పోటీ జరిగితే ఓటమి తప్పదని భావించిన అధికారపక్షం నామినేషన్‌ల దశ నుంచి పరిశీలన, విత్‌డ్రా వరకు పోలీసులను ఇష్టానుసారం దుర్వినియోగం చేసింది. చివరకు పోలింగ్ సమయంలోను పోలీసులను అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించేందుకు వెన్నుపోటు పార్టీ పథక రచన చేసింది. ఎంపిక చేసుకున్న చోట్ల బూత్ క్యాప్చర్, రిగ్గింగ్‌లకు పాల్పడేందుకు పక్కా ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు రాకుండా అడ్డుకునేందుకు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు అటువైపు రాకండా ఉండేలా పోలీసులతో పద్మవ్యూహం పన్నేలా స్కెచ్ వేశారు.
ఈ నేపథ్యంలోనే పోలింగ్ సమయంలో శాంతిభద్రతల సాకుతో వైఎస్సార్‌సీపీ నేతలను పోలీస్ నిర్బంధంలో ఉంచే విధంగా పథక రచన చేశారు. ఆదివారం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో పోలీసుల యంత్రాంగాన్ని ఇష్టానుసారం వాడుకునేలా పైనుంచి కింద వరకు సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. అధికారపక్షం రిగ్గింగ్‌కు సిద్ధంగా పలు ప్రాంతాల్లో పచ్చ గూండాలను, కిరాయి రౌడీలను దించారు. కడపలో రెండు రోజుల ముందే పొరుగు ప్రాంతాలకు చెందిన పచ్చ గూండాలు, కిరాయి రౌడీలు దిగినట్టు సమాచారం. వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలను హౌస్ అరెస్టులు చేసి ఏకపక్షంగా అధికారపక్షం రిగ్గింగ్ చేసుకోవాలనే ప్రణాళికను రచించారు.
పైకి గొప్పలు.. లోపల గోతులు
ప్రశాంత ఎన్నికల కోసం పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు గొప్పలు చెబుతున్న పోలీస్ బాస్‌లు క్షేత్రస్థాయిలో మాత్రం అధికారపక్షానికి కొమ్ముకాసేలా లోపాయికారి ఆదేశాలు ఇస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. బందోబస్తు పేరుతో ఇప్పటికే డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా హడావుడి చేస్తున్నప్పటికీ ఆయన చర్యలు అధికారపక్షానికి అనుకూలమనేది బహిరంగ రహస్యం. తాజాగా ఇంటెలిజెన్స్ బాస్ సైతం టెలీ కాన్ఫరెన్స్‌లో వైఎస్సార్‌సీపీని కట్టడి చేయాలని, అధికార పార్టీ నేతలు చెప్పింది వినాలనే సంకేతాలు ఇవ్వడం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.
గ్రేటర్ రాయలసీమ, పల్నాడు, గుంటూరు, ప్రకాశం తదితర జిల్లాల్లో పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులు వెన్నుపోటు పార్టీకి వెన్నుదన్నుగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష అభ్యర్థులను ఇబ్బందులు పాల్జేస్తున్న ఘటనలు వారి పనితీరును ప్రశ్నిస్తున్నాయి. అధికార పార్టీ కుట్రల్లో పాలుపంచుకునే పోలీసులు భవిష్యత్‌లో మూల్యం చెల్లించకతప్పదని వైఎస్సార్‌సీపీ నేతలు ఇప్పటికే హెచ్చరించడం గమనార్హం.


