అధికార పార్టీ అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలి | Polling agents should take precautions in local body elections says Sajjala Ramakrishna Reddy | Sakshi
Sakshi News home page

అధికార పార్టీ అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలి

Nov 1 2026 5:14 AM | Updated on Nov 1 2026 5:14 AM

Polling agents should take precautions in local body elections says Sajjala Ramakrishna Reddy

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: ఆదివారం జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడే అవకాశాలున్నందున వైఎస్సార్‌సీపీ నేతలు, అభ్యర్థులు, పోలింగ్‌ ఏజెంట్లు పూర్తి అప్రమత్తంగా ఉండాలని పార్టీ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. పోలింగ్‌ ప్రారంభం నుంచి బ్యాలెట్‌ బాక్సులకు సీలు వేసి, స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించే వరకు ప్రతి దశలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఆయన శనివారం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలకు టెలీకాన్ఫరెన్స్‌లో పోలింగ్‌కు సంబంధించి కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా సజ్జల ఏమన్నారంటే..

అధికార యంత్రాంగం తీరు ఆందోళన కలిగిస్తోంది..
ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పోలీసు, ఎన్నికల అధికారులను అధికార పార్టీ అనుకూలంగా ఉపయోగించుకుంటోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా స్వతంత్రంగా వ్యవహరించకుండా ప్రభుత్వానికి అనుబంధ శాఖలా మారిపోయింది. ఇప్పటికే పోలింగ్‌ ఏజెంట్ల పైన కేసులు పెడుతున్నారు. ఇప్పటివరకు ఎలాంటి సంఘటనలు జరగని ప్రాంతాల్లో కూడా పోలింగ్‌ కేంద్రాల్లో అవాంఛనీయ ఘటనలు సృష్టించి పోలింగ్‌ ఏజెంట్లను బయటకు పంపించే ప్రయత్నాలు జరుగుతాయి. 

అందువల్ల ప్రతి పోలింగ్‌ బూత్‌కు ప్రధాన ఏజెంట్, రిలీవర్లతో పాటు ప్రత్యామ్నాయంగా మరికొందరిని సిద్ధంగా ఉంచుకోవాలి. కనీసం నలుగురు అందుబాటులో ఉండాలి. ఒకరిపై కేసు పెట్టినా, మరే కారణంతోనైనా విధులకు హాజరుకాలేకపోయినా వెంటనే మరో ఏజెంట్‌ను నియమించే ఏర్పాట్లు ఉండాలి. పోలింగ్‌ ప్రారంభానికి ముందే ఏజెంట్లు కేంద్రాలకు చేరుకోవాలి. పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లే ముందు వారి పేరు, బూత్‌ నంబర్, ఏజెంట్‌గా నియామకానికి సంబంధించిన వివరాలతో వీడియో రికార్డు చేసి భద్రపరచుకోవాలి. 

పోలింగ్‌ కేంద్రంలో ఎవరైనా రెచ్చగొట్టినా సంయమనం పాటించాలి. వాగ్వాదా­లకు దిగకూడదు. అభ్యంతరాలు ఉంటే నేరుగా ప్రిసైడింగ్‌ లేదా పోలింగ్‌ అధికారికి తెలియజేయాలి. ప్రతి అభ్యర్థి వారి పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలను ముందుగానే పరిశీలించాలి. సీసీ కెమెరాలు లేని కేంద్రాల వివరాలను వెంటనే రిటర్నింగ్‌ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లాలి.

స్ట్రాంగ్‌ రూమ్‌ల భద్రత అత్యంత కీలకం 
బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచే స్ట్రాంగ్‌ రూమ్‌ల భద్రతపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ స్పష్టంగా ఆదేశించారు. జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలు స్ట్రాంగ్‌ రూమ్‌లను ముందుగానే సందర్శించి సీసీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించాలి. లోపాలు ఉంటే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలపాలి. అవసరమైతే ఎన్ని­కల కమిషన్‌కి ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తాం. బ్యాలెట్‌ బాక్సులకు సీలు వేసే సమయంలో పోలింగ్‌ ఏజెంట్లు అక్కడే ఉండి, సంతకాలు చేయాలి. ప్రతి అక్రమాన్ని ఆధారాలతో నమోదు చేయా­లి. బయటి వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలి.

కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక వార్‌ రూమ్‌ 
పోలింగ్, కౌంటింగ్‌ను నిరంతరం పర్యవేక్షించేందుకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక వార్‌ రూమ్‌ ఏర్పాటు చేశాం. ఇక్కడికి వచ్చే ఫిర్యాదులు, వీడియోలు, ఇతర ఆధారాలను సేకరించి, అధికారులకు పంపడంతో పాటు న్యాయపరమైన చర్యల కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తాయి. ప్రతి జిల్లాలో సమన్వయకర్తలు, అభ్యర్థులు, పోలింగ్‌ ఏజెంట్లు, రిలీవర్లు సమన్వయంతో పనిచేయాలి. ఎక్కడైనా సమస్య తలెత్తిన వెంటనే స్పందించాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement