ఇస్రో వ్యోమగామి శుభంషు శుక్లా, అంతరిక్షం నుంచి భూమిని చిత్రీకరించిన ఒక అద్భుతమైన వీడియోని పంచుకున్నారు. ఆ వీడియోలో కనిపించే మెరుపులని ఆయన "ప్రకృతి సిద్ధమైన బాణసంచా(nature’s very own fireworks)"గా అభివర్ణిస్తూ..ఇలా రాసుకొచ్చారు. దీపావళి నా హృదయంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. నాకు ఇది ఎంతో ఇష్టమైన పండుగ. దీపాల వెలుగులు, మెరుపులు, బాణసంచాల్లో ఏదో ప్రత్యేకమైన మాయాజాలం ఉంది. అవి నాలో అద్భుతమైన భావనను, ఆనందాన్ని నింపుతాయి అంటూ..భూమి సహజంగా జరుపుకునే వెలుగుల పండుగకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు.
ఆ వీడియోలో..అంతరిక్షంలో ఉన్నప్పుడు భూమిపై మెరుపులు నృత్యం చేస్తున్నట్లుగా కనిపించాయి. అంతరిక్షం నుంచి కిందకు చూస్తున్నప్పుడు అవి నాకు ప్రకృతి సిద్ధమైన బాణసంచాను గుర్తు చేశాయి. విశ్వానికి వెలుగును వేడుకగా జరుపుకోవడానికి తనదైన మార్గం ఉందని చెప్పే ఒక అందమైన దృశ్యమిది. అయితే ఈ దృశ్యాన్ని చూడటం ప్రత్యేకంగా అనిపించడమే కాదు..దీన్ని పంచుకోవడానికి ఇంతకంటే అద్భుతమైన రోజు మరొకటి ఉండదనిపించింది. చివరగా నా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ధన్ తేరస్ శుభాకాంక్షలు.
ఈ పండుగ సీజన్ మీ ఇళ్లల్లో.. మీ హృదయాల్లో వెలుగును, సంతోషాన్ని, మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని నింపాలని మనసారా కోరుకుంటున్నా." అంటూ పోస్ట్‌ని ముగించారు. కాగా, గ్రూప్ కెప్టెన్ శుభాంషు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)కు వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి, అలాగే అంతరిక్షంలోకి వెళ్లిన రెండొవ భారతీయుడు కూడా ఆయనే. ఆక్సియమ్-4 (Ax-4) మిషన్‌లో భాగంగా ఆయన 2025 జూన్ 26న అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టారు. ఈ మిషన్‌కు నాసా సీనియర్ అధికారి పెగ్గీ విట్సన్ నాయకత్వం వహించారు.
ఇదీ చదవండి: దీపావళి సందేశం..పిల్లలకు నేర్పింద్దాం ఇలా..!


